Saturday 1 January 2022

నీలాంబరి

నీలాంబరి వాళ్ళిల్లు నిజానికి నందుడిగారి ఇంటికి ఆనుకునే ఉంటుంది. కానీ రెండిళ్ళ మొగవాళ్ళకీ నాలుగు, అయిదు తరాలనించి మాటల్లేవు. ఆడవాళ్ళు మట్టుక్కు పెరటి గోడమీదనుంచి పిచ్చాపాటీ మాట్లాడుకునేవారు అప్పుడప్పుడూ. అంతే. నీలాంబరి ఆ ఇంటికి కోడలిగా వొచ్చి నాలుగు ఏళ్ళు అయ్యింది. నీలాంబరి పుట్టిల్లు జనావాసాలకి కాస్త దూరంగా వుండటంతో తనకి వాళ్ళ నాన్న నేర్పిన రామాయణ కథా, వాళ్ళ అమ్మ పాడే ఒకటి రెండు పాటలు తప్ప వేరే ఆటా, పాటా రావు. ఇంటి పని చెయ్యటం అంతా బాగా వచ్చి ఉండటంతో అత్తవారింట తేలికగానే జరిగిపోతోంది నీలాంబరికి.

అలా వచ్చిన నీలాంబరికి ఒక ఆడపిల్ల పుట్టింది. నీలాంబరి కి ఆడపిల్ల పుట్టినమరుసటి రోజురాత్రే నందుడి ఇంట్లో కృష్ణయ్య పుట్టాడు. పన్నెండో రోజు బాలసారె చేసిన తరవాత పెరటి గోడమీద నుంచి నీలాంబరి, తన పిల్లని చూపించింది యశోదకి." చక్కగా వుంది పిల్ల" అంటూ తన పిల్లవాడిని చూపించింది యశోద. నీల నీరద దేహుడూ, నిరుపమ కళా భాసమానుడూ, నిఖిల భువన సుందరుడూ అయిన పిల్లవాడిని చూసి నీలాంబరి బొమ్మైపోయింది. నాలుగు మాటల తరవాత పిల్లవాడిని తీసుకుని యశోద లోపలికి వెళ్ళింది. నీలాంబరి కూడా పిల్లని తీసుకుని ఇంట్లోకి వచ్చింది కానీ ఆమె కళ్ళల్లో ఇంకా ఆ పిల్లవాడే మెదులుతున్నాడు.

ఇంట్లో పనులు ఎలాగొలా పూర్తి చేసి రాత్రి అయ్యేటప్పటికి పిల్లని నిద్ర పుచ్చటం మొదలెట్టింది నీలాంబరి. జో కొడుతుంటే పిల్ల నిద్ర పోవటం మొదలెట్టింది. ఇంతలో నందుడుగారి ఇంట్లో నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించటం మొదలైంది. " అయ్యో, పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎందుకో, ఏమిటో?" అనుకున్నా తన ఇంటి పరిస్థితి తెలిసిన నీలాంబరికి తను ఏమీచెయ్యలేకపోవటంతో దుఃఖం వొచ్చింది. అప్పుడు ఆమెకు తన తల్లి పాడే పాట గుర్తుకు వచ్చింది. వెంటనే తనకు వొచ్చిన ఆ ఒక్క పాటనే గట్టిగా పాడుతూ పిల్లని జోకొట్ట సాగింది. ఆ పాట మొదలుకాగానే పక్కింట్లో పిల్లవాడి ఏడుపు ఆగిపోయింది. నీలాంబరి భర్త, ఎప్పుడూ పాట పాడని భార్య ఇప్పుడు ఎందుకు పాడుతోందా? అన్న కుతూహలంతో వచ్చి పిల్లకి జో కొట్టటం చూసి తృప్తిపడి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు పొద్దున్నే యశోద పెరటి గోడ దగ్గరికి వచ్చి నీలాంబరిని పిలిచి " నీ పాట మూలంగానే పిల్లవాడు పడుకున్నాడు, ప్రతిరోజూ అలాగే పాడు" అని అడిగింది. నీలాంబరి సిగ్గుతో " నాకు వచ్చిందే ఆ ఒక పాట" అన్నది. " పాట ఏమిటి అనేదాని కంటే పిల్లలు నిద్రపోతున్నారా, లేదా అనేది ప్రధానం. పిల్లవాడికినీ పాట నచ్చింది. వాడి కోసం అన్నా రోజూ పాడు." అన్న యశోద మాటలకి నీలాంబరి తల్లకిందులైంది.

అప్పటి నించీ ప్రతి రాత్రీ నీలాంబరి పిల్లని జో కొడుతూ పాటపాడడమూ, నీలాంబరి కూతురూ, పక్కింటి పిల్లవాడూ ఇద్దరూ నిద్ర పోవడమూ మొదలైంది. చూస్తుండగానే కృష్ణుడు పెద్దవాడు అయ్యాడు కానీ, నీలాంబరి పాట వినటం మట్టుక్కు ఆపలేదు. పొరపాటున నీలాంబరి ఏదైనా పనులలో పడినా, పెరటి గోడ దగ్గరకి వచ్చి " పిన్నీ, నీ నీలాంబరి పాట పాడు ఒక్కసారి" అని అడిగి పాడించుకుని అదివింటూ నిద్రపోయేవాడు.

కొన్ని రోజులకి కృష్ణుడు అక్రూరుడితో మథురకి వెళ్ళి ఉగ్రసేనుణ్ణి రాజు చేశాడు. ఉగ్రసేనుడు కృష్ణుడికి పెద్ద భవంతి ఇచ్చి, దాంట్లో పనిచేసే దాసదాసీ జనాన్నీ గాయకులనీ ఇచ్చాడు. కృష్ణుడు రాత్రి పడుకోబోయే ముందు గాయకులు పాడటం మొదలెట్టారు. కృష్ణుడికి అవి ఏవీ నచ్చలేదు. రాత్రి నిద్ర కూడా సరిగా పట్టలేదు. గాయకులకి ఆ మాట తెలిసి తమకి తెలిసిన రకరకాల రాగాలు పాడారు. అవిఏవీ కృష్ణుడికి నచ్చలేదు. నాలుగు రోజులైన తరవాత ఆ గాయకులని పిలిచి " మీరందరూ రేపు గోకులం వెళ్ళి నీలాంబరి గారి పాట నేర్చుకు రండి" అని పంపించాడు.

మరునాడు రాజుగారి గాయకులు అందరూ గోకులం బయలుదేరి నందుడు గారి ఇంటికి వెళ్ళారు. నీలాంబరి గారి పాట లేకుండా కృష్ణుడు గారికి నిద్ర రావట్లేదని, ఆపాట నేర్చుకుని రమ్మని తమని పంపారని వాళ్ళందరూ నందుడికి విన్నవించారు. నందుడు ఆలోచించి వాళ్ళని నీలాంబరి వాళ్ళ ఇంటికి పంపించాడు. అక్కడ ఆ గాయకులు విషయం అంతా విన్నవించి, ఒక్కసారి ఆపాట పాడిస్తే అది నేర్చుకుంటాము అంటే నీలాంబరి భర్త, వాళ్ళని తిట్టి వెనక్కి పంపేశాడు. ఆపైన నందుడు, పాత వైరాల వల్ల పిల్లవాడు బాధ పడకూడదని తానే స్వయంగా వెళ్ళి అడిగినా నీలాంబరి భర్త ఒప్పుకోలేదు.

ఆరోజు సాయంత్రం యశోద విషయం మొత్తం నీలాంబరికి చెప్పింది. " చిన్నప్పటి నించీ నీపాటకి అలవాటు అయ్యాడు వాడు. ఇప్పుడు ఆ పాట లేకపోతే నిద్ర పట్టట్లేదు పిల్లవాడికి. నువ్వే ఏదో విధంగా ఆ పాట ఈ గాయకులకి వినిపిస్తే వాళ్ళు నేర్చుకుని అక్కడ పిల్లవాడికి వినిపిస్తారు. ఈ మాటకి మీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఏమి చెయ్యాలో తోచడం లేదు" అన్నది. నీలాంబరి ఆలోచించి యశోదకి ఒక ఉపాయం చెప్పింది. యశోద సరే అని వెళ్ళిపోయింది.

రాత్రి అయ్యింది. నీలాంబరి కూతురిని నిద్ర పుచ్చటం మొదలెట్టింది. మెల్లిగా పాట పాడుతూ కూతురు వీపు మీద మెల్లిగా నిమురుతోంది. నీలాంబరి భర్త వొచ్చి, "ఏమి జరుగుతోంది " అని చూసి సంతృప్తి పడి వెళ్ళాడు. అతను గమనించనిది ఏమిటంటే మథుర నించి వొచ్చిన గాయకులు అందరూ నందుని ఇంటి పెరటి గోడ దగ్గర కూచుని నీలాంబరి పాడిన పాటని వింటున్నారు అని. కాసేపటికి పాట ముగిసింది. మరుసటి రోజు ఆ గాయకులు అందరూ మథురకి తిరిగి వెళ్ళి జరిగింది కృష్ణుడికి చెప్పారు. ఆరోజు రాత్రి కృష్ణుడు శయ్య మీద విశ్రమించగానే గాయకులు నీలాంబరి పాట పాడారు. కృష్ణుడు హాయిగా నిద్ర పోయాడు. అప్పటి నించి ఆ పాట ఉన్న రాగంలో అనేక పాటలుకట్టి పాడారు ఆ గాయకులు. ఆ రాగానికి నీలాంబరి పేరే మిగిలింది.

అప్పటినించి ఇప్పటిదాకా భగవంతుణ్ణి ఉయ్యాలలు ఊపటానికీ, నిద్ర పుచ్చటానికీ నీలాంబరి రాగం వాడారు అనేక మంది వాగ్గేయకారులు.

                                         - జొన్నలగడ్డ సౌదామిని

2 comments:

  1. బాగుందమ్మా, నీలాంబరి రాగం మీద ఎంత చక్కటి కథను అల్లారూ! అభినందనలు.

    ReplyDelete
  2. కథ అద్భుతంగా ఉంది.👌

    ReplyDelete

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...