Tuesday 29 March 2022

విద్యుత్

పతంజలి గారి అబ్బాయి అమెరికానించి వచ్చాడని, తనని పలకరించటానికి  వెళ్ళాలనీ, లేకపోతే బావుండదనీ మా ఇంటావిడ మరీ మరీ చెబితే, సరే అని శనివారం సాయంత్రం ఇద్దరమూ వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి పతంజలిగారు తమ సోఫా సింహాసనంలో కనిపించకపోయేటప్పటికి ఏమయ్యారా అని చూస్తే హాల్లో ఓ మూల కొత్తగా ఏర్పరచిన కంప్యూటర్లో ఏదో చూస్తున్నారు. నన్ను చూసి దాన్ని ఆపి లేచి వచ్చి తమ సోఫాలో కూర్చుంటూ "అమెరికా నుండి అబ్బాయీ, పిల్లలూ వొచ్చారు. వాడు మాతో మాట్లాడటానికి ఉంటుంది అంటూ ఈ కంప్యూటర్ ఒకటి పట్టుకొచ్చాడు. అదే ఎట్లా వాడాలా అని చూస్తున్నా" అంటూ చెప్పుకొచ్చారు ఆయన. "ఇక మీకు పూర్తిగా కాలక్షేపం" అన్నాను నేను.

ఆయన ఏదో అనబోయేంతలో లోపలనించి ఒక పదేళ్ళ కుర్రాడు వచ్చాడు. వచ్చీ రావటంతోనే "తాతా, జూం ఎలా వాడాలో నేర్చుకున్నావా?" అని అడిగాడు. పతంజలి గారు "నేర్చుకున్నాను లేరా" అని ఆ సంభాషణని తుంచి వేశారు. కానీ ఆ పిల్లవాడు వదలకుండా జూంలో ఉన్న రకరకాల విషయాల గురించి అడగటం మొదలెట్టాడు. పతంజలి గారు వాటికి ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చినా, పిల్లవాడు ఇంకా కొన్ని ప్రశ్నలు గుప్పించాడు. తన తెలివి తేటలు ప్రదర్శించటానికి అవకాశం దొరికిందని పిల్లవాడు రెచ్చిపోయి ప్రశ్నలు వేస్తుంటే పతంజలి గారికి విసుగొచ్చి ఆ ప్రశ్నలనిఏదోలా ముగించాలని చూసినా పిల్లాడు ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తున్నాడు.

పతంజలి గారు ఓపిక నశించి పిల్లవాణ్ణి గదమాయించుదాము అనుకుని కూడా ఎప్పుడో ఒక సారి వొచ్చే వాడు కదా అని ఆగారు. ఇంతలో ఆయన బుర్రలో ఒక మెరుపు మెరిసింది. వెంటనే పిల్లవాడి వైపు చూసి" ముందర నా ప్రశ్నకి సమాధానం చెబితే నీ ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను. "పిల్లవాడు" సరే అడుగు తాతా" అన్నాడు.

పతంజలి గారు మెల్లిగా " ఈ కంప్యూటర్ పనిచేయటానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిట్రా?" అని అడిగారు. ఆపిల్లవాడికి ఒక్క క్షణం ఏమీ తోచలేదు. "ప్రశ్న మళ్ళీ చెప్పు తాతయ్యా?" అని అడిగి చెప్పించుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మెల్లిగా తనలోనే తను " సాఫ్ట్ వేరా లేక హార్డ్ వేరా?" అని గొణుక్కుంటూ ఉండటం నా చెవిన పడింది. పతంజలి గారు అడిగిన విధానం వల్ల ఇదేదో మర్మమైన ప్రశ్న అని అనుకున్న నేను ఆ పిల్లవాడు ఏమి చెబుతాడా అని ఆసక్తిగా వేచి చూశాను.

హార్డ్ వేరూ, సాఫ్ట్ వేరూ మధ్య ఇరుక్కు పోయిన కుర్రాడు "ఇప్పుడే వస్తా తాతయ్యా" అంటూ గదిలోకి వెళ్ళాడు. పతంజలి గారు నాతో ముచ్చట్లు మొదలెట్టారు కానీ నా ఒక చెవి, గదిలోనుంచి అస్పష్టంగా వినిపిస్తున్న  పిల్లవాడూ వాళ్ళ తల్లిదండ్రుల సంభాషణ దగ్గరే  ఉంది.

కాసేపటికి ఒక యువకుడు గదిలోంచి పిల్లవాడితో వచ్చి పతంజలి గారికి ఎదురుగా కూర్చున్నాడు. పిల్లవాడు, మా నాన్నకిసమాధానం తెలుసు అన్న ధీమాతో నాన్న బుజం మీద చెయ్యి వేసి పక్కనే నిలడ్డాడు.

పతంజలిగారు నన్ను వాళ్ళ అబ్బాయికి పరిచయం చేశారు. కుశలప్రశ్నలు నడిచాయి. ఇంతలో మనవడు వాళ్ళ నాన్నచెవిలో ఏదో గొణిగాడు. పతంజలిగారి అబ్బాయి తండ్రివైపు తిరిగి " వీణ్ణి ఏదో ప్రశ్న వేశావుట.." అంటూ మాట్లాడేలోపు పతంజలి గారు " అవునురా, కంప్యూటర్ పనిచేయటానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అని అడిగాను" అన్నారు. వెంటనే తండ్రికి " కంప్యూటర్ లోని హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఉంటయ్యి"అని వాటి గురించి వివరంగా చెప్పాడు. కాసేపు చెప్పి " ఇంకా కావాలంటే ఈ పుస్రకంలో ఉంటుంది నాన్నా" అన్నాడు ఆ అబ్బాయి.

పతంజలి గారు నవ్వుతూ "నేను వేసిన ప్రశ్న నా మనవడికి కాదు వీడికి కూడా అర్థం కాలేదు" అన్నారు నన్ను చూసి. ఇంతలో ఏదో చెప్పబోతున్న అబ్బాయిని ఆగమని సైగ చేసి పతంజలిగారు మొదలెట్టారు.

"కంప్యూటర్ పనిచేయటానికి అతి ముఖ్యమైనది విద్యుత్ శక్తి, అదిలేకపోతే ఏ కంప్యూటరూ పనిచేయదు. అవునా?, కాదా?." అన్నారు పతంజలి గారు. వారబ్బాయీ, మనవడూ ఇద్దరూ ముఖముఖాలు చూసుకుని చివరికి తలలు ఊపారు. పతంజలిగారు ఆపకుండా" నిజానికి ప్రపంచంలో ఏది కదలాలన్నా శక్తి కావాల్సిందే. శక్తి వల్లనే సర్వమూ జరుగుతోంది. కానీ ఆశక్తిని మనం పట్టుకోలేము, చూడలేము కానీ అది ఉందని ప్రతిక్షణమూ తెలుస్తుంది.నిజజీవితంలో విద్యుఛ్ఛక్తిని దీనికి ఉదాహరణగా చూపవచ్చు. అది ఉండటం వల్ల బల్బు వెలుగుతుంది, ఫాను కదులుతుంది, కానీ అది కనిపించదు, వినిపించదు. అనుభవమే అది ఉండటానికి గుర్తు.


బ్రహ్మము కూడా అంతే. దేనివలన కన్నుతో చూస్తున్నామో, దేనివలన మిగతా ఇంద్రియాల ద్వారా రకరకాల విషయాలు అనుభవానికి వస్తున్నాయో, ఏది మనస్సుకి మనస్సో అది ఏమిటి అని విచారణ చేసి అనుభవం ద్వారా ఆ శుద్ధచైతన్యాన్ని గ్రహించాలి" అని ముగించారు.

ఆ మాటలని ఆలోచిస్తూ ఇల్లు చేరాను.


                                 - జోన్నలగడ్డ సౌదామిని

Monday 21 March 2022

జగద్గురువు

వశిష్ఠులవారి ఆశ్రమంలో అంతా కోసల దేశం నించి వొచ్చిన మంత్రి గారి పరివారంతో హడావిడిగా ఉంది.  పరాశరుడు జరుగుతున్నది అంతా చూసి విషయాన్ని గ్రహిస్తున్నాడు. మంత్రి గారు ఏదో రాచకార్యం విషయమై మహర్షికి ఏకాంతంలో విన్నపం చేసి ఆయన చేసిన సూచనలని గ్రహించి బయటికి వచ్చాడు. మహర్షి కూడా ఆయన వెనకే బయటికి వొచ్చి రావి  చెట్టు కింద కూచున్నారు. మంత్రి తన సిబ్బంది దగ్గరకి వెళ్ళి వాళ్ళతో విషయం అంతా చర్చించి సంతృప్తిగా ముఖంపెట్టాడు. మహర్షి దగ్గరకు వచ్చి "మహర్షి గారూ, మీరు కోసలదేశానికే గురువులు కాదు, మీరు జగద్గురువులు. మీ మహానుభావత్వాన్ని మేము ఏవిధంగానూ సంపూర్తిగా సంభావించనూ లేము, సమ్మానించనూ లేము. చంద్రుడికి ఒకనూలు పోగులాగా, మా రాజు గారు పంపిన ఈ చిన్ని కానుకలని సమర్పిస్తున్నాము, స్వీకరించండి" అన్నాడు. మహర్షిసూచన మేరకు, ఆయన శిష్యులు కానుకలని చాలావరకు తిరస్కరించి, అవసరమైన వాటిని స్వీకరించారు. మంత్రిబృందం వెళ్ళిపోయారు.

మరునాడు సాయంత్రం మహర్షి తన శిష్యుడైన మైత్రావరుణుడుగారితో ఏదో చర్చిస్తున్నారు. పరాశరుడు అక్కడకు వెళ్ళాడు. మనవణ్ణి చూసిన మహర్షి, దగ్గరకి పిలిచి ముద్దు చేశారు. సరాగాలు నడుస్తూ వుంటే పరాశరుడు "తాతా, నిన్ను జగద్గురువు అని ఆ మంత్రి సంబోధించాడు కదా?, దాని అర్థం ఏమిటి తాతా?" అన్నాడు. మహర్షి నవ్వుతూ శిష్యుడైన మైత్రావరుణుడుగారి వైపు సాకూతంగా చూశాడు. ఆయన పరాశరుడితో "జగద్గురువు అంటే ఈ జగత్తుమొత్తానికీ గురువు అని అర్థం" అన్నాడు.

పరాశరుడు వెంటనే "ఇప్పుడు ఈ జగత్తులో అనేక మంది రాజులు ఉన్నారు. వారికి అనేకమంది గురువులు కూడా ఉన్నారు. మరి తాతగారు వారి అందరికీ గురువా? అలా అవాలి అంటే వారందరూ దేశదేశాల నించి వచ్చి తాతగారిని కలిసి ఆయన ఉపదేశాలు తీసుకోవాలి కదా? అది నాకు తెలిసి జరుగుతున్నట్టు లేదు. మరి జగద్గురువు ఎట్లా?" అన్నాడు.

మైత్రావరుణుడుగారు క్షణం ఆలోచించి "మానవులు అందరూ చదువుకుని సరైన మార్గంలో నడవటానికి మహర్షిచక్కటి గ్రంథాలు రచించారు కూడా. అవి ఎక్కడ ఉన్నవారైనా చదివి సత్పథంలో జీవించవచ్చు" అన్నారు. పరాశరుడు  వదలకుండా "భూమండలం మీద, ఊర్లల్లో, అడవుల్లో, ఎడారుల్లో అనేక విధాలుగా బ్రతుకుతున్న మనుషుల గురించి వింటాం. వారికి మన భాషే రాదు. పైగా వారెవ్వరూ మనదగ్గరకి వచ్చినట్టు నేను చూడలేదు. మరి జగద్గురువు అని ఎట్లా అనవచ్చు ?" అన్నాడు పరాశరుడు.

మహర్షి గొంతు సవరించుకున్నారు. పరాశరుడూ, మైత్రావరుణుడుగారూ ఆయన వైపు తిరిగారు. మహర్షి మెల్లిగా "పరాశరా, నువ్వు అడిగే జగద్గురువు అనే మాటకి రకరకాల అర్థాలు, రకరకాల విధాలుగా  ఉన్నయ్యి. ఒక అర్థం ఆయన చెప్పిన షష్టీ తత్పురుష సమాసంలో జగత్తుకి గురువు అనేది. దానికి నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏమంటే, జగత్తులోని ప్రతి వ్యక్తి, తన మనస్సు సృష్టించిన తన స్వంత ప్రపంచంలో బ్రతుకుతాడు. అలా ఉన్న తన స్వంతప్రపంచానికి  ఒకరిని గురువుగా భావించి అతనే తన స్వంత జగద్గురువు అనుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, అలా తాను భావించిన వ్యక్తిని ప్రపంచంలోని ఇతరులు అందరూ కూడా భావించాలంటే, మనుషుల్లోని వైవిధ్యాల వల్ల అది అసంభవం అవుతుంది. " అన్నారు.


"అలా అయితే ఇక జగద్గురువు అనే పదమే వ్యర్థమేమో కదా?" అన్నాడు పరాశరుడు.

మహర్షి చిరునవ్వుతో "నన్ను పూర్తి చెయ్యనీయి. నాకు జగద్గురు శబ్దానికి అర్థం చెప్పటానికి బహువ్రీహి సమాసం వాడటం ఇష్టం. అప్పుడు జగద్గురువు అంటే జగత్తే గురువుగా కలవాడు అన్న అర్థం వస్తుంది. ఎవరైతే ఈ జగత్తుని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ, జగత్తుకి ఆధారమైన చైతన్యాన్ని గురువుగా చూస్తాడో, జగత్తు నించీ సత్యం గ్రహిస్తాడో, అతడు జగద్గురువు అనటం నాకు ఇష్టం" అన్నాడు.

"అలా, ఎలా సంభవం తాతయ్యా? జగత్తు నించీ సత్యం గ్రహించటం ఎట్లా?"

"జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే సర్వ ప్రపంచమూ గురువు అవుతుంది. దత్తాత్రేయుల కథ వినలేదూ? ఆ కథలో దత్తాత్రేయ అవధూత తనకు ఇరవై నలుగురు గురువులు ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో ఉన్న వేటకాడు, వేశ్య, కోతి, దొంగ ఇలా రకరకాల వాటి నుంచీ వివిధ వేదాంత విషయాలు నేర్చుకున్నాననీ అందువల్ల ఆ ఇరవై నలుగురూ తనకి గురువులని చెప్పారు.  నిజానికి ప్రపంచంలోని కొంతమంది నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. కొంతమంది నుంచి ఎలా ఉండకూడదో  నేర్చుకోవచ్చు. అలా గ్రహించగలిగితే, సర్వ ప్రపంచమూ నీకు ఎల్లప్పుడూ గురువే. " అన్నారు మహర్షి.

పరాశరుడు నవ్వుతూ "అయితే, నేను కూడా జగద్గురువుని" అన్నాడు. మహర్షి అతని నవ్వులో నవ్వు కలుపుతూ "జగత్తుకి ఆధారమైన చైతన్యాన్ని తెలిసి, సర్వమూ తనకి గురువే అని గ్రహించగలిగిన ప్రపంచంలోని ప్రతి అణువూ, ప్రతి జీవీ జగద్గురువే" అని ముగించారు.

                                    - జొన్నలగడ్డ సౌదామిని

Tuesday 15 March 2022

ఈగ

మళ్ళీ పతంజలి గారింటికి భోజనానికి పిలిచారు. అక్కడ తినబోయే పదార్థాలని తలుచుకుంటూ వారింటికి జేరాను. ఉభయకుశల ప్రశ్నలు అయ్యేంతలో వారి మనవడు పరిగెత్తుకుని వచ్చి కావిలించుకుని "తాతయ్యా, ఒక కథ చెప్పవూ?" అంటూ ముద్దులు కుడిచాడు. మనవడి పరిష్వంగంలో కాసేపు ప్రపంచాన్నే మరిచినట్టు కనిపించిన పతంజలి గారు తేరుకుని నావైపు చూశారు. ఆ చూపులో భావం గ్రహించిన నేను "పిల్లవాడికి కథ  చెప్పండి, నేను కూడా వింటాను" అన్నాను.

ఆయన కథ మొదలెట్టారు. ఒక ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మరిచిపోయి ఇంటి పక్కన ఉన్న పెద్దమ్మని, అడవిలోని పెద్దమ్మ కొడుకునీ, అతను నరుకుతున్న చెట్టునీ, చెట్టుని నరుకుతున్న గొడ్డలినీ, పక్కనే ఉన్న నదినీ, నది నీళ్ళుతాగుతున్న గుర్రాన్నీ, ఆ గుర్రం కడుపులో ఉన్న పిల్లనీ, ఒకరి తరవాత ఇంకొకరిని వరసగా "నా పేరు ఏమిటి" అని అడిగింది. చివరగా అడిగిన గుర్రం కడుపులోని పిల్ల గట్టిగా నవ్వుతూ "ఇహ్హిహిహ్హి ఇహ్హిహ్హిహీ" అంటుంటే ఈగకి తన పేరు గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది అని విశదంగా చెప్పారు. చెబుతున్నంత సేపూ చెవులు దోరబెట్టుకుని వింటున్న పిల్లవాడు "కథ బానేవుంది కానీ, ఏమీ అర్థం కాలేదు తాతయ్యా" అంటూ గదిలోకి వెళ్ళాడు.

అక్కడ వాళ్ళ నాన్నతో ఏదో చర్చిస్తున్నట్టు వాళ్ళిద్దరి గొంతులు వినిపిస్తున్నయ్యి. కాసేపటి తరవాత పిల్లవాడూ, యువకుడూ వొచ్చి పతంజలి గారి ఎదురుగ్గా కూచున్నారు. ఆ యువకుడు చిన్నగా నవ్వుతూ" నాకు చెప్పినట్టే వీడికి కూడా ఇల్లలుకుతున్న ఈగ కథ చెప్పావుట, నన్ను అర్థం చెప్పమని వేపుకు తింటున్నాడు. ఇట్టాంటి కథలకి అర్థాలు ఉండవురా అంటే వినటల్లేదు. నువ్వైనా చెప్పు నాన్నా?" అన్నాడు పతంజలి గారితో.

పతంజలి గారు తాపీగా చేతిలో ఉన్న పుస్తకం చూస్తూ "అది అర్థం పర్థం లేని కథ కాదు. ప్రపంచం మొత్తాన్ని సమన్వయం చేసే వేదాంత కథ అది." అన్నారు. నాకు బుర్ర తిరిగింది. ఆ కథ నా చిన్నప్పుడు వందల సార్లు విన్నాను. పిల్లలకి బోలెడు సార్లు చెప్పాను." ఇదేమిటీయన, వేదాంత కథ అంటున్నాడు" అనుకుని జరగబోయేదేమిటా అని చూస్తున్నాను.

నాలాగే ఆ యువకుడికీ ఏమీ అర్థం అయినట్టు లేదు. వెంటనే " ఈ కథలో అంత విషయం ఎక్కడుందో చెప్పు నాన్నా?" అన్నాడు. పతంజలిగారు పుస్తకం మెల్లిగా మూసి పక్కనపెడుతూ " మన కథలన్నింటిలో వేదాంతం అంతర్లీనంగా ఉంటుంది. విను. కథ మొదట ఈగ ఇంటిని అలుకుతూ తన పేరుని తాను మరిచి పోయింది. ఆవిధంగానే మనం అందరమూ ఈ దేహం కోసమూ, మనస్సు కోసమూ రకరకాల అనవసరమైన పనులు చేస్తూ మన స్వస్వరూపమైన ఆత్మనేమరిచిపోతున్నాము." అన్నారు.

కథ చాలా దూరం సాగుతోందే అని జాగ్రత్తగా వినటం మొదలెట్టాను.

పతంజలి గారు మళ్ళీ మొదలెట్టారు. "కథలో ఈగ అటూ, ఇటూ తిరిగినట్టు, మనం కూడా, పక్కింటి వాళ్ళనీ. వాళ్ళవాళ్ళనీ, వారికి సంబంధించిన వాటినీ, ఇలా అనవసరమైన వాళ్ళందరినీ మన ఆనందానికి దారి గురించి అడుగుతాము.

ఎంత తిరిగినా, ఈగకి తన పేరు తెలియనట్లు. ఈ సంసారంలో ఎంత తిరిగినా, ఎంత సాధించినా, ఎంత సంపాదించినా మనకి స్వస్వరూపం బోధ పడదు. ఇంకా వ్యక్తం అయ్యి బయటపడని గుర్రంపిల్లలాగా, సామాన్యులకి వ్యక్తం కాకుండా, సాధకులని కాచి రక్షిస్తూ  ఉండే గురువు మనకి మార్గోపదేశం చేస్తాడు.

ఆ గుర్రం పిల్ల “ఇహిహీ “ అనగానే ఈగకి తన పేరు "ఈగ" అని గుర్తుకి వొచ్చినట్టు, గురువు యొక్క బోధ వల్ల సాధకుడు, సాధన చేసి తాను ఆత్మని అని తన సత్యమైన ఆనంద స్వరూపం గ్రహించి "హాహాహా" అంటూ నవ్వుతాడు. ఎలాగైతేతన పేరు గుర్తుకు తెచ్చుకున్న ఈగ, నూత్న జ్ఞానంతో, ఇంటికి వెళ్ళి తన పనులు చక్కబెట్టుకుందో, స్వస్వరూపాన్ని తెలుసుకున్న సాధకుడు కూడా, ఈ సంసారంలో ప్రారబ్ధం ఉన్నన్ని నాళ్ళు విహరిస్తూ ఉంటాడు. పోలికలు చాలనుకుంటాను” అంటూ ముగించారు పతంజలి గారు.

బుర్ర గోక్కుంటూ నేనూ, జుట్టు పీక్కుంటూ వాళ్ళ అబ్బాయి  అక్కడ నిండి నిష్క్రమించాము.


                                   - జొన్నలగడ్డ సౌదామిని

Tuesday 8 March 2022

మాయ

ప్రతి రోజూ రాత్రి భోజనాల తరవాత త్యాగరాజ స్వామితో పాటు ముఖ్యశిష్యులు అందరూ దొడ్లో పొగడ చెట్టు కింద జేరేవారు. మెల్లిగా వ్యాసపీఠాన్నీ, పోతనగారి భాగవత గ్రంథాన్నీ పట్టుకుని తెలుగు బాగా వచ్చిన మానాంబుచావడి వెంకటసుబ్బయ్యో, వాలాజాపేట వెంకటరమణ భాగవతారో అక్కడికి జేరేవారు. త్యాగరాజు గారి కూతురు సీతాలక్ష్మి దీపాన్ని తీసుకువచ్చి పెట్టేది. అప్పుడు నిత్య పోతన భాగవత పారాయణ మొదలయ్యేది. అయ్యవారు ఆ పద్యాలు వింటూ అలా మైమరచి పోతూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆ పరవశంలో రాసిన కృతులతో బాటు అప్పుడే రాసిన కృతులు పాడుతుండేవారు అయ్యవారు. అందుకని శిష్యులు రాతసామగ్రి కూడ ఎప్పుడూ దగ్గర ఉంచుకొనేవారు.

ఆ రోజు వామన చరిత్ర చదువుతున్నారు వెంకట సుబ్బయ్య. వామనుడు రావటమూ, బలిదానమివ్వడమూ, త్రివిక్రమావతారమూ పూర్తయ్యినయ్యి. ఇంతలో కథలోకి ప్రహ్లాదుడు రావటమూ, బలి భార్య వింధ్యావళి రావటమూ, ఆమె చేసిన కన్నీటి విన్నపమూ అయ్యవారిని కదిలించినయ్యి. సానుకంపంగా సుబ్బయ్య


కాదనడు, పొమ్ము, లేద

రాదనడు, జగత్త్రయైక రాజ్యము నిచ్చెన్,

నాదయితు గట్టనేటికి

శ్రీదయితా చిత్తచోర, శ్రితమందారా


అన్న పద్యం చదివాడు. అయ్యవారు తానే వింధ్యావళి అయిపోయినంత కదిలిపోయారు. ఆయన కళ్ళవెంట కన్నీళ్ళు కారుతున్నయ్యి. కథ సాగుతోంది. బ్రహ్మ కూడా వచ్చి ప్రార్థించాడు.అప్పుడు విష్ణువు చెప్పిన పద్యం పాడటం మొదలెట్టాడు సుబ్బయ్య.

”ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని యఖిల విత్తంబు నే నపహరింతు"

అని మొదలెట్టగానే అప్పటిదాకా విన్నపాలు చేసిన వింధ్యావళి మొరలే మనస్సులో ఉన్న అయ్యవారికి మదిలో చాలాకష్టం వేసింది. రక్షించు తండ్రీ అని మొరబెట్టితే అలా మొరబెట్టిన వాడి సర్వాన్నీ తానే అపహరిస్తానని విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఆయనకి ఆక్షణాన రుచించలేదు. పద్యం మిగతాభాగం వినబుద్ధి కాలేదు. మనస్సులో భావావేశం పొంగింది. వెంటనే అయ్యవారు గొంతు సవరించుకున్నారు. శిష్యులు కాగితమూ, కలమూ అందుకున్నారు.


పల్లవి.

అడిగి సుఖములెవ్వరనుభవించిరిరా

ఆది మూలమా రామ


అనుపల్లవి.

సడలని పాప తిమిర కోటి సూర్య 

సార్వభౌమ సారసాక్ష సద్గుణ ని(న్న)


చరణం1.

ఆశ్రయించి వరమడిగిన సీత

అడవికి పోనాయె

ఆశ హరణ రక్కసియిష్టమడుగ-

నపుడే ముక్కు పోయె ఓ రామ ని(న్న)


చరణం2.

వాసిగ నారద మౌని వరమడుగ

వనిత రూపుడాయె

ఆసించి దుర్వాసుడన్నమడుగ

అపుడే మందమాయె ఓ రామ ని(న్న)


చరణం3.

సుతుని వేడుక జూడ దేవకియడుగ

యశోద జూడనాయె

సతులెల్ల రతి భిక్షమడుగ వారి వారి

పతుల వీడనాయె ఓ రామ ని(న్న)

 

అంటూ నిందాత్మకమైన పాటని పాడుతున్న అయ్యవారికి అప్పటికి మనస్సులోని ఆవేగం తగ్గింది. " అయ్యో, ఇదేమిటీ ఇలా రాశాను" అనుకొన్న అయ్యవారు ఒక్క క్షణం ఆలోచించి


చరణం4.

నీకే దయ పుట్టి బ్రోతువో బ్రోవవో

నీ గుట్టు బయలాయె

సాకేత ధామ శ్రీ త్యాగరాజ నుత

స్వామి ఏటి మాయ ఓ రామ ని(న్న) 


అని పాటని ముగించారు.


కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న శిష్యులని చూసి "భగవంతుడు అపార కరుణా మూర్తి. కానీ ఆయన మాయ ఏమిటో ఎవరికీ ఏమీ అర్థం కాదు. సీత ఒకసారి ఋషులని చూడాలి అంటే ఆవిడ ఏళ్ళతరబడి అడవిలో ఉండేట్టు చూశాడు. శూర్పణఖ తన కోరిక చెబితే తన ముక్కు కాస్తా పోయింది. విష్ణుమాయని తెలుసుకోవాలి అనుకున్న నారదుడు స్త్రీ అయ్యాడు. దూర్వాసుడు వచ్చి పాండవులని భోజనం పెట్టించమంటే అప్పుడే కడుపు నిండిపోయింది. దేవకి తపస్సు చేసి కన్న పిల్లవాడి ముద్దు ముచ్చటలు యశోదకి దొరికాయి. గోపికలు రతిభిక్ష అడిగితే వాళ్ళ కాపురాలకి దూరం అయ్యారు. కరుణా సుధాబ్ధి అయిన రాముడు ఇలా ఒకటి అడిగితే వేరే ఒకటి ఎందుకు ఇచ్చాడు అంటే అదే ఆయన మాయ. అనిర్వచనీయమైన ఆయన శక్తి. ఎవరి ప్రారబ్ధ ప్రకారం వారికి ఇచ్చాడు" అని ముగించారు.

 

                                    -  జొన్నలగడ్డ సౌదామిని

Tuesday 1 March 2022

చలి

హేమంతం చివరికి వచ్చింది. పొద్దున్నే దట్టంగా పొగమంచు కమ్మేసింది. రెండు అడుగులు మించి కనిపించటల్లేదు. చలి వొణికించేస్తోంది అందరినీ. ఉహుహూ అని దుప్పట్లుకప్పుకుని వణుకుతోంది లోకం మొత్తం. చిదంబర నటరాజదేవాలయం లాంటి మహత్తర దేవాలయంలోనూ ఆ చలి ప్రభావం వల్ల భక్తులు పెద్దగా లేరు. పురోహితులు మట్టుక్కు ఎలాగొలా తయారై అంతటి చలిలోనూ సూర్యోదయం కాకుండానే మొదలయ్యే ప్రాతఃకాల అభిషేకానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అభిషేకం మొదలెట్టడానికి ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు వారందరూ.

ఇంతలో దూరం నుండి అడుగుల చప్పుడు వినిపించింది. చెయ్యెత్తు మనిషి, వొళ్ళంతా త్రిపుండ్రాలు పెట్టుకుని, రుద్రాక్షమాలలు ధరించి, చక్కటి కర్ణాభరణాలు పెట్టుకుని, చక్కటి ధోవతి, ఉత్తరీయమూ, ఆపైన చలి బాధ తగ్గించుకోవటం కోసం ఎవరో మహారాజు కప్పిన దుశ్శాలువా కప్పి, నిరంతర శివ మంత్ర జపంతో పునీతమైన వాక్కుతో, అద్వైత విచారణతో అఖండ బ్రహ్మానందం అనుభవిస్తూ విరాజిల్లే అప్పయ్య దీక్షితులు అక్కడికి వచ్చారు. ఆయనతో బాటు ఆయన శిష్యబృందం కూడా ఉంది.

ఆయన రాగానే పురోహితులలో ఒకరు "వచ్చారా, మీకోసమే చూస్తున్నాం" అంటే ఇంకొకరు "బాగా చలిగా ఉంది, కాసేపటి తరవాత మొదలు పెడదామా?" అన్నారు. వారిమాటలకి తల అడ్డంగా ఊపి "చలి అని ఆగితే ఎలా? ఎంత కష్టమైనా ఏ సమయానికి  జరిగేది ఆ సమయానికి జరగాలి" అని దీక్షితులు గంభీరమైనస్వరంతో శివస్తుతులు చదువుతూ గుడి లోపలికి బయలుదేరారు. ఆయన శిష్యులు ఆయనతో గొంతు కలిపి గట్టిగా చదువుతుంటే గుడి మొత్తం ఆ స్తోత్రాలు  ప్రతిధ్వనించాయి.

గుడి లోపలికి వెళ్ళి, కనకసభలో శిష్యులతో కూచుని, పురోహితులు మొదలెట్టిన మహన్యాసంలో గొంతు కలిపారు దీక్షితులు. "ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్.." అన్న శ్లోకం పోటీలు పడి గట్టిగా చదువటం మొదలెట్టారు అందరూ. ఇంతలో చలిగాలి రివ్వున వీచింది. గట్టిగా వీచిన ఆ చలిగాలి అందరినీ ఒక్కసారి గజగజ వణికించింది. అప్రయత్నంగా వొంటిమీద ఉన్న శాలువాని సవరించుకున్నారు దీక్షితులు. ఇంకా చలి వేస్తుంటే ఏమి చెయ్యాలో తోచలేదు దీక్షితులకి.



ఇంతలో ఆయన దృష్టి ఎదురుగ్గా ఉన్న నటరాజు మీద పడింది. ఆయన్ని చూస్తూ "స్వామీ, నటరాజా" అనుకుంటూ శాలువాని తలమీదా, వొంటిచుట్టూ గట్టిగా చుట్టుకుంటుంటే దీక్షితులకి పరమశివుడు ఇంత చలిని ఎలా తట్టుకుంటున్నాడా అని ఒక భావం కలిగింది. "ప్రభో! కనకసభాపతే! ఇంత చలి ఎలా తట్టుకుంటున్నావయ్యా" అని పైకే అనేశారు దీక్షితులు. అందరూ ఆయన వైపే చూశారు. ఆయన మాత్రం ఈ లోకంలో లేరు. ఆపైన "అసలే హేమంతపు చలి, పైన ఆపకుండా ఈ చన్నీళ్ళ అభిషేకాలు, ఎలా భరిస్తున్నావయ్యా?" అంటూ అదే భావనలో ఉండిపోయారు  దీక్షితులు.

ఆలోచిస్తూ ఉన్నకొద్దీ దీక్షితులకి శివుడి అవస్థ ఇంకా విశదం కాసాగింది. మొదలుపెట్టిన అభిషేకం పూర్తి అయ్యేదాకా ఆపలేరు. అందుకని అలా ఆలోచిస్తూ కూచున్న దీక్షితులు తన చలి గురించి మర్చిపోయి శివుడి చలి గురించి ఆలోచించారు.

శివుడు ఉండేదే మంచు కొండలలో, చేసుకున్నది మంచు కొండల కూతురిని. నెత్తి మీద చల్లగా ఉండే గంగమ్మ, చంద్రుడూ. వొళ్ళంతా చల్లగా ఉండే పాములు  తిరుగుతూ ఉంటాయి. ఆపైన వొళ్ళంతా చందనమూ. ఇలా శివుణ్ణి గురించి ఆలోచిస్తున్న దీక్షితులకి ఇన్ని చల్లటి వాటిని వొంటిమీద, చుట్టూ పెట్టుకుని ఉన్న శివుడు ఎలా చలికి వొణకకుండా ఉన్నాడా అని ఆలోచిస్తున్నారు దీక్షితులు. దానికి తాను ఏమి చెయ్యగలమా అని ఆలోచిస్తున్నారు.

ఇంతలో అభిషేకంపూర్తి అయ్యింది. పూజ కూడా దాదాపు పూర్తి అయ్యింది. అప్పుడు గీతం శ్రావయామి అన్నాడు పురోహితుడు. వెంటనే అప్పయ్య దీక్షితులు

మౌళౌగంగాశశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగాః,

పార్శ్వే వామే దయార్ద్ర హిమగిరిదుహితా చందనం సర్వగాత్రే,

ఇత్థం శీతం ప్రభూతం తవ కనకసభానాథ సోఢుం క్వశక్తిః?

చిత్తే నిర్వేదతస్తే యది భవతినతే నిత్యవాసోమదీయే.

(తలమీద గంగా, చంద్రులు, కాళ్ళూ,చేతుల మీద చల్లగా ఉండే పాములూ, ఎడమపక్క దయతో తడిసిపోయి ఉన్నహిమగిరి కుమార్తె అయిన పార్వతీ దేవీ, వొళ్ళంతా చందనమూ, ఇట్లా చల్లటి వాళ్ళనీ, చల్లటి వస్తువులనీ చుట్టూ చేర్చుకున్న ఓ కనకసభా నాథా, ఇంత చల్లదనం ఎలా భరిస్తున్నావు? నీ దయ ఇంకా కలగలేదే అని నిర్వేదంతో వేడెక్కిపోయి ఉన్న నా మనస్సులో వచ్చి ఎప్పటికీ ఉండిపో. అలా ఉండిపోతే నీకు చుట్టూ ఉన్న చల్లదనం వలన కలిగిన చలిపోతుంది) అన్నారు.

పూజ అయ్యి అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకి వచ్చారు. అప్పుడు పురోహితులలో ఒకరు "దీక్షితులవారూ, మీ శ్లోకార్థం అద్భుతంగా ఉంది. మరి శివుడికి చలి తగ్గాలి అంటే మేము ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాము?" అన్నారు. అప్పయ్య దీక్షితులవారు ఆలోచించి "గుడిలో దినచర్యని ప్రతి దినమూ చేసేదాని కంటే ఇంకొద్ది సేపు ఆలస్యంగామొదలెట్టండి. దాంతో చలి తగ్గి శివుడికి కాస్త సులువుగా ఉంటుంది" అన్నారు. ఆ సలహాకి అందరూ సమ్మతించారు. "మరి మిగతా గుళ్ళలో మాట?" అని పురోహితవర్గంనించి ఇంకో ప్రశ్న వచ్చింది. "మన శివుడికి ఇష్టమైనది మనం చేద్దాం, ఎక్కడ శివుడికి ఏది ఇష్టమో అక్కడ అది జరుగుతుంది" అన్నారు అప్పయ్య దీక్షితులు చిరునవ్వుతో.

అప్పటినించీ అరుణాచలంలో అయిదున్నరకే ఆలయం తెరిచినా చిదంబరం లోనూ ఇంకా అనేక పెద్ద పెద్దఆలయాలలోనూ పొద్దున్న ఆరు గంటలకే స్వామి దర్శనం మొదలైంది.

                                                                                          - జొన్నలగడ్డ సౌదామిని

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...