Saturday 10 September 2022

మొలక కెంపులు - జనార్దనాష్టకం

రాత్రి అయ్యి చాలా సమయం గడిచింది. మూడోజాము పూర్తి అయిందంటూ గ్రామ తలారి పెట్టిన కేక, నిద్రపోయీ పోకుండా జోగుతూన్న కుసుమకి వినిపించింది. వెంటనే కుసుమ తల విదిలించి లేచి ముఖం కడుక్కుని వచ్చి కూచునిచుట్టూ చూసింది. సాయంత్రమంతా కృష్ణుడు వస్తాడని తన చేతులతో చక్కగా మల్లె మొల్లలతో అలంకరించిన మంచం తనని చూసి విరగబడి నవ్వినట్టు అనిపించింది. పట్టరాని కోపం వచ్చింది కుసుమకి. కానీ ఎలాగైనా కోపాన్ని తగ్గించుకోవాలని గురువు చెప్పిన మాట గుర్తుకు రాగా "ఊ" అంటూ తల అడ్డంగా ఊపి తన దృష్టి వేరేవైపు మరలించింది. అక్కడ తను సాయంత్రమంతా కష్టపడి తయారు చేసిన మధుర పదార్థాలు ఉండటం చూసి కుసుమకోపం రెట్టింపైంది. కానీ కోపం వల్ల విషయం చెడుతుంది తప్పితే ఉపయోగం లేదని తెలిసినది అవటం వల్లా, ముష్టిఘాతాల కంటే మర్మాఘాతాలే బాగా పనిచేస్తాయని అనుభవంలో గ్రహించినది అవటం వల్లా కుసుమ తన కోపాన్ని ఏవిధంగా చూపాలి అని ఆలోచించసాగింది. "అసలే దక్షిణ నాయకుడు. తన కోసం పడి చచ్చేవాళ్ళు కోటిమంది. అందుకని ఎక్కువ కోపం చూపితే మొదటికే మోసం. అసలు కోపం చూపకపోతే మనిషి పూర్తిగా కట్టు తప్పి పోతాడు. అందుకని కాస్త కోపమూ, ఇంకాస్త దురుసుతనమూ, కాస్త వ్యంగ్యమూ, మరి కాస్త వెటకారమూ, కాసిన్ని దెప్పిపొడుపులూ, మరిన్ని మర్మాఘాతాలూ కలిపి కొడితే కాని ఈ కృష్ణుడి తిక్క కుదరదు" అని నిశ్చయం చేసి ఆ నల్లని దొంగ కోసం ఎప్పుడువొస్తాడా అని ఎదురు చూపులు చూస్తోంది. 

ఇంకాసేపైన తరవాత మన నాయకుడు గారు ప్రత్యక్షం అయ్యాడు. లతా నికుంజంలో కూచున్న కుసుమ దగ్గరకు చిరునవ్వుతో వచ్చి "నువ్వు త్వరగా నిద్ర పోతావు కదా. అలా నిద్రపోయి ఉన్నప్పుడు చాలా అందంగా అనిపిస్తావు. అలా నిద్రిస్తున్నప్పుడు ఓసారి చూసి పోదామని వస్తే నువ్వు ఇంకా నిద్ర పోకుండా కూచున్నావు. దేనికి?." అన్నాడు కృష్ణుడు. కుసుమకి కొద్దిగా కోపం వచ్చింది, కానీ బయటపడకుండా "ఎవరో పొద్దు కుంకి దీపాలు పెట్టేవేళకి వొస్తానన్నారు కదా అని వాళ్ళ కోసం వేచి ఉన్నాను" అన్నది. కృష్ణుడు చిరునవ్వుతో "నీ దగ్గరకు వస్తానని చెప్పింది మరిచే పొయ్యాను. క్షమించు" అంటూ కాస్త దగ్గరకి జరిగాడు.

అలా దగ్గరకి జరిగినప్పుడు లతా నికుంజంలోని లతల మధ్యలోంచి వొచ్చిన చంద్ర కిరణాలు కృష్ణుడి ముఖం మీద పడ్డయ్యి. కుసుమకి ఆ అందాల ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమెకు "ముఖంలో ఏదో మార్పు వచ్చిందే" అనిపించి పైకి అనేసింది. కృష్ణుడు "నేను నీకెప్పుడూ కొత్తే " అంటూ కుసుమ చెయ్యి పట్టుకున్నాడు. క్షణంలో కుసుమకి భేదం తెలిసింది. కృష్ణుడి పెదవి అంతా దంతక్షతాలతో ఎర్రగా అయి వుంది. అది చూసి కోపం మరికాస్త ఎక్కువ అయ్యింది. కానీ తమాయించుకుని "అవునూ, నీ ముఖానికి ఎవరన్నా లేపనాలు పూశారా?" అన్నది కుసుమ.

"అబ్బే, ఇప్పటి దాకా ఉద్ధవుడితో ఏదో మాట్లాడుతూ ఉంటే పొద్దు తెలియలేదు. తనని అటు పంపి, ఇటు వచ్చా. అంతే" అన్నాడు కృష్ణుడు. 

"మరి ముఖంలో ఎక్కడో రంగు మారినట్టు అనిపిస్తోందే?"

"నీకెప్పుడూ ఏదో అనిపిస్తూనే వుంటుందిలే కానీ వెళ్ళి ఆ యమున ఒడ్డున కూచుందాం పద." 

"అక్కడ కానుగుచెట్ల నీడలో ఏమీ కనిపించదు. ఇక్కడే నయం. ఏదీ నీ ముఖం సరిగ్గా చూబించు?"

"అబ్బా, గడ్డం పట్టుకుని తలని అటూ, ఇటూ తిప్పుతూ చేస్తున్న పరిశీలన చాలు కానీ, మన రావిచెట్టు కింద ఉన్నఅరుగు దగ్గరకు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుందాం, పద" 

"అవ్వన్నీ తరవాత కానీ, ముందర ఇది చెప్పు. నీకు ఈ కెంపులు ఎవరు బహుకరించారు?"

"కెంపులా?, అలాంటివి ఏమీలేదే?"

"అవును కెంపులే, కొత్తకొత్తగా మొలకెత్తిన కెంపులు, చక్కటి సొగసుతో అలంకరించిన కెంపులు, స్పష్టంగాకనిపిస్తుంటేనూ?"

"నిజమా, ఎక్కడ వున్నయ్యీ?, నాకేమీ తెలియట్లేదే?"


"తెలియట్లేదా?, నీ పెదాల నిండా ఇంత సోగ్గా, సొగసుగా, సుందరంగా మొలకలెత్తిన కెంపులు ఉంచారనితెలియట్లేదా?, లేక అవి ఉంచినవారు ఎవరో తెలియట్లేదా?"

"అవీ.. అవీ.." 

"ఊ చెప్పు, ఈ పెదాల మీద కెంపులు మొలకెత్తించింది  ఎవరు, చెప్పు?"

"...."

" అలా తలదించుకుంటే ఎట్లా, విషయం ఏమిటో విశదం కానీ?"

"...." 

" ఇటు పక్కకి జరుగు, కాస్త చంద్ర కాంతి ఎక్కువ పడనీ." 

".."

"అవునూ, దగ్గరకొస్తే ఏదో మంచి వాసన వస్తోంది. అదీ మగువ పొలుపు తెలిపే పరిమళం. దాని విషయం ఏమిటోకూడా వివరించు." 

"అబ్బే, బయలుదేరేముందు బావుంటుందని వట్టివేళ్ళ నూనె రాసుకుని.. " 

"అట్టే, అట్టే, ఇది వట్టివేళ్ళ వాసన అంటే నమ్మమంటావూ?. ఏదీ ఇంకాస్త తిరుగు. అవునూ ఇదేమిటి ? చందనపు చిన్నెలు కనిపిస్తున్నాయి నీ ఎదురు రొమ్ము మీద?"

"ఇంట్లో ఎదురుగ్గా చందనం వుంటే రాసుకుని బయలుదేరా. అంతే. అబ్బా, ఈ చందనాన్ని అలా మీదకి వొంగి వాసనకూడా చూడాలా?"

"అబద్ధం చెబితే అతికేటట్టు ఉండాలి. ఈ చందనం ఆడవాళ్ళు వక్షోజాలకి రాసుకునేది. దీంట్లో మల్లెనూనె, మందారపూల  రసమూ కలుపుతారు." 

"..." 

"ఊ చెప్పు , నీ రొమ్ము మీద ఏర్పడిన చిన్నెలు  గుత్తమైన మిటారి గుబ్బల వని తెలుస్తూనే వుంది కానీ, ఆవిడ పేరు ఏమిటో చెప్పు, విని తరిస్తాము?.

"..."

"అబ్బా, ఏమీ మాట్లాడకుండా తలపక్కకి తిప్పేస్తే ఎలా?. ఏదో ఒకటి చెప్పు?"

".."

"అబ్బా, అన్ని పనులూ చేసి ఇప్పుడు తల తిప్పుకు కూచుంటే ఎలా. ఆగు ఆగు ఆ చెంపల మీద ఆ ఎర్రటి గీట్లుఏమిటి?. చూడనీ విశదంగా"

"ఏమీ కాలేదన్నాను కదా"

"నువ్వు అలానే అంటావు. ఆగు. ముఖం అటు తిప్పు. ఇంకాస్త కిందకి. అయ్యో ఎంత పెద్ద గాట్లు. గోళ్ళ గాట్ల లాగాలేవు. ఏదోకత్తితో గీరినట్లు ఉన్నయ్యి."

"అబ్బా వదులుదూ?"

"ఇంత చక్కని ముఖాన్ని, ఇంత మృదువైన చర్మాన్ని, ఇంత లేత చెంపలని చక్కగా చూసుకుంటూ, ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు గానీ ఇలా కత్తిగోరులతో సమ్మానించటం ఇదే చూడటం. అవునూ ఈ కత్తిగోరుల కన్యామణి ఎవరో చెప్పు. పొద్దున్నే వెళ్ళి పోట్లాడాలి. ఇంత అందమైన ముఖాన్ని ఇలా పాడు చేసినందుకు శిక్ష వెయ్యాలి కదా. నువ్వు ఎట్లాగూ వెయ్యవు. నేనన్నా శిక్ష వేద్దామని అడుగుతున్నా ఆ అమ్మాయి పేరుని. చెప్పు.?"

"ఇంక వొదిలెయ్యకూడదూ?"

"కూడదు. మరీ ఇంత రాక్షసప్రేమ అయితే ఎలా. అలాంటి వాళ్ళ నించి నిన్ను రక్షించుకోవాలి కదా మేము"

".."

"అబ్బా, మళ్ళీ నీ చేతులు నా భుజాల మీద వేసి ఏమారుద్దామని చూస్తున్నావు. ఇంతకీ ముందు ఈ విషయం చెప్పు 

బిత్తరంబుగ మొలక కెంపులు పెదవి నెవ్వతె నుంచెరా

గుత్తమైన మిటారి గుబ్బల గుమ్మ, ఎవ్వతె మెచ్చెరా

చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా

కత్తి గోరుల, దనుజ మర్దన, కందుకూరి జనార్దనా"

"..."

"...."

    

                          - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...