Saturday 22 January 2022

శోభిల్లు

పూజాంతంలో త్యాగరాజ స్వామి అయ్యవారు పాట మొదలెట్టారు.

శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవె మనసా (శో)

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు (శో)

ధర ఋక్సామాదులలో వర గాయత్రీ హృదయమున
సుర భూసుర మానసముల శుభ త్యాగరాజుని యెడ (శో)

అని పూర్తి చేశారు. శిష్యులు రాసుకున్నారు.

మరుసటి రోజు పొద్దున శిష్యులు పాడగా విని ఆనందంగా తల ఊపారు అయ్యవారు. పాఠం దాదాపు పూర్తి అయ్యింది. అయ్యవారు ముగించేలోపు వెంకట సుబ్బయ్య లేచి " గురువుగారూ, నాదొక చిన్న సందేహం" అన్నాడు వినయంగా. అంగీకారంగా తలపంకించారు అయ్యవారు సుబ్బయ్య ఒక అడుగు ముందుకు వేసి " సప్త స్వర సుందరులనిభజించమన్నారు కదా మీరు. అంటే ఏడు స్వరాలు ఉన్నాయని కదా. నా ప్రశ్న ఏమిటంటే మనకి స,రి, గ, మ, ప, ద,నిఅనే ఏడు స్వరాలని మాత్రమే మన ఋషులు ఎందుకు ఏర్పరిచారు?" అన్నాడు.


ఆ ప్రశ్న వినగానే మిగతా శిష్యులు " ఇంత చిన్న విషయం తెలియదా?" అన్నట్టు హేళన పూర్వకంగా నవ్వటం మొదలెట్టారు. అయ్యవారు గొంతు సవరించుకున్నారు. శబ్దాలు అన్నీ ఆగిపోయాయి.

"చాలా గంభీరమైన ప్రశ్న. ఎవరికైనా సమాధానం తోస్తే చెప్పండి." అన్నారు అయ్యవారు. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. కాసేపటి తరవాత అయ్యవారు మొదలెట్టారు.

"అందరూ సంగీతం మొత్తం సామవేదాన్నించి వచ్చింది అంటారు కదా, మరి సామానికి ఆధారం ఏమిటి" అని అడిగారు అయ్యవారు. అందరూ ఆలోచనల్లో పడ్డారు కానీ ఎవరూ మాట్లాడలేదు

కాసేపు చూసి అయ్యవారు దయతో " ఛాందోగ్యంలో ప్రథమ ప్రపాఠకంలో అష్టమ ఖండంలో ఈ విధంగా ఉంది.

సామానికి ఆధారం స్వరం

స్వరానికి ఆధారం ప్రాణం

ప్రాణానికి ఆధారం ఆహారం

ఆహారానికి ఆధారం నీరు

నీటికి ఆధారం స్వర్గం

స్వర్గానికి ఆధారం భూమి

భూమికి ఆధారం ఆకాశం

ఇలా స్వరమూ, ప్రాణమూ, ఆహారమూ, నీరూ, స్వర్గమూ, భూమీ, ఆకాశమూ ఇవి సప్త స్వరాలకి సంకేతాలు. ఇవి అన్నీ మనస్సుకి అవగతాలయ్యేవి . వీటిలో చివరిదైన ఆకాశానికి ఆధారమేమిటి అని ఆలోచిస్తే అష్టమస్వరం సంగీతంలో ఎందుకు లేదు అని అర్థమౌతుంది. ఉపనిషత్తు ప్రకారం ఆకాశానికి ఆధారం ఉద్గీథ. ఉద్గీథ వల్లనే సర్వ ప్రపంచ సృష్టిస్థితిలయాలు జరుగుతున్నయ్యి. ఈ ఉద్గీథ, దేహంతో, మనస్సుతో అందుకోలేనిది. ఉద్గీథ అనుభూతిలోకి వస్తుందికానీ, దాన్ని వివరించటం అసాధ్యం. అందుకని సప్తస్వరాల తర్వాతి స్వరం అనాహత నాదంలా అనుభవ వేద్యమే గానీ దాన్నిగురించి చెప్పలేము. అందుకే అష్టమ స్వరం ఉన్నది, దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉండవచ్చు, కానీ దాని గురించి చెప్పగలవాళ్ళు లేరు. ఈ విధంగా ఉద్గీథ అయిన ఓంకారాన్ని ఉపాసిస్తే పరమపదాన్ని పొందుతారు. మీరందరూ ఉద్గీథని ఉపాసన చేసి తరించండి." అన్నారు అయ్యవారు.

అందరూ అయ్యవారు చెప్పింది ఆలోచిస్తున్నారు. కాసేపాగి వెంకట సుబ్బయ్య "అయ్యవారూ, మీరు చెప్పింది సరిగానే ఉన్నట్టుంది. కానీ మనం స్వరాలు ఏడు అయినా, ద్వాదశ స్వర స్థానాలని సంగీతంలో వాడతాం కదా, వాటి సంగతి ఏమిటి?." అన్నాడు.

అయ్యవారు తల ఊపి " అవును సంగీతం పాడేటప్పుడు మనం

ఆధార షడ్జం

శుద్ధ రిషభం

చతుశ్శ్రుతి రిషభం

శుద్ధ గాంధారం

అంతర గాంధారం

శుద్ధ మధ్యమం

ప్రతి మధ్యమం

పంచమం

శుద్ధ ధైవతం

చతుశ్శ్రుతి ధైవతం

కైశికి నిషాదం

కాకలీ నిషాదం

అనే ఈ పన్నెండు స్వర స్థానాలని గుర్తుగా పెట్టుకుని పాడతాము. ఇవి పన్నెండే ఎందుకు ఉన్నాయి అంటే మనిషి ఒకస్థాయిలో పాడగా స్పష్టంగా వినపడగలిగేది పన్నెండు భాగాలు మాత్రమే. ఈ పన్నెండు స్వర స్థానాలకి ఆధారము కూడా ఉపనిషత్తే.

నాద బిందు ఉపనిషత్తులో ఓంకారానికి పన్నెండుమాత్రలు ఉన్నాయని, ఆ మాత్రల పేర్లు ఘోషిణీ, విద్యుత్, పతంగిని, వాయువేగిని, నామధేయ, ఐంద్రి, వైష్ణవి, శాంకరి, మహతి, ధృతి, నారి, బ్రాహ్మీ అని చెప్పబడి ఉంది. ఈ పన్నెండుమాత్రలలో ఏ ఒక్క దానిని ఉపాసించినా మహత్తరమైన ఫలితాలు వస్తాయని అక్కడ చెప్పబడి ఉంది.

ఆ విధంగా సప్త స్వరాలూ, ద్వాదశ స్వర స్థానాలూ లాంటి వాటి అన్ని భావాలూ ఉపనిషత్తుల్లోనే ప్రపంచించారు మన మహర్షులు.

మనకి ఉన్న మూడు స్థాయిలు, మంద్ర , మధ్యమ , తారా స్థాయిలు కూడా ఓంకారంలోని మూడు అక్షరాల నుండి పుట్టినవే. ఆ మూడూ సరిగా తెలుసుకుంటే చతుర్థమైన తురీయం అనుభవంలోకి వొస్తుంది. ఇలా సంగీతం మూలాల గురించి తెలుసుకుని వాటిని ఉపాసిస్తే నాద బ్రహ్మానందానుభవం కలుగుతుంది" అన్నారు అయ్యవారు.

                                             - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...