Saturday 29 January 2022

చెంచు కాంభోజి

సీతారాములు గోదావరీ తీరంలో వనవాసం చేస్తున్నారు. రామలక్ష్మణులు కట్టిన పర్ణశాలలో హాయిగా ఉంటోంది సీతమ్మ. గోదావరి గట్టున కూచుని మిథిలలో సంగీత గురువులు నేర్పిన పాటలూ, అయోధ్యలో అత్తగారు నేర్పిన పాటలూ, అంతఃపురదాసీలు పాడగా విన్న పాటలూ, అన్నీ ఒకదాని తరవాత ఒకటి పాడుతూ ఉండేది సీత.

ఒకరోజు అలా నది ఒడ్డున కూచుని, మైమరచి పాడుకుంటున్న సీతకి కొద్దిదూరంలో ఉన్న చెట్ల వెనకాల ఎవరో దాగి ఉన్న అలికిడి వినిపించి, భయంతో పర్ణశాలలోకి పరిగెత్తింది. "ఏమైంది" అన్న రాముడి  ప్రశ్నకి "ఆ చెట్లలో ఏదో అలికిడి అయ్యింది" అన్న సీత సమాధానం విని వెంటనే లక్ష్మణుడు పరిగెత్తాడు అటు వైపు. అర ఘడియలో ఇద్దరు పదేళ్ళ ఆడపిల్లలతో పాటు పర్ణశాల దగ్గరకి వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి సీతారాములు ఆశ్చర్యపోయారు.

దగ్గరకి వచ్చి "అన్నా, ఇక్కడికి కొద్ది దూరంలో ఒక చెంచులపల్లె ఉన్నది అని నీకు తెలుసు కదా. ఈ పిల్లలు ఆ పల్లె వాళ్ళు. వీళ్ళకి వొదిన పాడే పాటలు అంటే ఇష్టముట. అందు కని ఆ చెట్ల చాటుకు వొచ్చి రోజూ వింటున్నారుట." అన్నాడు లక్ష్మణుడు. సీతమ్మ లేచి ఆ పిల్లల దగ్గరకు వొచ్చి వారిని తీసుకుని గోదావరి ఒడ్డుకు వెళ్ళి కూచుంది.

"ఇప్పుడు చెప్పండి మీ కథ" అన్నది  సీతమ్మ. ఆ ఇద్దరు పిల్లల్లో కాస్త పొడుగ్గా ఉన్న పిల్ల ఒక అడుగు ముందుకు వేసి " నా పేరు సామా, నేను మా అమ్మా నాన్నతో ఆ చెంచు గూడెంలో ఉంటాను. పది రోజుల క్రితం మా స్నేహితురాలితో ఆడుకుంటూ ఈ చెట్లలోకి వొచ్చి మీ పాట విన్నాను. ఆ పాట నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఆ పాటపాడతారేమో విందామని రోజూ వొచ్చి ఆ చెట్ల వెనక దాక్కుంటున్నాను. కానీ మీరు ఆ పాట మళ్ళీ పాడలేదు" అన్నది ఆ పిల్ల.

"నీకు పాటలు వొచ్చా?" అని అడిగింది సీతమ్మ ఆ పిల్లని. "ఓ, బోలెడు వొచ్చు" అంటూ  పాట  పాడడం మొదలెట్టింది. చక్కటి గొంతూ, స్వరాలు పలకటం మీద శ్రద్ధా ఉన్న ఆ పిల్లని చూసి సీతమ్మకి ముచ్చట  వేసింది. ఆ పిల్ల పాట పాడటం పూర్తిఅయ్యాక " పాటలు నేర్చుకుంటావా" అన్నది సీతమ్మ. "ఓ, ఎన్నినేర్పిస్తే అన్ని నేర్చుకుంటాను. కానీ ఒక విన్నపం. పదిరోజుల కింద పాడిన పాట మొదటగా నేర్పుతారా?" అన్నది ఆ పిల్ల. సీతమ్మ తను గతపది రోజుల్లో పాడిన రాగాలు గుర్తుకు తెచ్చుకుని ఒకటి తరవాత ఒకటి పాడింది. అయిదో పాట మొదలు పెట్టగానే ఆ పిల్ల ఆనందంతో "ఆ ఇదే, ఇదే” అని ఎగిరి గంతు వేసింది." దీన్ని కాంభోజి రాగం అంటారు." అంటూ ఆ రాగం గురించి  విశేషాలు చెప్పి ఎలా పాడాలో నేర్పింది. ఆ చెంచు పిల్లలిద్దరూ శ్రద్ధగా విన్నారు. వింటూండగా వారి ముఖంలో శ్రద్ధ మెల్లిగా తగ్గినట్టు సీతమ్మకి తోచింది. పాట అయిన తరవాత " ఎలా వుంది?" అని అడిగింది సీతమ్మ.

"ఆ చెంచుపిల్ల కాసేపు తటపటాయించి" ప్రతి సంక్రాంతి పండుగకూ మా పెద్దవాళ్ళు ఒక పాట పాడుతారు. పదిరోజులకింద మీరు పాడుతుంటే మీ పాట అదే పాట లాగా వుందేమా అనిపించింది. కానీ దగ్గర కూర్చుని వింటే మావాళ్ళపాటకీ, మీ పాటకీ చాలా భేదాలు వున్నాయి" అన్నది. సీతమ్మకి కుతూహలం కలిగి " మీపాట పాడు, ఎట్లావుంటుందో చూద్దాము" అన్నది. ఇంతలో రామయ్య  " ఏమి జరుగుతోందీ?" అంటూ వచ్చి అక్కడ కూచున్నాడు. సీతమ్మ విషయం చెప్పింది. ఇంతలో ఆ చెంచు పిల్ల గొంతెత్తి పాడడం మొదలెట్టింది. పాట శ్రావ్యంగా సాగుతోంది. సీతమ్మతల్లి తాళం వేస్తూతల తిప్పుతూ ఆనంద తన్మయురాలు అయ్యింది. కాసేపటికి పాట ఆగింది. ఆనందబాష్పాలు రాలుస్తున్న సీతమ్మ ఆచెంచు పిల్లని కావిలించుకుని ముద్దుపెట్టింది. తన చేతికి ఉన్న మరకత మణిమయ కంకణాన్ని తీసి ఆ పిల్లకి తొడిగి. ఆపిల్లని పంపించింది.

రాత్రైంది. సీతమ్మతో రాములవారు తెప్పలో విహరిస్తున్నారు. రాములవారు తెడ్డు వేస్తున్నారు. సీతమ్మ కూనిరాగంతీస్తోంది. ఆ పాట చెంచిత పాడిన రాగంలో ఉంది. ఆ రాగాన్ని శ్రద్ధగా విన్న రామయ్య "ఏమిటి విశేషం, ఇవ్వాళ్ళ విదేహమహారాజు గారి కూతురు, కోసల మహారాజు గారి కోడలు, హఠాత్తుగా చెంచిత అయ్యిందేమిటీ?". అన్నాడు. సీతమ్మ సిగ్గుపడింది. పాట ఆగిపోయింది. రామ ప్రభువు నవ్వుతూ" పాట చక్కగా ఉంది. సందేహమే లేదు. పాడటం ఆపకు" అన్నాడు. సీతమ్మ మళ్ళీ రాగం తీయటం మొదలెట్టబోతూ" నిజానికి కాంభోజికి దగ్గరగా ఉన్నా, ఆ చెంచు పిల్ల పాడినపాట కొత్తగానూ, రమణీయంగానూ ఉంది. " అంటూ ఆ రాగమే చాలాసేపు పాడింది.

మరుసటి రోజు సీతారాములు వనవిహారం చెయ్యటానికి బయలుదేరారు. సీతమ్మ కూని రాగం మొదలెట్టగానే "ఊ,పాడు,  నీ చెంచు కాంభోజిని" అన్నాడు రామయ్య. సీతమ్మ "భలే మంచి పేరు పెట్టారే"  అంటూ మురిసిపోయి ఆనందంగా పాడుకుంటూ వనమంతా తిరిగింది. ఆ రాగం సీతమ్మ ద్వారా అయోధ్యలోనూ, మిథిలలోనూ అందరికీ తెలిసింది.

అలా రామ ప్రభువు చేత పేరు పెట్ట బడిన  చెంచు కాంభోజిలో త్యాగరాజ స్వామి వరరాగలయజ్ఞులు తామనుచు వదరేరయా అనే కృతి రాశారు.

                                     - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...