Friday 25 February 2022

భజన

రాత్రి పూజ జరుగుతోంది. త్యాగయ్య గారి ఇంట్లో రామ పంచాయతనానికి వీణ కుప్పయ్యర్ మంత్రాలు చదువుతుంటే మానాంబుచావడి వెంకట సుబ్బయ్య పూజ చేస్తున్నాడు. అయ్యవారు పూజ చూస్తూ ఆనంద పులకితులవుతున్నారు. శిష్యులందరూ చుట్టూ మూగి "అయ్యవారు ఇవ్వాళ్ళ ఏమి కొత్త పాట పాడతారు" అని మనస్సుల్లో అనుకుంటూ నుంచున్నారు. కుప్పయ్యర్ "గీతం శ్రావయామి" అన్నాడు.

కాస్సేపు అందరూ మౌనంగా ఉన్నారు. తాదాత్మ్యతలో ఉన్న అయ్యవారు మెల్లిగా పాట మొదలెట్టారు. శిష్యులు రాసుకోవటం మొదలెట్టారు.


పల్లవి:

నీ భజన గాన రసికుల నేనెందు గానరా రామ (నీ)

అనుపల్లవి:

శ్రీ, భవ, సరోజాసనాది శచీ మనోరమణవంద్య! ఇలలో (నీ)

చరణం:

సగుణ నిర్గుణపు నిజ దబ్బరలను షణ్మతముల మర్మమష్ట సిద్ధుల

వగలు జూప సంతసిల్లి గంటిని వరానన త్యాగరాజ వినుత (నీ)

 

అని అయ్యవారు ఆనందంతో నాయకి రాగంలో  పాడారు. పూజ పూర్తి అయ్యింది. పడుకోవడానికి వెళుతూ "ఇవ్వాల్టిపాట ఏంటి ఇలా ఉంది" అని చర్చించుకుంటూ వెళ్ళారు.

మరుసటి రోజు అయ్యవారు పాఠం చెప్పటానికి వచ్చి కూర్చున్నారు. పాటపాడమని సైగ చేశారు. శిష్యులు అందరూ కలిసి నిన్న రాత్రి అయ్యవారు పాడిన పాట పాడారు. అయ్యవారు ఆనందంగా విన్నారు. అక్కడక్కడ ఉన్న కొద్ది చిన్న తప్పులుదిద్దుకోమని శిష్యులకి చెప్పిలేవబోయారు. ఇంతలో వెంకట సుబ్బయ్య "గురువు గారూ, నాకో సందేహం" అన్నాడు. అయ్యవారు తలతిప్పి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశారు.

"నిన్న మీరు పాడిన పాట తాత్పర్యం ఇంతకుముందు మీరు పాడిన అనేకపాటలకి వ్యతిరేకంగా ఉంది." అన్నాడు ధైర్యం చేసి. అయ్యవారు ఆలోచిస్తూ" వివరించు" అన్నారు.

"నిన్న మీరు పాడిన పాటకి నాకు అర్థం అయింది రామ భజన చేసే రసికులని నేను ఎక్కడా చూడలేదు అని. ఇంతకుముందు మీరు పాడిన భజనసేయరాదా అనే అఠాణా రాగ కీర్తనలో

"బాగుగ మానస భవ సాగరమును తరింప త్యాగరాజు మనవిని విని తారకమగు రామ నామ భజన సేయరాదా" అని అందరినీ సంబోధించి అన్నారు.

ఇంకా కళ్యాణిరాగంలో భజన సేయవే మనసా పరమభక్తితో అనే కృతిలో మనస్సుని భజన సేయమని సంబోధించారు. రామ భజనచేసే రసికులని ఎక్కడా చూడనప్పుడు మరి అందరినీ భజన చేయమని సంబోధించట మెందుకు? ఇతరుల విషయం వదిలినా మనస్సుని సంబోధించటం ఎందుకు?" అని సుబ్బయ్య అన్నాడు. అయ్యవారు ఆలోచిస్తున్నారు.

ఇంతలో కుప్పయ్యర్ "భజరే భజ మానస రామం అని కానడ రాగంలోనూ, భజన పరులకేల దండపాణి భయము మనసా అంటూ సురటిలోనూ కృతులున్నాయి. భజనసేయు మార్గమును జూపవే అనే నారాయణి రాగ కృతి కూడా ఉంది. పల్లవుల్లో మాత్రమే కాక చరణాల్లో అనేక చోట్ల కూడా భజన చేయడం గురించి ఉన్నది " అన్నాడు.

ఇంకా ఎవరన్నా మాట్లాడతారేమోనని అందరి వంకా కలయచూసి అయ్యవారు మాట్లాడటం మొదలెట్టారు. " తనువూ, మనస్సూ అర్పించి చేసే భజన భగవంతుడిని తెలుసుకునే ముఖ్యమైన సాధన. నిస్సందేహంగా. అయితే ఈ సాధనచేసి తరిస్తే వొచ్చేదేమిటి అని ఆలోచిస్తే రెండు మార్గాలు కనిపిస్తాయి. మొదటిది భక్తి మార్గం. ఇందులో భక్తుడు సాలోక్య, సామీప్య, సారూప్యాలలో ఏ ఒకటి సాధించినా అతనికీ ఈ ప్రపంచానికీ బంధం తెగిపోతుంది. రెండోది జ్ఞాన మార్గం. ఇందులో జీవన్ముక్తి సాధించిన జ్ఞానికి ప్రపంచం ఉన్నా లేనట్టే. ఏ విధంగా చూసినా భజన చేసి దానిలోని రసాన్నిగ్రహించిన రసికులు భూమిమీద ఉన్నా లేనట్టే. అందుకనే పల్లవిలో నీ భజన గాన రసికులని నేను ఎక్కడా చూడలేదు అన్న దానికి తోడు అనుపల్లవిలో ఇలలో అని వచ్చింది కలుపుకుని సమన్వయం చేసుకుంటే సుఖం " అన్నారు.

                                                                              - జొన్నలగడ్డ సౌదామిని

Friday 18 February 2022

నూట పదహార్లు

ఛాందోగ్యం తృతీయ ప్రపాఠకంలో ఈ విధంగా ఉన్నది.

"యజ్ఞరూపుడైన పురుషుడు గడిపిన 24 సంవత్సరాలు ప్రాతఃకాల యజ్ఞం. అందుకని గాయత్రి ఛందస్సు 24 అక్షరాలు.

ఆ పురుషుడు తరవాత గడిపిన 44 సంవత్సరాలు మాధ్యాహ్నిక సవనం. అందుకే త్రిష్టుప్ ఛందస్సు 44 అక్షరాలు.

యజ్ఞపురుషుడు తరవాత గడిపిన 48 సంవత్సరాలు మూడోసవనం. అందుకే జగతీ ఛందస్సులో 48 అక్షరాలు ఉంటాయి.

ఈ యజ్ఞ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు 116 (24+44+48) సంవత్సరాలు బ్రతుకుతారు."

ఎవరైతే ఈ సిద్ధాంతం తెలిసి ఉంటారో, ఆ మూడు వైదిక ఛందస్సులు అధ్యయనం చేసి ఉంటారో, వారిని గౌరవిస్తూ నూటపదహారులు దక్షిణ ఇవ్వటం మొదలై ఉంటుంది అనుకోవటం ఎంతో సుందరంగానూ, సుసంగతంగానూ, ఉపనిషత్సమ్మతంగానూ అనిపిస్తోంది.

ఈ మధ్య ఎక్కడో విన్న మాట, నిజాం రాజ్య రూపాయికీ బ్రిటిష్ రూపాయికీ మారకంలో ఉన్న తేడా వల్ల నూట పదహార్లువాడుకలోకి వచ్చింది అనేది ఆలోచించాల్సిన మాటే అని అనిపిస్తోంది.


                                                                                - జొన్నలగడ్డ సౌదామిని.

Wednesday 9 February 2022

చామరము

సీతారామ లక్ష్మణులు గోదావరీ తీరంలో వనవాసం చేస్తున్నారు. అడవిలోకి వెళ్ళినప్పుడల్లా, ఆ వనాల్లో మాత్రమే దొరికేరకరకాల పండ్లూ. కూరగాయలూ అన్నీ తీసుకు వచ్చి "ఇవి అయోధ్యలో దొరకవు. ఈ అడవికి వచ్చాం కాబట్టి వీటిని తినే అదృష్టం దొరికింది" అంటూ రామలక్ష్మణులు సీతకి ఇస్తుండేవారు. వాటి అన్నిటినీ సీత వండితే అందరూ ఆరగించేవారు. అప్పుడప్పుడూ, సీత కూడా వారితో బయటికి వెళ్ళేది. అందరూ కలిసి హాయిగా వనవిహారం చేసేవారు.

అలాంటి వనవిహారం చేయటానికి ఒకసారి సీతారాములు బయలుదేరారు. వనంలో ఉన్న రకరకాల పుష్పాలలో సీత, తనకు కావలసినవి చూబిస్తుంటే రాముడు వాటిని కోసుకుని వచ్చి సీత చేతిలో పెడుతున్నాడు. ఆ పుష్పాలన్నీ చేతిలో పట్టుకున్న సీత వనరాణిగా వెలిగిపోతోంది. ఇంతలో కొద్దిదూరంలో లేళ్ళు కనిపించినయ్యి. వాటిని చూసి సీత ఎంతో ఆనందించి పసిపిల్లలాగా వాటితో ఆడుకుంటుంటే రాముడు కూడా వాటిని పట్టుకుని మెల్లిగా వొంటినినిమిరి వాటితో పాటు పరుగులు పెడుతూ ఉంటే లక్ష్మణుడు మట్టుక్కు విల్లు ఎక్కుపెట్టి క్రూర జంతువులు ఏమీ రాకుండా చూశాడు.

కాసేపు అలా ఆడుకున్న తరవాత లేచి మళ్ళీ వనవిహారానికి బయలుదేరారు సీతారాములు.

ఇంతలో కొంతదూరంలో సీతా కాంతకి వింత వింత వన్నెలున్న చమరీ మృగాల గుంపు కనిపించింది. ఆ గుంపుకి అంతారాజు అయినందువల్లనో ఏమో ఒక పెద్ద చమరీ మృగం గుంపుకి కొద్దిగా ముందు నడుస్తోంది. ఆ రాజ మృగం తోక చాలాపెద్దదిగానూ, దట్టమైన వెంట్రుకలతో ఉంది. ఆ రాజ చమరీమృగం ఆ తోకని సవిలాసంగా ఊపుతూ మెల్లిగా నడుస్తోంది. ఆ చమరీ మృగాన్నీ, చక్కగా ఉన్న దాని తోకనీ చూసి సీతమ్మకి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ ఎండాకాలం వొస్తోంది కాబట్టి ఈ చమరీ మృగ వాలం వంటి దానితో చక్కటి విసనకర్ర తయారు చేసుకుంటే బావుంటుంది అని ఆవిడకి తోచింది. తోక తెగినా ఆ మృగం ప్రాణానికి ఆపద ఏమీ ఉండదులే అని ఆవిడకి అనిపించింది.

వెంటనే రాములవారికి చెవిలో విషయం చెప్పింది సీతమ్మ. రాములవారు తలకాయ ఊపారు. వెంటనే కోదండం పైకి ఎత్తిబాణం ఎక్కుబెట్టి గురి సరిగా ఉందేమోనని చూశారు. ఇంతలో ఆ చమరీ మృగము తలతిప్పి రాములవారి వైపుచూసింది. క్షణంలో ఆ మృగానికి రాముల వారి గురి ఎక్కడ ఉందో అర్థమైంది. ఆ క్షణంలోనే రాములవారు ఆ మృగం తోక కత్తిరించటానికి బాణం వొదిలారు.

ఆ మృగానికి తన తోక కత్తిరించటానికి బాణం వేశారని అర్థమైంది. రాములవారి బాణం అప్రతిహతమైనది అని ఆమృగానికి తెలుసు. కానీ తోక అనేది పోతే తన గుంపులో విలువ లేకుండా పోతుంది అని కూడా ఆ మృగం ఆలోచించింది. అలా అవమానకరమైన జీవితం గడిపే కంటే అద్భుతమైన ఆ రామబాణం తగిలి చనిపోతే పుణ్యగతులు వస్తాయని నిశ్చయించి వెనక్కి తిరిగి ఇంతకుముందు తన తోక ఉన్న చోట మెడ పెట్టింది.

రాములవారు దూరం నించీ ఇదంతా గమనిస్తున్నారు. ఎప్పుడైతే ఆ చమరీ మృగం తన మెడని బాణానికి ఎదురుగాపెట్టిందో ఆ మృగం మనస్సులోని  భావాలని అర్థం చేసుకున్న రామప్రభువుకి ఆ మృగం పై దయ కలిగింది. రామప్రభువు మనస్సులోని భావాలని చెప్పకుండానే గ్రహించే సీతమ్మ తల్లి దయతో తలఊపింది. రామప్రభువు వెంటనే కోదండం నుండి వేగంగా పోయే ఇంకొక బాణం తీసి మొదట వేసిన బాణం గురి తప్పేటట్టు కొట్టారు. ఇంకొక్క క్షణంలో చమరీ మృగంతలని ఛేదించబోయే మొదటి బాణం, వెనకనించి వచ్చి తాకిన రెండవ బాణం వల్ల గురి తప్పి పక్కకి పడిపోయింది.

అప్పటి దాకా కళ్ళు మూసుకుని మెడ  తెగిపడటానికి సిద్ధమైన మృగం బాణాలు కిందపడ్డ చప్పుడుకి కళ్ళు తెరిచివిషయం అర్థమై శిరస్సు వంచి రామప్రభువుకి అభివాదం చేసింది.

ఈ కథ వాల్మీకంలో లేదు. నాకుతెలిసిన ఇతర రామాయణాల్లోనూ లేదు. కానీ త్యాగరాజ స్వామి ఈ కథని తన క్రిందికీర్తనలో పొందుపరిచి మనకి రామప్రభువు యొక్క కరుణ గురించిన మంచి కథని అందించారు

పల్లవి:

వాచామగోచరమే మనసా

వర్ణింప తరమే రామ మహిమ


అనుపల్లవి:

రేచారి మారీచుని పడకొట్టి

రెండో వాని శిఖికొసగెనే (వా)


చరణం:

మానవతీ మదినెరిగి చామరమౌటకస్త్రమునేయ కని

మానంబుకై మెడ చాచగా మాధవుండు కని కరగి వేగమే,

దీనార్తి భంజనుడై ప్రాణదానంబొసగమును చనిన బాణంబునటు చెదరజేయలేదా గానలోల త్యాగరాజనుతు మహిమ (వా)

 

                                      -  జొన్నలగడ్డ సౌదామిని

 

Friday 4 February 2022

అసితరాముడు

మొత్తానికి పతంజలి గారి ఇంటి మెట్లు ఎక్కాను. ఆయన భార్యకీ నా భార్యకీ ఏదో బీరకాయ పీచు చుట్టరికం ఉన్నా ఇద్దరూ ఒకే పల్లెటూళ్ళో పుట్టి పెరగటం వలన ఉండే అకారణ ప్రేమ వల్లా, రెండు కుటుంబాలూ ఒకే కాలనీలో ఉండటం వల్లా, మా కుటుంబాలు తరచూ కలుసుకోవడం పరిపాటి. అందరు తెలివిగల వాళ్ళకి లానే ఆయన చాలా మితభాషి. పొరపాటున ఆయన మాట్లాడినా నాకు ఆయన మాట్లాడే కావ్యాలూ, శాస్త్రాలూ ఒక్క ముక్క అర్ధం కావు కాబట్టి ఆయన చెప్పిన అన్నిటికీ నాకంతా రమణ మహర్షి గారి లాగా శుద్ధ మౌనం, దాంతో బాటు కాసిని చిరునవ్వులూ సరిపోయేవి.

మా ఆవిడ పుట్టింటికి వెళుతూ వద్దంటున్నా వాళ్ళ అక్క గారి ఇంట్లో సాయంత్రం భోజనం ఏర్పాటు చేయటంతో ఇక రాకతప్పలేదు. పతంజలి గారింట్లో భోజనం టైము సాయంత్రం ఏడున్నర కాబట్టి, ఒక అరగంట ముందు వచ్చి కాసేపు ఆయన చెప్పినవి వినటం సామాజిక బాధ్యత కాబట్టి, గడియారం ఏడు కొట్టకుండానే వాళ్ళ ఇంటి మెట్లు ఎక్కాను. ఎదురుకుండా సోఫాలో కూర్చున్నారు పతంజలి గారు. నన్ను చూసి నవ్వి చేత్తో సోఫాని చూబించి "ఏమోయ్" అన్నారు. ఇంట్లోంచి వారి సతీమణి వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి నీళ్ళు ఇచ్చి లోపలికి వెళ్ళి వంట చూస్తోంది. 

ఇంతలో గడియారం ఏడు గంటలు కొట్టింది. వెంటనే పతంజలిగారు తలతిప్పి "అసిత రాముణ్ణి పట్టుకురాకూడదూ" అని మెల్లిగా అన్నారు. "వొస్తున్నా, వొస్తున్నా" అంటూ ఆవిడ ఏదో తెచ్చి ఆయన చేతిలో పెట్టి రెండో చేత్తో తెచ్చిన మంచినీళ్ళ బుడ్డి చెంబు చేతికిచ్చింది. ఆవిడ చేతిలో పెట్టిందాన్ని చూడను కూడా చూడకుండా నోట్లో వేసుకుని కాసిని మంచితీర్థం పుచ్చుకున్నారు పతంజలి గారు. ఇదంతా చూస్తున్న నాకు ఈ " అసిత రాముడు" సంగతి ఏమిటా అనేది అర్ధంకాక ఈ కొత్తది ఏమిటీ, దాన్ని ఎలా తెలుసుకోవాలీ అనే కుతూహలం  పెరిగింది.

ఆ తరవాత అరగంట పాటు నా పక్కనించి పూర్ణ మౌనమూ, చక్కటి చిరునవ్వులూ, ఆయన పక్కనించి మేఘ సందేశమూ, మను చరిత్రా వాటిల్లోని నాయకుల పోలికలూ, భేదాలూ వాటిల్లో విశేషాలూ  నడిచిపోయాయి. ఏడున్నరకి ఒక గంటకొట్టింది గడియారం. వెంటనే ఆయన మళ్ళీ తలతిప్పి "గుప్త సీతని పట్టుకొస్తావూ" అని అన్నారు. మళ్ళీ వంటగదిలోంచి ఆవిడ గబగబా వచ్చి ఆయన చేతిలో ఏదో పెట్టి బుడ్డి చెంబు చేతికందించింది. ఆవిడ చేతిలో పెట్టినదాన్ని చూడకుండా నోట్లో వేసుకుని మంచి తీర్థం తాగారు ఆయన. ఆవిడకేసి తల ఊపితే ఆవిడ కూడా తల ఊపింది. భోజనంతయారైందని నాకు అర్ధమైంది. ఆయన "భోజనం చేద్దామా" అంటే "అలాగే" అని లేచి వెళ్ళి కూచుని భోజనం మీదదండ యాత్ర చేశాను. ఇప్పటికి ఎన్నో పదార్ధాలు తిని ఉన్నా, ఆవిడ చేసిన మామిడికాయలూ, అల్లం కలిపి చేసిన పచ్చడిరుచి మట్టుక్కు ఇప్పటీ దాకా తగల్లేదు. భోజనం మొత్తం దాదాపు ఆ పచ్చడితో పూర్తి చెయ్యటం చూసిన ఆవిడ ఒక చిన్నడబ్బాలో ఆ పచ్చడి పెట్టి "పొద్దున టిఫిన్ లోకి బావుంటుంది" అని ఇస్తే మొహమాటం లేకుండా తీసుకుని జేబులో ఎలాపెట్టుకున్నానో నాకే ఆశ్చర్యం.

భోజనం పూర్తి చేసి వచ్చి మళ్ళీ హాల్లో సోఫాలో కూర్చోగానే పతంజలి గారు "అల్లుడు రాముణ్ణి ఇస్తావూ" అన్నారు. ఆవిడ "ఇదుగో వస్తున్నా" అంటూ ఆయన చేతులో ఏదో పెట్టి బుడ్డి చెంబుతో నీళ్ళు అందిస్తే ఆయన మళ్ళీ ఆ చేతిలో ఉన్నదాన్ని నోట్లో వేసుకుని మంచితీర్థం పుచ్చుకున్నారు.

ఈ "అసిత రాముడూ, గుప్త సీతా, అల్లుడు రాముడూ" ఇవ్వన్నీ ఏమిటా అని నా మనస్సు పరిపరి విధాల ఆలోచించింది. ఏమీ అర్ధం కాలేదు. ఏమన్నా ఆయుర్వేదం మందులా అనే అనుమానం  వచ్చింది. ఆ పేరుతో ఏమన్నావున్నయ్యేమోనని మొబైల్లో గూగుల్ చేస్తే ఏమీ దొరకలేదు. నాకు ఇదేమిటో తెలుసుకోవాలని ఉత్సుకత  పెరిగిపోయింది. కానీ అడిగితే ఏమన్నా అనుకుంటారేమోనని అలాగే మౌనంగా కూచున్నాను.

ఇంతలో ఆవిడ భోజనం పూర్తి చేసి "ఇదిగో రాజా రాముణ్ణి తీసుకోండి" అని ఆయన చేతిలో ఏదో పెట్టింది. ఉండ బట్టలేక ధైర్యం చేసి "అయ్యా, ఇందాకటి నుంచీ అసిత రాముడన్నారు, గుప్త సీత అన్నారు, అల్లుడు రాముడు అన్నారు, ఇప్పుడు ఆవిడ రాజా రాముడు అన్నారు. నాకేమీ అర్ధం కావట్లేదు" అని త్వరత్వరగా అని, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని తల దించుకుని కూచున్నాను.

పతంజలి గారు పెద్దగా నవ్వి తన చేతిలోది చూపించారు. అది ఏదో టాబ్లెట్ లాగా ఉంది. "దీని పేరు ఇంగ్లీషులో rozerem. అది పలకటానికీ అలవాటులేనిదీ, పలికితే గొప్ప ప్రయోజనమూ లేనిది.  చక్కగా రామనామం పలికితేపుణ్యమూ, పురుషార్ధమూనూ. మిగతా మాటలు రిటైరయిన మావంటి వాళ్ళకి ఎందుకు చెప్పండి. అందుకే దీన్ని మేము రాజారాముడు అనుకుంటాము. ఎంత సుఖంగా  ఉంది మాట. ఎంత పుణ్యం వచ్చే మాట చెప్పండి." అని ఆగారుపతంజలి గారు.

"మిగతావి..?" అని ప్రశ్నార్ధకంగా అన్నాను.

"అవి కూడా అంతే అసిత రాముడు అంటే నల్లని రాముడు అని అర్ధం. కానీ ఇదుగో చూడండి ఇక్కడ ఉన్నది Acitrom tablet.  అలాగే గుప్త సీత, ఎంతో మనోహరమైన పేరు. వాల్మీకి ఆశ్రమంలో అమ్మవారు గుప్తంగా ఉన్నప్పటి పేరు. ఇదిగో చూడండి. Sita Gluptin. అనే మందు. దీన్నే చక్కగా అమ్మవారి పేరు పెట్టుకుని పిలుచుకుంటాము. ఇక అల్లుడురాముడు అంటే ultram అనే మందు, చూడండి."

"బావుంది, కానీ ఇలా పేర్లు ఎందుకు మార్చి పిలుస్తున్నారు.?"

"ఎవడో తెల్లవాడు ఏదో చెట్టు నుంచో, పుట్ట నుంచో తయారు చేసిన దానికి, వాడికి ఇష్టమైన పేరు వాడు పెట్టుకోవచ్చా అనేది ఆలోచించాల్సిన విషయమే. అదీ కాక పేరు అనేది ఒక గుర్తు కోసం. నా ఇప్పటి ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళు సీతారాములు. వాళ్ళచుట్టూ నా జీవితం మొత్తం తిరుగుతూ ఉంది.  ఇంక ఈ మందుల పేర్లు అతి చిన్న విషయాలు. సర్వమూ సీతారాములు అయితే మందులు మట్టుక్కు వేరే పేర్లతో ఎలా వుంటయ్యి చెప్పండి. అందుకని ఇలా ఈ మందులన్నిటికీ మా పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాం. అమ్మ సీతమ్మ, అయ్య రామయ్య ఆ విధంగా నైనా ఇంకాస్త సేపుమా మనస్సుల్లో ఉంటారని. వారిని ఇంకాసేపు తలచి. మేము తరిద్దామని" అని పతంజలి గారు ఆనంద బాష్పాలతో, ఉద్వేగంతో చెబుతూ ఉంటే  ఆయాసం తగ్గటానికి ఆవిడ ఆయన వీపు రాసింది. రేపటినించీ మా ఆవిడతో మాట్లాడేటప్పుడు ఏ విషయాల్లో రామాయణం విషయాలు చొప్పించవచ్చా అని ఆలోచిస్తూ ఇల్లు చేరాను.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...