Sunday 28 August 2022

జిలుగు దుప్పటి - జనార్దనాష్టకం

సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా 
చరణపద్మము మీద, దేహము చంద్రకాంతులు దేరగా 
మురువు చూపుచు వచ్చినావో
మోహనాకృతి మీరగా 
గరుడవాహన, దనుజ మర్దన, కందుకూరి జనార్దనా 

క్లుప్తంగా చెప్పుకోవాలంటే బంగారం దుప్పటి ఆయన కాళ్ళమీదికి జారింది. దేహము చంద్ర కాంతులు తేరుతోంది. అలా మోహనాకృతి మీరగా ముద్దు చూపుతూ వచ్చావు కదా అంటూ ఆ గరుడ వాహనుడూ, దనుజ మర్దనుడూ అయిన కందుకూరిలోని జనార్దనుణ్ణి వర్ణించినట్టు ఉన్నది ఈ పద్యం. కాస్త తీరిగ్గా చూస్తే చాలా విషయం కనపడుతోంది. ముందర ఆ బంగారు దుప్పటి ఎవరి చరణ పద్మము మీద జారింది, మరీ ముఖ్యంగా ఎందుకు జారింది, ఆ జనార్దనుడు మురువు చూపుతూ రావటానికీ ఈ దుప్పటి జారటానికీ గల సంబంధం ఏమన్నా ఉందా, లాంటి ప్రశ్నలు అన్నీ సమన్వయం చేస్తే కానీ పద్యంలో ఏ విషయాన్ని వర్ణించారో సరిగ్గా అర్థం కాదు. సరే, ముందర ఆ దుప్పటి సంగతి చూద్దాము. ఆ దుప్పటికి వేసిన విశేషణమే మహత్తరంగా ఉన్నది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు పసిడి బంగరు అని సమానార్థకాలైన పదాలని కలిపి ప్రయోగించటం యుక్తమా అన్న ప్రశ్నతో మొదలుపెడితే క్వాచిత్కంగా లభించే ప్రయోగాలతో దాన్ని సమర్థించవచ్చు. జిలుగు దుప్పటి అంటే సూక్ష్మంగా పని చేయబడిన దుప్పటి అని, సిరులు అంటే సంపదలు, శోభలు అనుకుంటే అలాంటి శోభతో కూడిన బంగారంతో తయారై సూక్ష్మమైన పని చేయబడి ఉన్నది ఆ దుప్పటి మీద అని నిర్ధారించుకోవచ్చు. ఇంకో విధంగా చెబితే ఎక్కువ బంగారంతో, జిలుగు పనితో తయారైందని చెప్పవచ్చు. 

దుప్పటికి మంచం మీద వేసే వస్త్రం అనే అర్థం ప్రస్తుతం విరివిగా వాడబడుతున్నా, కావ్యాల్లో కట్టుకునే వస్త్రం గానూ, పైన కప్పుకొనే వస్త్రం గానూ ఎక్కువ గానే వాడారు. ఇక్కడ దుప్పటి అంటే అది నాయకుడిదా, నాయకిదా లేక మంచం మీద వేసినదా అనే ప్రశ్నకి సమాధానాలు అనేక విధాలుగా ఉండవచ్చు, ఆ సమాధానాల బట్టి తరవాత జరిగే క్రియలు అనేకం ఉండవచ్చు కాబట్టి ఆ ప్రశ్న పాఠకులకి వదిలేసి మొదటి ఆలోచన, ఆ జారింది మంచము మీద పరిచిన వస్త్రం అనుకుందాము కాసేపు. మనోహరంగా ఉంది ఈ ఊహ. అక్కడ ఉన్న మంచం మీద ఒక గోపిక ఉన్నది. మంచం కింద ఆయన నించుని ఉన్నాడు. ఆమెని అనునయ పరచే వాక్యాలు చెబుతున్నాడు. గోపికకి ఏదో కోపం వచ్చే పని ఈ గరుడ గమనుడు చేసి ఉండాలి. దాని మీద ఆవిడ ధూం ధాం అని దుప్పటి ముసుగుతన్ని పడుకుని ఉండాలి. మన దక్షిణ నాయకుడు గారు కబుర్లూ, కాకరకాయలూ చెప్పి ఎలాగొలా ఆ కోపాన్ని కాస్త తగ్గించి ఆ ముసుగు కప్పుకున్న దుప్పటిని తొలగించి చేతులోకి తీసుకుంటూ ఉన్నాడు. కోపం పూర్తిగా తగ్గేట్టు ఇంకాసిని కబుర్లు చెబుతూ దుప్పటి మొత్తం గ్రహించి చేతిలోనున్న దుప్పటిని కిందకి వదిలాడు. 

అప్పుడు ఆ సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారి అది ఆ నంద కిశోరుడి పాదాల మీద పడింది. ఇంకోవిధంగా ఆలోచిస్తే ఆ జారింది కృష్ణుడు గారి ఉత్తరీయం అని భావించ వచ్చు అలా భావించి ముందుకు వెళితే చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ ఉత్తరీయం ఎందుకు జారినట్లు?. ఆయన ఒక్కడే ఉండి ఏ వేణువో వాయించుకుంటుంటే పొరపాటున ఉత్తరీయం జారిందా?, లేక అక్కడ ఉన్న గోపిక ఎవరో ఆటపట్టిస్తూ లాగి ఉంటే అది జారిందా? లేక దేహము చంద్రకాంతితో విరాజిల్లుతోంది చూడమని గోపికకి చూపించటానికి ఆ ధూర్త గోపాలుడు తానే ఆ ఉత్తరీయం కిందకి జార్చాడా? ఇవన్నీ ఆలోచిస్తుంటే క్షణకాలం జారింది ఉత్తరీయం కాదేమో అనిపించింది. ఇంకాస్త ఆలోచిస్తే దేహము చంద్రకాంతులు తేరటానికీ, మురువు అంటే అందం అంతా చూపుతూ మోహనాకృతుల్ని అధికరిస్తూ రావటానికీ ఈ ఉత్తరీయం జారిపోవటానికీ సంబంధం బోధపడింది. పద్యం ఏ సన్నివేశంలో వచ్చి ఉంటుందా అన్నది అర్థం అయ్యింది. చంద్రుడు చిరునవ్వు నవ్వుతున్న పున్నమి రాత్రిలో, చక్కటి చంద్ర శిల మీద ఇంకా చక్కగా చెక్కిన మణి మంటపం. ఆ మంటపం మధ్యలో పెద్ద పందిరి మంచమూ, ఆ పందిరి మంచం మీదకి పాకిన మల్లె తీగలూ, ఆ మంచం మీద తుషార, ఫేనములతో పోటీపడే తెల్లటి దిండ్లూ, దుప్పట్లూ, వాటి మధ్య కలహాంతరితకీ ఖండితకీ మధ్యలో ఊగాడుతున్న నాయిక, ఆవిడకి ఎలాగొలా సర్ది చెప్పి శాంతపరచాలని ప్రయత్నించే నాయకుడు, ఇవ్వన్నీ అమిరాయి. కానీ గోపికకి కోపం తగ్గలేదు. ఏమిచెయ్యాలి? నంద నందనుడు ఏదో ఒక మాయచెయ్యాలి కదా, సరే అని కాళ్ళు పట్టుకున్నాడు, ఊహూ కరగలేదు ఆ కాంత. " స్త్రీణామాద్యం ప్రణయ వచనం విభ్రమోహి ప్రియేషు" అని పెద్దలు అన్నారు కదా అని నల్లటి వాడు ఆలోచించాడు. 
ఇంతలో పెద్ద గాలి వచ్చింది. నల్లనయ్య ఒక్క క్షణం ఆలోచించి ఉత్తరీయాన్ని అలా వదిలిపెట్టాడు. అప్పుడు సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారి, జారి మెల్లిగా ఆయన చరణ పద్మము మీద పడింది. అలా ఆయన పైనున్న పచ్చని పటము జారగానే అలౌకికమైన ఆ దేహం మీద పౌర్ణమినాటి చంద్రకాంతి పడింది. దాంతో ఆ దేహం కొత్తకొత్త కాంతులీనుతూ చంద్రకాంతి కంటే ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్న ఆ జనార్దనుణ్ణి చూస్తూ తననితానే మర్చిపోయింది ఆ గోపిక . అలా వెలిగిపోయే ఆ అందం చూపించటానికే వచ్చినట్టూ, అలా ఉత్తరీయం జార్చినట్టూ, ఆ విధంగా తన మోహనాకృతితో సర్వ జగత్తునీ మీరి వెలుగుతూ ఉన్న గరుడవాహనుడూ, రాక్షస మర్దనుడూ అయిన కందుకూరి జనార్దనుణ్ణి రమ్మని మనమూ పిలుద్దాము, రండి.

                    - జొన్నలగడ్డ సౌదామిని.

Thursday 18 August 2022

హల్లీసకము - చివరి భాగము

అత్యంతానందదుడూ, అప్రమేయ ప్రకాశుడూ, అనాద్యవిద్యా జనిత అజ్ఞాన నాశక సమర్ధుడూ అయిన ఆ యమునా తీర విహారి అదృశ్యుడు అవగానే ఆత్మవిద్యా సాధకుడిని తాదాత్మ్యత ఆవరించినట్లు, సూర్యమండలాన్ని మేఘమండలం కప్పేసింది. ఆకాశం చిల్లులు పడినట్లు వానలు మొదలయ్యాయి. ప్రళయ కాలశిఖిశిఖా సంరంభ విజృంభమాణ సౌదామినులను చూసీ, కల్పాంత కాల త్రిపురహర త్రిలోచన నికట వహ్ని సమ నిర్ఘాతపాతములు చూసీ, అందరూ చీకాకు పడ్డారు. యమునా పులిన విరాజిత అశ్వత్థ వృక్ష ము క్రింద అక్కడక్కడ పడే వర్షపుచినుకులను చీరచెంగుల సైరిస్తూ ఉండగా "ఇంటికి వెళదామా" అన్న ప్రీతి మాటలకు అలిగి 

"ఇంటి వాడూ వీడె, ఇల్లూ వీడె కంటికి రాకున్న, కూర్చు వాడూ వీడె (ఇం) 

మంటిమి వీనితొ, తుంటరి వానితొ, ఉంటిమి ప్రేమతొ, జంటకవుల వలె (ఇం) 

లోకమంతా మరచి , శోకమంతా వదలి ఏకమై వానితొ , నాకమే చూశాము లోకోత్తరుడైన నాధుని వదలి ఏక్రియ, ఏగతి, ఎందేగుదామే. (ఇం) 

అని చెప్పిన లలి వాక్యాలకు అందరూ సంతసించారు. ఇంతలో వర్షము తీవ్రమైంది. యమున పొంగింది. యమునా జలం పాదాల వరకూ వచ్చింది. వల్లవ పల్లవపాణులందరూ చల్లని జల్లుల తడిసి ఉల్లములు తల్లడిల్లగా వెల్లబోయి యమునాదేవిని స్తుతించారు.

రంగత్తుంగ తరంగే యమునే, రంగత్తుంగ తరంగే (రం) 

మంగళతర, బహు సంగ వినాశకి, భంగకార యమసోదరి (రం) 

మీన కమఠ నక్ర జంతు బహుళ విధ ప్రవృద్ధే మానిత సంజ్ఞా సహిత మహిత సూర్య పుత్రికే కనత్కనక కింకిణీ కళ్యాణ మాల యుతే సనక సనందాది నుతే అనివారిత ప్రవాహే (రం)
 
అని వినుతించిన దిక్కుమొక్కులేని అక్కాంతల ఎక్కువైన చిక్కుదీర్ప నెవ్వరు రాకున్న, యమునా జలము పెరిగి నడుము వరకు వచ్చినది. అయినను, మ్రొక్కవోని కంఠంబుల చక్కగ అక్కమలనయనుడే దిక్కు అని నమ్మి మక్కువతో అక్కోమలులు

ఇంతులలయుచుండ పొంతకు రావేల, పంతమేలర సామి, పద్మదళాక్షా (ఇం)

సుంతయు దయలేక చెంతకు చేరవు, కాంత కష్టముంటె కరగవు కాస్తైన (ఇం) 

ఇట్టి వర్షమెపుడు వినలేదు, కనలేదు, తట్టుకొనలేమింక తరుణ నయనా! గట్టిగ దయతోడ, జట్టు మాతో గట్టి, పట్టి, మమ్ము బాగ, గట్టున వేయుము. (ఇం) 

నిన్ను నమ్మినవారి, నీరమేమి చేయు, పన్నుగ రక్షింపు పన్నగశయనా! ఎన్ని కష్టములున్న, ఉన్నది నీవని మన్ననతో బహుధైర్యముంటిమిరా (ఇం) 

ఇన్నాళ్ళ వలె కాదు ఇప్పుడు తప్పక మాపక్కన నువ్వు నిలవాలిరా క్రన్నన నీటి ప్రవాహము బాధను వెన్నుడ నీవే తగ్గించాలిరా (ఇం) 

అని రక్షించుమని ప్రార్ధించు లలనామణుల బాధ యమునా ప్రవాహ వేగ ఉద్ధ్రుతి వలె క్షణక్షణ విజృంభమాణమై, దుర్నిరీక్ష్యమై యుండగా ప్రవాహవేగము ఆకంఠము వచ్చెను. అబలలు నిస్సహాయులై రోదింప గాదిలి సహేతుకంబుగా, శ్రీకృష్ణ చరణారవిందంబులు మనసున దలచి, నెమ్మనంబున, ఉమ్మలికంబు వాపు శక్తి గోవింద పదారవిందంబులకు తప్ప వేరు లేదని నమ్మి అమ్మునిశ్రేష్ఠశ్రేష్ఠునికి తనుమనంబులు సంపూర్ణ సమర్పణంబు సేసి

తలచినదే జరుగును, జలజనేత్రుడు (త)

వలచి వాడు మమ్ము చూచి రక్షింప, సరి, వల్లకాదనిన వాని కరుణ అది (త) 

ఏది జరిగినగాని మోదము తోడను శ్రీదుని నమ్మెదము ఒద్దికతో ఉన్న, పోయిన శ్రీమన్నారాయణుడె మా స్వామి యనెదము ఖేదము లేక చివరి శ్వాస ఉన్నంతకు శ్రీపాదమె తలచుదుము అదనుగ కరిని ఏలిన వాడిపుడు ఎటులైన రక్షించులే (త) 

అని చెప్పు గాదిలి మాటలు విని ఉత్సాహ తరంగితులై కంఠ దఘ్నలై యుండి కృష్ణ కృష్ణేతి శబ్దంబులు పిడుగుల శబ్దంబుల నధికరింప గోపికలందరు నినదింప మేఘాల మధ్యలో దామినుల మెరపులో ఉన్న నీలపు కాంతి దివ్వె కాగ,చటుల ఛ్ఛటఛ్ఛటగర్జన ఘోషలు సరస యాత్రారంభ ఘోషగాగ, చండ ప్రచండ నిర్ఘాత పాతంబు లుర్వి దీపావళీ పటాకాలు కాగ , చండ మహోన్నతోద్దండ వర్షంబు లుర్వి శుభ్రము చేయు విధముగాగ, వర్షములో గలుగు వడగళ్ళు మేలైన సుందర రంగవల్లులుగాగ, కృష్ణ దేవుడదిగొ వచ్చుచున్నాడని ప్రకృతి చెప్పేటట్టి పాటలాగ ఉన్న ఆ నిరంతర సలిల ధారా ప్రవాహ సమ్మిళిత నిబిడ నీరంధ్ర తమ రాత్రిలో అనిర్వచనీయ సుందర తనుండునూ, అప్రమేయ స్వప్రకాశుడునూ, అనాద్యవిద్యానిరాకరణ కర్తవ్య పరిపాలనా దక్ష యోగిజన హృత్పుండరీక విరాజమానుడూ, అనిర్దేశ్య ప్రకారుండునూ, అష్టాక్షరీ మంత్ర నిరంతర జప స్సంతప్త పూర్వ కిల్బిష మహా మౌని జన హృదయేశ్వరుడూ అయిన నందగోప సుందరుడు దృశ్యమానుడు అయ్యాడు. గురుచరణారవింద సేవాప్రాప్త విజ్ఞానముతో అజ్ఞానము తొలగినట్లూ, శ్రీమన్నారాయణ నామంతో సర్వ పాపాలూ ధ్వస్తమయ్యినట్లూ, ఉద్దండ వర్షములూ, తత్ప్రాప్త యమునా నీరమూ, కృష్ణ సందర్శన క్షణకాలంలో సమసిపోయినవి. వల్లవాంగనలందరూ వారికి వచ్చిన మహాపదలని మరచి కృష్ణునికి మొక్కి, కరంబులుపట్టి, మాటాడి, కౌగిలించి కృష్ణుడు తమవాడేనని ఆనందించు చున్ననూ, కృష్ణుడు ఇంకనూ తమను దూరమున ఉంచి మాట్లాడుట చూచి కోపమున 

వన్నెలున్న చిన్నదాన్ని నన్ను ఎవరు చూడరో (వ) 

కన్నులలో పెట్టుకుని కైవారము చేయరో (వ)

చందురూడు మందమాయె చేప కనులు తేలిపోయె దొండపండు వెల్లనాయె జింకలేమొ అడవి కెళ్ళె (వ) 

రంభా ఊర్వశి మేనక రాలినట్టి పూవులే రతీదేవి నన్ను చూసి మతి పోయీ తిరిగెలే అచ్చర కాంతలు అందరు పిచ్చి వారలయ్యిరే గోపకులము వొళ్ళు మరచి నాచుట్టూ తిరుగుతుందె(వ) 

అని లలి కోపమున మాట్లాడగా కొద్దిగా ప్రేమ వొద్దురా ముద్దులాడ మా మువ్వ గోపాల అద్దంపు నీ వొళ్ళు అలిసిపోయెనురా వొద్దింక చాలురా సద్దు సేయకురా కొద్దిగాను ప్రేమ ఉంటె చిన్ననాటి చెలికిచ్చుకొ ఇంకొద్దిగ ఎక్కువుంటె ఇతరులకే ఇచ్చుకో ఇంకా ఎక్కువ వుంటే ఇంతులెక్కడని వెదకికో అంతె కాని ఎంతైనా మము పలచన చేయకురా వలచి వచ్చి ముద్దులిచ్చి వదలక నుండేటట్టిదొ గాఢాశ్లేషల రాత్రుల పొద్దులెల్ల గుదిగుచ్చుటొ వసివాడని వనజాక్షిని గజిబిజి చేసేటట్టిదొ మరలవదలి వెళ్ళననీ వొట్టేసియు మాటిచ్చుటొ కుశలముగా కులాసాగ కుసుమశరుని గెలుచుటో ఈమాత్రము లేకుంటే నీవెచ్చటొ మేమెచ్చటొ అని కూర్మి పలికినఅంతలోగాదిలి పట్టరాని తమకంబున వేణుగోపాలుని జీరిన, ఆతండు వల్లెయనక, సడిసేయక, యుండిన గాదిలి పట్టరాని కోపముతో 

ఇంతిరో వీడు ఇంతవాడయ్యెనే(ఇ)

సంతసమున నేను జేర పంతమాడుతుండెనే (ఇ) 

కాంతనని చూడక, కౌగిలించుకొనక, వింతమాటలెన్నొ పలికి వెడవెడ నవ్వేనే సుంతయైన ప్రేమలేని కాంతుడు మనకెందుకులే ఇంతచాలు రండి మనము పోదాము వదలి (ఇ) 

అని గాదిలి అనగా విని మిగిలిన గోపభామలు మనంబులు తల్లడిల్లిననూ, తప్పక, గాదిలిని అనుసరించి చనిరి. గోపకాంతలందరూ తనని వదలి వెళ్ళిన, కృష్ణ భగవానుడు దందహ్యమాన హృదయంబున తనని వదలి వెళ్ళిన గోపభామినులని తలచి మల్లెమొల్లల నవ్వులన్నీ మెల్ల మెల్లగ విసిరి విసిరీ ఉల్లమంతా నిండిపోయిన ఉవిద లెవ్వరొకో ?. పల్లెపాటల పైరు ఆటల, కల్లకపటములేని మాటల, మెల్లమెల్లగ మనసు దోచిన మగువ లెవ్వరొకో? ఉషాకాల మయూఖ కాంతుల తుషారోదయ శీతవేళల మృషా కధలను మళ్ళిచెప్పే భామ లెవ్వరొకో?. హృదయమంతా నిండిపోయీ, మదిని మొత్తం ఆక్రమించీ, సుధామయమౌ సొదలు చెప్పే ముదిత లెవ్వరొకో?. గుండెలోతుల ఘోషలన్నిటి, పిండి వేసేబాధలన్నిటి, మండి పోయే మంట లార్పే అండ లెవ్వరివో? రాగయుక్తముగాను పాడుచు, భోగములలో నన్ను తేల్చుచు, నాగమోహిని లాగ వెలిగే భోగు లెవ్వరొకో?. కమ్మకమ్మగ నెమ్మనమ్మును నమ్మలేని విధమ్మునెంతో నెమ్మదిలగా జేసినట్టీ బొమ్మ లెవ్వరొకో?. కన్నులతొ ప్రేమాభిషేకము వెన్నెలలనే వేడి చేయగ సన్న చేస్తూ సంస్కరించే మిన్న లెవ్వరొకో?. చిన్న నాటన వెన్నెలల్లే తిన్నగా నా మనసు దూరీ, వన్నెచిన్నెలు అన్ని చూపే చిన్నె లెవ్వరివో ?. వాళ్ళపైనా, వీళ్ళపైనా, కళ్ళతోనే కబురు చెబుతూ, కాళ్ళ గజ్జెలు ఆడుకుంటూ, మళ్ళి మళ్ళీ ముద్దుపెట్టే బుల్లి ఎవ్వరొకో?. తియ్యతియ్యని తేనె మాటల, కయ్యమసలే లేని పాటల నెయ్యమంతా మనసునిండిన తొయ్యలెవ్వరొకో?. కడుపునిండా బువ్వపెట్టీ, వొడుపుగా బండినీ తోలీ, మడిని దున్నీ సడిని చేసే తొడిమ లెవ్వరొకో?. కల్లయైనా జగములోపల ఎల్లలేనీ సుఖమునిచ్చీ, మెల్లమెల్లగ మనసు నిండిన పిల్ల లెవ్వరొకో?. ఇట్టుచూసీ, అట్టు చూసీ, బెట్టుచూపీ, బెరుకుతోడీ మెట్టు ఎక్కీ మేడ కొచ్చే దిట్ట లెవ్వరొకో?. తిప్పితిప్పీ కనుల నిదరా, కప్పిపోతూ ఉన్న వదలక, చప్పచప్పటి పాట వదలని తిప్ప లెవ్వరివో?. నవ్వులల్లో నిండె హృదయము, నవ్వులల్లో దొరికె వజ్రము, నవ్వులన్నీ దోచుకెళ్ళిన దివ్వె లెవ్వరొకో?. నిండుగా ఉండేటి చీరా, మెండుగా ఉండేటి నగలూ, దండిగా ఇచ్చేటి గుణమూ ఉండెనెవ్వరికో?. మేటి పనులను బాగ చేసీ, నాటి కధలను బాగ చెప్పీ, మాటిమాటికి గుర్తుకొచ్చే బోటు లెవ్వరొకో?. అని కృష్ణుడు మాటిమాటికీ తనని వదలి వెళ్ళిన గోపకాంతల మనంబున సంభావించి చింతించుచున్న సమయంబున గోపకాంతలందరూ యమునాతీరంలో ఉన్న మాలతీ నికుంజంలో జేరి నిలచియున్న సమయంబున 

కాంత, వాడలిగితే కన్నీళ్ళే కద నాకు(కాం)

భ్రాంతమైన మనసు తోడ ఎంత ఘోరమయ్యెనే (కాం) 

ఇంతలేసిమాటలంటె కాంతుడు దూరము కాడా? కాంతుడు వద్దంటే ఏమయినా సంతసమా? బొంతకాకి లాగ ఇంక ఏకాంతపు జీవితమా? చెంత వాడు లేకపోతె చెలియ! నేను బ్రతుకనే (కాం) 

అని నెమ్మి కందర్ప బాణ భగ్న హృదయయై , బాష్ప సలిల ధారా పరంపరల తన ముఖాంబుజము నిండిపోయి విలపింప,

వాడిని సైరింపవలె, వారిజలోచన(వా) 

వాడు, అందాల చెలికాడు,మదనుని జోడు, వాడు, అందరికి ఈడు,రాతిరికి రేడు, రాననబోడు (వా) 

ఏమేమి చేసిన కామితమ్ము దీర్చు, కలిసి ఎన్నాళ్ళాయె కమలనయనా శ్యామల గాత్రుని సొగసు మరవలేక మరులు కొని మనసిచ్చి మౌనముండగనే కాముడు తానొచ్చి నొచ్చునట్లు మదిలొ అచ్చంపు బాణము అదిరేట్టు వేసెనె భామరొ! సామి ఏమిచేసిన సరి, మరి మాటవలదే, సైరింపవలెనే అని తనప్రకారంబు సెప్పిన కూర్మి అంతరంగంబు విని, ఖిన్న వదనలై యున్న గోపకాంతల జూచి గాదిలి, దూతికలైన ప్రియ, ప్రీతిలను పిలిచి

పోయి పిలువుడు వాని, పొలతులారా(పో)

సోయగములు సొంతమైన నాయక శేఖరుని (పో) 

సంగతిగా తన సారస ముఖులతొ మాటలు చెప్పమని పొంగుచు తనకై వేచిన చెలుల కౌగిలి చేర్చమని శృంగారించిన చెలులందరితో బాగుగ కూడమనీ హంగుగ అందరి కోరిక దీర్చి బాగుగ ఏలమనీ (పో) 

అని పుత్తెంచిన వారును మనస్సమాన సంచారులై పోయి కృష్ణ సమ్ముఖంబున నిలువంబడి శుభము కలుగుగాక శృంగార శిఖరముకు, శుభము కలుగు గాక లలితాననమునకు శుభము కలుగు గాక రసిక శేఖరునకు , శుభము కలుగు గాక మధురాధరమునకు శుభము కలుగు గాక సుందరీజనములకు శుభము కలుగు గాక ఘన ప్రేమ ఫలమునకు శుభము కలుగు గాక కందర్పు బాణముకు శుభము కలుగు గాక యమున తటికి అని శుభంబు పలికి 

ఒంటిగా నున్న కాంతల జంట బాయుట తగునా, దేవర (ఒం) 

తొంటి మాటలు వేగమె తలచి వెంటనె రారాద! వేణుగోపాలా! (ఒం) 

తల్లకిందూలయ్యి కళ్ళలో నీరిడి కాచుకొని ఉన్నారు కమల నయనా! ఉల్లము మొత్తము కల్లోలమైనది ఎల్లి మాపని మళ్ళి ఇంక చెప్పకురా వెల్లువైన బాధ వెలవెల మాడుచు దిక్కుతోచక బాగ చిక్కి యుంటిరిరా మెల్లగ నీవొచ్చి ముట్టుకుని, మాటాడి ముద్దియల బాగెంచి ముచ్చట తీర్పరా (ఒం) 

అని సకలజన మనోభిరాముండైన ఆ నందనందనునికి విన్నవించ పదవే ఓ చెలియ 

పట్టలేకున్నాను, పొలతి మీది మోహము ( ప) 

పదవే నాముద్దు పంచదారచిలుక, కదలుమింక క్షణము కూడ నేనోర్వను( ప) 

తగ్గిన కోపపు క్షణమున అతివల దగ్గరవ్వ వలెను సిగ్గుల మొగ్గల, సరియైన క్షణమున చేయి బట్టవలెను బుగ్గల ఎరుపులు తగ్గ కుండగనె ముద్దుబెట్ట వలెను ముగ్గీముగ్గని యప్పుడె భామల ముగ్గుజేర్ప వలెను (ప) 

అని ప్రేమ పూర్వక వచనంబులు సలిపి లలిత భాషియు, లలిత రూపియు, లలిత కళావిభవుండగు ఆ లాలిత్య నిధి దూతికలతోడ వెన్వెంట నేగి మనోహరు కథా గానంబులు సేయువారునూ, మాధవు పదంబులు మనస్సున నిలిపి మౌనంబున ఆనంద నిధానముగనువారునూ, కృష్ణ నామాకర్ణనంబున బహిరంతరములు మరచి సంభ్రమించువారునూ, పరమప్రేమ సంఫుల్ల మానసులూ అయిన ఆ గోపికా జనంబు డగ్గరినాడు 

దాసుని తప్పులు దండముతో సరి, దయచూడుడీ భామలారా (దా) 

గాసి బొంది, తప్పు చేసితినని యొప్పు వానిని దయచూడుడీ (దా) 

విరులదండ వేసి చేసిన అల్లరి మరువలేదు నేను మరి మరి కణ్ఠా శ్లేష ప్రణయినిని మరువలేను నేను పరిపరి మీకై పరితపించినది మరువలేను నేను సరి, మీకోపము తగ్గనిచో ఏదండనకైనను సిద్ధము నేను (దా) 

అని గోపీ జనంబుల ముంగల రమణీయ నాటకము జరిపి కొందర చిరు నవ్వులచే, కొందర మధురభాషణంబులచే, కొందర కరపల్లవంబుల, కొందర కను కెలంకుల కటాక్షించి మందస్మిత సుధా కిరణంబుల సర్వ హృదయ చోరుడైన ఆ నంద సుందరుండు వల్లవ కాంతల యుల్లముల్లసిలజేసిన 

సాము సడలెను రాత్రి, సామి ఇటు రారా(సా)

మోము జూపీ మమ్ము మోహపెట్టీ తుదకు కాముని కొదిలేసి కష్టపెట్టకురా(సా) 

పున్నమి వెన్నెల నవ్వుతున్నదిరా మొన్నటి బాసలు మిగిలిపోయెనురా చిన్న నవ్వు నవ్వి చిక్కవు దొరకవు మన్ననజేసి మాట చెల్లించర ( సా) 

అని విన్నవించుచున్న నెనరు మాటలు నవ్వుతూ ఆలకించి గోవర్ధన గిరిధారి వేణుగానంబు సేయ తాను ఎక్కడుందో మాట అక్కడే మిగిలెలే, చక్కనైనా కొమ్మ బొమ్మ అయ్యిందిలే, మిక్కిలి ప్రేమతో మనసు నిండిపోయి చిత్రముగ చిత్రమై నిలిచిపోయిందిలే అప్పుడు అందరు గోపికలూ పట్టరాని మోహంబున కృష్ణ, కృష్ణ యనుచు కదియ, పురందర బ్రహ్మాది నిఖిల విశ్వ సమ్మోహన కారుడైన ఆ మోహనమూర్తి శృంగార రస శిఖరాయమాణమైన మందహాసముతో ఒక్కొక్క గోపికకు ఒక్కొక్కడై వెలిసె ఒక్కొక్క గోపికను ఒక్కొక్కడై జీరె ఒక్కొక్క గోపికను ఒక్కొక్కడై పట్టె ఒక్కొక్క గోపికను ఒక్కొక్కడై కదిసె ఇట్లు ఆ నందాత్మజుండు ఒక్కొక్క గోపిక కొక్కడై సరస శృంగార సంభాషణములు సేయ ఒక్క ఇంతిని పట్టి మంతనమాడును, వేరొక్క ఇంతికి కధలు చెప్పు ఒక్క ఇంతికి తాను ముచ్చటలు చెప్పును, వేరొక్క ఇంతికి జడను వేయు ఒక్క ఇంతితొ తాను పాటలు పాడును, వేరొక్క ఇంతితొ ఆటలాడు ఒక్క ఇంతిని కౌగలించియె యుండును వేరొక్క ఇంతితొ పూలుగట్టు అష్ట గోపికలందరి కధలు వినుచు, అష్ట విధముల వర్తించు అమృత మూర్తి కష్ట నష్టము లేక భక్తులను కాచు ఇష్టుడైనట్టి మా నంద శిశువు. అట్లు ఆ బృందావన రాకా శశి, తన వేర్వేరు కళల అయ్యింతులనందర లాలించి, పాలించ పట్టజాలని సుఖము 

పలుకుటకు మాటేది గట్టిగా సామిని పట్టి కూచున్నట్టి (ప) 

ఎట్ట ఎదుటను వీడు చుట్టుకొనీ నాకు బొట్టు పెట్టీ నన్ను చెట్టపట్టే టట్టి (ప) 

మెల్లగా వెనుకగా వచ్చి కళ్ళని మూయ, చల్లని నా స్వామి చేతిపై చెయి వేయు (ప)

మెలమెల్లగా నా మనసున దూరి, పొమ్మన్ననూ, పోను అన్నటి క్షణపు (ప)

ఇదికాదు,అదికాదు, ఏది వాడని చూడ, నీవునేనొకటని నిలిపిన క్షణపు (ప) 

అని లలి భగవానునికి కరకమకంబులు ముకుళించి మ్రొక్క, అప్పుండరీకాక్షుండు మందస్మితంబుగా 

చేడెలారా మీరు, కూడియున్నారు (చే) 

వీడని ప్రేమతొ పాడుతున్నారు(చే) 

వసి వాడనీ భక్తి మనసున నింపి మసి పట్టనటువంటి బుద్ధిని గలిగి కాసంత చింతయు కదలక వదిలి భాసించు ఆత్మతొ అహమును త్రోసి (చే) 

అని సంఫుల్ల మానసుడై అక్కాళిందీ పులినతలవిహారి, అవ్వారల నందర మిక్కిలి మక్కువతో, హల్లీసకంబునకు పిలువ 

హల్లీసకంబునకు వల్లవ కాంతలు,జనిరి ఉల్లసిలుచు పల్లవించుచును (హ)

మల్లీమందారాది కుసుమముల ముడిచీ, నల్లని వాడని నగవున బలికీ(హ) 

ఘల్లున గజ్జెలు ఘణఘణ మనగా, కొల్లలౌ తలపులు మెల్లన తీర(హ) 

కనకహారములు ఘనముగ దాల్చీ, ఘననీలనిభజూసి తలపుల తగిలి (హ)

రండు రండనుచును ఒండొరుల పిలిచీ, దండిగా విరులను జడలను తురిమి(హ)

కమ్మవిల్తుడు వేయు కుసుమాస్త్రమనగా, నమ్మకమ్మున గెల్తు నందాత్మజుని యనుచు(హ) 

కనుగొనల చూడగ, ఇంచు విలుకాడు, తేనెలో ముంచి పూనె బాణములు (హ) 

పరిపరి కనుగొట్ట పడతు లందరును, మరిమరి తొడగొట్టె, మారుడు, పిలిచి (హ) 

అని ఇట్లు తియ్యవిలుకాని సుందరిని ముందర జయించి జను నయ్యింతుల యా నల్లని మాయలాడు మెల్లని మాటల నలయించి, పెంపు మించి, అష్టకాంతలకు అష్ట శరీరుడై వెలసి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంబున మురిపించ, యమునాపులినంబున కర్ణికార, కేతకీ, కమల, కరవీరాది పుష్పమాలా విరాజితుండునూ, కమనీయ మణిమయ చేలుండునూ, ఇందుధర సుందరీ సదృశ విశేష రూప గుణ విలసితుండునూ, కందర్ప గర్వ నిర్వాపణుడూ అయిన ఆ గోపసుందరుడు, ఆ కాంతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కడై వృత్తాకారమున అష్ట కాంతలు అష్ట కృష్ణులతో కలిసి హల్లీసకము జేయ నిలింపులు గుంపులు గొని కల్పవృక్ష సుమంబుల వర్షంబులు గురియించిరి. దేవదుందుభులు మ్రోగె అప్పుడు నెమ్మి పరమప్రేమతో 

రాసలీల లాడునట్టీ రాలుగాయిని చూడరే,క్రిందకొచ్చిన చంద్రవంకని తనివితీరా చూడరే (రా) 

రాస మండలనృత్య ఖేలన రాజరాజును చూడరే, పట్టలేనీ పరంధాముని పట్టిపట్టీ చూడరే(రా) 

చక్కగా ఒక కుప్పపోసిన అందమిక్కడ చూడరే , ఒక్కసారే వేల చంద్రుల వెన్నెలలు వీక్షించరే(రా) 

ఒకరితో లేనవ్వులు, ఆపైన పువ్వుల తురుములు ఒకరి చెవిలో గుసగుస ఆపైన పాటల పరవశం ఒకరితోనో మాటలూ ఇంకొకరితొ బహు పాటలూ ఒకరితోనో సుద్దులూ, ఇంకొకరితోనో ముద్దులూ (రా)

అట్లు జగన్మోహనంబుగా, వల్లవాంగనలతో హల్లీసకము సల్పిన, సర్వ ప్రకృతి అమందానందమున నుండె. ఇవ్విధంబున సరస శృంగార చక్రవర్తి యయిన నందనందను గుణభజనానంద కీర్తనలు సేయు వారందరు అమందానందంబున వాసుదేవు నిజపదంబునకు జనిరి అని చెప్పి జన వినుత విహారీ, జానకీ ప్రేమ రాశీ కనకమయ విభూషీ, కాననోద్దండ భాసీ సనక వినుత శౌరీ, వానరేంద్రాతి స్నేహీ ధనకనక విరాగీ, జ్ఞాననిష్ఠానుకూలీ అని శ్రీరామునకు సర్వము సమర్పించి మంగళము 

కొలని దోపరికి మంగళము, పొలతుల చెలునకు మంగళము(కొ) 

నెలతల ప్రేమకు ఫలమై నిలిచిన నీలబాలునకు మంగళము (కొ) 

ఎల్లరి మనసులు మెల్లగదోచే చల్లని తండ్రికి మంగళము పల్లవి పాడుచు పిల్లల గాచే అల్లరి తండ్రికి మంగళము (కొ)

సమాప్తము


                       - జొన్నలగడ్డ సౌదామిని 
    

Friday 12 August 2022

హల్లీసకము - రెండవ భాగము

అర్మిలి, గాదిలి, మక్కువ, లలి , రహి, కూర్మి, నెమ్మి, నెనరు వాళ్ళ చెలులయిన ప్రేమ, ప్రియ, ప్రీతి అందరూ మనస్సమాన వేగంతో వేణుగానం ఎక్కడ నుండి వినిపిస్తోందో అక్కడకి వెళ్ళారు. అక్కడ పారిజాత పాదప సమీప విరాజమానుడూ, దివ్య పారిజాత పాదప సమాన హృద్వాంఛా పరిపూర్ణ ప్రభావుడూ, పారిజాత పాదప ప్రసూన తిరస్కార మహద్దంతరుచి ప్రకాశుడూ, శ్రీ పారిజాత పాదప ప్రసూన మాలా విభ్రాజితుడూ అయిన కృష్ణుణ్ణి చూశారు. వాళ్ళని చూడగానే కృష్ణుడు "మీకందరికీ మేలే కదా" అన్నాడు. "మేలూ, శుభమూ నిన్న రాత్రే పోయినాయి." అదేమీ" "చూడాల్సిన వాళ్ళు చూడక పోవటమూ, పిలవాల్సిన వాళ్ళు పిలవకపోవటమూ" "మీ భర్తలతో ప్రణయ కలహమా?" అందరూ ముఖాలు వేలాడేసుకున్నారు. "అవునూ, ఈసమయంలో మీరందరూ మీ వాళ్ళందరినీ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టూ? "

ఇంతులగని నీకు ఇంత పంతమేల? (ఇ)

కాంతల,భ్రాంతల, వింతైన మాటల ఇంత దూరము జేయ సంతసమా నీకు? (ఇ)

స్వాంతమందు నిన్ను చింతించు వారు అంతులేని మమత సొంతమైన వారు కంతుని గెల్చిన సుందరులు వీరు మంతనములకు మరి వచ్చినారు (ఇ) 

అచ్చపు ప్రేమతొ వచ్చినవారిని రచ్చల బెట్టుట న్యాయమె నీకు మచ్చికతో బాగ ముచ్చట చెప్పి హెచ్చగు ప్రీతితొ నిచ్చలు కూడుము (ఇ)

అని సన్ననైన స్వరముతో నెనరు చెప్పిన పలుకులు వినకున్న స్వామితో పొద మాటునా ఎద లోపలి సొద చెప్పితే బదులేదిరా నిదరోయినా మదిలోపలా కదలేవులే వదిలేయకా సౌదామినీ ధళధళ లలో నాదమ్ములో మోదమ్ముగా మెదిలేటి మేటివి! చూడరా! కదలేటి వాడా! కానరా కధ కానిదీ వ్యధ లేనిదీ మధు మాసపు సుధయేదిరా మధురమ్ముగా నినదించుతూ బోధించె! భృంగము చూడరా! అధరమ్ములో అమృతమ్ములూ వృధ చేయకూ అవి నీవెరా బాధంటె భయమే లేదులే వేధింపు లున్నా వదల లే అమలమ్ములౌ కమలమ్ములూ కమనీయమౌ సుమహారమూ సుమనమ్ములౌ తమలమ్ములూ తమకమ్ముతో సమరమ్ముకూ గమనమ్ముకై గమకమ్ములూ శమనమ్ములేనీ కొమ్మకూ నామమ్ములోనా నీవెలే శ్యామమ్ము నీదౌ రూపమే కలహంసలూ కలకూజితం కల్యాణమౌ మలయానిలం ఎలదేటి పాటల తోటలో బులిబుల్లి హంసల నడకలూ లలితమ్ములౌ వలితమ్ములౌ కలితమ్ములౌ నీ తలపులూ ఘలు ఘల్లు గజ్జెలు కదలగా మెలమెల్లగా కలిసెయ్యరా అని కెంగేలు మోడ్చి కన్నుదోయిని నందనందన సుందర పాదారవింద మకరంద సంస్పర్శమాణముగా జేసి విన్నవించిన అర్మిలి పలుకులు విని మాటాడకున్న స్వామితో


ఆదరము లేదేర శ్రీధర! స్వామీ, (ఆ)

మోదముతోడుత ముదితలు వేడగ, బోధలు చేసేవు, బాధలు పెంచేవు (ఆ) 

మొన్న రాతిరి సన్న జేసితి వన్న మాత్రము చాలులే నిన్న రాతిరి కన్నుగీటితి వన్న భావన మధురమే తిన్నగానను ఎన్ని కూడర నేటి రాతిరి రాజువీ మిన్నగా మనసందు కొంచును సుందరాంగ జనార్దనా (ఆ) 

అని కరాంజలులు ముకుళించి వేడిన కూర్మిపై ఓర్మి వహింపని స్వామితో సుద్దులు చెప్పితె

ముద్దు గోపాలుడు నిద్దుర ఎటువచ్చునే (సు)

కద్దు కద్దనువాడు వద్దు వద్దనుచుంటె పొద్దులేగతి పోవునే (సు) 

కామశాస్త్రపు కాచి పోసిన నేత చిటికెలో నీతి శాస్త్రపు జేత అయ్యెనే భామల గంధమ్ము పక్కన బెట్టి తిరుమణి చూర్ణమ్ము తీర్చిదిద్దేనే కోమలుల గానమును వదలిపెట్టి తాను కామజేత కధలు వినెనే బాగుగ ఈరీతి బాలుడొప్పుచుండ బ్రతికేమి ఫలమింక భామా (సు) 

అని విరక్త చిత్తయై చింతించుచున్న నెమ్మికి కమ్మని మాటల లలి స్వామి నుద్దేశించి చేసే విన్నపం ఇట్లా వినిపించింది. నీ మనసులో నెట్లూహింతువో చెప్పు ఆవిధమ్మున నేను నడిచికొందు నీ చిత్తమందేమి చింతింతువో గాని అట్టి తలపులె నేను పట్టి యుందు నీ బుద్ధిలో ఏమి నిర్ణయింతువొగాని సిద్ధము నేనెపుడు స్థిరము గాను నీ అహంకారమే నిజమైనదనియెద నా భావనేదియో ఆజ్ఞ ఇమ్ము నీ ఇష్టమైనట్లు నిజముగ చేయరా ఏమి చేసిన నిన్ను వదలనెపుడు మనసులోన నీవు, మాటలోన నీవు నన్ను నీవు నిండ నిలచిపోదు. అని నిలువబడిన కంపమాన శరీరిణియూ, అశ్రుపూరిత ముఖియూ అయిన లలికి నందగోప సుందరుడు ప్రత్యుత్తరమివ్వక ఉండిన 

కాంతల నేచిన, శాంత మెవరికి నుండు (కాం)

ఇంతుల గూడక భ్రాంతుల జేసి అ శ్రాంతము వదలక వింత కధలవి చెప్పి (కాం) 

నీతులు చెప్పుటకు మౌనులున్నారు వెతకగ అడవిని ఋషులు ఉన్నారు పాత మాటలు చెప్ప పదిమంది ఉన్నారు నాతులకు నువుతప్ప వేరెవరు లేరురా (కాం) 

వెదకంగ వేణువును ఊదేటి వాడూ మదిలోన స్థిరముగా నిలచి ఉన్నాడూ ఎదలోన నిలచి మము చక్కగా ఏలుకో నదిలోన నిలచి మా అందరితొ ఆడుకో (కాం) 

సమయానికి తగ్గ మాటలు చెప్పుము కాముని గెలిచేటి సాములు నేర్పుము రాముని మాటలు రేపు చూద్దాములే భామల మాటను భావించి గెలువర. (కాం) 

అని విన్నపము చేసిన మక్కువను, ఎక్కువ తిరస్కరించి , అక్కజమగు చక్కదనమున చక్కెర విలుకాని దిక్కులతోసి తళుక్కని మెరిసే నల్లనయ్య పక్కకు చూచుచున్న అవసరంబున 

జగడము సేయ సమయము కాదుర, నగుబాటెందుకురా? (జ) 

పగడపు మోవితొ తగిలి కౌగిలించి తగులము తీర్చర తొందరగాను (జ) 

నీకోసమె ప్రతి నిశి నిద్రింపదు, తనని క్షణము చూడుi నీకోసమె నవ పల్లవ కరముల పూలు గట్టె చూడు నీకోసమె ప్రతి క్షణము కలతపడు కన్నీళ్ళని చూడు నీకోసమె తన జీవిత మంతయు మోడి గట్టె చూడు. (జ) 

అని నిరూపించుచున్న రహికి ఆ బృందావన సుందరుడు ప్రాపునివ్వని సమయంబున గాదిలి అత్యంత కోపావేశయై 

దొరతనమది నీది దొంగలెత్తుకుపోను: పోరా నన్నొదిలి వేరు చోటికి సామి(దొ) 

చిరకాల స్నేహమున చిచ్చు పెట్టినవాడ మొగమున మరకలు మాబాగు లేరా(దొ) 

కరి రక్షకుడని మహగొప్పబిరుదులే రమ్మనిన రావిది వల్లకాడే గద పరిపరి నీ మోవి నొక్కిన ఇంటికి సరగున పోవోయి సమయమిదేనోయి(దొ) 

నిన్ను తలచీ ప్రేమ నిద్ర రాలేదపుడు నిను తలచి కోపముతో నిద్ర రాలేదిపుడు నీరాక ఊహపుడు గుండె గుబగుబలాడె నీరాక ఊహిపుడు గుండె బండైపోయె(దొ) 

పండిన కొమ్మని పాడుచేసీ నీవు ఎండిన తీగపై ఎగబడెద వెందుకు గుండె చెరువై పోయి దిండు తడిసీ పోయె మండి పోయెను మనసు మా పెద్ద రేడా (దొ) 

నీకేమి, కులముంది నీకేమి ధనముంది నీకేమి బహు దొడ్డ బంధు గణ ముంది. నేనేమో ఏకిని అంతటేకాకిని నీ వైపునుంచేమొ ఆ నల్లకాకిని  (దొ) 

మన్నారుగుడిలోని మా రాజగోపాల విన్నాములేరా  నీ వింత కధలన్నీ నన్నొదిలి వెళ్ళనని నాకు మాటిస్తేను నిన్ను కరుణిస్తాను ఈ ఒక్కసారికి(దొ)  

అని యదుకుల నందనుని నిష్ఠుర భాషణంబుల నలయించిన ,ఆ సుందరాంగుడు అదృశ్యమయ్యె......


రెండవభాగము సమాప్తము....


                    - జొన్నలగడ్డ సౌదామిని 

Thursday 11 August 2022

హల్లీసకము - మొదటి భాగము

సాయంత్రమైంది. గోపికా సుందరీమణులు ఓపికలు లేని చిత్తంతో రాసమండల పరిభ్రమణ మహా మండలేశ్వరుడూ, గోప గోపీజన గౌరవ మనోహారీ, నిరంతర తపస్సంతప్త సర్వ కిల్బిష హర సమర్ధ మహా మౌనిజన హృదయ నివాసీ, అయిన ఆ నల్లనయ్య కోసం వేచి ఉన్నారు. వారి పేర్లు అర్మిలి, నెనరు, గాదిలి, మక్కువ, నెమ్మి, రహి, కూర్మి, లలి . వీళ్ళందరికీ ముగ్గురు దూతికలు ఉన్నారు. ఆ అమ్మాయిల పేర్లు ప్రేమ, ప్రియ ప్రీతి.

అందరూ ఆ నల్లని వాడి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఇంతలో అర్మిలి


ఇదిగిదిగొ ఇక్కడే, ఇక్కడే నావాడువెలుగు కన్నుల,నన్ను చూచినాడు

 

అదిగదిగొ ఆ పూల వనము లోపల స్వామి చేరి నా చేతులు పట్టి నాడు

 

ఇదిగిదిగొ ఈ శింశుపా వృక్ష ఛాయలో ప్రభువు కౌగిలి పెన వేసినాడు

 

అదిగదిగొ ఆ నీల సరసు లో నా రేడు జలకమాడి వేణి తీర్చినాడు

 

ఏడి,వాడు, రాడు, నా మన్మధుని ఈడు మోడి చేసి వాడు మాయమయ్యె

 

వాడు లేని నాడు రేడు లేనిది జగము వాడి పోయెను మనసు వాడు లేక

 

అంటూ ఏడవడం మొదలెట్టింది. ప్రేమ మెల్లిగా అర్మిలిని సముదాయించడం మొదలుపెట్టింది.


"స్వామి, వస్తాడు. తప్పకుండా, మొన్న అన్నిపనులు చేసిన వాడు మళ్ళీ రాక ఎక్కడికి పోతాడు. మెల్లిగా వస్తాడు. ఇంకాపొద్దు కూడా సరిగా కాలేదు. మెల్లిగా వస్తాడు. ఆగు. " అన్నది ప్రేమ..

 

" వస్తాడంటావా మెల్లిగా, వస్తే చాలు,వచ్చి మెల్లిగా చూస్తే చాలు, చూసి, చూసి.....

 

మెల్లగా కనులతో చూచినంతనె చాలు కన్నులలొ కన్నుల్లు కలిసిపోవు

 

మెలమెల్లగా తాను మాటాడినంతనే పాటపాడును గుండె ప్రతి క్షణమ్ము

 

మెలమెలమెల్లగా ముట్టుకొనినంతనే చుట్టుకొని వదల దా మనసు రాదు

 

మెలమెల్ల మెలమెల్ల మూర్కొనునంతనే కరిగి వానిలోన కలిసిపోదు

 

మెల మెల్ల మెల మెల్ల మెల్లగా ఒకసారి చేయి పట్టినంత వాడె నేను

 

మెల మెల్ల మెల మెల్ల మెల మెల్ల మెల్లగా దగ్గర తీసిన ఉన్న దొకటె " అన్నది అర్మిలి.

 

" అవును, నువ్వూ, స్వామీ కలిస్తే మిగిలేది ఒకటే కానీ, మిగతావాళ్ళు కలిసినా కూడా అంతే కదా బృందావనమందయానా, అదిగో అక్కడ కూచున్న కూర్మి సంగతి చూడు, ఎప్పుడూ ఇల్లు వదలి రాని పిల్ల ఎలా అయిపోయిందోదాని పక్కన కూర్చుని నెమ్మదిస్తూ పాట పాడుతోంది నెమ్మి ఒకసారి విందాం పద " అంటూ అర్మిలిని తీసుకుని గాదిలివెళ్ళింది.

 

అక్కడ నెమ్మి సప్తస్వరాల హరివిల్లు విరిసే గళంలో కృష్ణుడిని ఉద్దేశించి కూర్మి గురించి పాడుతోంది.

నిచ్చలింట్లో నుండే నీరజాక్షిరో ఇది అచ్చపు ప్రేమతో అటమటించెనురా

మెచ్చుకోళ్ళవి తాను మెచ్చేది లేదుర ఇచ్చకమ్ములవీ నచ్చేది కాదురా

ఉల్లముల్లసిల్ల మెల్లన తలనిండ మల్లెమొల్లలు మరి ముడియుచున్నదిరా

తెల్లని కోకది నారింజ చెంగుతో అభిసారిక లాగు వెలుగు చున్నదిరా 

సల్లలితముగాను ఒక గీతి పాడుచు మెల్లగ తల ఎత్తి చూచుచున్నదిరా

కళ్ళలో నీరుతో కృష్ణ కృష్ణా యని ఎల్ల దిక్కుల నిన్ను వెదకేనురా

మనసులో నువు  నిండ మాటలు పెగలక మౌనిలా తానేమో కూరుచున్నదిరా

తానిది తానది అనుచు తనలో తాను తనవాడనీ నిన్ను తగిలియున్నదిరా

కానడు  తనననుచు కలికి కుందుచు బాగా విన్నబోయీ మిగుల చిన్న అయినదిరా

బాణము ధాటికి వేణిని వదలి బాల నిన్నే తలచి బడలి ఉన్నదిరా

వేగమె నీవొచ్చి చెయిబట్ట కుంటేను చెయిదాటి పోయేను: చలమేలరా

సాగి శ్రీ స్వామి శ్రీ రాజగోపాల నీమముగ దొరతనము నిలబెట్టుకోరా

అలా నెమ్మి పాటవినీ, కూర్మి మనసు చేసే మొర విని కూడా రాలేదు కృష్ణుడు. కూర్మి బడలి, వడలి, నెమ్మి ఒళ్ళో ఒరిగిపోయింది. ప్రేమ వచ్చి శైత్యోపచారాలు చేయటం మొదలుపెట్టింది.

అర్మిలి, గాదిలి ఇద్దరూ కూర్మిని, నెమ్మిని చూసి ఎంతో దిగాలుపడ్డారు.

ఇంతలో పుష్ప కుంజం లో ఉన్న రహి, అక్కడ నృత్యం చేస్తూ ఉన్న నెనరు గురించి

తనను తాను మరచి మరచి తన్మయమైనదిరో

చిన్నారి చెలి చక్కగ చిన్ననాటి సొద తలచుచు

మదిలో పట్టని ప్రేమతొ కన్నులలో వెన్నెలతో

ముదిత మనో మోహనముగ అతిలోకపు నవ్వుతోడ

నేనే కృష్ణుడననుచు నమ్మకముగ ఆటలే

నవ్వులతో పువ్వులతో సువ్వి, ఈల పాటలే

బకుని, కేశి, పూతనలని చంపానని మాటలే

గోపికనని వేడుకగా నవ్వుల విరి. తోటలే

నాకే కస్తూరి నుదుట, పింఛముంది  చూసుకో

ఇదిగో ఇదె వైజయంతి, ఇదియే పీతాంబరము

ఇవిగో శంఖము చక్రము కౌస్తుభమూ, నందకమూ,

ఇవిగో అందెలు ఘల్లన, ఇదిగో వేణువు అనుచును

నేనే పూతనను చంపి పాలు త్రావినానుగా

నేనే కాళియు తలపై నూత్న నాట్య మాడితిగా

నేనే కేశిని చంపి చల్దులెన్నొ కుడిచితిగా

నేనే గోవర్ధనమును ఒక్క కేల నెత్తితిగా

నేనెవ్వరు నేనెవ్వరు నేనెవ్వరు అని అడుగుచు

నేనె  జగద్రక్షణకై దీక్షా కంకణ ధారిని

నేనే విశ్వము లాగా కనిపించే వెలుగును

అవ్యయమఖిలము నేనే ఆదిరూపుడను నేనే

నిర్వికార నిరంజనము నేనే అని పలుకుచూ

అని పాడటం మొదలెట్టగానే అందరూ రహి తన్మయత్వాన్ని, నెనరు తల్లీనమై చేసే నాట్యాన్నీ ఆశ్చర్యంగా చూడ సాగారు. అద్భుతమైన ఆ నాట్యాన్ని చూస్తూ, మధురమైన ఆ పాట వింటూ, కృష్ణుడి లాగా అభినయం చేయటం చూస్తూఅందరూ ఆనందిస్తున్నారు.

నాట్యం ఆగింది.

ఇంతలో యమున వడ్డున నుంచీ, " అందరూ ఇటురండి" అనేకేక వినిపిం చింది. అందరూ "ఏమిటా" అన్నకుతూహలంతో అక్కడికి పరిగెత్తారు. అక్కడ యమున వడ్డున ఇసకలో శంఖ చక్రాంకితాలైన కృష్ణ పాదాలు, వాటి చుట్టూచిన్న వృత్తమూ, వాటి మీద రంగురంగులపూలూ కనిపించాయి అందరికీ. నేల మీద పడుకుని మక్కువ అందిస్తున్నపూలని ఆ పాదాల చుట్టూ సద్దుతోంది లలి.

మందార పూలన్ని మా మంచి శూరునకు అందాల పూలన్ని ఆనంద వీరునకు

బృందారకాది గణ రక్షణ సుధీరునకు బృందావనములోని చిన్నారి మారునకు

నందాత్మజునకు మా నవనీత చోరునకు అందరిని ఉల్లాస పరచేటి పేరునకు

కలికి మొగము లాగ కలువ విచ్చింది

 

కలికి పెదవిలాగ మందార విరిసింది

 

కలికి తళుకులాగ పొగడలే వెలిగాయి

 

కలికి మొగము లాగ మల్లెల్లు మెలిగాయి

 

కలికి నడకలాగ తామరలు ఊగాయి

 

కలికి వేడుక లాగ జాజులు సాగాయి

 

కలికి నడత లాగ దవనమ్ము గంధమ్ము కలికి మొత్తమ్మది కృష్ణుని సొమ్ము

అంటూ పాడుతూ ఆడుతోంది  మక్కువ.

అందరూ ఆ కృష్ణ పాదాలని చూసి మెల్లిగా వంగి చుట్టూ ఉన్న ఇసక కొంచెం తీసుకుని మూర్ధంలో ధరించారు. దానిచుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు. అందరూ కృష్ణుడు అక్కడే నుంచుని వున్నట్టుగా భావనచేస్తూ ఉన్నారు.  "మెల్లమెల్లగ మనసుదోచుతు, నల్లకలువల మించు సొబగుతొ, ఎల్లవారల గుండెనిండే, కళ్ళు ఎవ్వరివో " అంటూ అన్నది కూర్మిఆర్తితో,

"సనక ఋషులను మించినట్టిది, జనక రాజుని దాటినట్టిది, కనక ప్రభలను దాటు వజ్రపుతునక ఎక్కడిదో?" అన్నది నెమ్మి. "మీరు చెప్పే వాటిల్లో ఛందో భంగం ..." అంటూ సంకోచిస్తూన్న రహిని మధ్యలోనే ఆపింది గాదిలి. "ఎన్ని భంగాలున్నా బాధలేదు, మనం చెప్పేది త్రిభంగిలో నుంచున్న వాడి గురించైతే మట్టుక్కు.  మనవాడు అన్ని వ్యాకరణాలకీ అతీతుడు కదా?. నువ్వు కూడా ధైర్యంగా నాలుగు పాటలు పాడు, పద్యాలు చెప్పు, సరైతేమంచిదే, తప్పులైతే మరీ మంచిది." అన్నది గాదిలి. మెల్లిగా రహి కోమలమైన స్వరంతో


బాలగోపాలమాశ్రయేహం, సతతం. (బా)

నీల నీరద దేహ, నిరుపమ శుభ గేహ,

పాలితాద్భుత వాహ, సకల జగన్మోహ  (బా)

నంద గోప కుమార, నిత్య సుఖ సంసార

బృందావన చోర, వందారు మందార.    (బా)

అకళంక మృదు భాష, అవని రాక్షస శోష

సకలేంద్రియ శేష , సరస మంగళ వేష.   (బా)


అని పాడింది. "బానే పాడావు కదా, కృష్ణుణ్ణి పడేయటానికి ఇంకేం కావాలి" అని గాదిలి అంటే రహి సిగ్గుపడింది.

"ఒద్దికగా నుండే ముద్దు గోపాలునితో సద్దు చేసే మంచి బుద్ధిశాలి యెవరో (ఒ)

హద్దులు మీరుచు నిద్దర మానుచు వద్దు అంటూ కూడు ముద్దియ యెవ్వరో (ఒ)

అద్దంపు చెక్కిళ్ళు వసివాడులాగా, ముద్దుల్లు పెట్టేటి మోహిని ఎవరో

సుద్దులు చెప్పుచు ఎద్దుల బండిలొ పొద్దున్నె మీదున్న  పెద్ద జాణ ఎవరొ? (ఒ)

నిక్కి చూచి మదిలో చక్కని సామిని గ్రక్కున చేతితొ పట్టిన దెవరో?

ఎక్కువ ప్రేమతొ దిక్కునీవనుచును మక్కువతో కౌగిలించేది ఎవరో?

చిక్కియు చిక్కని చుక్కల రాయుని చుక్కల రాతిరి సొక్కజేసిన దెవరొ?

మిక్కిలి కూర్మితొ పెక్కైన భంగుల హక్కుగ స్వామిని హత్తుకున్నదెవరొ?  (ఒ)

అంటూ కృష్ణుడు ఎక్కడ  ఉన్నాడోనని, ఎవరితో ఉన్నాడని ఊహించి నెనరు రాగాలు తీసింది.

ఇంతలో వనంలోనుంచి కృష్ణుడి వేణుగానం వినిపించింది.

 

మొదటి భాగం సమాప్తం.


                      - జొన్నలగడ్డ సౌదామిని 

టీ

కాళిదాసూ, మాఘుడూ, భారవీ, బాణుడూ లాంటి కావ్యరస గ్రహణపారీణులు అంతా నందన వనంలో, కల్పవృక్షంచెట్టు నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి సురభిళంగా వుంది. మధ్య మధ్యా అక్కడ ఉన్న పరిచారికలు కావలసినవన్నీ చూస్తున్నారు.

ఇంతలో యేదోవొక విషయమ్మీద మాఘుడికీ  బాణుడికీ భిన్నాభిప్రాయం వచ్చింది. ఇద్దరు తెలివిగలవాళ్ళ మధ్య గొడవ రాకుండానే వుండాలి కానీ, వొస్తే సుఖాసుఖాల తేలుతుందా?. ఇద్దరూ గట్టిగా పట్టుపట్టి కూచున్నారు. కాళిదాసూ, భారవీ మధ్యలో కల్పించుకుందామంటే వారికి కోపదారులైన ఇద్దరంటే మహా భయమాయె. అందులోనూ బాణుడుగారు అంటే మరీ భయం. ఆయన మాటలు మామూలుగానే బాణాలు లాగా ఉంటాయి, ఇక కోపమొస్తే చెప్పనే అక్కరలేదు. మాఘుడు గారు వదిలే మాటలు ఆక్షణం పెద్ద కఠినంగా అనిపించకపోయినా తర్వాత వాటిని లోతుగా ఆలోచిస్తే అనిపించే ధ్వనులూ, గూఢార్థాలూ గుండెని గుభేలనిపించకమానవు.

విషయం ఎంత జటిలం అయినా ఎవరో ఒకరు సర్ది చెప్పాలి కదా. తప్పక కాళిదాసు  పూనుకున్నాడు. కాస్త ఆలోచించి పరిచారికని పిలిచి అందరికీ చక్కటి కస్తూరి, కుంకుమ పువ్వూ వేసిన టీ పట్టుకురమ్మన్నాడు. టీ వొచ్చే లోపు బాణుడికీ మాఘుడికీ ఏవో సాంత్వన పరిచే విషయాలు చెప్పాడు. కొద్దిగా విషయం మార్చటంతో వాతావరణం కాస్త తేలికపడింది. ఇంతలో టీ వచ్చింది. కవులందరూ ఆహా, ఓహో అంటూ జుర్రారు.

టీ చక్కగా పనిచేసిందని కాళిదాసు సంతోషించినంత సేపు పట్టలేదు మన కవుల వాగ్వాదం మళ్ళీ ఆరంభం కావటానికి. కాళిదాసు తలపట్టుకున్నాడు. ఇలా వ్యవహారం వందల టీ పాత్రల మీదా, గంటల కొద్దీ సాగింది. కానీ ఇంకా మాఘుడూ, బాణుడూ బిర్రబిగుసుకుని కూర్చునే ఉన్నారు.

అట్లా వాగ్వాదం సాగుతుండగా బాణుడుగారు అన్నాడూ "నేను చెప్పేదాన్ని దేవత తప్పితే ఇంకెవరు కాదన్నా ఒప్పుకోను" అని. వెంటనే కాళిదాసుకి బుర్రలో ఆలోచన వచ్చింది. బాణుడి వైపూ, మాఘుడి వైపూ తిరిగి "మీరిద్దరూ మహాకవులు , కాబట్టి మీ వాగ్వాదం తీర్చడం దేవి వల్లే అవుతుంది. అందుకని దేవిని ప్రార్థిద్దాము. దేవి వొచ్చి ఏమి చెబితే అది మీరు ఇద్దరూ ఒప్పుకోవాలి " అని చెప్పిందానికి అందరూ ఒప్పుకున్నారు.

అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు కరుణారసభర నయనాలతో దయతో చూస్తూ చిరునవ్వుతోప్రత్యక్షమైంది. అందరూ నమస్కరించారు. కాళిదాసు మహాకవుల వివాదం గురించి కొద్దిగా చెప్పి మహాకవులని వారివారి వాదన చెప్పమన్నాడు. ఇంతలో అమ్మవారు అక్కడ బల్లల మీద ఉన్న టీ పాత్రలని చూసి "మీరందరూ ఒకటికి పది టీ తాగి కూర్చున్నారు, మరి నాకు టీ ఏదిరా" అన్నది.

బాణుడు, మాఘుడూ పరిచారికల దగ్గరకి పరిగెత్తారు.

కాళిదాసు కొద్దిగా ఆలోచించి "సర్వజగత్తునీ కాపాడి కష్టపడుతున్నదానికి నీకు ఒకటీ ఎక్కడ సరిపోతుంది తల్లీ. ఇవిగో పన్నెండు టీలు సమర్పిస్తున్నాను, అనుగ్రహించు" అని


చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ

కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |

పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా

ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతాం

అని  భక్తిభావంతో పాడాడు. ఇంతలో మాఘుడూ, బాణుడూ తెచ్చిన టీని సేవించిన అమ్మవారు కాళిదాసుని చిరునవ్వుతో చూస్తూ  "అసలు టీ కంటే నీ పన్నెండు టీలే బావున్నాయిరా" అంటూ తన దగ్గిర ఉన్న టీ పాత్రలని విసిరేస్తే పాత్ర బాణుడి ఒళ్ళోనూ, పాత్ర కింద ఉండే పానపాత్ర మాఘుడి చేతిలోనూ పడ్డాయి. అమ్మవారు అదృశ్యురాలైంది.

పాత్ర గొప్పదా, పానపాత్ర గొప్పదా అనే విషయంలో చర్చ మొదలై ఇప్పటి వరకూ తెగినట్టు లేదు. చివరికి ఏమైందో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.

(అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా రాసినది)

    

                         - జొన్నలగడ్డ సౌదామిని.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...