Monday 21 March 2022

జగద్గురువు

వశిష్ఠులవారి ఆశ్రమంలో అంతా కోసల దేశం నించి వొచ్చిన మంత్రి గారి పరివారంతో హడావిడిగా ఉంది.  పరాశరుడు జరుగుతున్నది అంతా చూసి విషయాన్ని గ్రహిస్తున్నాడు. మంత్రి గారు ఏదో రాచకార్యం విషయమై మహర్షికి ఏకాంతంలో విన్నపం చేసి ఆయన చేసిన సూచనలని గ్రహించి బయటికి వచ్చాడు. మహర్షి కూడా ఆయన వెనకే బయటికి వొచ్చి రావి  చెట్టు కింద కూచున్నారు. మంత్రి తన సిబ్బంది దగ్గరకి వెళ్ళి వాళ్ళతో విషయం అంతా చర్చించి సంతృప్తిగా ముఖంపెట్టాడు. మహర్షి దగ్గరకు వచ్చి "మహర్షి గారూ, మీరు కోసలదేశానికే గురువులు కాదు, మీరు జగద్గురువులు. మీ మహానుభావత్వాన్ని మేము ఏవిధంగానూ సంపూర్తిగా సంభావించనూ లేము, సమ్మానించనూ లేము. చంద్రుడికి ఒకనూలు పోగులాగా, మా రాజు గారు పంపిన ఈ చిన్ని కానుకలని సమర్పిస్తున్నాము, స్వీకరించండి" అన్నాడు. మహర్షిసూచన మేరకు, ఆయన శిష్యులు కానుకలని చాలావరకు తిరస్కరించి, అవసరమైన వాటిని స్వీకరించారు. మంత్రిబృందం వెళ్ళిపోయారు.

మరునాడు సాయంత్రం మహర్షి తన శిష్యుడైన మైత్రావరుణుడుగారితో ఏదో చర్చిస్తున్నారు. పరాశరుడు అక్కడకు వెళ్ళాడు. మనవణ్ణి చూసిన మహర్షి, దగ్గరకి పిలిచి ముద్దు చేశారు. సరాగాలు నడుస్తూ వుంటే పరాశరుడు "తాతా, నిన్ను జగద్గురువు అని ఆ మంత్రి సంబోధించాడు కదా?, దాని అర్థం ఏమిటి తాతా?" అన్నాడు. మహర్షి నవ్వుతూ శిష్యుడైన మైత్రావరుణుడుగారి వైపు సాకూతంగా చూశాడు. ఆయన పరాశరుడితో "జగద్గురువు అంటే ఈ జగత్తుమొత్తానికీ గురువు అని అర్థం" అన్నాడు.

పరాశరుడు వెంటనే "ఇప్పుడు ఈ జగత్తులో అనేక మంది రాజులు ఉన్నారు. వారికి అనేకమంది గురువులు కూడా ఉన్నారు. మరి తాతగారు వారి అందరికీ గురువా? అలా అవాలి అంటే వారందరూ దేశదేశాల నించి వచ్చి తాతగారిని కలిసి ఆయన ఉపదేశాలు తీసుకోవాలి కదా? అది నాకు తెలిసి జరుగుతున్నట్టు లేదు. మరి జగద్గురువు ఎట్లా?" అన్నాడు.

మైత్రావరుణుడుగారు క్షణం ఆలోచించి "మానవులు అందరూ చదువుకుని సరైన మార్గంలో నడవటానికి మహర్షిచక్కటి గ్రంథాలు రచించారు కూడా. అవి ఎక్కడ ఉన్నవారైనా చదివి సత్పథంలో జీవించవచ్చు" అన్నారు. పరాశరుడు  వదలకుండా "భూమండలం మీద, ఊర్లల్లో, అడవుల్లో, ఎడారుల్లో అనేక విధాలుగా బ్రతుకుతున్న మనుషుల గురించి వింటాం. వారికి మన భాషే రాదు. పైగా వారెవ్వరూ మనదగ్గరకి వచ్చినట్టు నేను చూడలేదు. మరి జగద్గురువు అని ఎట్లా అనవచ్చు ?" అన్నాడు పరాశరుడు.

మహర్షి గొంతు సవరించుకున్నారు. పరాశరుడూ, మైత్రావరుణుడుగారూ ఆయన వైపు తిరిగారు. మహర్షి మెల్లిగా "పరాశరా, నువ్వు అడిగే జగద్గురువు అనే మాటకి రకరకాల అర్థాలు, రకరకాల విధాలుగా  ఉన్నయ్యి. ఒక అర్థం ఆయన చెప్పిన షష్టీ తత్పురుష సమాసంలో జగత్తుకి గురువు అనేది. దానికి నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏమంటే, జగత్తులోని ప్రతి వ్యక్తి, తన మనస్సు సృష్టించిన తన స్వంత ప్రపంచంలో బ్రతుకుతాడు. అలా ఉన్న తన స్వంతప్రపంచానికి  ఒకరిని గురువుగా భావించి అతనే తన స్వంత జగద్గురువు అనుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, అలా తాను భావించిన వ్యక్తిని ప్రపంచంలోని ఇతరులు అందరూ కూడా భావించాలంటే, మనుషుల్లోని వైవిధ్యాల వల్ల అది అసంభవం అవుతుంది. " అన్నారు.


"అలా అయితే ఇక జగద్గురువు అనే పదమే వ్యర్థమేమో కదా?" అన్నాడు పరాశరుడు.

మహర్షి చిరునవ్వుతో "నన్ను పూర్తి చెయ్యనీయి. నాకు జగద్గురు శబ్దానికి అర్థం చెప్పటానికి బహువ్రీహి సమాసం వాడటం ఇష్టం. అప్పుడు జగద్గురువు అంటే జగత్తే గురువుగా కలవాడు అన్న అర్థం వస్తుంది. ఎవరైతే ఈ జగత్తుని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ, జగత్తుకి ఆధారమైన చైతన్యాన్ని గురువుగా చూస్తాడో, జగత్తు నించీ సత్యం గ్రహిస్తాడో, అతడు జగద్గురువు అనటం నాకు ఇష్టం" అన్నాడు.

"అలా, ఎలా సంభవం తాతయ్యా? జగత్తు నించీ సత్యం గ్రహించటం ఎట్లా?"

"జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే సర్వ ప్రపంచమూ గురువు అవుతుంది. దత్తాత్రేయుల కథ వినలేదూ? ఆ కథలో దత్తాత్రేయ అవధూత తనకు ఇరవై నలుగురు గురువులు ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో ఉన్న వేటకాడు, వేశ్య, కోతి, దొంగ ఇలా రకరకాల వాటి నుంచీ వివిధ వేదాంత విషయాలు నేర్చుకున్నాననీ అందువల్ల ఆ ఇరవై నలుగురూ తనకి గురువులని చెప్పారు.  నిజానికి ప్రపంచంలోని కొంతమంది నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. కొంతమంది నుంచి ఎలా ఉండకూడదో  నేర్చుకోవచ్చు. అలా గ్రహించగలిగితే, సర్వ ప్రపంచమూ నీకు ఎల్లప్పుడూ గురువే. " అన్నారు మహర్షి.

పరాశరుడు నవ్వుతూ "అయితే, నేను కూడా జగద్గురువుని" అన్నాడు. మహర్షి అతని నవ్వులో నవ్వు కలుపుతూ "జగత్తుకి ఆధారమైన చైతన్యాన్ని తెలిసి, సర్వమూ తనకి గురువే అని గ్రహించగలిగిన ప్రపంచంలోని ప్రతి అణువూ, ప్రతి జీవీ జగద్గురువే" అని ముగించారు.

                                    - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...