Thursday 11 August 2022

హల్లీసకము - మొదటి భాగము

సాయంత్రమైంది. గోపికా సుందరీమణులు ఓపికలు లేని చిత్తంతో రాసమండల పరిభ్రమణ మహా మండలేశ్వరుడూ, గోప గోపీజన గౌరవ మనోహారీ, నిరంతర తపస్సంతప్త సర్వ కిల్బిష హర సమర్ధ మహా మౌనిజన హృదయ నివాసీ, అయిన ఆ నల్లనయ్య కోసం వేచి ఉన్నారు. వారి పేర్లు అర్మిలి, నెనరు, గాదిలి, మక్కువ, నెమ్మి, రహి, కూర్మి, లలి . వీళ్ళందరికీ ముగ్గురు దూతికలు ఉన్నారు. ఆ అమ్మాయిల పేర్లు ప్రేమ, ప్రియ ప్రీతి.

అందరూ ఆ నల్లని వాడి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఇంతలో అర్మిలి


ఇదిగిదిగొ ఇక్కడే, ఇక్కడే నావాడువెలుగు కన్నుల,నన్ను చూచినాడు

 

అదిగదిగొ ఆ పూల వనము లోపల స్వామి చేరి నా చేతులు పట్టి నాడు

 

ఇదిగిదిగొ ఈ శింశుపా వృక్ష ఛాయలో ప్రభువు కౌగిలి పెన వేసినాడు

 

అదిగదిగొ ఆ నీల సరసు లో నా రేడు జలకమాడి వేణి తీర్చినాడు

 

ఏడి,వాడు, రాడు, నా మన్మధుని ఈడు మోడి చేసి వాడు మాయమయ్యె

 

వాడు లేని నాడు రేడు లేనిది జగము వాడి పోయెను మనసు వాడు లేక

 

అంటూ ఏడవడం మొదలెట్టింది. ప్రేమ మెల్లిగా అర్మిలిని సముదాయించడం మొదలుపెట్టింది.


"స్వామి, వస్తాడు. తప్పకుండా, మొన్న అన్నిపనులు చేసిన వాడు మళ్ళీ రాక ఎక్కడికి పోతాడు. మెల్లిగా వస్తాడు. ఇంకాపొద్దు కూడా సరిగా కాలేదు. మెల్లిగా వస్తాడు. ఆగు. " అన్నది ప్రేమ..

 

" వస్తాడంటావా మెల్లిగా, వస్తే చాలు,వచ్చి మెల్లిగా చూస్తే చాలు, చూసి, చూసి.....

 

మెల్లగా కనులతో చూచినంతనె చాలు కన్నులలొ కన్నుల్లు కలిసిపోవు

 

మెలమెల్లగా తాను మాటాడినంతనే పాటపాడును గుండె ప్రతి క్షణమ్ము

 

మెలమెలమెల్లగా ముట్టుకొనినంతనే చుట్టుకొని వదల దా మనసు రాదు

 

మెలమెల్ల మెలమెల్ల మూర్కొనునంతనే కరిగి వానిలోన కలిసిపోదు

 

మెల మెల్ల మెల మెల్ల మెల్లగా ఒకసారి చేయి పట్టినంత వాడె నేను

 

మెల మెల్ల మెల మెల్ల మెల మెల్ల మెల్లగా దగ్గర తీసిన ఉన్న దొకటె " అన్నది అర్మిలి.

 

" అవును, నువ్వూ, స్వామీ కలిస్తే మిగిలేది ఒకటే కానీ, మిగతావాళ్ళు కలిసినా కూడా అంతే కదా బృందావనమందయానా, అదిగో అక్కడ కూచున్న కూర్మి సంగతి చూడు, ఎప్పుడూ ఇల్లు వదలి రాని పిల్ల ఎలా అయిపోయిందోదాని పక్కన కూర్చుని నెమ్మదిస్తూ పాట పాడుతోంది నెమ్మి ఒకసారి విందాం పద " అంటూ అర్మిలిని తీసుకుని గాదిలివెళ్ళింది.

 

అక్కడ నెమ్మి సప్తస్వరాల హరివిల్లు విరిసే గళంలో కృష్ణుడిని ఉద్దేశించి కూర్మి గురించి పాడుతోంది.

నిచ్చలింట్లో నుండే నీరజాక్షిరో ఇది అచ్చపు ప్రేమతో అటమటించెనురా

మెచ్చుకోళ్ళవి తాను మెచ్చేది లేదుర ఇచ్చకమ్ములవీ నచ్చేది కాదురా

ఉల్లముల్లసిల్ల మెల్లన తలనిండ మల్లెమొల్లలు మరి ముడియుచున్నదిరా

తెల్లని కోకది నారింజ చెంగుతో అభిసారిక లాగు వెలుగు చున్నదిరా 

సల్లలితముగాను ఒక గీతి పాడుచు మెల్లగ తల ఎత్తి చూచుచున్నదిరా

కళ్ళలో నీరుతో కృష్ణ కృష్ణా యని ఎల్ల దిక్కుల నిన్ను వెదకేనురా

మనసులో నువు  నిండ మాటలు పెగలక మౌనిలా తానేమో కూరుచున్నదిరా

తానిది తానది అనుచు తనలో తాను తనవాడనీ నిన్ను తగిలియున్నదిరా

కానడు  తనననుచు కలికి కుందుచు బాగా విన్నబోయీ మిగుల చిన్న అయినదిరా

బాణము ధాటికి వేణిని వదలి బాల నిన్నే తలచి బడలి ఉన్నదిరా

వేగమె నీవొచ్చి చెయిబట్ట కుంటేను చెయిదాటి పోయేను: చలమేలరా

సాగి శ్రీ స్వామి శ్రీ రాజగోపాల నీమముగ దొరతనము నిలబెట్టుకోరా

అలా నెమ్మి పాటవినీ, కూర్మి మనసు చేసే మొర విని కూడా రాలేదు కృష్ణుడు. కూర్మి బడలి, వడలి, నెమ్మి ఒళ్ళో ఒరిగిపోయింది. ప్రేమ వచ్చి శైత్యోపచారాలు చేయటం మొదలుపెట్టింది.

అర్మిలి, గాదిలి ఇద్దరూ కూర్మిని, నెమ్మిని చూసి ఎంతో దిగాలుపడ్డారు.

ఇంతలో పుష్ప కుంజం లో ఉన్న రహి, అక్కడ నృత్యం చేస్తూ ఉన్న నెనరు గురించి

తనను తాను మరచి మరచి తన్మయమైనదిరో

చిన్నారి చెలి చక్కగ చిన్ననాటి సొద తలచుచు

మదిలో పట్టని ప్రేమతొ కన్నులలో వెన్నెలతో

ముదిత మనో మోహనముగ అతిలోకపు నవ్వుతోడ

నేనే కృష్ణుడననుచు నమ్మకముగ ఆటలే

నవ్వులతో పువ్వులతో సువ్వి, ఈల పాటలే

బకుని, కేశి, పూతనలని చంపానని మాటలే

గోపికనని వేడుకగా నవ్వుల విరి. తోటలే

నాకే కస్తూరి నుదుట, పింఛముంది  చూసుకో

ఇదిగో ఇదె వైజయంతి, ఇదియే పీతాంబరము

ఇవిగో శంఖము చక్రము కౌస్తుభమూ, నందకమూ,

ఇవిగో అందెలు ఘల్లన, ఇదిగో వేణువు అనుచును

నేనే పూతనను చంపి పాలు త్రావినానుగా

నేనే కాళియు తలపై నూత్న నాట్య మాడితిగా

నేనే కేశిని చంపి చల్దులెన్నొ కుడిచితిగా

నేనే గోవర్ధనమును ఒక్క కేల నెత్తితిగా

నేనెవ్వరు నేనెవ్వరు నేనెవ్వరు అని అడుగుచు

నేనె  జగద్రక్షణకై దీక్షా కంకణ ధారిని

నేనే విశ్వము లాగా కనిపించే వెలుగును

అవ్యయమఖిలము నేనే ఆదిరూపుడను నేనే

నిర్వికార నిరంజనము నేనే అని పలుకుచూ

అని పాడటం మొదలెట్టగానే అందరూ రహి తన్మయత్వాన్ని, నెనరు తల్లీనమై చేసే నాట్యాన్నీ ఆశ్చర్యంగా చూడ సాగారు. అద్భుతమైన ఆ నాట్యాన్ని చూస్తూ, మధురమైన ఆ పాట వింటూ, కృష్ణుడి లాగా అభినయం చేయటం చూస్తూఅందరూ ఆనందిస్తున్నారు.

నాట్యం ఆగింది.

ఇంతలో యమున వడ్డున నుంచీ, " అందరూ ఇటురండి" అనేకేక వినిపిం చింది. అందరూ "ఏమిటా" అన్నకుతూహలంతో అక్కడికి పరిగెత్తారు. అక్కడ యమున వడ్డున ఇసకలో శంఖ చక్రాంకితాలైన కృష్ణ పాదాలు, వాటి చుట్టూచిన్న వృత్తమూ, వాటి మీద రంగురంగులపూలూ కనిపించాయి అందరికీ. నేల మీద పడుకుని మక్కువ అందిస్తున్నపూలని ఆ పాదాల చుట్టూ సద్దుతోంది లలి.

మందార పూలన్ని మా మంచి శూరునకు అందాల పూలన్ని ఆనంద వీరునకు

బృందారకాది గణ రక్షణ సుధీరునకు బృందావనములోని చిన్నారి మారునకు

నందాత్మజునకు మా నవనీత చోరునకు అందరిని ఉల్లాస పరచేటి పేరునకు

కలికి మొగము లాగ కలువ విచ్చింది

 

కలికి పెదవిలాగ మందార విరిసింది

 

కలికి తళుకులాగ పొగడలే వెలిగాయి

 

కలికి మొగము లాగ మల్లెల్లు మెలిగాయి

 

కలికి నడకలాగ తామరలు ఊగాయి

 

కలికి వేడుక లాగ జాజులు సాగాయి

 

కలికి నడత లాగ దవనమ్ము గంధమ్ము కలికి మొత్తమ్మది కృష్ణుని సొమ్ము

అంటూ పాడుతూ ఆడుతోంది  మక్కువ.

అందరూ ఆ కృష్ణ పాదాలని చూసి మెల్లిగా వంగి చుట్టూ ఉన్న ఇసక కొంచెం తీసుకుని మూర్ధంలో ధరించారు. దానిచుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు. అందరూ కృష్ణుడు అక్కడే నుంచుని వున్నట్టుగా భావనచేస్తూ ఉన్నారు.  "మెల్లమెల్లగ మనసుదోచుతు, నల్లకలువల మించు సొబగుతొ, ఎల్లవారల గుండెనిండే, కళ్ళు ఎవ్వరివో " అంటూ అన్నది కూర్మిఆర్తితో,

"సనక ఋషులను మించినట్టిది, జనక రాజుని దాటినట్టిది, కనక ప్రభలను దాటు వజ్రపుతునక ఎక్కడిదో?" అన్నది నెమ్మి. "మీరు చెప్పే వాటిల్లో ఛందో భంగం ..." అంటూ సంకోచిస్తూన్న రహిని మధ్యలోనే ఆపింది గాదిలి. "ఎన్ని భంగాలున్నా బాధలేదు, మనం చెప్పేది త్రిభంగిలో నుంచున్న వాడి గురించైతే మట్టుక్కు.  మనవాడు అన్ని వ్యాకరణాలకీ అతీతుడు కదా?. నువ్వు కూడా ధైర్యంగా నాలుగు పాటలు పాడు, పద్యాలు చెప్పు, సరైతేమంచిదే, తప్పులైతే మరీ మంచిది." అన్నది గాదిలి. మెల్లిగా రహి కోమలమైన స్వరంతో


బాలగోపాలమాశ్రయేహం, సతతం. (బా)

నీల నీరద దేహ, నిరుపమ శుభ గేహ,

పాలితాద్భుత వాహ, సకల జగన్మోహ  (బా)

నంద గోప కుమార, నిత్య సుఖ సంసార

బృందావన చోర, వందారు మందార.    (బా)

అకళంక మృదు భాష, అవని రాక్షస శోష

సకలేంద్రియ శేష , సరస మంగళ వేష.   (బా)


అని పాడింది. "బానే పాడావు కదా, కృష్ణుణ్ణి పడేయటానికి ఇంకేం కావాలి" అని గాదిలి అంటే రహి సిగ్గుపడింది.

"ఒద్దికగా నుండే ముద్దు గోపాలునితో సద్దు చేసే మంచి బుద్ధిశాలి యెవరో (ఒ)

హద్దులు మీరుచు నిద్దర మానుచు వద్దు అంటూ కూడు ముద్దియ యెవ్వరో (ఒ)

అద్దంపు చెక్కిళ్ళు వసివాడులాగా, ముద్దుల్లు పెట్టేటి మోహిని ఎవరో

సుద్దులు చెప్పుచు ఎద్దుల బండిలొ పొద్దున్నె మీదున్న  పెద్ద జాణ ఎవరొ? (ఒ)

నిక్కి చూచి మదిలో చక్కని సామిని గ్రక్కున చేతితొ పట్టిన దెవరో?

ఎక్కువ ప్రేమతొ దిక్కునీవనుచును మక్కువతో కౌగిలించేది ఎవరో?

చిక్కియు చిక్కని చుక్కల రాయుని చుక్కల రాతిరి సొక్కజేసిన దెవరొ?

మిక్కిలి కూర్మితొ పెక్కైన భంగుల హక్కుగ స్వామిని హత్తుకున్నదెవరొ?  (ఒ)

అంటూ కృష్ణుడు ఎక్కడ  ఉన్నాడోనని, ఎవరితో ఉన్నాడని ఊహించి నెనరు రాగాలు తీసింది.

ఇంతలో వనంలోనుంచి కృష్ణుడి వేణుగానం వినిపించింది.

 

మొదటి భాగం సమాప్తం.


                      - జొన్నలగడ్డ సౌదామిని 

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...