Sunday 28 August 2022

జిలుగు దుప్పటి - జనార్దనాష్టకం

సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా 
చరణపద్మము మీద, దేహము చంద్రకాంతులు దేరగా 
మురువు చూపుచు వచ్చినావో
మోహనాకృతి మీరగా 
గరుడవాహన, దనుజ మర్దన, కందుకూరి జనార్దనా 

క్లుప్తంగా చెప్పుకోవాలంటే బంగారం దుప్పటి ఆయన కాళ్ళమీదికి జారింది. దేహము చంద్ర కాంతులు తేరుతోంది. అలా మోహనాకృతి మీరగా ముద్దు చూపుతూ వచ్చావు కదా అంటూ ఆ గరుడ వాహనుడూ, దనుజ మర్దనుడూ అయిన కందుకూరిలోని జనార్దనుణ్ణి వర్ణించినట్టు ఉన్నది ఈ పద్యం. కాస్త తీరిగ్గా చూస్తే చాలా విషయం కనపడుతోంది. ముందర ఆ బంగారు దుప్పటి ఎవరి చరణ పద్మము మీద జారింది, మరీ ముఖ్యంగా ఎందుకు జారింది, ఆ జనార్దనుడు మురువు చూపుతూ రావటానికీ ఈ దుప్పటి జారటానికీ గల సంబంధం ఏమన్నా ఉందా, లాంటి ప్రశ్నలు అన్నీ సమన్వయం చేస్తే కానీ పద్యంలో ఏ విషయాన్ని వర్ణించారో సరిగ్గా అర్థం కాదు. సరే, ముందర ఆ దుప్పటి సంగతి చూద్దాము. ఆ దుప్పటికి వేసిన విశేషణమే మహత్తరంగా ఉన్నది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు పసిడి బంగరు అని సమానార్థకాలైన పదాలని కలిపి ప్రయోగించటం యుక్తమా అన్న ప్రశ్నతో మొదలుపెడితే క్వాచిత్కంగా లభించే ప్రయోగాలతో దాన్ని సమర్థించవచ్చు. జిలుగు దుప్పటి అంటే సూక్ష్మంగా పని చేయబడిన దుప్పటి అని, సిరులు అంటే సంపదలు, శోభలు అనుకుంటే అలాంటి శోభతో కూడిన బంగారంతో తయారై సూక్ష్మమైన పని చేయబడి ఉన్నది ఆ దుప్పటి మీద అని నిర్ధారించుకోవచ్చు. ఇంకో విధంగా చెబితే ఎక్కువ బంగారంతో, జిలుగు పనితో తయారైందని చెప్పవచ్చు. 

దుప్పటికి మంచం మీద వేసే వస్త్రం అనే అర్థం ప్రస్తుతం విరివిగా వాడబడుతున్నా, కావ్యాల్లో కట్టుకునే వస్త్రం గానూ, పైన కప్పుకొనే వస్త్రం గానూ ఎక్కువ గానే వాడారు. ఇక్కడ దుప్పటి అంటే అది నాయకుడిదా, నాయకిదా లేక మంచం మీద వేసినదా అనే ప్రశ్నకి సమాధానాలు అనేక విధాలుగా ఉండవచ్చు, ఆ సమాధానాల బట్టి తరవాత జరిగే క్రియలు అనేకం ఉండవచ్చు కాబట్టి ఆ ప్రశ్న పాఠకులకి వదిలేసి మొదటి ఆలోచన, ఆ జారింది మంచము మీద పరిచిన వస్త్రం అనుకుందాము కాసేపు. మనోహరంగా ఉంది ఈ ఊహ. అక్కడ ఉన్న మంచం మీద ఒక గోపిక ఉన్నది. మంచం కింద ఆయన నించుని ఉన్నాడు. ఆమెని అనునయ పరచే వాక్యాలు చెబుతున్నాడు. గోపికకి ఏదో కోపం వచ్చే పని ఈ గరుడ గమనుడు చేసి ఉండాలి. దాని మీద ఆవిడ ధూం ధాం అని దుప్పటి ముసుగుతన్ని పడుకుని ఉండాలి. మన దక్షిణ నాయకుడు గారు కబుర్లూ, కాకరకాయలూ చెప్పి ఎలాగొలా ఆ కోపాన్ని కాస్త తగ్గించి ఆ ముసుగు కప్పుకున్న దుప్పటిని తొలగించి చేతులోకి తీసుకుంటూ ఉన్నాడు. కోపం పూర్తిగా తగ్గేట్టు ఇంకాసిని కబుర్లు చెబుతూ దుప్పటి మొత్తం గ్రహించి చేతిలోనున్న దుప్పటిని కిందకి వదిలాడు. 

అప్పుడు ఆ సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారి అది ఆ నంద కిశోరుడి పాదాల మీద పడింది. ఇంకోవిధంగా ఆలోచిస్తే ఆ జారింది కృష్ణుడు గారి ఉత్తరీయం అని భావించ వచ్చు అలా భావించి ముందుకు వెళితే చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ ఉత్తరీయం ఎందుకు జారినట్లు?. ఆయన ఒక్కడే ఉండి ఏ వేణువో వాయించుకుంటుంటే పొరపాటున ఉత్తరీయం జారిందా?, లేక అక్కడ ఉన్న గోపిక ఎవరో ఆటపట్టిస్తూ లాగి ఉంటే అది జారిందా? లేక దేహము చంద్రకాంతితో విరాజిల్లుతోంది చూడమని గోపికకి చూపించటానికి ఆ ధూర్త గోపాలుడు తానే ఆ ఉత్తరీయం కిందకి జార్చాడా? ఇవన్నీ ఆలోచిస్తుంటే క్షణకాలం జారింది ఉత్తరీయం కాదేమో అనిపించింది. ఇంకాస్త ఆలోచిస్తే దేహము చంద్రకాంతులు తేరటానికీ, మురువు అంటే అందం అంతా చూపుతూ మోహనాకృతుల్ని అధికరిస్తూ రావటానికీ ఈ ఉత్తరీయం జారిపోవటానికీ సంబంధం బోధపడింది. పద్యం ఏ సన్నివేశంలో వచ్చి ఉంటుందా అన్నది అర్థం అయ్యింది. చంద్రుడు చిరునవ్వు నవ్వుతున్న పున్నమి రాత్రిలో, చక్కటి చంద్ర శిల మీద ఇంకా చక్కగా చెక్కిన మణి మంటపం. ఆ మంటపం మధ్యలో పెద్ద పందిరి మంచమూ, ఆ పందిరి మంచం మీదకి పాకిన మల్లె తీగలూ, ఆ మంచం మీద తుషార, ఫేనములతో పోటీపడే తెల్లటి దిండ్లూ, దుప్పట్లూ, వాటి మధ్య కలహాంతరితకీ ఖండితకీ మధ్యలో ఊగాడుతున్న నాయిక, ఆవిడకి ఎలాగొలా సర్ది చెప్పి శాంతపరచాలని ప్రయత్నించే నాయకుడు, ఇవ్వన్నీ అమిరాయి. కానీ గోపికకి కోపం తగ్గలేదు. ఏమిచెయ్యాలి? నంద నందనుడు ఏదో ఒక మాయచెయ్యాలి కదా, సరే అని కాళ్ళు పట్టుకున్నాడు, ఊహూ కరగలేదు ఆ కాంత. " స్త్రీణామాద్యం ప్రణయ వచనం విభ్రమోహి ప్రియేషు" అని పెద్దలు అన్నారు కదా అని నల్లటి వాడు ఆలోచించాడు. 
ఇంతలో పెద్ద గాలి వచ్చింది. నల్లనయ్య ఒక్క క్షణం ఆలోచించి ఉత్తరీయాన్ని అలా వదిలిపెట్టాడు. అప్పుడు సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారి, జారి మెల్లిగా ఆయన చరణ పద్మము మీద పడింది. అలా ఆయన పైనున్న పచ్చని పటము జారగానే అలౌకికమైన ఆ దేహం మీద పౌర్ణమినాటి చంద్రకాంతి పడింది. దాంతో ఆ దేహం కొత్తకొత్త కాంతులీనుతూ చంద్రకాంతి కంటే ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్న ఆ జనార్దనుణ్ణి చూస్తూ తననితానే మర్చిపోయింది ఆ గోపిక . అలా వెలిగిపోయే ఆ అందం చూపించటానికే వచ్చినట్టూ, అలా ఉత్తరీయం జార్చినట్టూ, ఆ విధంగా తన మోహనాకృతితో సర్వ జగత్తునీ మీరి వెలుగుతూ ఉన్న గరుడవాహనుడూ, రాక్షస మర్దనుడూ అయిన కందుకూరి జనార్దనుణ్ణి రమ్మని మనమూ పిలుద్దాము, రండి.

                    - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...