Sunday 26 December 2021

గణేశ

ఆరోజు వినాయక చవితి. శిష్యులందరూ గణపతి పూజ ఉత్సాహంగా చేశారు. పూజ చివర త్యాగరాజ స్వామి అయ్యవారు.


ప. శ్రీగణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

అ. శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం
  శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం (శ్రీ)

చ. రంజితనాటక రంగతోషణం
శింజితవర మణిమయభూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజరముఖం త్యాగరాజపోషణం (శ్రీ)

.అని పాడారు. తరవాత శిష్యులు అంతా పోటీలు పడి శ్లోకాలు, కీర్తనలు పాడారు. భోజనం చేసి విశ్రమిస్తున్నారు. కుప్పు అయ్యర్ మెల్లిగా కాళ్ళు పడుతున్నాడు. 

" పూజ తృప్తిగా సాగిందా మీ అందరకీ?" అన్నారు అయ్యవారు. 
" చక్కగా సాగింది, కానీ.." అంటూ నీళ్ళునమిలాడు కుప్పు. 
" ఫరవాలేదు, నీ సందేహం ఏమిటో చెప్పు?" అన్నారు అయ్యవారు. 

కుప్పు అయ్యర్ జంకుతూ " అంతా బానే వుంది కానీ ఆ వినాయక వ్రత కథే కాస్తంత తిరకాసుగా వుంది. మట్టి బొమ్మ, దానికి ప్రాణం పోయటం, తల తీసి కొత్త తల పెట్టటం, మొదటి పూజ, ఇవ్వన్నీ గజిబిజిగానూ, గందరగోళం గానూ అనిపించాయి" అన్నాడు. 

అయ్యవారు గట్టిగా నవ్వారు. " తత్త్వ విజ్ఞానాన్ని సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చే కథల్లో ఉండే అద్భుతాలూ అగమ్యగోచరప్పుంతలు ఇన్నీ అన్నీ కావు.ఇవి అన్నీ మన మహర్షులు దయతో చెప్పిన కథలు, సామాన్యంగా చూస్తే అద్భుతాల కుప్పలు, ఆలోచిస్తే అమృతాల వెల్లువలు." అన్నారు అయ్యవారు దయతో. 

" ఈ కథలో తత్త్వమూ, ఆలోచనా ధారా ఎక్కడున్నాయి?" అన్నాడు కుప్పు. అయ్యవారు మెల్లిగా " ఉన్నదే అది. విను. మట్టితో చేసిన ఈ దేహం జడం. ఈ జడమైన దేహం, చైతన్యాన్ని పట్టుకోలేదు. అదేవిధంగా శివస్వరూపమైన చైతన్యం జడమైన దేహాన్ని పట్టుకోవటంలో ఇష్టం చూపించదు. కానీ లోకయాత్రకి చైతన్యమూ, జడమూ కలిసినది కావాలి. అంటే పార్వతీదేవి మట్టితో చేసిన వినాయకునికీ, శివుని శుద్ధ చైతన్యం తోడైతేనే లోకయాత్ర సఫలం అవుతుంది. అదే పార్వతి చేసిన మూర్తిని శివుడు పునర్నిర్మించటం. అదే చిత్ జడ గ్రంథి బంధం ఏర్పరచటం. 

చైతన్యమూ, జడమూ ఒక్కచోట కలిసి ఉండేట్టు చూడటానికి అహంకారము అనే గ్రంథి ఏర్పరచాడు ఈశ్వరుడు. ఇలా మొదటి సారి ఏర్పరచినది గణేశుని విషయంలోనే. ఆవిధంగానే సమస్త జీవరాశులకి ఈ గ్రంథి బంధం ఏర్పడింది. అందువల్లే ఈ చిజ్జడ గ్రంథి ని ఆధారంగా చేసే సకల కార్యాలలోనూ మొదట ఈ గ్రంథి, చైతన్యమూ, జడమూ కలిపి ఏర్పాటు అయ్యిందని గ్రహిస్తే, ఆ తరువాతి మెట్టు అయిన శుద్ధ చైతన్యాన్ని ఉపాసించటం సులభం అవుతుంది. అందువల్లే ముందర గణపతిని ఉపాసించటం. అందువల్లే షట్చక్రాల మొట్టమొదట మూలాధార చక్రంలోనూ గణపతే ఉంటాడు. " అన్నారు అయ్యవారు. " మరి ఏనుగు ముఖమూ, ఇతరాలూ" అన్నాడు కుప్పు అయ్యర్. " ఆలోచించు. సామాన్యంగా కనిపించే ప్రతి పూజా విషయానికీ, అసామాన్యమైన తాత్త్విక భావనలు వెనుక ఉన్నయ్యి. ఎవరికి ఏది కావాలంటే దాన్ని గురించి కాస్త తపస్సు చేస్తే అన్నీ విశదం అవుతాయి. అదే మనకి మహర్షులిచ్చిన వరం " అన్నారు అయ్యవారు.


                                         - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...