Tuesday 15 March 2022

ఈగ

మళ్ళీ పతంజలి గారింటికి భోజనానికి పిలిచారు. అక్కడ తినబోయే పదార్థాలని తలుచుకుంటూ వారింటికి జేరాను. ఉభయకుశల ప్రశ్నలు అయ్యేంతలో వారి మనవడు పరిగెత్తుకుని వచ్చి కావిలించుకుని "తాతయ్యా, ఒక కథ చెప్పవూ?" అంటూ ముద్దులు కుడిచాడు. మనవడి పరిష్వంగంలో కాసేపు ప్రపంచాన్నే మరిచినట్టు కనిపించిన పతంజలి గారు తేరుకుని నావైపు చూశారు. ఆ చూపులో భావం గ్రహించిన నేను "పిల్లవాడికి కథ  చెప్పండి, నేను కూడా వింటాను" అన్నాను.

ఆయన కథ మొదలెట్టారు. ఒక ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మరిచిపోయి ఇంటి పక్కన ఉన్న పెద్దమ్మని, అడవిలోని పెద్దమ్మ కొడుకునీ, అతను నరుకుతున్న చెట్టునీ, చెట్టుని నరుకుతున్న గొడ్డలినీ, పక్కనే ఉన్న నదినీ, నది నీళ్ళుతాగుతున్న గుర్రాన్నీ, ఆ గుర్రం కడుపులో ఉన్న పిల్లనీ, ఒకరి తరవాత ఇంకొకరిని వరసగా "నా పేరు ఏమిటి" అని అడిగింది. చివరగా అడిగిన గుర్రం కడుపులోని పిల్ల గట్టిగా నవ్వుతూ "ఇహ్హిహిహ్హి ఇహ్హిహ్హిహీ" అంటుంటే ఈగకి తన పేరు గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది అని విశదంగా చెప్పారు. చెబుతున్నంత సేపూ చెవులు దోరబెట్టుకుని వింటున్న పిల్లవాడు "కథ బానేవుంది కానీ, ఏమీ అర్థం కాలేదు తాతయ్యా" అంటూ గదిలోకి వెళ్ళాడు.

అక్కడ వాళ్ళ నాన్నతో ఏదో చర్చిస్తున్నట్టు వాళ్ళిద్దరి గొంతులు వినిపిస్తున్నయ్యి. కాసేపటి తరవాత పిల్లవాడూ, యువకుడూ వొచ్చి పతంజలి గారి ఎదురుగ్గా కూచున్నారు. ఆ యువకుడు చిన్నగా నవ్వుతూ" నాకు చెప్పినట్టే వీడికి కూడా ఇల్లలుకుతున్న ఈగ కథ చెప్పావుట, నన్ను అర్థం చెప్పమని వేపుకు తింటున్నాడు. ఇట్టాంటి కథలకి అర్థాలు ఉండవురా అంటే వినటల్లేదు. నువ్వైనా చెప్పు నాన్నా?" అన్నాడు పతంజలి గారితో.

పతంజలి గారు తాపీగా చేతిలో ఉన్న పుస్తకం చూస్తూ "అది అర్థం పర్థం లేని కథ కాదు. ప్రపంచం మొత్తాన్ని సమన్వయం చేసే వేదాంత కథ అది." అన్నారు. నాకు బుర్ర తిరిగింది. ఆ కథ నా చిన్నప్పుడు వందల సార్లు విన్నాను. పిల్లలకి బోలెడు సార్లు చెప్పాను." ఇదేమిటీయన, వేదాంత కథ అంటున్నాడు" అనుకుని జరగబోయేదేమిటా అని చూస్తున్నాను.

నాలాగే ఆ యువకుడికీ ఏమీ అర్థం అయినట్టు లేదు. వెంటనే " ఈ కథలో అంత విషయం ఎక్కడుందో చెప్పు నాన్నా?" అన్నాడు. పతంజలిగారు పుస్తకం మెల్లిగా మూసి పక్కనపెడుతూ " మన కథలన్నింటిలో వేదాంతం అంతర్లీనంగా ఉంటుంది. విను. కథ మొదట ఈగ ఇంటిని అలుకుతూ తన పేరుని తాను మరిచి పోయింది. ఆవిధంగానే మనం అందరమూ ఈ దేహం కోసమూ, మనస్సు కోసమూ రకరకాల అనవసరమైన పనులు చేస్తూ మన స్వస్వరూపమైన ఆత్మనేమరిచిపోతున్నాము." అన్నారు.

కథ చాలా దూరం సాగుతోందే అని జాగ్రత్తగా వినటం మొదలెట్టాను.

పతంజలి గారు మళ్ళీ మొదలెట్టారు. "కథలో ఈగ అటూ, ఇటూ తిరిగినట్టు, మనం కూడా, పక్కింటి వాళ్ళనీ. వాళ్ళవాళ్ళనీ, వారికి సంబంధించిన వాటినీ, ఇలా అనవసరమైన వాళ్ళందరినీ మన ఆనందానికి దారి గురించి అడుగుతాము.

ఎంత తిరిగినా, ఈగకి తన పేరు తెలియనట్లు. ఈ సంసారంలో ఎంత తిరిగినా, ఎంత సాధించినా, ఎంత సంపాదించినా మనకి స్వస్వరూపం బోధ పడదు. ఇంకా వ్యక్తం అయ్యి బయటపడని గుర్రంపిల్లలాగా, సామాన్యులకి వ్యక్తం కాకుండా, సాధకులని కాచి రక్షిస్తూ  ఉండే గురువు మనకి మార్గోపదేశం చేస్తాడు.

ఆ గుర్రం పిల్ల “ఇహిహీ “ అనగానే ఈగకి తన పేరు "ఈగ" అని గుర్తుకి వొచ్చినట్టు, గురువు యొక్క బోధ వల్ల సాధకుడు, సాధన చేసి తాను ఆత్మని అని తన సత్యమైన ఆనంద స్వరూపం గ్రహించి "హాహాహా" అంటూ నవ్వుతాడు. ఎలాగైతేతన పేరు గుర్తుకు తెచ్చుకున్న ఈగ, నూత్న జ్ఞానంతో, ఇంటికి వెళ్ళి తన పనులు చక్కబెట్టుకుందో, స్వస్వరూపాన్ని తెలుసుకున్న సాధకుడు కూడా, ఈ సంసారంలో ప్రారబ్ధం ఉన్నన్ని నాళ్ళు విహరిస్తూ ఉంటాడు. పోలికలు చాలనుకుంటాను” అంటూ ముగించారు పతంజలి గారు.

బుర్ర గోక్కుంటూ నేనూ, జుట్టు పీక్కుంటూ వాళ్ళ అబ్బాయి  అక్కడ నిండి నిష్క్రమించాము.


                                   - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...