Friday 7 January 2022

తలుపు

శరత్పూర్ణిమ సాయంత్రమైంది. రాధా వాళ్ళింటికి వచ్చాడు కృష్ణుడు. తలుపులు మూసి ఉన్నాయి. లోపలనించీ గడియవేసి ఉందో లేదో తెలియలేదు కృష్ణుడికి. " రాధా, రాధా" అంటూ కృష్ణుడు ఇంటి బయట అరుగు దగ్గర ఉండి మెల్లిగా పిలిచాడు. ఇంట్లో రాధ తన సఖి అయిన ఇందులేఖతో ముచ్చట లాడుతోంది. కృష్ణుడు పిలిచిన పిలుపు విన్న ఇందులేఖ, రాధతో " నీకోసం, అడుగో నీ ప్రియతమ నాయకుడు వచ్చాడు. ఇంక నేను వెళతాను" అన్నది.

"వెళుదువుగానిలే, కూర్చో"
"అదేమిటి, నీకోసం వొచ్చి, నీ పేరు పెట్టి మరీ పిలుస్తుంటే?"
"అంతలా పేరు పెట్టి పిలిచేవాడు లోపలికే రావచ్చు కదా, చెప్పు?."
"తలుపులు వేసిఉన్నయ్యి కదా, అందుకని పిలిచాడేమో?"
"తలుపులు దగ్గరకే వేసి ఉన్నాయనీ, దగ్గరకే వేసి ఉంటాయనీ తనకి మాత్రం తెలియదా ఏమిటి ?"
"అలా ఎలా తెలుస్తుందీ?"
"ఇది మొదటి మారా రావడం?, ఇప్పటికి ఒక వెయ్యి సార్లు వొచ్చిన చోట ఉన్న విషయం ఆ మాత్రం తెలియదా ఏమిటి?" స్నేహితురాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా కృష్ణుడు మరోసారి పిలిచాడు" రాధా, తలుపు. రాధా తలుపు" అన్నాడు.

అప్పుడు ఇందులేఖ నవ్వుతూ "తలుపు తలుపంటూనె తలపు లో నువు నిండ వలపు దారుల బాగ కలసి పోదాం మనము అంటున్నాడు నీ నాయకుడు చూడు" అన్నది.
రాధ తల దించి సిగ్గుతో నవ్వుతూ "ముందర లోపలికి రానీ, తర్వాత సంగతి ఆలోచిద్దాము" అన్నది.

"ఇలా మీరిద్దరూ పంతాలకు పోతే వేసిన తలుపులు వేసినట్టే ఉంటయ్యి రేపటిదాకా. నాకెందుకు నేనుపోతా" అంటూ దొడ్డిదారిలో వెళ్ళిపోయింది ఇందులేఖ.
కాసేపైంది కానీ అప్పుడప్పుడూ అటునుంచి వొచ్చే మాటలే గానీ వాటికి సమాధానాలు మట్టుక్కు రావటం లేదు. ఇంతలో గాలి గట్టిగా వీచింది. తలుపు కొద్దిగా తెరుచుకుంది. కృష్ణుడు చూసేలోపు తలుపు దగ్గరకి వేసేద్దామని ఒక గంతు వేసి తలుపు దగ్గరకి జేరేటప్పటికి గుమ్మంలో కృష్ణుడు. ఏమి చెయ్యాలో తెలియక అలా బొమ్మలా నిలుచుంది రాధ.


"ఒక్కసారి బయటికి రా రాధా, స్వఛ్ఛంగా వీస్తున్న గాలీ, ప్రశాంతంగా ప్రవహించే సెలయేరూ, అద్భుత ప్రకాశాన్నిచ్చే చంద్రుడూ, అన్నీ కలగలిపి మనస్సుని దివ్యదేశాలవైపు తీసుకెళుతున్నాయి. "
"నువ్వు కావాలంటే వెళ్ళు నాకు ఇక్కడే బాగుంది"
" సరేకానీ ఒకసారి బయటికి వచ్చి చూడు ఎలావుందో? "
" నువ్వే లోపలికి వచ్చి నీ రాధ ఏమేమి తయారు చేసిందో చూడు."
" వస్తాలే కానీ, ముందు నువ్వు బయటి కి వచ్చి ఇక్కడ ఉన్న అద్భుతాన్ని చూడు"
" చూస్తాలే కానీ, ఇటురా, ఇక్కడ నీకు ఇష్టమని జున్నుపాలు సిద్ధం చేసి ఉంచాను."
" జున్ను పాల మీద నాకిప్పుడు మనస్సు లేదు. అంతకంటే గొప్ప ఆనందం నేను అనుభవిస్తున్నాను. ఒక్కసారి బయటికి వచ్చి చూడు."
" నాకు మా ఇంట్లోనే బావుంటుంది.ఇన్నేళ్ళ నించీ హాయిగా లేనూ. ఇదిగో చూడు, నీకోసం చక్కటి తలపాగా తయారు చేశాను"
" కూప కూర్మం లాగా ఇంట్లో ఉండక, స్వేఛ్ఛగా బయటికిరా, వొచ్చి ఈగొప్ప ఆనందం అనుభవించు."
" అవన్నీ నాకు ఎందుకు గానీ, ఒక సారి రావూ, నీకోసం నేను చేయించిన మణిభూషణాలు చూడు. చూస్తే నువ్వే ముగ్ధుడివైపోయి, నీ స్వేఛ్ఛని వదిలేసి వాటిని ఇంక వదలవు."
" అబ్బా, మనసుని మోహింపజేసే వాటి అన్నిటి సంగతి వొదిలిపెట్టు . అచ్చమైన ఆనందం పొందుదువుగాని బయటకు రా"
" ఇదిగో చూడు, చంద్ర కిరణం ఒకటి గదిలోని నా ఆభరణాలని అన్నిటినీ ఎంత ప్రకాశవంతం చేస్తోందో ?"
ఇక లాభం లేదని కృష్ణుడు గదిలోకి వెళ్ళి రాధ రెక్క పుచ్చుకుని కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. కిటికీ లోంచి చంద్రుణ్ణి చూసిన రాధ " ఎంత బావుంది" అని ఆనందంగా అన్నది.
"ఇక్కడ ఏమున్నదీ, ఇరుకైన గది గోడలూ, క్షణ భంగురాలైన నగలూ, ధనాలూ, అనవసరమైన ఆడంబరాలూ, అహంకారాలూ తప్ప. "
"అమ్మో, ఇవి అన్నీ నాకు చాలా ఇష్టమైనవి. వీటి అన్నిటినీ వొదిలేస్తే ఎలా?"
"ఒక్కసారి వీటిని వొదిలేసి బయటపడు. సత్యం తెలుస్తుంది" అంటూ బలవంతంగా రాధని బయటకు తెచ్చాడు కృష్ణుడు. కాస్త దూరం నడిచి యమున వొడ్డున ఉన్న ఇసుక కాళ్ళకి తగలగానే చటుక్కున తల ఎత్తి చూసింది రాధ.

మిలమిల మెరిసిపోతున్న తారకలూ, వాటి మధ్యలో మబ్బుల్లో కనీకనిపించకుండా దోబూచులాడే చందమామ, జలతారు మేలిముసుగులోని సుందరి ముఖంలాగా ఉంది. తలపైకెత్తి దాన్ని చూస్తూ అలా నిలిచిపోయిన రాధకి గలగలపారే యమున శబ్దం వినిపించింది. ప్రశాంత మైన ఆ రాత్రిలో యమున లో అలల శబ్దాలూ, చెట్ల ఆకుల గలగలలూ తప్ప వేరే శబ్దం ఏమీలేదు. రాధ కృష్ణుడి మీదకి ఒరిగి చంద్రుణ్ణి చూస్తూ అలా, అలా ఒరిగి కృష్ణుడి ఒళ్ళో తలపెట్టుకుని ఆకాశాన్ని చూస్తోంది. కృష్ణుడు రాధ తలపైన రాస్తున్నాడు. కాసేపటిదాకా మాటలు కూడా లేవు.
అలా ఎంతసేపుగడిచిందో ఎవరికీ తెలీదు. అప్పుడు రాధ " కృష్ణా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది " అన్నది. కృష్ణుడు చిరునవ్వుతో " నిజానికి ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగానే వుంటుంది. కానీ నువ్వు నీ రకరకాల వస్తువుల తోటీ , కోరికలతోటీ నిండిన నీ ఇంటిని వదిలి రావాయె. " అన్నాడు.
" అమ్మో, అన్నీ వదిలి వొచ్చేస్తే ?"
" ఏమీ కాదు. నువ్వూ హాయిగా, సుఖంగా ఉండవచ్చు. అసలు నేనూ, నాదీ అంటూ నువ్వు కూర్చుకున్న భౌతిక, మానసిక విషయాలే నిన్ను ప్రశాంతంగా ఉండకుండా చేసేవి. ఎప్పుడు వాటిని వొదిలావో అప్పుడు ప్రశాంతత. అందుకని ఆ గొడవలు అన్నీ వొదిలి ప్రశాంతంగా ఉండు"
రాధకి అక్కడి ప్రశాంతత చాలా నచ్చింది. అలాగే కృష్ణుడి వొడిలో తలపెట్టి అలా నిద్రపోయింది. పొద్దున్న కోడి కొక్కొరొకో అనగానే నిద్ర లేచిన రాధ అప్పటిదాకా తను కృష్ణుడి ఒళ్ళో తలపెట్టి పడుకున్నాను అనీ, మనస్సు అల్లకల్లోలాలు లేక ప్రశాంతంగా ఉందనీ గ్రహించింది. కృష్ణుడు నిద్ర కూడా పోకుండా తనకి సేవ చేస్తూ మేలుకునే ఉన్నాడని గ్రహించి సిగ్గుపడింది.


కృష్ణుడు రాధని దగ్గరకు తీసుకుని "ప్రశాంతంగా ఉండే స్వేఛ్ఛా ప్రపంచంలోకి స్వాగతం" అన్నాడు.
రాధ ఆలోచించి "నిజంగా ప్రశాంతంగా ఉంది నాకు. ఇలాంటి మార్పు నీవల్లే జరిగింది" అన్నది.
"కాదు. నీవల్లే. ఎప్పుడైతే నువ్వు ఇంటితోనూ, వస్తువులతోనూ, జనులతోనూ బంధం పెంచుకుంటావో అప్పుడు దుఃఖం. ఎప్పుడు వాటి సంగతి వొదిలేశావో అప్పుడు సుఖమూ, ప్రశాంతతా. రెంటిలో నీకు ఏది కావాలి అనేది నీకు నువ్వే ఎంచుకోవాలి" అన్నాడు కృష్ణుడు.
రాధ కాసేపు ఆలోచించి "నాకు అవీ వొద్దు, ఇవీ వొద్దు. నువ్వుంటే చాలు" అన్నది. అలా రాధ అన్న మాటలకి సంతోషించిన నందనందనుడు మనల్ని రక్షించుగాక.

                                             - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...