Friday 12 August 2022

హల్లీసకము - రెండవ భాగము

అర్మిలి, గాదిలి, మక్కువ, లలి , రహి, కూర్మి, నెమ్మి, నెనరు వాళ్ళ చెలులయిన ప్రేమ, ప్రియ, ప్రీతి అందరూ మనస్సమాన వేగంతో వేణుగానం ఎక్కడ నుండి వినిపిస్తోందో అక్కడకి వెళ్ళారు. అక్కడ పారిజాత పాదప సమీప విరాజమానుడూ, దివ్య పారిజాత పాదప సమాన హృద్వాంఛా పరిపూర్ణ ప్రభావుడూ, పారిజాత పాదప ప్రసూన తిరస్కార మహద్దంతరుచి ప్రకాశుడూ, శ్రీ పారిజాత పాదప ప్రసూన మాలా విభ్రాజితుడూ అయిన కృష్ణుణ్ణి చూశారు. వాళ్ళని చూడగానే కృష్ణుడు "మీకందరికీ మేలే కదా" అన్నాడు. "మేలూ, శుభమూ నిన్న రాత్రే పోయినాయి." అదేమీ" "చూడాల్సిన వాళ్ళు చూడక పోవటమూ, పిలవాల్సిన వాళ్ళు పిలవకపోవటమూ" "మీ భర్తలతో ప్రణయ కలహమా?" అందరూ ముఖాలు వేలాడేసుకున్నారు. "అవునూ, ఈసమయంలో మీరందరూ మీ వాళ్ళందరినీ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టూ? "

ఇంతులగని నీకు ఇంత పంతమేల? (ఇ)

కాంతల,భ్రాంతల, వింతైన మాటల ఇంత దూరము జేయ సంతసమా నీకు? (ఇ)

స్వాంతమందు నిన్ను చింతించు వారు అంతులేని మమత సొంతమైన వారు కంతుని గెల్చిన సుందరులు వీరు మంతనములకు మరి వచ్చినారు (ఇ) 

అచ్చపు ప్రేమతొ వచ్చినవారిని రచ్చల బెట్టుట న్యాయమె నీకు మచ్చికతో బాగ ముచ్చట చెప్పి హెచ్చగు ప్రీతితొ నిచ్చలు కూడుము (ఇ)

అని సన్ననైన స్వరముతో నెనరు చెప్పిన పలుకులు వినకున్న స్వామితో పొద మాటునా ఎద లోపలి సొద చెప్పితే బదులేదిరా నిదరోయినా మదిలోపలా కదలేవులే వదిలేయకా సౌదామినీ ధళధళ లలో నాదమ్ములో మోదమ్ముగా మెదిలేటి మేటివి! చూడరా! కదలేటి వాడా! కానరా కధ కానిదీ వ్యధ లేనిదీ మధు మాసపు సుధయేదిరా మధురమ్ముగా నినదించుతూ బోధించె! భృంగము చూడరా! అధరమ్ములో అమృతమ్ములూ వృధ చేయకూ అవి నీవెరా బాధంటె భయమే లేదులే వేధింపు లున్నా వదల లే అమలమ్ములౌ కమలమ్ములూ కమనీయమౌ సుమహారమూ సుమనమ్ములౌ తమలమ్ములూ తమకమ్ముతో సమరమ్ముకూ గమనమ్ముకై గమకమ్ములూ శమనమ్ములేనీ కొమ్మకూ నామమ్ములోనా నీవెలే శ్యామమ్ము నీదౌ రూపమే కలహంసలూ కలకూజితం కల్యాణమౌ మలయానిలం ఎలదేటి పాటల తోటలో బులిబుల్లి హంసల నడకలూ లలితమ్ములౌ వలితమ్ములౌ కలితమ్ములౌ నీ తలపులూ ఘలు ఘల్లు గజ్జెలు కదలగా మెలమెల్లగా కలిసెయ్యరా అని కెంగేలు మోడ్చి కన్నుదోయిని నందనందన సుందర పాదారవింద మకరంద సంస్పర్శమాణముగా జేసి విన్నవించిన అర్మిలి పలుకులు విని మాటాడకున్న స్వామితో


ఆదరము లేదేర శ్రీధర! స్వామీ, (ఆ)

మోదముతోడుత ముదితలు వేడగ, బోధలు చేసేవు, బాధలు పెంచేవు (ఆ) 

మొన్న రాతిరి సన్న జేసితి వన్న మాత్రము చాలులే నిన్న రాతిరి కన్నుగీటితి వన్న భావన మధురమే తిన్నగానను ఎన్ని కూడర నేటి రాతిరి రాజువీ మిన్నగా మనసందు కొంచును సుందరాంగ జనార్దనా (ఆ) 

అని కరాంజలులు ముకుళించి వేడిన కూర్మిపై ఓర్మి వహింపని స్వామితో సుద్దులు చెప్పితె

ముద్దు గోపాలుడు నిద్దుర ఎటువచ్చునే (సు)

కద్దు కద్దనువాడు వద్దు వద్దనుచుంటె పొద్దులేగతి పోవునే (సు) 

కామశాస్త్రపు కాచి పోసిన నేత చిటికెలో నీతి శాస్త్రపు జేత అయ్యెనే భామల గంధమ్ము పక్కన బెట్టి తిరుమణి చూర్ణమ్ము తీర్చిదిద్దేనే కోమలుల గానమును వదలిపెట్టి తాను కామజేత కధలు వినెనే బాగుగ ఈరీతి బాలుడొప్పుచుండ బ్రతికేమి ఫలమింక భామా (సు) 

అని విరక్త చిత్తయై చింతించుచున్న నెమ్మికి కమ్మని మాటల లలి స్వామి నుద్దేశించి చేసే విన్నపం ఇట్లా వినిపించింది. నీ మనసులో నెట్లూహింతువో చెప్పు ఆవిధమ్మున నేను నడిచికొందు నీ చిత్తమందేమి చింతింతువో గాని అట్టి తలపులె నేను పట్టి యుందు నీ బుద్ధిలో ఏమి నిర్ణయింతువొగాని సిద్ధము నేనెపుడు స్థిరము గాను నీ అహంకారమే నిజమైనదనియెద నా భావనేదియో ఆజ్ఞ ఇమ్ము నీ ఇష్టమైనట్లు నిజముగ చేయరా ఏమి చేసిన నిన్ను వదలనెపుడు మనసులోన నీవు, మాటలోన నీవు నన్ను నీవు నిండ నిలచిపోదు. అని నిలువబడిన కంపమాన శరీరిణియూ, అశ్రుపూరిత ముఖియూ అయిన లలికి నందగోప సుందరుడు ప్రత్యుత్తరమివ్వక ఉండిన 

కాంతల నేచిన, శాంత మెవరికి నుండు (కాం)

ఇంతుల గూడక భ్రాంతుల జేసి అ శ్రాంతము వదలక వింత కధలవి చెప్పి (కాం) 

నీతులు చెప్పుటకు మౌనులున్నారు వెతకగ అడవిని ఋషులు ఉన్నారు పాత మాటలు చెప్ప పదిమంది ఉన్నారు నాతులకు నువుతప్ప వేరెవరు లేరురా (కాం) 

వెదకంగ వేణువును ఊదేటి వాడూ మదిలోన స్థిరముగా నిలచి ఉన్నాడూ ఎదలోన నిలచి మము చక్కగా ఏలుకో నదిలోన నిలచి మా అందరితొ ఆడుకో (కాం) 

సమయానికి తగ్గ మాటలు చెప్పుము కాముని గెలిచేటి సాములు నేర్పుము రాముని మాటలు రేపు చూద్దాములే భామల మాటను భావించి గెలువర. (కాం) 

అని విన్నపము చేసిన మక్కువను, ఎక్కువ తిరస్కరించి , అక్కజమగు చక్కదనమున చక్కెర విలుకాని దిక్కులతోసి తళుక్కని మెరిసే నల్లనయ్య పక్కకు చూచుచున్న అవసరంబున 

జగడము సేయ సమయము కాదుర, నగుబాటెందుకురా? (జ) 

పగడపు మోవితొ తగిలి కౌగిలించి తగులము తీర్చర తొందరగాను (జ) 

నీకోసమె ప్రతి నిశి నిద్రింపదు, తనని క్షణము చూడుi నీకోసమె నవ పల్లవ కరముల పూలు గట్టె చూడు నీకోసమె ప్రతి క్షణము కలతపడు కన్నీళ్ళని చూడు నీకోసమె తన జీవిత మంతయు మోడి గట్టె చూడు. (జ) 

అని నిరూపించుచున్న రహికి ఆ బృందావన సుందరుడు ప్రాపునివ్వని సమయంబున గాదిలి అత్యంత కోపావేశయై 

దొరతనమది నీది దొంగలెత్తుకుపోను: పోరా నన్నొదిలి వేరు చోటికి సామి(దొ) 

చిరకాల స్నేహమున చిచ్చు పెట్టినవాడ మొగమున మరకలు మాబాగు లేరా(దొ) 

కరి రక్షకుడని మహగొప్పబిరుదులే రమ్మనిన రావిది వల్లకాడే గద పరిపరి నీ మోవి నొక్కిన ఇంటికి సరగున పోవోయి సమయమిదేనోయి(దొ) 

నిన్ను తలచీ ప్రేమ నిద్ర రాలేదపుడు నిను తలచి కోపముతో నిద్ర రాలేదిపుడు నీరాక ఊహపుడు గుండె గుబగుబలాడె నీరాక ఊహిపుడు గుండె బండైపోయె(దొ) 

పండిన కొమ్మని పాడుచేసీ నీవు ఎండిన తీగపై ఎగబడెద వెందుకు గుండె చెరువై పోయి దిండు తడిసీ పోయె మండి పోయెను మనసు మా పెద్ద రేడా (దొ) 

నీకేమి, కులముంది నీకేమి ధనముంది నీకేమి బహు దొడ్డ బంధు గణ ముంది. నేనేమో ఏకిని అంతటేకాకిని నీ వైపునుంచేమొ ఆ నల్లకాకిని  (దొ) 

మన్నారుగుడిలోని మా రాజగోపాల విన్నాములేరా  నీ వింత కధలన్నీ నన్నొదిలి వెళ్ళనని నాకు మాటిస్తేను నిన్ను కరుణిస్తాను ఈ ఒక్కసారికి(దొ)  

అని యదుకుల నందనుని నిష్ఠుర భాషణంబుల నలయించిన ,ఆ సుందరాంగుడు అదృశ్యమయ్యె......


రెండవభాగము సమాప్తము....


                    - జొన్నలగడ్డ సౌదామిని 

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...