Tuesday 11 January 2022

మందార మాల

సాయంత్రమైంది. గోపికలు అందరూ జట్లు జట్లుగా యమునా తీరానికి జేరుతున్నారు. కృష్ణుడు మథురకి వెళ్ళి మాసాలు గడిచినా గోపికలందరూ అక్కడ జేరి కాసేపు కూచుని పాత తలపులు గుర్తుకు తెచ్చుకుని ఎలాగో ఇండ్లకి జేరటం రోజూ జరుగుతున్నదే.

మెల్లిగా గోపికలందరూ యమునా తీరంలోని పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న అరుగు దగ్గర జేరారు. ఆ అరుగు పక్కనే బాగా విరబూసే మందార చెట్టు ఇంతకు ముందు గోపికలకి, కృష్ణుడికి అవసరమైన చక్కటి పుష్పాలు అందిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ పుష్పాలు ముట్టుకునే వాళ్ళు లేక పెరిగి పెద్దవై వడిలి రాలిపోతున్నాయి.

అలాంటి చోట గోపికలు అందరూ కూచుని మాటాడుకోవడం మొదలెట్టారు. ఇంతలో దూరం నుంచి ఎవరో వస్తున్న అలికిడి వినబడింది. ఒక్క క్షణం మనస్సులో కృష్ణ సాన్నిహిత్యం ఉన్న అందరు గోపికలూ కృష్ణుడు వొస్తున్నాడేమోనని అలా చూడటం మొదలెట్టారు. కొద్ది క్షణాల్లో అక్కడికి జేరిన మూర్తిని చూసి అందరూ నిరాశతో నిట్టూర్పులు వదిలారు. అక్కడికి వచ్చిన వాడు కృష్ణునితో ఎప్పుడూ తిరిగే ఉద్ధవుడు. కృష్ణుడితో బాటు తాను కూడా బృందావనం నుంచి మథురకి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు.

ఉద్ధవుడు మెల్లిగా ముందుకు వచ్చి "కృష్ణుడు మీ అందరి యోగ క్షేమాలు కనుక్కు రమ్మని పంపాడు నన్ను. మీ అందరికీ కుశలమే కదా?" అన్నాడు. అక్కడ ఉన్న గోప సుందరులు అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. వారెవ్వరికీ కృష్ణుడు తానే రాకుండా ఉద్ధవుడితో వార్త పంపటం ఇష్టం కాలేదు. ఏమి చెయ్యాలో వారెవ్వరికీ తోచలేదు. ఇంతలో ఒక సుందరి యథాలాపంగా తల ఎత్తి ఆకాశంలోకి చూసింది. పైన మందార చెట్టూ దానికి గుత్తుగా విరబూసిన పువ్వులు కనిపించాయి. వెంటనే తన మనస్సులో ఒక ఆలోచన వొచ్చింది.

తన చెలులకి సైగ చేసి మందార పూల వైపు చూబించి " ఓ మందారమా, నువ్వు ఎప్పుడూ పూలు పూస్తూ మమ్మల్ని ఆనందింపచేస్తూ ఉన్నావు. నీ పూలు కూడా చక్కగా, అందంగా ఉన్నాయి. కానీ ఇంత అందంగా ఉన్న నిన్ను చూసి ఆనందిస్తూ ఉండక ఒక నల్లని వస్తువుని చూసి మోహపడి, మాహృదయం భగ్నమై బాధపడుతున్నాము." అన్నది.

ఇంతలో ఇంకొక గోపిక " ఓ మందారమా, నువ్వు చాలా గొప్ప చెట్టువి. నీలాగా మంచి అందమైన పూలు పూచే చెట్టు ఎక్కడన్నా ఉంటుందా?. కానీ మథురా నగరంలో మొలిచే ఉమ్మెత్త పుష్పాలు చూసి అవి నీవు అందించే మందారల కంటే గొప్పగా ఉంటాయని అనుకునే వారి గురించి ఏమి చెప్పాలో చెప్పు?." అన్నది.

ఇంతలో ఇంకో గోపిక " ఓ మందారమా, తాను ఒక పెద్ద శిలని ఎత్తాడు. ఇంద్రుడు కురిపించిన శిలావర్షం నించీ గోకులాన్ని కాపాడాడు. అయితే యేమీ. వొఠ్ఠి శిలా హృదయుడేనాయె. మమ్మల్నందరినీ శిలలుగా చేసి తలతిప్పి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు ఆ నల్లరాతి బండ. " అన్నది.

ఇంకొక గోపిక కోపంతో " ఓ మందారమా, నీకు కాసిని నీళ్ళు పోశామో లేదో, గుత్తులు గుత్తులుగా ఈ మంజుల పుష్పాలని ఇస్తూనే వున్నావు. నాలుగు చుక్కలు ఒక వత్సరం రాల్చామో లేదో మధురమైన ఫలాలని ప్రతి వత్సరమూ ఇస్తోంది ఆ మామిడి చెట్టు. కానీ ఆ మోసకారికి తాను అడిగినవీ, అడగనివీ అన్నీ నిలువు దోపిడీ ఇచ్చి కూర్చుంటే మమ్మల్ని వదిలి మథురాపుర మందయానల దగ్గరకి వెళ్ళిపోయాడు." అన్నది.

వేరొక గోపిక అందుకుని " ఓ మందారమా, పోయిన వాడు పోయి ఊరికే ఉండచ్చు కదా, కానీ మథురలోని వారి ముందు బృందావనం మీద హాస్యాలట, ఇదేమన్నా న్యాయమా చెప్పు "

ఇంకో గోపిక ఆలోచించి " నామరూపాలు లేని వాడు చూపించిన నామరూపాలు చూసి ఆ మోహంలో పడిపోయి వాడు ఆడించినట్టల్లా ఆడితే, మనల్నందరినీ నామరూపాలు లేకుండా చేసి తానేమో ఆనందంగా మథురాపురంలో కూర్చున్నాడు" అన్నది.

ఇంకో గోపిక " ఓ మందారమా, అందంగా, ఎర్రగా ఉన్న పూలు పూస్తావు నువ్వు. మేమందరమూ నీ పూల రంగూ, నేవళమూ ఉన్నవాళ్ళం. వాడేమో నదురైన నీలమేఘం రంగు. ఈ రెండు రంగులకి ఎక్కడన్నా సాపత్యం కుదురుతుందా చెప్పు?. అయినా సరే ఏదో మన ఊరి వాడు కదా అని చేరదీస్తే మమ్మల్నందరినీ సముద్రంలో ముంచేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఏమి చెబుతాము, చెప్పు?" అన్నది.

ఇంకొక గోపిక " మంచివాడు, మంచివాడు అనుకుంటే మంచి శాస్తి చేసి వెళ్ళాడు." అని ఇంకా తిట్టబోతుంటే ఉద్ధవుడు " ఆగండి, ఆగండి. మీతో వ్యక్తిగతంగా ఏవేవో చెప్పమని కృష్ణుడు చాలా మాటలు చెప్పాడు. నేను ఆ కనిపించే లతానికుంజంలో కూచుంటాను. మీలో ఎవరు వొస్తే వాళ్ళకి కృష్ణుడు పంపించిన సందేశం చెప్పి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను" అంటూ వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న పొదరింట్లో కూచున్నాడు.

ఒకరితర్వాత ఒకరు పొదరింట్లోకి వెళ్ళి కాసేపటి తర్వాత వొస్తున్నారు. అందరూ, ఆనందంతో నిండిపోయిన గుండెలు కలవాళ్ళూ, ఆనంద బాష్పాలతో తడిసిపోయిన చెక్కిళ్ళు కలవాళ్ళూ, అద్భుతమైన చిన్ని బంగారపు పెట్టెలు చేతుల్లో పట్టుకున్నవాళ్ళూ అయి ఉన్నారు. " ఏమయ్యిందే లోపల?" అంటూ వస్తున్న గోపికని ఒక పిల్ల గోపిక అడిగితే ఆ చిన్ని బంగారు పెట్టెని ఆమె చేతిలో పెట్టి అక్కడ ఉన్న అరుగు మీద కూచుంది మైమరచిన మనసుతో ఉన్న ఆ గోపిక.

మెరిసిపోయే ఆ బంగారు పెట్టెని చేతిలోకి తీసుకుని తెరిస్తే అందులో జాజ్వల్య మానంగా మెరుస్తూ, మందార పువ్వు రంగులో ఉన్న పగడపు రాయీ, దాని మీద ఎంచక్కని ఇంద్రనీలాలతో రాయబడిన ఆ గోపిక పేరూ ఉన్నాయి. పక్కనే చిన్ని భూర్జ పత్రం ఉంది. దాని మీద అందమైన అక్షరాలతో " యమునా తీరం లోని మందారాలనీ మరువలేను. మందారాల కంటే సుకుమారంగానూ, ప్రకాశవంతంగానూ ఉండే మిమ్మల్నీ మరవలేను. మందారాలని మించిన మంజుల , మనోహర సుందరీమణికి నన్ను మరిచిపోవద్దని మనస్స్ఫూర్తిగా చేసే విన్నపం" అని రాసి ఉన్నది చూసి ఉత్తేజితురాలైన చిన్న గోపిక ఏదో అడగబోయేంతలో ఆ గోపిక బంగారపు పెట్టెని వుళాక్కుని వెళ్ళు అంటూ సైగ చేసి కళ్ళు మూసుకుని ఆనందంగా కూచుంది.

                                  - జొన్నలగడ్డ సౌదామిని



No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...