Tuesday 18 October 2022

సత్

వశిష్ఠుల వారు సాయంకాల సమయంలో రావిచెట్టు కింద కూచుని శిష్యులైన మైత్రా వరుణుడితో మాట్లాడుతున్నారు. సృష్టి, అది జరిగిన విధానమూ వివరంగా చర్చిస్తున్నారు గురుశిష్యులు. కాసేపటికి ఆటలు చాలించి పరాశరుడు వొచ్చి తాతగారి దగ్గర కూచుని జరిగే సంభాషణ అంతా వింటున్నాడు. ప్రతి  దినమ్మూ వొచ్చి కూచుంటే దినానికి ఒక లడ్డూ ఇచ్చేట్టు తాతామనవళ్ళ వొప్పందం. అలా వొచ్చి కూచున్నాడు మనవడు. కాసేపు అయ్యింది. తలఊపుతూ అంతా వింటున్నవాడు అయిన పరాశరుడు " తాతా, నాదో సందేహం?" అన్నాడు. మహర్షి నవ్వుతూ "నీ బుర్ర సందేహాలపుట్ట" అంటూ మనవడి తల నిమిరి "సరే చెప్పు" అన్నాడు. 

పరాశరుడు మెల్లిగా "నాకు కనిపిస్తున్న ఈ పర్వతాలూ, నదులూ, మనుషులూ, ఇవ్వన్నీ పుట్టకముందు ఇక్కడ ఏమి ఉండేది, తాతా?" అన్నాడు. మైత్రా వరుణుడు గారు నవ్వుతూ "నేను అడిగిన ప్రశ్నే వీడూ అడుగుతున్నాడు. ఇంక మీ సమాధానానిదే ఆలస్యం" అన్నాడు. 

మహర్షి శిష్యుణ్ణీ, మనవణ్ణీ దయతో చూసి "పరాశరా, ఈ సమస్త జగత్తూ సృష్టి కాక ముందు సత్ ఒక్కటే ఉండేది. ఇంకేమీ ఉండేది కాదు. ఆ సత్ నుండే కనిపించే ఈ చరాచర జగత్తు మొత్తం ఆవిర్భవించింది. ఆ సత్ ఒక పదార్థం కాదు. దానికి ఏ విశేషములూ లేవు. అది అంతా వ్యాపించి ఉంది. దాంట్లో గుణ దోషాలు ఏవీలేవు. " అన్నాడు. 



పరాశరుడికి ఈ మాటలు అర్థం అయ్యీ కాకుండా ఉన్నాయి. ఇంకాస్త వివరణ కోసం ఏమి అడగాలా అని పరాశరుడు ఆలోచిస్తూ ఉండగా మైత్రావరుణుడు అందుకున్నారు. "సత్ కి ముందు అసత్ ఉన్నది అని వేదంలోనే ఎక్కడో చదివినగుర్తు?" అని పృఛ్ఛ చేసిన శిష్యుడి వైపు తిరిగి మహర్షి "అనంతమైన వేదాల్లో వేర్వేరు చోట్ల వేర్వేరుగా ఋషులు సత్యాన్ని దర్శించి ఆ దర్శించిన దాన్ని తమ భాషలో చెప్పారు. అందరూ దర్శించింది ఒక సత్యాన్నే అయినా, దాన్ని వ్యక్తీకరించేటప్పుడు తీసుకున్న మనస్సు సహాయం వల్ల వారి మాటల్లో కొన్ని తేడాలుండవచ్చు. అలాగే ఆ దర్శించిన దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే వేదాన్నీ, దాని అర్థాన్ని గురు ముఖతః అధ్యయనం చేసుకుంటే అన్నీ సరిగ్గా సమన్వయం అవుతాయి.

ఉదాహరణకి సత్, అసత్ ల గురించిందే చూద్దాము. అన్నిటికి పూర్వం ఉన్నది ఒక్కటే అని వేదం చెప్పింది అనే దాంట్లో ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కొంతమంది దాన్ని సత్ అన్నారు, ఇంకొంతమంది అసత్ అన్నారు. నా దృష్టిలో భేదం అంతా నామ రూపాల్లోనే గానీ వస్తువులో లేదు. ఒకళ్ళు ఒక పేరుతో అంటే అదే వస్తువుని ఇంకొకరు ఇంకో పేరుతో పిలుస్తారు. 

ఇంకోవిధంగా చూసినా సత్ నుంచి సత్ కానిది ఎలా సంభవిస్తుంది? అలాగే అసత్ నించి సత్ ఎలా సంభవిస్తుంది? నిజానికి ఏది ఉన్నదో అది, సత్, అసత్ లని దాటి వెలిగేది. దానికి ఏ పేరూ పెట్టలేము, దాన్ని ఊహించనూ లేము. నిజానికి ఏది ఉన్నదో అది సత్, అసత్ లకి ఆవల ఉన్నది, చిత్, అచిత్‌లకి ఆవల ఉన్నది. ఆనంద అనానందాలకి ఆవల ఉన్నది. మన లోకం మొత్తం విజయాన్ని ఆరాధించేది కావటంతో నామ రూపాలూ, భేదాలూ ఏవీ లేని ఆ ఎరుకకి మనం సత్, చిత్, ఆనందాలు ఆపాదిస్తాము. అంతే" అన్నారు మహర్షి.

విషయం విశదమయ్యి శిష్యుడూ, లడ్డూ తీసుకుని బుర్రగోక్కుంటూ మనవడూ నిష్క్రమించారు. 


                          - జొన్నలగడ్డ సౌదామిని.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...