Friday 4 February 2022

అసితరాముడు

మొత్తానికి పతంజలి గారి ఇంటి మెట్లు ఎక్కాను. ఆయన భార్యకీ నా భార్యకీ ఏదో బీరకాయ పీచు చుట్టరికం ఉన్నా ఇద్దరూ ఒకే పల్లెటూళ్ళో పుట్టి పెరగటం వలన ఉండే అకారణ ప్రేమ వల్లా, రెండు కుటుంబాలూ ఒకే కాలనీలో ఉండటం వల్లా, మా కుటుంబాలు తరచూ కలుసుకోవడం పరిపాటి. అందరు తెలివిగల వాళ్ళకి లానే ఆయన చాలా మితభాషి. పొరపాటున ఆయన మాట్లాడినా నాకు ఆయన మాట్లాడే కావ్యాలూ, శాస్త్రాలూ ఒక్క ముక్క అర్ధం కావు కాబట్టి ఆయన చెప్పిన అన్నిటికీ నాకంతా రమణ మహర్షి గారి లాగా శుద్ధ మౌనం, దాంతో బాటు కాసిని చిరునవ్వులూ సరిపోయేవి.

మా ఆవిడ పుట్టింటికి వెళుతూ వద్దంటున్నా వాళ్ళ అక్క గారి ఇంట్లో సాయంత్రం భోజనం ఏర్పాటు చేయటంతో ఇక రాకతప్పలేదు. పతంజలి గారింట్లో భోజనం టైము సాయంత్రం ఏడున్నర కాబట్టి, ఒక అరగంట ముందు వచ్చి కాసేపు ఆయన చెప్పినవి వినటం సామాజిక బాధ్యత కాబట్టి, గడియారం ఏడు కొట్టకుండానే వాళ్ళ ఇంటి మెట్లు ఎక్కాను. ఎదురుకుండా సోఫాలో కూర్చున్నారు పతంజలి గారు. నన్ను చూసి నవ్వి చేత్తో సోఫాని చూబించి "ఏమోయ్" అన్నారు. ఇంట్లోంచి వారి సతీమణి వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి నీళ్ళు ఇచ్చి లోపలికి వెళ్ళి వంట చూస్తోంది. 

ఇంతలో గడియారం ఏడు గంటలు కొట్టింది. వెంటనే పతంజలిగారు తలతిప్పి "అసిత రాముణ్ణి పట్టుకురాకూడదూ" అని మెల్లిగా అన్నారు. "వొస్తున్నా, వొస్తున్నా" అంటూ ఆవిడ ఏదో తెచ్చి ఆయన చేతిలో పెట్టి రెండో చేత్తో తెచ్చిన మంచినీళ్ళ బుడ్డి చెంబు చేతికిచ్చింది. ఆవిడ చేతిలో పెట్టిందాన్ని చూడను కూడా చూడకుండా నోట్లో వేసుకుని కాసిని మంచితీర్థం పుచ్చుకున్నారు పతంజలి గారు. ఇదంతా చూస్తున్న నాకు ఈ " అసిత రాముడు" సంగతి ఏమిటా అనేది అర్ధంకాక ఈ కొత్తది ఏమిటీ, దాన్ని ఎలా తెలుసుకోవాలీ అనే కుతూహలం  పెరిగింది.

ఆ తరవాత అరగంట పాటు నా పక్కనించి పూర్ణ మౌనమూ, చక్కటి చిరునవ్వులూ, ఆయన పక్కనించి మేఘ సందేశమూ, మను చరిత్రా వాటిల్లోని నాయకుల పోలికలూ, భేదాలూ వాటిల్లో విశేషాలూ  నడిచిపోయాయి. ఏడున్నరకి ఒక గంటకొట్టింది గడియారం. వెంటనే ఆయన మళ్ళీ తలతిప్పి "గుప్త సీతని పట్టుకొస్తావూ" అని అన్నారు. మళ్ళీ వంటగదిలోంచి ఆవిడ గబగబా వచ్చి ఆయన చేతిలో ఏదో పెట్టి బుడ్డి చెంబు చేతికందించింది. ఆవిడ చేతిలో పెట్టినదాన్ని చూడకుండా నోట్లో వేసుకుని మంచి తీర్థం తాగారు ఆయన. ఆవిడకేసి తల ఊపితే ఆవిడ కూడా తల ఊపింది. భోజనంతయారైందని నాకు అర్ధమైంది. ఆయన "భోజనం చేద్దామా" అంటే "అలాగే" అని లేచి వెళ్ళి కూచుని భోజనం మీదదండ యాత్ర చేశాను. ఇప్పటికి ఎన్నో పదార్ధాలు తిని ఉన్నా, ఆవిడ చేసిన మామిడికాయలూ, అల్లం కలిపి చేసిన పచ్చడిరుచి మట్టుక్కు ఇప్పటీ దాకా తగల్లేదు. భోజనం మొత్తం దాదాపు ఆ పచ్చడితో పూర్తి చెయ్యటం చూసిన ఆవిడ ఒక చిన్నడబ్బాలో ఆ పచ్చడి పెట్టి "పొద్దున టిఫిన్ లోకి బావుంటుంది" అని ఇస్తే మొహమాటం లేకుండా తీసుకుని జేబులో ఎలాపెట్టుకున్నానో నాకే ఆశ్చర్యం.

భోజనం పూర్తి చేసి వచ్చి మళ్ళీ హాల్లో సోఫాలో కూర్చోగానే పతంజలి గారు "అల్లుడు రాముణ్ణి ఇస్తావూ" అన్నారు. ఆవిడ "ఇదుగో వస్తున్నా" అంటూ ఆయన చేతులో ఏదో పెట్టి బుడ్డి చెంబుతో నీళ్ళు అందిస్తే ఆయన మళ్ళీ ఆ చేతిలో ఉన్నదాన్ని నోట్లో వేసుకుని మంచితీర్థం పుచ్చుకున్నారు.

ఈ "అసిత రాముడూ, గుప్త సీతా, అల్లుడు రాముడూ" ఇవ్వన్నీ ఏమిటా అని నా మనస్సు పరిపరి విధాల ఆలోచించింది. ఏమీ అర్ధం కాలేదు. ఏమన్నా ఆయుర్వేదం మందులా అనే అనుమానం  వచ్చింది. ఆ పేరుతో ఏమన్నావున్నయ్యేమోనని మొబైల్లో గూగుల్ చేస్తే ఏమీ దొరకలేదు. నాకు ఇదేమిటో తెలుసుకోవాలని ఉత్సుకత  పెరిగిపోయింది. కానీ అడిగితే ఏమన్నా అనుకుంటారేమోనని అలాగే మౌనంగా కూచున్నాను.

ఇంతలో ఆవిడ భోజనం పూర్తి చేసి "ఇదిగో రాజా రాముణ్ణి తీసుకోండి" అని ఆయన చేతిలో ఏదో పెట్టింది. ఉండ బట్టలేక ధైర్యం చేసి "అయ్యా, ఇందాకటి నుంచీ అసిత రాముడన్నారు, గుప్త సీత అన్నారు, అల్లుడు రాముడు అన్నారు, ఇప్పుడు ఆవిడ రాజా రాముడు అన్నారు. నాకేమీ అర్ధం కావట్లేదు" అని త్వరత్వరగా అని, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని తల దించుకుని కూచున్నాను.

పతంజలి గారు పెద్దగా నవ్వి తన చేతిలోది చూపించారు. అది ఏదో టాబ్లెట్ లాగా ఉంది. "దీని పేరు ఇంగ్లీషులో rozerem. అది పలకటానికీ అలవాటులేనిదీ, పలికితే గొప్ప ప్రయోజనమూ లేనిది.  చక్కగా రామనామం పలికితేపుణ్యమూ, పురుషార్ధమూనూ. మిగతా మాటలు రిటైరయిన మావంటి వాళ్ళకి ఎందుకు చెప్పండి. అందుకే దీన్ని మేము రాజారాముడు అనుకుంటాము. ఎంత సుఖంగా  ఉంది మాట. ఎంత పుణ్యం వచ్చే మాట చెప్పండి." అని ఆగారుపతంజలి గారు.

"మిగతావి..?" అని ప్రశ్నార్ధకంగా అన్నాను.

"అవి కూడా అంతే అసిత రాముడు అంటే నల్లని రాముడు అని అర్ధం. కానీ ఇదుగో చూడండి ఇక్కడ ఉన్నది Acitrom tablet.  అలాగే గుప్త సీత, ఎంతో మనోహరమైన పేరు. వాల్మీకి ఆశ్రమంలో అమ్మవారు గుప్తంగా ఉన్నప్పటి పేరు. ఇదిగో చూడండి. Sita Gluptin. అనే మందు. దీన్నే చక్కగా అమ్మవారి పేరు పెట్టుకుని పిలుచుకుంటాము. ఇక అల్లుడురాముడు అంటే ultram అనే మందు, చూడండి."

"బావుంది, కానీ ఇలా పేర్లు ఎందుకు మార్చి పిలుస్తున్నారు.?"

"ఎవడో తెల్లవాడు ఏదో చెట్టు నుంచో, పుట్ట నుంచో తయారు చేసిన దానికి, వాడికి ఇష్టమైన పేరు వాడు పెట్టుకోవచ్చా అనేది ఆలోచించాల్సిన విషయమే. అదీ కాక పేరు అనేది ఒక గుర్తు కోసం. నా ఇప్పటి ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళు సీతారాములు. వాళ్ళచుట్టూ నా జీవితం మొత్తం తిరుగుతూ ఉంది.  ఇంక ఈ మందుల పేర్లు అతి చిన్న విషయాలు. సర్వమూ సీతారాములు అయితే మందులు మట్టుక్కు వేరే పేర్లతో ఎలా వుంటయ్యి చెప్పండి. అందుకని ఇలా ఈ మందులన్నిటికీ మా పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాం. అమ్మ సీతమ్మ, అయ్య రామయ్య ఆ విధంగా నైనా ఇంకాస్త సేపుమా మనస్సుల్లో ఉంటారని. వారిని ఇంకాసేపు తలచి. మేము తరిద్దామని" అని పతంజలి గారు ఆనంద బాష్పాలతో, ఉద్వేగంతో చెబుతూ ఉంటే  ఆయాసం తగ్గటానికి ఆవిడ ఆయన వీపు రాసింది. రేపటినించీ మా ఆవిడతో మాట్లాడేటప్పుడు ఏ విషయాల్లో రామాయణం విషయాలు చొప్పించవచ్చా అని ఆలోచిస్తూ ఇల్లు చేరాను.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...