Saturday 3 September 2022

జనార్దనాష్టకం -- ఆన

సాయంత్రమైంది. యమునాతీరం కోలాహలంగా ఉంది. గోపికలు అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ నందనందనుడి కోసం వేచి ఉన్నారు. ఆ హడావిడికి కూతవేటు దూరంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఉన్న అరుగు మీద కుసుమ కూచుని ఆ చెట్టుకి జారగిలబడి ఉంది. ఆమె డస్సిపోయినట్టు ఆమె ముఖమే చెబుతోంది. ఆమెకి సపర్యలు చేస్తూ నీలవేణి పక్కనే కూర్చుని ఉన్నది. 

"మూడు నాలుగు రోజుల్నించీ అన్నం సరిగ్గా తింటున్నట్టు లేవు. ముఖం చూడు ఎలా పీక్కుపోయిందో. ఏమైందో అసలు విషయం చెప్పకపోతే ఎవరికన్నా ఎట్లా తెలుస్తుందీ" అంటూ విసుక్కుంటూ దీర్ఘాలు తీసింది నీలవేణి. 

కుసుమ ఏమీ మాట్లాడలేదు. 

"నీ మొండి పట్టుదల చిన్నప్పట్నించీ చూశాను లేమ్మా చాలాసార్లు. ఇంతకీ విషయం చెప్పు. క్షణంలో సద్దుబాటు చేస్తా?" అని గదమాయించింది నీలవేణి. 

చెబుదామా, వద్దా అని వితర్కించుకుంటూ ముందుకూ వెనక్కూ ఆడింది గానీ కుసుమ ఉలకలేదు, పలకలేదు. 

కోపం పట్టలేక, నీలవేణి వొంగి కుసుమ ముఖంలో ముఖం పెట్టి "రత్నప్రభతో పూల గురించిన గొడవా?" అన్నది 

కుసుమ తల అడ్డంగా ఊపింది. 

"దమయంతి తోనా?"

"--"

"మధూలిక తోనా?" 

"--"

"అసలు గోపికలతోనేనా" 

"ఊహూ"

"మీ ఇంట్లో గొడవా?" 

"ఊహూ" 

"మరి ఎవరన్నా గోపాలకులతో వ్యవహారమా?" 

"ఊహూ" 

అప్పుడు అనుమానం వొచ్చింది నీలవేణికి కృష్ణుడితో ఏమన్నా గొడవ అయ్యిందేమోనని. కానీ చాలారోజుల నించీ కుసుమతో ఎంతో స్నేహంగా ఉంటున్న కృష్ణుడితో గొడవ అయిందా అని ఆలోచించి ఎందుకన్నా మంచిది అని "కృష్ణుడితో గొడవా?" అన్నది. వెంటనే కుసుమ భోరుమన్నది. కన్నీటి ధారలని మెల్లిగా తుడుస్తూ "ఏమైంది కృష్ణుడితో?. ఇద్దరూచాలా దగ్గరగా ఉండేవాళ్ళుగా?" అన్నది అలివేణి. కుసుమ వెక్కుతూ, పూడుకుపోయిన గొంతుతో మెల్లిగా చెప్పటం మొదలెట్టింది. 

"నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచీ ఏకాదశి నాడు నిర్జల నిరాహారం అని. ఆరోజు అలాగే నిరాహారంగా ఉండి యమునా తీరానికి వచ్చాను. మనవాడు వొచ్చాడు. చాలాసేపు కబుర్లు చెప్పాడు, ఆటలు ఆడాడు. ఇంటికి బయలుదేరుతుంటే మరుసటి దినం  ద్వాదశి పారణ అని గుర్తుకు వచ్చింది. మరుసటి రోజు రాత్రి నేను మంచి భక్ష్యాలు తీసుకువొస్తానని చెప్పాను. తప్పకుండా నా దగ్గరకి వొచ్చి ఆ భక్ష్యాలు తినాలి అని అన్నాను. అల్లాగే అంటూ తలకాయ ఊపాడు మన వీరాధివీరుడు. ఆ తల ఊపటం చూసి నాకు సందేహం వొచ్చింది. దాంతో పాటు ఎల్లాగన్నా కృష్ణుడికి భక్ష్యాలు పెట్టాలన్న కోరిక పెరిగింది. అందుకని చేతిలో చెయ్యి వేయించుకుని మరుసటి రాత్రి వచ్చి భక్ష్యాలు తినాలని ఆనపెట్టాను. అలాగే అంటూ తను కూడా దేవుడి మీద ఒట్టు వేసి మరీ చెప్పాడు." అంటూ మళ్ళీ భోరుమంది కుసుమ. 

నీలవేణి సముదాయిస్తూ "ఈ మగవాళ్ళంతా ఇంతే, మన ముందర ఇచ్చకపు మాటలన్నీ చెప్పి, ఒట్లు వేసి ముఖం చాటుకాగానే అన్నీ మరిచి పోతారు. నేను కృష్ణుణ్ణి పిలిచి మాట్లాడతాలే." అన్నది. 

కుసుమ వెంటనే అందుకుని "ఆ తరవాత ఇంకా చాలా జరిగింది, విషయం పూర్తిగా వినూ" అన్నది విసుగుతో. 

"సరే, పూర్తిగా చెప్పు" అన్నది నీలవేణి. 

కుసుమ వెంటనే అందుకుంది. "ఏకాదశి రాత్రి ఆన పెట్టాను. మరుసటి రోజు ద్వాదశి నాడు రకరకాల భక్ష్యాలు అన్నీ తయారుచేస్తూ ఉన్నాను. అన్నీ చాలావరకు తయారయ్యాయి కూడా. ఇంతలో మా పక్కింటి పిన్నిగారు ఏదో వ్రతం చేసుకుంటూ పిలవటానికి వచ్చింది. ఆవిడతో మాట్లాడి గుమ్మం దాకా వచ్చి ఆవిణ్ణి పంపుతూ ఉంటే మా ఇంటి ఎదురుగా వెళుతూ మన కృష్ణుడు కనిపించాడు. ఒక్కడే నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక్కడే ఉన్నాడు, పైగా భక్ష్యాలు సిద్ధంగా ఉన్నయ్యి కదా కొద్దిగా రుచి చూపిద్దామా అనే కోరిక వొచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పళ్ళెంలో నాలుగు కారపువీ, కాసిన్ని తీపివీ పెట్టి అవి పట్టుకుని గుమ్మంలోకి వొచ్చి పిలిచాను. మహానుభావుడు మాట కూడా మాట్లాడలేదు. నన్నుచూడను కూడా చూడలేదు. వినపడలేదేమోనని ఎలుగెత్తి పిలిచాను. ఒకటికి నాలుగు మార్లు గొంతు పొయ్యేట్లు  పిలిచాను. పలక్కుండా దాక్కూంటూ వెళ్ళిపోయాడు. ఏమి చెయ్యాలో చెప్పు?" అని ఆ జరిగింది తలచుకుంటూ కంఠం రుద్ధమై ఆగింది కుసుమ. 

"ఇంతేకదా, పాపం వినిపించలేదేమో , నేను మాట్లాడి వస్తాలే కృష్ణుడితో" అన్నది నీలవేణి. 

"మరి ఆ దాక్కోవడాలు ఎందుకో?, అయినా అప్పుడే ఏమయ్యిందీ?, జరిగింది వినవా ఏమిటీ?" అని కోపగిస్తున్న కుసుమని మెల్లిగా సర్ది "మిగతా విషయం చెప్పు" అని అడిగింది నీలవేణి. వెంటనే మళ్ళీ మొదలెట్టింది. 

"ద్వాదశి పారణ కాస్తా దొంగలెత్తుకెళ్ళినట్టు అయిపోయింది కదా. ఆమీద నాకు చాలా కోపం వచ్చింది. గట్టిగా అడిగేద్దాము అనుకున్నాను, నిన్న తిథి ద్వయం, త్రయోదశి, చతుర్దశి, వొచ్చాయి. సరే శివుడికి తుమ్మిపూల పూజ చేసి పరమాన్నం నైవేద్యం పెట్టాను. ఆ నైవేద్యాన్ని ఎదురింటి  మామ్మగారికి ఇచ్చి వొస్తుంటే మిత్రులతో కలిసి మనవాడు చక్కగానీటు చేసుకుని మరీ వొస్తున్నాడు. దొరికాడు కదా, విషయం అడుగుదామని వీధి మధ్యలో నుంచున్నాను. నిన్న అరిచినా పలకలేదుకదా, కంటికి ఎదురుగ్గా కనబడితే మాట్లాడతాడు అని తను వొస్తున్న ప్రదేశానికి ఎదురుగ్గా నిలుచున్నాను. నేను అలా చూస్తూనే వున్నాను, కానీ ఆ దొంగ కృష్ణుడు నావైపు తల కూడా తిప్పకుండా మిత్రులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తిరస్కారం తట్టుకోలేకపోతున్నాను. దాని వల్ల అన్న పానాలు రుచించటల్లేదు. ఏమి చెయ్యమంటావు చెప్పు?" అని దీనంగా అడుగుతున్న కుసుమని ఎలా సముదాయించాలో తెలియక నీలవేణి ఆగి ఆలోచించింది. 

"నేను వెళ్ళి నీ విషయం అంతా చెప్పి కృష్ణుణ్ణి పట్టుకొస్తాను. ధైర్యంగా వుండు" అన్నది నీలవేణి. "చంద్రుడు మరీ పైకి ఎక్కకముందే తీసుకురావాలి సుమా" అన్నది కుసుమ. "సరే" అని బయల్దేరింది నీలవేణి. 


కాసేపైంది. పున్నమి చంద్రుడు పైకి వొస్తున్నాడు. నీలవేణి కృష్ణుణ్ణి తీసుకు వచ్చింది. ప్రకాశంతో కూడిన నీలమేఘ వర్ణంకలవాణ్ణీ, రెండుమూడమ్ముల యేటుకాడిని మించిన సుందరుణ్ణీ, సిం హమధ్యముణ్ణీ చూసి ఆనందంతో నిండిపోయింది. కృష్ణుడు పక్కన కూచుని ఏవో మాటలు మొదలెట్టాడు. కుసుమకి జరిగినవి అన్నీ గుర్తుకు వచ్చాయి అప్పుడు మెల్లిగా


ఆన బెట్టిన రాకపోతివి ఆయెబో అటు మొన్ననూ 

పూని పిలచిన పలుకబోతివి పొంచిపోవుచు మొన్ననూ

నేను చూడగ గడచిపోతివి నీటు చేసుకు నిన్ననూ

కానిలేరా,దనుజ మర్దన, కందుకూరి జనార్దనా 


అని దీనంగా చెప్పింది కుసుమ. 

అదివిన్న ఆ శృంగార శిఖామణి కుసుమని దగ్గరకు తీసి అనునయ వాక్కులతో తన దుఃఖాన్ని పోగొట్టాడు.


                        - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...