Monday 17 January 2022

నాదతనువు

సాయంకాలమైంది. కైలాసంలో శివతాండవం మొదలైంది. పరమశివుడు రకరకాలుగా తన తాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అమ్మవారు సింహాసనం మీద కూచుని భర్త చేసే నాట్యాన్ని చూస్తోంది. శివుడు కుప్పించి ఎగురుతున్నాడు, మృదంగ ధ్వానాలకి తగినట్టు ఉద్ధతమైన తన తాండవాన్ని చూపిస్తున్నాడు. అమ్మవారు, తాను ఆ తాండవంలో పాల్గొనక పోయినా, భర్త చేసే నృత్యాన్ని చూస్తూ తల్లీనమై పోయింది.


ఆవిడ సర్వేంద్రియాలూ ఆ నాట్యం లో లీనమైపోయాయి. ఆవిడకి తెలియకుండానే కూచుని ఉన్న ఆవిడ శరీరం మొత్తమూ ఆ తాండవ నృత్యానికి తగ్గట్టుగా కదులుతోంది.



ధిం ధిం అని మ్రోగే మద్దెల శబ్దాలకి అనుగుణంగా ఆవిడ పాదాలు కదులుతున్నాయి. ఎర్ర మందారాల గుత్తులని అధికరించే కాంతితో వెలిగే ఆ పాదాలు, పద్మరాగ మణులతో అలంకరించిన పాదపీఠిని తిరస్కరించి ప్రకాశిస్తున్న ఆ కుసుమ సుమారమైన పాదాలు కందుతాయేమో నని చుట్టూ ఉన్న చెలికత్తెలు బెంగ పెట్టుకుని, ఎలా చెబుదామా అని తర్జనభర్జనలు పడుతున్నా ఆ మహాతల్లి, నతజన కల్పవల్లి మట్టుక్కు తాండవానికి అనుగుణంగా పాదాలు కదిలిస్తుంటే, వొచ్చే చిరు ధ్వనులు భక్తజన సమ్మోహనాలై విరాజిల్లుతున్నాయి.

ఆ శింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అయిన తల్లి పాదాలకి లోక మోహనాలైన మంజీరాలు ఉన్నాయి. ఆవిడ మంజీర నాదాలు వింటూ హంసలు నాట్యాలు నేర్చుకుంటయ్యి. నవరత్నాలతోనూ, సకల విధాలైన అనర్ఘ మణులతోనూ, బంగారంలాంటి ఖనిజాలతోనూ విశ్వకర్మ తన పని తనం చూపుతూ తయారు చేసిన మువ్వలు, కామేశ మానస అయిన ఆవిడ మనసుని అనుసరించి రకరకాలుగా ధ్వనిస్తాయి. అలాంటి మంజీరాలు, ఆ శివ తాండవ సమయంలో, ఆతల్లి కదులుతున్న పాదాలతో బాటు కదులుతూన్న మంజీరాలు, హృదయోల్లాసకరమైన శబ్దాలతో వినేవారికి అనిర్వచనీయమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాయి.

ఆ శ్రీమహారాజ్ఞికి రకరకాల మణులతో దివ్యంగా తయారుచేసిన మేఖల ఉన్నది. ఆ మేఖలకి ఉన్న వేలాది చిన్న చిన్న గజ్జలు, నీల చికుర అయిన ఆ తల్లి నాట్యం చేసేటప్పుడు, మనోహరంగా వినిపించే ప్రక్క వాయిద్యంగా అనిపిస్తాయి. రాజీవలోచన అయిన ఆ తల్లి, ఆ సాయంకాల శివ తాండవాన్ని కూచుని చూస్తూ ఉన్నా , రమ్యమైన ఆ తల్లి తనువు ఆ తాండవ మృదంగ నాదాలకి అనుగుణంగా కొద్దిగా కదులుతోంది. ఆ కదిలే దేహంలో భాగమై, అస్తినాస్తి విచికిత్సకి హేతువైన ఆ తల్లి నడుముకి అలంకరించి ఉన్న మేఖల కూడా మెల్లిగా కదులుతోంది. రణత్కింకిణి మేఖల అయిన తల్లి మేఖలకి ఉన్న గజ్జెల నుండి మంద్రంగా, మనోహరంగా వినిపిస్తున్న ఉన్న ధ్వని జగదానందకారకంగా ఉన్నది.

అద్భుతమైన ఆ తాండవ నృత్యానికి లక్ష్మీదేవి పాటపాడుతుంటే, విష్ణువు మృదంగం వాయిస్తున్నాడు. సరస్వతి వీణ వాయిస్తుంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. అలా జరుగుతున్న ఆ తాండవం జగన్మోహనంగా ఉంది. ఆ తాండవం చూస్తూ, ఆపాట వింటూ లీనమై , చిఛ్ఛక్తి అయిన ఆ తల్లి ఆనందంతో, తన చేతులతో మెల్లిగా తాళం వేస్తోంది. ఒక చేతిని ఇంకొక చేతిమీద వేసి పాటకి తగినట్టు తాళం వేస్తోంది. వినీ, వినపడనట్టు చిన్నదిగా వినిపించే ఆ శబ్దం మంగళకరంగా ఉన్నది.

తత్త్వమయి అయిన ఆ తల్లి, చేతులకి గొప్పవైన పుష్యరాగాలూ, కెంపులూ, నీలాలూ, ఇతర మణులూ కలిపి చేసిన కంకణాలు ధరించినా, ఆ తల్లి శరీర కాంతిని గెలవాలని ఆ అనర్ఘ మణులన్నీ ఒక్కొక్కటిగానూ, అన్నీ కలిపి ప్రయత్నించినా ఓడిపోయి వెలవెల పోతాయి. అలా ఓడిపోయిన దుఃఖంతో అవి అన్నీ ఒకదానికి ఒకటి తమ కష్టం చెప్పుకుని బాధపడతాయి. అమ్మవారి సన్నిధిలో విలపించలేవు కానీ తమ పక్కనున్న కంకణాలనీ, గాజులనీ తగిలినప్పుడు మట్టుక్కు అవి తట్టుకోలేక పక్కనున్న వాటికి బాధ చెప్పుకుంటూ నిట్టూర్పులు నిగుడిస్తాయి. ఆ శబ్దాలనే కంకణాలు, గాజులు ఒకదానికి ఒకటి ఒరుసుకుని చేసే ధ్వని అని అందరూ అనుకుంటారు.

సర్వ సృష్టి జన్మ స్థితి లయాలకి కారణమైన ఆ జనని తాటంకమహిమ గురించి ఎవరు, ఏమి చెప్పగలరు?. ఉత్కృష్టమైన మణులతో, జగత్తునే జాజ్జ్వల్యమానంగా ప్రకాశింపజేసే ఆ రాకేందు వదన యొక్క తాటంకాలు, ఆ తల్లి అటూ ఇటూ తల ఊపినప్పుడు చిరు సవ్వడులు చేస్తాయి. ఇక శివ తాండవ సమయంలో, ఆ నాట్యం చూస్తూ తన్మయురాలై ఆ మీనలోచని, ఆ పాట రాగ తాళాల అనుగుణంగా తలని కదిలిస్తున్నప్పుడు చెప్పేదేముంది?. తాండవానికి తాళం వాయించే బాధ్యత ఉన్న బ్రహ్మదేవుడు, తాళ బధ్ధంగా, లయాత్మకంగా కదిలే ఆ తాటంకాల నుండి వెలువడే మధురములూ, మనోహరములూ అయిన ఆ చిరు సవ్వడులని వింటూ తాళం వెయ్యటంలో ఉన్న తన తప్పులని దిద్దుకొంటున్నాడు.

తాండవానికి తగినట్టుగా పాట సాగుతోంది. శ్రవణపేయంగా సాగుతున్న పాట దేవిని కూడా సమ్మోహింపచేసింది.ఆనందంగా ఆ పాట వింటున్న దేవి అదే పాటకి పెదవులు కదిపింది. భక్తులు చేసే ఉపాంశు జపంలాగా శబ్దం ఏమీ రాకుండా పెదాలు మట్టుకు కదుపుతోంది దేవి. పాట గతి ద్రుతం నుంచి అతిద్రుతం కి మారింది. ఆ ఉత్సాహంలో దేవి నోటినించి ఆ పాటలోని కొన్ని మధురాక్షరాలు వినీ వినపడనట్టు పలికాయి. ఆ నాదం సర్వ జన హృదయోల్లాసకారిగా ఉన్నది.

అద్భుతంగా సాగే ఆ తాండవాన్ని చూస్తూ మైమరచి ఉండే దేవికి, పక్కన పాడుతున్న పాటా, మృదంగ ధ్వనీ, వీణా ధ్వనీ, తాళ విన్యాసమూ ఇవేవీ మనస్సుకి పట్టవు. కానీ ఆ పరమశివుణ్ణి మెప్పించటానికీ, అంతకంటే అనేక రెట్లు కష్టమైన దేవి మెప్పు పొందడానికీ ఆ పాడే లక్ష్మీదేవీ, మృదంగం వాయించే విష్ణువూ, వీణ వాయించే సరస్వతీ, తాళం వేసే బ్రహ్మా పోటీ పడుతుంటారు. అలా పోటీపడే వారిలో ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు, అత్యద్భుతంగా వాయించినప్పుడు కరుణాపూరితాపాంగంతో దేవి వారిని చూసి మాట్లాడే " బావుంది" అనే శబ్దమే, సత్కారం అని అందరూభావిస్తారు కదా.

అనిశమూ నాదతనువు అయిన ఆ తల్లికి మనసారా సాష్టాంగ ప్రణామాలు.    
                                      - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...