Saturday 12 November 2022

అవధూత గీత - దత్తాత్రేయ విరచితం

ప్రథమాధ్యాయము


శ్రీదత్త ఉవాచ 

ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా 

మహద్భయ పరిత్రాణా ద్విప్రాణాముపజాయతే ॥ ౧ ॥

భావము:

ఈశ్వరుడి అనుగ్రహం వల్లనే, ఆలోచించగలిగే మనుషులకి, మహాభయాల నుంచి రక్షించే, అద్వైతాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది.


అవధూత ఉవాచ 

యేనేదం పూరితం సర్వమాత్మానైవాత్మనాత్మని 

నిరాకారం కథం వందే హ్యభిన్నం శివమవ్యయం ॥ ౨ ॥

భావము:

ఏవిధంగా, మంగళమైనదీ, నాశనం లేనిదీ, ఈ సర్వము కంటే వేరుకానిదీ, తన ఆత్మతో ఈ సర్వాన్నీ, ఆత్మనీ నింపేసేనిరాకార స్వరూపానికి, నేను నమస్కరించగలనో చెప్పవలసినది?.


పఞ్చభూతాత్మకం విశ్వం మరీచిజలసన్నిభమ్ ।

కస్యాప్యహో నమస్కుర్యామహమేకో నిరఞ్జనః ॥ ౩ ॥

భావము:

పంచభూతాలతో చేయబడిన ఈ ప్రపంచం ఎండమావిలోని నీరు లాంటిది. ఒక్కణ్ణీ, ఏదీ అంటని వాణ్ణీ అయిన నేను ఎవరికి నమస్కారం చేస్తాను?.


ఆత్మైవ కేవలం సర్వం భేదాభేదో న విద్యతే ।

అస్తి నాస్తి కథం బ్రూయాం విస్మయః ప్రతిభాతి మే ॥ ౪॥

భావము:

ఈ ప్రపంచం మొత్తం అంతా ఆత్మే. దానికి వేరుగా ఉండటం,లేకపోవటం అనేవి లేనేలేవు.ఈ ప్రపంచం ఉన్నదా, లేదాఅనేది ఎవరైనా ఎట్లా చెప్పగలరు అనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.


వేదాన్తసారసర్వస్వం జ్ఞానం విజ్ఞానమేవ చ ।

అహమాత్మా నిరాకారః సర్వవ్యాపీ స్వభావతః ॥ ౫॥

భావము:

వేదాంతం మొత్తానికీ సారం- నేను సహజంగా ఆకారం లేనివాడినీ,అంతా ఆవరించే స్వభావం ఉన్న ఆత్మనీ అనే ఈజ్ఞానమే, ఈ మహత్తర విజ్ఞానమే.


యో వై సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః ।

స్వభావనిర్మలః శుద్ధః స ఏవాయం న సంశయః ॥ ౬॥

భావము:

అందరిలోనూ ఆత్మగా గోచరించే ఆ దేవుడు, ఆకాశంలాగా ఏకళలూ లేనివాడు. నిర్మల స్వభావుడూ, శుద్ధుడూ అయిన ఆ దేవుడు నేనే అనటంలో ఏమాత్రమూ సందేహము లేదు. 


అహమేవావ్యయోఽనన్తః శుద్ధవిజ్ఞానవిగ్రహః ।

సుఖం దుఃఖం న జానామి కథం కస్యాపి వర్తతే ॥ ౭॥

భావము:

నేనే నాశనం లేని వాణ్ణి, అనంతమైన వాణ్ణి. శుద్ధమైన విజ్ఞాన రూపుణ్ణి. సుఖమూ, దుఃఖమూ, ఎట్లా, ఏ విధంగా ఉంటయ్యో నాకు తెలీదు


న మానసం కర్మ శుభాశుభం మే

    న కాయికం కర్మ శుభాశుభం మే ।

న వాచికం కర్మ శుభాశుభం మే

    జ్ఞానామృతం శుద్ధమతీన్ద్రియోఽహమ్ ॥ ౮॥

భావము:

నా మానసిక కర్మకి శుభమూలేదు,అశుభమూలేదు.. నా శరీర కర్మకి శుభమూ లేదు, అశుభమూ లేదు. నా వాక్కు చేసేకర్మకి శుభమూ లేదు, అశుభమూ లేదు. నేను, మనస్సూ, ఇంద్రియాలూ దాటిన శుద్ధమైన జ్ఞానమనే అమృతాన్ని


మనో వై గగనాకారం మనో వై సర్వతోముఖమ్ ।

మనోఽతీతం మనః సర్వం న మనః పరమార్థతః ॥ ౯॥

భావము:

మనస్సు ఆకాశంలాంటి ఆకారం ఉన్నది(ఆకారం లేనిది). మనస్సే అన్ని వైపులా వ్యాపించేది. మనస్సుని దాటిపోయేదీమనస్సే, కాని నిజానికి మనస్సనేదే లేదు.


అహమేకమిదం సర్వం వ్యోమాతీతం నిరన్తరమ్ ।

పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వా తిరోహితమ్ ॥ ౧౦॥

భావము:

నేను ఒక్కణ్ణే,ఈ మొత్తం ఆకాశాన్ని దాటి ఎప్పుడూ ఉండేది. అలాంటప్పుడు, కనపడినా,కనపడకున్నా ఆత్మని నేనుఎలా చూడగలను చెప్పు ?. 


త్వమేవమేకం హి కథం న బుధ్యసే

    సమం హి సర్వేషు విమృష్టమవ్యయమ్ ।

సదోదితోఽసి త్వమఖణ్డితః ప్రభో

    దివా చ నక్తం చ కథం హి మన్యసే ॥ ౧౧॥

భావము:

ఓ దత్తాత్రేయ ప్రభూ, నువ్వు మార్పు చెందేవాడివి కావనీ, అందరిలోనూ సమంగా వెలిగే పరబ్రహ్మానివి అని ఒక్కడివేఅయిన నీకు ఎట్లా తెలియట్లేదు?. . ఎప్పుడూ, అడ్డులేకుండా ప్రకాశించే ఓ మహానుభావా, నువ్వు రాత్రి పగళ్ళ లాంటివిషయాల గురించి ఏమి ఆలోచిస్తున్నావు?




దత్త ఉవాచ 


ఆత్మానం సతతం విద్ధి సర్వత్రైకం నిరన్తరమ్ ।


అహం ధ్యాతా పరం ధ్యేయమఖణ్డం ఖణ్డ్యతే కథమ్ ॥ ౧౨॥




ఎల్లప్పుడూ, అన్ని చోట్లా ఉన్న నిరంతరమైన ఆత్మని తెలుసుకో. నేనే ధ్యానం చేసేవాడినీ, నేనే ధ్యానం చేయబడేదీ. అట్లాంటి అంతులేని నేనుని ఎందుకు ముక్కలు చేస్తావు?.




న జాతో న మృతోఽసి త్వం న తే దేహః కదాచన ।


సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుధా శ్రుతిః ॥ ౧౩॥




నువ్వు పుట్టనే లేదు, నువ్వు చావనూ లేవు. ఎప్పుడూ నీకు దేహం అనేదే లేదు. వేదాలు అనేక విధాలుగా అంతాబ్రహ్మమే అనే విఖ్యాతి చెందిన వాక్యాన్ని చెప్పాయి కదా?




స బాహ్యాభ్యన్తరోఽసి త్వం శివః సర్వత్ర సర్వదా ।


ఇతస్తతః కథం భ్రాన్తః ప్రధావసి పిశాచవత్ ॥ ౧౪॥


అన్నిచోట్లా, అన్ని వేళలా, శుభమయుడివిగా ఉన్న నువ్వే లోపలా, బయటా ఉన్నావు. ఈ మాట అర్ధం చేసుకోకుండాఅటూ, ఇటూ పిచ్చివాడిలాగా, పిశాచంలాగా, తిరుగుతున్నావు?.  


 


సంయోగశ్చ వియోగశ్చ వర్తతే న చ తే న మే ।


న త్వం నాహం జగన్నేదం సర్వమాత్మైవ కేవలమ్ ॥ ౧౫॥


కలవడమూ, విడిపోవటమూ అనేవి నీకూ, నాకూ లేవు. నిజానికి నువ్వూ, నేనూ, ఈప్రపంచమూ అనేవే లేవు. అంతాఆత్మ ఒక్కటే తప్ప వేరే ఏదీ లేదు. 


 


శబ్దాదిపఞ్చకస్యాస్య నైవాసి త్వం న తే పునః ।


త్వమేవ పరమం తత్త్వమతః కిం పరితప్యసే ॥ ౧౬॥


శబ్ద,స్పర్శ,రూప,రస,గంధాలు అనే అయిదు విషయాలకి కనిపించేవాడివి నువ్వు కాదు. అవి కూడా నీకు కనిపించవు. వాటితో నీకు ఏ సంబంధమూలేకుండా తిరుగుతూ ఉంటావు. అలాంటి నువ్వే ఆ పరమమైన తత్త్వానివి అనిగ్రహించక ఎందుకు తపన పడుతూ ఉంటావు. 


 


జన్మ మృత్యుర్న తే చిత్తం బన్ధమోక్షౌ శుభాశుభౌ ।


కధం రోదిషి రే వత్స నామరూపం న తే న మే ॥ ౧౭॥


నీకు, పుట్టుకా, చావూ లేవు. మనస్సూ, బంధమూ, మోక్షమూ నీకులేదు. శుభాశుభాలు కూడా లేని నీవు ఎందుకుఏడుస్తావు, నాయనా?. నీకూ, నాకూ, నామాలూ, రూపాలూ లేవు 


 


అహో చిత్త కథం భ్రాన్తః ప్రధావసి పిశాచవత్ ।


అభిన్నం పశ్య చాత్మానం రాగత్యాగాత్సుఖీ భవ ॥ ౧౮॥


ఓ మనస్సే స్వరూపముగా ఉన్నవాడా, , ఎందుకు భ్రాంతి చెంది, పిశాచంలాగా అటూ ఇటూ తిరుగుతావు. నీకంటేవేరుకాని ఆత్మని చూసి, రాగద్వేషాల మీద ప్రేమ వదిలి సుఖంగా ఉండు. 


 


త్వమేవ తత్త్వం హి వికారవర్జితం


    నిష్కమ్పమేకం హి విమోక్షవిగ్రహమ్ ।


న తే చ రాగో హ్యథవా విరాగః


    కథం హి సన్తప్యసి కామకామతః ॥ ౧౯॥


నువ్వే ఆ మార్పులేనిదీ, కదలికలేనిదీ, ఒక్కటే అయినదీ, పూర్ణ స్వేఛ్ఛ ఉన్న పరమ తత్త్వానివి. నీకు దేని మీదా రాగముకానీ, విరాగము కానీ లేవు. అటువంటప్పుడు ఏవిధంగా నువ్వు ఈ కోరికలని కోరి కష్టపడతావు?. కష్టపడవు అనిభావము 


 


వదన్తి శ్రుతయః సర్వాః నిర్గుణం శుద్ధమవ్యయమ్ ।


అశరీరం సమం తత్త్వం తన్మాం విద్ధి న సంశయః ॥ ౨౦॥


వేదాలన్నీ గుణములేనిదీ, శుద్ధమైనదీ, నష్టం కానిదీ, శరీరం లేనిదీ, సమమైనటువంటి తత్త్వం గురించి వివరిస్తాయి. నేను ఆ తత్త్వాన్నే అనేది సందేహం లేకుండా తెలుసుకో.


 


సాకారమనృతం విద్ధి నిరాకారం నిరన్తరమ్ ।


ఏతత్తత్త్వోపదేశేన న పునర్భవసమ్భవః ॥ ౨౧॥


ఆకారం ఉన్నదల్లా అసత్యం అని తెలుసుకో. నిరాకారమైనది ఎప్పుడూ ఉంటుందని తెలుసుకో. ఈ తత్త్వంతెలిసినవాళ్ళు మళ్ళీ పుట్టటం అనేది జరగదు. 


 


ఏకమేవ సమం తత్త్వం వదన్తి హి విపశ్చితః ।


రాగత్యాగాత్పునశ్చిత్తమేకానేకం న విద్యతే ॥ ౨౨॥


మహాత్ములు ఒక్కటీ, సమమూ అయిన తత్త్వాన్ని వివరిస్తారు. రాగద్వేషాలని సంపూర్తిగా వదిలివేయటం వల్లనే ఒక్కటీ, అనేకమూ అనే తేడాలు మనసుకు తెలియకుండా పోతాయి. 




 అవధూత ఉవాచ 




అనాత్మరూపం చ కథం సమాధి-


    రాత్మస్వరూపం చ కథం సమాధిః ।


అస్తీతి నాస్తీతి కథం సమాధి-


    ర్మోక్షస్వరూపం యది సర్వమేకమ్ ॥ ౨౩॥


అవధూత చెప్పుతున్నాడు. ఆ తత్త్వము ఆత్మకాకుండా ఉంటే సమాధి ఎట్లా కుదురుతుంది?. అది ఆత్మ రూపమేఅయితే ఇంక సమాధి ఎందుకు?. అది ఆత్మ రూపము అయ్యీ, కాకుండా వుంటే సమాధి ఎలా కుదురుతుంది?. అంతాఒక్కటే అయిన ఆ తత్త్వము, మోక్ష స్వరూపము అయితే సమాధి ఎలా ఉంటుంది?. 


 


విశుద్ధోఽసి సమం తత్త్వం విదేహస్త్వమజోఽవ్యయః ।


జానామీహ న జానామీత్యాత్మానం మన్యసే కథమ్ ॥ ౨౪॥


నువ్వు శుద్ధమైన, సర్వ సమమైన, దేహంతో సంబంధం లేని, పుట్టని, మార్పులేని తత్త్వానివి. నాకు ఇది తెలుసు, నాకుఇది తెలియదు అనే దానిని ఆత్మగా ఎట్లా ఆలోచించవచ్చు?. 




తత్త్వమస్యాదివాక్యేన స్వాత్మా హి ప్రతిపాదితః ।


నేతి నేతి శ్రుతిర్బ్రూయాదనృతం పాఞ్చభౌతికమ్ ॥ ౨౫॥


"తత్త్వమసి " ( నువ్వు ఆత్మవి అయివున్నావు) అనే వాక్యాలతో ఆత్మని ప్రతిపాదించిన వేదాలు, పంచభూతాలతోతయారైన వాటిని అసత్యం అని చెబుతూ "నేతి, నేతి "(ఇదికాదు, ఇదికాదు) అని చెబుతున్నాయి. 


 


ఆత్మన్యేవాత్మనా సర్వం త్వయా పూర్ణం నిరన్తరమ్ ।


ధ్యాతా ధ్యానం న తే చిత్తం నిర్లజ్జం ధ్యాయతే కథమ్ ॥ ౨౬॥


ఈ ఆత్మ, ఆత్మచేతే నింపబడినట్లు, ఈ సమస్తమూ, నిరంతరంగా నీతోటే నింపబడుతోంది. ధ్యానమూ, ధ్యానంచేసేవాడూ, మనస్సూ, ఇవేవీ లేనప్పుడు ఏవిధంగా నీ మనస్సు సిగ్గులేకుండా ధ్యానం చేస్తోంది?. 


 


శివం న జానామి కథం వదామి


    శివం న జానామి కథం భజామి ।


అహం శివశ్చేత్పరమార్థతత్త్వం


    సమస్వరూపం గగనోపమం చ ॥ ౨౭॥


శివుడెవరో నాకు తెలీదు, ఇక నేను అతని గురించి ఏమి చెప్పేది?. శివుడెవరో నాకు తెలీదు, అతణ్ణి ఎలా పూజిస్తాను?. నేను, ఆకాశ స్వరూపుణ్ణి. సమస్వరూపం కలిగిన పరమార్థ తత్త్వమైన శివుణ్ణి.


 


నాహం తత్త్వం సమం తత్త్వం కల్పనాహేతువర్జితమ్ ।


గ్రాహ్యగ్రాహకనిర్ముక్తం స్వసంవేద్యం కథం భవేత్ ॥ ౨౮॥


నేను తత్త్వాన్నీ కాను, సమమైన తత్త్వాన్నీ కాను. నేను ఊహలూ, హేతువులూ లేని తత్త్వాన్ని. కర్త, కర్మ లనేభేదభావాన్ని దాటినవాణ్ణి, నేను నాకే ఏవిధంగా కర్మని అవుతాను?. 


 


అనన్తరూపం న హి వస్తు కించి-


    త్తత్త్వస్వరూపం న హి వస్తు కించిత్ ।


ఆత్మైకరూపం పరమార్థతత్త్వం


    న హింసకో వాపి న చాప్యహింసా ॥ ౨౯॥


అనంతమైన రూపం అంటూ ఏమీ లేదు. పరమమైన ఆ తత్త్వానికి రూపం ఏమాత్రమూ లేదు. ఏకమైన ఆత్మే పరమార్థతత్త్వము. అక్కడ హింసించేదిగానీ, అహింసగానీ లేవు. 


 


విశుద్ధోఽసి సమం తత్త్వం విదేహమజమవ్యయమ్ ।


విభ్రమం కథమాత్మార్థే విభ్రాన్తోఽహం కథం పునః ॥ ౩౦॥


నువ్వు శుద్ధమైన, మార్పులేని తత్త్వానివి. నీకు దేహమూ, చావు పుట్టుకలూ లేవు. అట్టాంటి నీకు భ్రమ ఎట్లాకలుగుతుంది. ఆత్మకి భ్రమ ఎక్కడన్నా ఉంటుందా?. 


 


ఘటే భిన్నే ఘటాకాశం సులీనం భేదవర్జితమ్ ।


శివేన మనసా శుద్ధో న భేదః ప్రతిభాతి మే ॥ ౩౧॥


కుండపగిలిపోతే దాంట్లో ఉన్న ఆకాశం, భేదాలన్నీ వదిలి బయట ఉన్న మహదాకాశంలో ఎలా కలిసిపోతుందో, అల్లాగే, నా మనస్సు శివుడిలో కలిసిపోయింది. ఇంక భేదాలు ఏవీ ఎక్కడ?. 


 


న ఘటో న ఘటాకాశో న జీవో జీవవిగ్రహః ।


కేవలం బ్రహ్మ సంవిద్ధి వేద్యవేదకవర్జితమ్ ॥ ౩౨॥


నిజానికి, కుండే లేదు, దాంట్లో ఆకాశమే లేదు, జీవుడే లేడు, వాడి దేహమూ లేదు. తెలుసుకునేవాడూ, తెలియబడేదీఅనే తేడాలు లేకుండా ఉన్నది బ్రహ్మ ఒక్కటే అని తెలుసుకో. 


 


సర్వత్ర సర్వదా సర్వమాత్మానం సతతం ధ్రువమ్ ।


సర్వం శూన్యమశూన్యం చ తన్మాం విద్ధి న సంశయః ॥ ౩౩॥


అన్ని చోటులా, అన్ని వేళలా, అన్నిటిలోనూ, ఆత్మే ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. శూన్యం అయినదీ, శూన్యం కానిదీఅయిన సమస్తమూ నేనే అని నిస్సందేహంగా తెలుసుకో. 


 


వేదా న లోకా న సురా న యజ్ఞా


    వర్ణాశ్రమో నైవ కులం న జాతిః ।


న ధూమమార్గో న చ దీప్తిమార్గో


    బ్రహ్మైకరూపం పరమార్థతత్త్వమ్ ॥ ౩౪॥


వేదాలూ, లోకాలూ, దేవతలూ, యజ్ఞాలూ, వర్ణాశ్రమాలూ, కులాలూ, జాతులూ, ఇవ్వేవీ లేవు. ధూమ మార్గమూ, దీప్తిమార్గమూ ఇల్లాంటివి లేనేలేవు. పరమార్థ తత్త్వ రూపమైన బ్రహ్మము ఒక్కటే ఉన్నది. 




వ్యాప్యవ్యాపకనిర్ముక్తః త్వమేకః సఫలం యది ।


ప్రత్యక్షం చాపరోక్షం చ హ్యాత్మానం మన్యసే కథమ్ ॥ ౩౫॥


నువ్వూ, నీకంటే వేరుగా చూస్తున్నదీ రెండూ నిజానికి వేరుగా లేవు. వాటిని విభజించలేము. అలా దేన్నైతేవిభజించలేమో అదే నీవు. అట్లాంటప్పుడు ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ఆత్మ ఎలా తెలియబడుతుంది? 


 


అద్వైతం కేచిదిచ్ఛన్తి ద్వైతమిచ్ఛన్తి చాపరే ।


సమం తత్త్వం న విన్దన్తి ద్వైతాద్వైతవివర్జితమ్ ॥ ౩౬॥


అద్వైతం కొంతమంది ఇష్టపడతారు, ద్వైతాన్ని ఇంకొందరు ఇష్టపడతారు. ద్వైతాన్నీ, అద్వైతాన్నీ, రెంటినీ, వదిలేసినప్పుడు ఉండే సమత్వం తో కూడిన తత్త్వాన్ని ఎవ్వరూ తెలుసుకోరు. 


 


శ్వేతాదివర్ణరహితం శబ్దాదిగుణవర్జితమ్ ।


కథయన్తి కథం తత్త్వం మనోవాచామగోచరమ్ ॥ ౩౭॥


తెలుపు లాంటి రంగులు లేనిదీ, శబ్దం లాంటి గుణాలు లేనిదీ, మనస్సుకీ, మాటకీ తెలియబడనిదీ, అయిన ఆతత్త్వాన్ని గురించి ఎలా చెప్పగలుగుతావు?. 


 


యదాఽనృతమిదం సర్వం దేహాదిగగనోపమమ్ ।


తదా హి బ్రహ్మ సంవేత్తి న తే ద్వైతపరమ్పరా ॥ ౩౮॥


రకరకాల ఈ దేహాలు మొత్తమూ, రూపాలతో కనిపించే ఈ ప్రపంచం, ఆకాశం లాగా ఏమీ లేనిది అని, ఇదంతా బ్రహ్మఅని తెలుసుకున్న వాడికి భేద భావం ఉండదు 


 


పరేణ సహజాత్మాపి హ్యభిన్నః ప్రతిభాతి మే ।


వ్యోమాకారం తథైవైకం ధ్యాతా ధ్యానం కథం భవేత్ ॥ ౩౯


ఇతరులకి ఆత్మ వేరుగా కనిపించవచ్చు. కానీ, నాకు మట్టుక్కు, ఆత్మ, ఏ భిన్నత్వమూ లేకుండా, నేనులాగా భాసిస్తోంది. ఆకాశంలాగా, ఒక్కటే, ఇంకేమీ లేకుండా ఉంటే, ధ్యానం చేసేవాడూ, ధ్యానం చేయటమూ ఎట్లా సంభవిస్తాయి?. 


 


యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ ।


ఏతత్సర్వం న మే కించిద్విశుద్ధోఽహమజోఽవ్యయః ॥ ౪౦॥


నేను ఏది చేస్తున్నానో, ఏది తింటున్నానో, ఏది హోమం చేస్తున్నానో, ఏది ఇస్తున్నానో, ఇవిమొత్తమూ, నాదృష్టిలోఎప్పుడూ లేవు. నేను పరమ శుద్ధుణ్ణీ, పుట్టుక లేని వాణ్ణీ, నాశనం లేనివాణ్ణీ. 


 


సర్వం జగద్విద్ధి నిరాకృతీదం


    సర్వం జగద్విద్ధి వికారహీనమ్ ।


సర్వం జగద్విద్ధి విశుద్ధదేహం


    సర్వం జగద్విద్ధి శివైకరూపమ్ ॥ ౪౧॥


ఈ ప్రపంచం మొత్తానికీ ఏ ఆకారమూ లేదు అని తెలుసుకో. 


ఈ ప్రపంచం మొత్తమూ, ఎప్పుడూ ఏ మార్పులూ లేకుండా ఉన్నది అని తెలుసుకో. 


ఈ ప్రపంచం మొత్తమూ, తనలోని వస్తువులతో మలినం కాకుండా శుద్ధంగా ఉందని తెలుసుకో. 


ఈ ప్రపంచం మొత్తమూ, భగవంతుడి స్వరూపంగా తెలుసుకో. 


 


తత్త్వం త్వం న హి సన్దేహః కిం జానామ్యథవా పునః ।


అసంవేద్యం స్వసంవేద్యమాత్మానం మన్యసే కథమ్ ॥ ౪౨॥


నువ్వే ఆ పరమమైన తత్త్వానివి అనే విషయంలో ఏమాత్రమూ సందేహం వద్దు. తనకి తానే తెలియబడే ఆ తత్త్వముమనసు చేత తెలియబడదు. అట్లాంటప్పుడు పరమమైన ఆత్మని తెలుసుకోవాలని ఆలోచించగలవా?. 


 


మాయాఽమాయా కథం తాత ఛాయాఽఛాయా న విద్యతే ।


తత్త్వమేకమిదం సర్వం వ్యోమాకారం నిరఞ్జనమ్ ॥ ౪౩॥


మాయ, మాయ అంటూంటారే అదేమిటి?. ఒక నీడా?. అలాంటి నీడ వంటి మాయ లేనే లేదు. పరమమైన, ఒక్కటిఅయిన, ఈ మొత్తం తత్త్వమూ, ఆకాశంలాగా అంతటా నిండి ఉంది. ఇంక వేరే ఏదీ లేదు. 


 


ఆదిమధ్యాన్తముక్తోఽహం న బద్ధోఽహం కదాచన ।


స్వభావనిర్మలః శుద్ధ ఇతి మే నిశ్చితా మతిః ॥ ౪౪॥


నేను మొదలూ, మధ్యా, చివరా లేని వాణ్ణి. ఎప్పుడూ బద్ధుణ్ణి కాను. నాస్వభావమే నిర్మలము అని, నేను శుద్ధుణ్ణి అనినిశ్చయంగా తెలిసిన వాణ్ణి. 


 


మహదాది జగత్సర్వం న కించిత్ప్రతిభాతి మే ।


బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమస్థితిః ॥ ౪౫॥


నాకు, ఈ జగత్తూ, దాంట్లోని మహత్తు మొదలైన గుణాలూ, ఇవి కొంచెం కూడా తెలియవు. బ్రహ్మ ఒక్కడే ఈ సర్వమూఅయినప్పుడు, వర్ణాశ్రమ ఆచారాలు ఎక్కడ, ఎందుకు వుంటాయి?. 


 


జానామి సర్వథా సర్వమహమేకో నిరన్తరమ్ ।


నిరాలమ్బమశూన్యం చ శూన్యం వ్యోమాదిపఞ్చకమ్ ॥ ౪౬॥


నాకు ఎప్పుడూ, ఒక్కటీ, ఎప్పుడూ ఉండేదీ అయిన దాని గురించి తెలుసు. ఆధారం లేని ఆ ఒక్కటే , శూన్యంగానూ, శూన్యం కానిదిగానూ, ఆకాశమూ, పంచభూతాలూ, ప్రపంచమూ లాగానూ అనిపిస్తుంది. 




న షణ్ఢో న పుమాన్న స్త్రీ న బోధో నైవ కల్పనా ।


సానన్దో వా నిరానన్దమాత్మానం మన్యసే కథమ్ ॥ ౪౭॥


ఆత్మ స్త్రీ, పురుష, తృతీయా ప్రకృతుల్లో ఏదీ కాదు. ఆలోచనాశక్తికానీ, బుద్ధి కానీ ఆత్మకి లేవు. అలాంటప్పుడు, ఆత్మఆనందమయం అయినదనీ, కాదనీ ఎలా చెప్పగలవు?. 




 


షడఙ్గయోగాన్న తు నైవ శుద్ధం


    మనోవినాశాన్న తు నైవ శుద్ధమ్ ।


గురూపదేశాన్న తు నైవ శుద్ధం


    స్వయం చ తత్త్వం స్వయమేవ బుద్ధమ్ ॥ ౪౮॥


 శుద్ధమైన ఆత్మ, ఆరు అంగాలు ఉన్న యోగముద్వారా గానీ , మనస్సుని నాశనం చేయటం వల్లకానీ, గురూపదేశంవల్లకానీ పొందలేవు. ఎందుకంటే నువ్వే, ఇప్పటికే, ఆ శుద్ధమైన, చైతన్యమైన తత్త్వానివి 




న హి పఞ్చాత్మకో దేహో విదేహో వర్తతే న హి ।


ఆత్మైవ కేవలం సర్వం తురీయం చ త్రయం కథమ్ ॥ ౪౯॥


అయిదు భూతాలతో చేయబడిన స్థూల దేహం నువ్వు కాదు. దేహం లేకుండా ఉన్నదీ నువ్వు కాదు. మొత్తమూ ఆత్మఒక్కటే ఉంటే మూడోదీ, తురీయమూ అని ఎందుకు చెబుతావు?. 


 


న బద్ధో నైవ ముక్తోఽహం న చాహం బ్రహ్మణః పృథక్ ।


న కర్తా న చ భోక్తాహం వ్యాప్యవ్యాపకవర్జితః ॥ ౫౦॥


నేను బద్ధుణ్ణి కాదు, ముక్తుడినీ కాను. నేను బ్రహ్మాన్నీ కాను, ఇంకేమీ కాను. పని చేసేవాణ్ణీ కాదు, దాని ఫలితాలుఅనుభవించేవాణ్ణీ కాదు. నేను ఎక్కడా వ్యాపించి లేను, నన్ను ఎవ్వరూ వ్యాపించిలేరు. 


 


యథా జలం జలే న్యస్తం సలిలం భేదవర్జితమ్ ।


ప్రకృతిం పురుషం తద్వదభిన్నం ప్రతిభాతి మే ॥ ౫౧॥


నీళ్ళల్లో నీళ్ళు కలిపితే ఆనీళ్ళకి తేడా లేకుండా ఎలా వుంటుందో, ప్రకృతికీ , పురుషుడికీ తేడా ఏమీ లేదనేది నాకుసుస్పష్టము. 


 


యది నామ న ముక్తోఽసి న బద్ధోఽసి కదాచన ।


సాకారం చ నిరాకారమాత్మానం మన్యసే కథమ్ ॥ ౫౨॥


నేను బద్ధుడిని కాకపోతే, నాకు ముక్తి ఎప్పటికీ రాదు. ఆకారంతోనో , లేకుండానో ఉన్న ఆత్మ బంధనంలో ఉన్నది అనిఎందుకు అనుకుంటావు. 


 


జానామి తే పరం రూపం ప్రత్యక్షం గగనోపమమ్ ।


యథా పరం హి రూపం యన్మరీచిజలసన్నిభమ్ ॥ ౫౩॥


పరమమైన ఆత్మ ఆకాశంలాగా అంతా ఆవరించి ఎదురుకుండా ఉన్నది. దాంట్లో కనిపించే రూపాలు అన్నీఎండమావిలో కనిపించే నీరు లాంటివే. 


 


న గురుర్నోపదేశశ్చ న చోపాధిర్న మే క్రియా ।


విదేహం గగనం విద్ధి విశుద్ధోఽహం స్వభావతః ॥ ౫౪॥


నాకు గురువు లేడు, ఆయనిచ్చే ఉపదేశమూ లేదు. నాకు ఏ ధర్మచింతా లేదు, చేసే పనీ లేదు.


దేహము లేకుండా, ఆకాశం లాగా, శుద్ధంగా ఉండటమే స్వభావం కలిగింది నేనేనని తెలుసుకో. 




విశుద్ధోఽస్య శరీరోఽసి న తే చిత్తం పరాత్పరమ్ ।


అహం చాత్మా పరం తత్త్వమితి వక్తుం న లజ్జసే ॥ ౫౫॥


నువ్వు విశుద్ధమైన వాడివి. నీకు శరీరమూ, మనస్సూలేవు. నువ్వు అన్నిటినీ దాటిన సత్యానివి. "నేనే ఆత్మని, పరమమైన తత్వాన్ని" అని చెప్పటానికి సిగ్గుపడవద్దు. 


 


కథం రోదిషి రే చిత్త హ్యాత్మైవాత్మాత్మనా భవ ।


పిబ వత్స కలాతీతమద్వైతం పరమామృతమ్ ॥ ౫౬॥


 ఓ చిత్తమా, ఎందుకు నువ్వు ఏడుస్తావు?. నీలోపలి ఆత్మ ఏదైతే ఉందో అది అవ్వు.


ఓ పిల్లవాడా, ఏ కళలూ లేని పరమమైన అద్వైతం అనే అమృతాన్ని తాగు. 




నైవ బోధో న చాబోధో న బోధాబోధ ఏవ చ ।


యస్యేదృశః సదా బోధః స బోధో నాన్యథా భవేత్ ॥ ౫౭॥


నీకు జ్ఞానము లేదు, జ్ఞానము కానిదీ లేదు. జ్ఞానమూ, జ్ఞానము కానిదీ, రెండూ కలగలిపి కూడా లేవు. ఏదైతేకనిపిస్తోందో, అదే ఎప్పుడూ ఉండే జ్ఞానము. ఆ జ్ఞానము కాకుండా వేరే ఏమీ లేదు. 


 


జ్ఞానం న తర్కో న సమాధియోగో


    న దేశకాలౌ న గురూపదేశః ।


స్వభావసంవిత్తరహం చ తత్త్వ-


    మాకాశకల్పం సహజం ధ్రువం చ ॥ ౫౮॥


జ్ఞానం వల్లకానీ, తర్కం వల్లకానీ, సమాధి వల్లకానీ, యోగం వల్ల కానీ, దేశ కాలాల వల్ల కానీ, గురువు చేసేఉపదేశాలవల్లకానీ, ఆత్మని పొందలేవు. నేను చైతన్యమేస్వభావంగా కలవాణ్ణి. ఆకాశం లాగా సహజమైన, మార్పులేని, పరమమైన తత్త్వాన్నే నేను. 


 


న జాతోఽహం మృతో వాపి న మే కర్మ శుభాశుభమ్ ।


విశుద్ధం నిర్గుణం బ్రహ్మ బన్ధో ముక్తిః కథం మమ ॥ ౫౯॥


నాకు పుట్టుక లేదు, చావు లేదు. శుభమూ, అశుభమూ అయిన పనులు ఏవీ లేవు. విశుద్ధమూ, గుణాలు లేనిదీ, అయిన బ్రహ్మ నేనైనప్పుడు, బంధమూ, ముక్తీ నాకు ఎల్లా కలుగుతాయి?. 


 


యది సర్వగతో దేవః స్థిరః పూర్ణో నిరన్తరః ।


అన్తరం హి న పశ్యామి స బాహ్యాభ్యన్తరః కథమ్ ॥ ౬౦॥


అంతటా వ్యాపించి ఉన్న దేవుడే స్థిరంగా ఉండేవాడూ, పూర్ణుడూ, ఎప్పుడూ ఉండేవాడూ అయితే, లోపలా, బయటాఎక్కడ ఉంటాడు అనే తేడాని నేను చూడలేకపోతున్నాను. 


 


స్ఫురత్యేవ జగత్కృత్స్నమఖణ్డితనిరన్తరమ్ ।


అహో మాయామహామోహో ద్వైతాద్వైతవికల్పనా ॥ ౬౧॥


ఒక్కటిగా,ఎల్లప్పుడూ, భాగాలు లేకుండా ప్రపంచం ప్రకాశిస్తోంది. మాయ యొక్క మహామోహం వల్ల కలిగే ద్వైతమూ, అద్వైతమూ అనేవి మనస్సులో కలిగే కల్పనలే. 


 


సాకారం చ నిరాకారం నేతి నేతీతి సర్వదా ।


భేదాభేదవినిర్ముక్తో వర్తతే కేవలః శివః ॥ ౬౨॥


ఆకారం ఉండటం, లేకపోవటం, అనేవి ఎప్పుడూ లేదు. ఎప్పటికీ లేదు. ఈ భేదాలూ, అభేదాలూ, నాశనం చేసితిరిగేవాడు కేవలం శివుడే 




న తే చ మాతా చ పితా చ బన్ధుః


    న తే చ పత్నీ న సుతశ్చ మిత్రమ్ ।


న పక్షపాతీ న విపక్షపాతః


    కథం హి సంతప్తిరియం హి చిత్తే ॥ ౬౩॥


నీకు తల్లీ, తండ్రీ, బంధువూ ఎవరూలేరు. నీకు భార్యా, కొడుకూ, స్నేహితుడూ ఎవరూలేరు. పక్షపాతముఉండటమూ,లేకపోవటమూ నీకు లేవు. అల్లాంటప్పుడు, ఆ మనస్సు సంతృప్తి లేకుండా ఎందుకు ఉందో చెప్పు?. 


 


దివా నక్తం న తే చిత్తం ఉదయాస్తమయౌ న హి ।


విదేహస్య శరీరత్వం కల్పయన్తి కథం బుధాః ॥ ౬౪॥


ఓ మనసా, పగలూ, రాత్రీ అనేవి లేవి. ఉదయించటం, అస్తమించటం కూడాలేవు. అలాంటప్పుడు తెలివిగలవాళ్ళు, దేహంలేని ఆత్మకి శరీరం ఎందుకు కల్పిస్తారో చెప్పు?. 


 


నావిభక్తం విభక్తం చ న హి దుఃఖసుఖాది చ ।


న హి సర్వమసర్వం చ విద్ధి చాత్మానమవ్యయమ్ ॥ ౬౫॥


అది విభజింపబడినదీ కాదు, విభజింపబడనిదీ కాదు. అది సుఖాన్నీ, దుఖాన్నీ పొందదు. అది ప్రపంచం కాదు, ప్రపంచం కానిదీ కాదు. అవ్యయమైన ఆత్మ అదే అని తెలుసుకో. 


 


నాహం కర్తా న భోక్తా చ న మే కర్మ పురాఽధునా ।


న మే దేహో విదేహో వా నిర్మమేతి మమేతి కిమ్ ॥ ౬౬॥


నేను పని చేసేవాడిని కాను, ఫలితం పొందేవాడిని కాను. నాకు పాతవీ, కొత్తవీ కర్మలు ఏవీ లేవు. నాకు దేహమే లేదు. నాకు దేహం లేకుండా లేదు.నావీ, నావి కానివీ నాకు ఏవి?. 


 


న మే రాగాదికో దోషో దుఃఖం దేహాదికం న మే ।


ఆత్మానం విద్ధి మామేకం విశాలం గగనోపమమ్ ॥ ౬౭॥


నాకు ఇష్టాలు అనే దోషాలూ, దేహాలు అనే దుఖాలు లేవు. విశాలమూ, ఆకాశం లాంటిదీ, ఒక్కటీ అయిన నేను ఆత్మనేఅని తెలుసుకో. 


 


సఖే మనః కిం బహుజల్పితేన


    సఖే మనః సర్వమిదం వితర్క్యమ్ ।


యత్సారభూతం కథితం మయా తే


    త్వమేవ తత్త్వం గగనోపమోఽసి ॥ ౬౮॥


ఓ మిత్రుడైన మనసా, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు?, ఎందుకు ఎక్కువ తర్కిస్తావు?. వీటన్నిటి సారం చెబుతానువిను. నువ్వే ఆ ఆకాశం లాంటి తత్త్వానివి. 


 


యేన కేనాపి భావేన యత్ర కుత్ర మృతా అపి ।


యోగినస్తత్ర లీయన్తే ఘటాకాశమివామ్బరే ॥ ౬౯॥


యోగి ఏ భావనతో చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు అనేవి అనవసరం. కుండపగిలినపుడు, దానిలో ఉన్నఆకాశం మహదాకాశంలో లీనమైనట్లు,యోగి, ఆత్మలో లీనమౌతాడు. 


 


తీర్థే చాన్త్యజగేహే వా నష్టస్మృతిరపి త్యజన్ ।


సమకాలే తనుం ముక్తః కైవల్యవ్యాపకో భవేత్ ॥ ౭౦॥


తీర్థంలోనైనా, చండాలవాటికలోనైనా ,ప్రాణం విడిచేటప్పుడు స్మృతి ఉన్నా, లేకపోయినా, జ్ఞాని ప్రాణాలు వదలి ఒక్కటిఅయిన ఆత్మలా ఉంటాడు. 


 


ధర్మార్థకామమోక్షాంశ్చ ద్విపదాదిచరాచరమ్ ।


మన్యన్తే యోగినః సర్వం మరీచిజలసన్నిభమ్ ॥ ౭౧॥


ధర్మార్ధకామమోక్షాలూ, కదిలేదీ,కదలనిదీ అయిన ఈ ప్రపంచం మొత్తమూ, యోగి దృష్టిలో ఎండమావిలో ఉన్న నీరులాంటిది. 


 


అతీతానాగతం కర్మ వర్తమానం తథైవ చ ।


న కరోమి న భుఞ్జామి ఇతి మే నిశ్చలా మతిః ॥ ౭౨॥


గడచిపోయినవీ, జరుగుతున్నవీ, రాబోయేవీ, ఏ పనులనీ, నేను చేయను, వాటి ఫలితం తీసుకోను అని నా నిశ్చలమైనఆలోచన. 


 


శూన్యాగారే సమరసపూత-


    స్తిష్ఠన్నేకః సుఖమవధూతః ।


చరతి హి నగ్నస్త్యక్త్వా గర్వం


    విన్దతి కేవలమాత్మని సర్వమ్ ॥ ౭౩॥


శూన్యమైన గుడిసెలో, అన్నిటినీ సమానంగా చూస్తూ, సుఖంగా అవధూత ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఈ సర్వమూ, కేవలం ఆత్మేనని తెలిసి, గర్వం వదలి , నగ్నంగా అతను తిరుగుతుంటాడు. 


 


త్రితయతురీయం నహి నహి యత్ర


    విన్దతి కేవలమాత్మని తత్ర ।


ధర్మాధర్మౌ నహి నహి యత్ర


    బద్ధో ముక్తః కథమిహ తత్ర ॥ ౭౪॥


మూడో అవస్థ అయిన నిద్రా, నాలుగోది అయిన సమాధీ లేనే లేవు. అక్కడ కేవలం ఆత్మే తెలియబడుతుంది. అక్కడధర్మాలూ, అధర్మాలూ, లేవు. ఇంక అక్కడ బద్ధుడూ, ముక్తుడూ ఎలా వుండగలరు?. 


 


విన్దతి విన్దతి నహి నహి మన్త్రం


    ఛన్దోలక్షణం నహి నహి తన్త్రమ్ ।


సమరసమగ్నో భావితపూతః


    ప్రలపితమేతత్పరమవధూతః ॥ ౭౫॥


అక్కడ ఏమంత్రమూ ఎంత వెదికినా ఏమీ తెలియదు, అక్కడ ఛందస్సూ, దాని లక్షణమూ ఏమాత్రమూ లేవో, ఆసమరసమైన స్థితిలో ముణిగి పవిత్రమైన ఆత్మని భావించి, అవధూతనైన నేను, పరమమైనదాన్ని చెప్పాను. 


 


సర్వశూన్యమశూన్యం చ సత్యాసత్యం న విద్యతే ।


స్వభావభావతః ప్రోక్తం శాస్త్రసంవిత్తిపూర్వకమ్ ॥ ౭౬॥


శూన్యమూ, శూన్యం కానిదీ, అయిన ఆత్మ సత్యమా, అసత్యమా అని తెలియబడదు. మార్పులేని ఆత్మ ఒక్కటే ఉన్నది. అదే శాస్త్రాలు నిర్దేశించేది కూడా.


 


ఇతి ప్రథమోఽధ్యాయః ॥ ౧॥


ఇది మొదటి అధ్యాయము. 


No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...