Friday 16 September 2022

జాజి పూవులు - జనార్దనాష్టకం

యమున ఒడ్డున కానుగు చెట్ల మధ్య ఉన్న స్థలం అంతా పున్నమి రాత్రి అయినా నల్లగా, విస్తరించుకుని ఉండే ఆ చెట్ల మూలాన చీకటి కోనలాగా ఉంటుంది, ఆ చెట్లకీ యమునకీ మధ్య ఉన్న  కాస్త స్థలమూ, పగలు కూడా తళతళా మెరిసే ఇసుకతో నిండి ఉంటుంది. రాత్రైతే, ముఖ్యంగా పున్నమి రాత్రైతే ఆ ఇసుక, వెన్నెలలో తడిసి ముద్దై మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి ఒక పున్నమి రాత్రి కుసుమ ఆ సైకత స్థలంలో కూచుని ఇసుకతో పిచ్చుకగూళ్ళు కడుతోంది. యథాప్రకారం కృష్ణుడు వాటిని చెడగొడుతూ కుసుమని ఆటపట్టిస్తున్నాడు.

"ఇలాగైతే నీకు శిక్ష తప్పదు" అని బెదిరించింది కుసుమ. కానీ మాట వినేవాడా కృష్ణుడు.?. ఊహూ. గోల ఇంకాస్త ఎక్కువైంది. పక్కనే ఉన్న కానుగు కొమ్మని విరిచి ఆకులు అన్నీ దూసి చక్కటి బెత్తం తయారు చేసింది కుసుమ. దాన్ని చూడగానే పిల్లవాడి గోల శాంతించింది. కానీ కుసుమా ఊరుకోలేదు. " ఇసుకమీద వెల్లికిలా పడుకుని, చేతులు తలకింద పెట్టుకో" అని ఆజ్ఞాపించింది కృష్ణుణ్ణి. కృష్ణుడు "అలాగే" అని ఆ చంద్ర కిరణాలు పడుతున్న ఆ ఇసుకలో వెల్లికిలాపడుకుని తలకింద చేతులు రెండూ పెట్టి  "ఇంకేమి ఆన?" అన్నాడు. "కదలకుండా, మాట్లాడకుండా అలాగే పడుకో. లేకపోతే దెబ్బలు పడతాయి?" అంటూ బెత్తం చూబిస్తూ బెదిరించింది కుసుమ. కృష్ణుడు అలాగే వెల్లికిలా పడుకుని చంద్రుణ్ణి చూస్తున్నాడు. ఆ చంద్ర కాంతి లో మెరిసిపోతున్నాడు కృష్ణుడు. 

"కదలద్దు" అంటూ కృష్ణుడి తలవైపు కూచుంది కుసుమ. "మొన్న మాలిని నీతో మాటలాడుతూ నీ కళ్ళల్లోకి చూస్తే ఆమెకు అమృతం నిండిన బావిలోకి చూసినట్టు అనిపించిందిట. మధూలిక తో నాట్యం చేస్తూ కళ్ళూ కళ్ళూ కలిపావుట నువ్వు. అప్పుడు ఆమెకి నీ కళ్ళలో ఉప్పొంగిన సముద్రం కనిపించిందని చెప్పింది. ఇన్ని నాళ్ళు ఇంత దగ్గరగా ఉన్నా ఎప్పుడూ అలా నీ కళ్ళలోకి ఎందుకు చూడలేదా అనిపించింది. ఇప్పుడు ఎల్లాగైనా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను. నాకు ఏమి కనిపిస్తుందో చూడాలి?" అంటూ కృష్ణుడి తలవైపు ఇసకలో కూచుంది కుసుమ. కృష్ణుడు కదలబోయాడు. "ఊహూ, కదిలావా, ఒక పెద్దశిక్ష తప్పదు?" అంటూ తర్జనితో బెదిరించి కృష్ణుడి తలవైపు వొంగి సర్దుకుంది కుసుమ. కృష్ణుడి నుదురు దగ్గరకి తన గడ్డం వొచ్చేటట్టూ, కృష్ణుడి కళ్ళకి ఎదురుగ్గా తన కళ్ళు వొచ్చేటట్టూ సర్దుకుని అలా వెనక్కి  కాళ్ళు జాచింది కుసుమ. ఎత్తు నించి చూస్తే తలకింద చెయ్యి పెట్టుకుని పడుకున్న కృష్ణుడూ, కృష్ణుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అతని నుదుటి మీద గడ్డం పెట్టి పడుకున్న కుసుమా, ఇద్దరూ ఒకే సరళరేఖలా కనిపిస్తున్నారు. 

కుసుమ కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తోంది. ఒక్క క్షణం ఆమెకి మాలిని చెప్పిన అమృతపు బావి గుర్తుకు వొచ్చింది. పరిశీలనగా చూసింది. మొదట్లో ఒక్క క్షణం కంటి  మధ్యలోని  కనుపాపని దగ్గరగా చూసినప్పుడు ఆ చిన్న కనుపాప అమృతపు బావిలాగానే అని పించింది కుసుమకి. అలా ఆ విశాలమైన కళ్ళని బాగా దగ్గరగా చూస్తూ ఉంటే కుసుమకి రకరకాల భావాలు కలిగాయి. ఆ కనుపాప కాలచక్రంలాగా ఉన్నది అనీ, దాన్ని తిప్పుతున్నది కృష్ణుడేననీ అనిపించింది. ఇంతలో ఆమె దృష్టికంట్లో ఎక్కువ భాగం ఆక్రమించిన తెల్ల గుడ్డు మీద పడింది. అసలే పెద్ద కళ్ళు, వాటిల్లో ఎక్కువ  భాగం ఆక్రమించిన తెల్లగుడ్డూ ఆమెకి ఎంతో మనోహరంగా తోచింది. దాన్ని దగ్గర నించి చూడాలని జంట  నేత్రాలని అంటి చూసింది. ఆమెకళ్ళు కృష్ణుడి కళ్ళని అతి దగ్గరనించి, అంటి, అంటి  మరీ చూస్తున్నాయి. అలా చూస్తున్నప్పుడు ఆమెకు ఆ కృష్ణుడి కంట్లోని తెల్లగుడ్డు యొక్క తెల్లదనం అచ్చంగా తన ఇంట్లో విరగ కాసే జాజిపూల రంగులాగా ఉన్నది  అనితోచింది. అలాఆ కళ్ళని అంటి మరీ చూస్తున్న కొద్దీ ఆమెకు జాజిపూలు మరీ మరీ గుర్తుకు వొచ్చాయి. గుర్తుకు రావటమే కాకుండా ఆ జాజిపూలతో తనకి అభిషేకం చేసిన కృష్ణుడి కొంటె తనమూ, ఆ జాజి మాలలు ధరించి తామిద్దరమూ హాయిగా తిరగటమూ గుర్తుకొచ్చాయి. అలా జాజిపూల భావన మనసంతా నిండి, తన ఆలోచనా ప్రపంచం అంతా జాజిపూలు పూయటంతో నిండిపోయింది. అది ఆమెకి ఒక అలౌకిక ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి పోయి చొక్కిపోయిన  కుసుమ కృష్ణుడి నుదుటి మీద గడ్డం పెట్టి కళ్ళల్లోకి అంటి చూస్తూ అలా మెల్లిగా పక్కకి జారి కృష్ణుడి కళ్ళలోని జాజిపూలలాంటి తెల్లదనాన్ని తలుస్తూ వెల్లకిలా పడుకుని కళ్ళుమూసుకుంది.

దూరంగా యమున గలగలలూ, పైనించి చంద్రుడి పరవళ్ళూ, చల్లగా వీచే పిల్లగాలీ, దాంతో బాటే వొస్తున్న విరజాజుల వాసనలతో ప్రకృతి అంతా మత్తెక్కిస్తోంది. 

కుసుమ అలా జాజిపూలని తలుస్తూ చొక్కి మెల్లిగా కళ్ళు తెరిచి ఆకాశాన్నీ, చంద్రుణ్ణీ  చూసింది. ఆకాశం కృష్ణుడి రంగులాగా ఉందనీ, చంద్రుడిరంగు కృష్ణుడి కళ్ళలోని తెల్లగుడ్డు లాగా ఉందనీ అనుకుంది. కృష్ణుడు పడుకున్నవాడల్లాలేచి కుసుమ మీదకి మెల్లిగా వొంగాడు. ఆకాశంలోకి చూస్తున్న కుసుమ మీదకి అలా వొంగగానే కృష్ణుడి దేహం అడ్డం వచ్చి మేఘవర్ణం కప్పినట్టు అయ్యింది కుసుమకి. అలా మింటిత్రోవల చూస్తుండగా మేఘ వర్ణం తనని మొత్తం ఆక్రమించినట్టూ, కప్పినట్టూ అవగానే కుసుమ లేవబోయింది. 

కృష్ణుడు కుసుమ భుజాలు పట్టుకుని ఆపి, తను లేచి, ఇంతకు ముందు కుసుమ పడుకున్న విధంగానే ఆమె నుదుటిమీద  తన గడ్డం ఆనించి ఆమె కళ్ళలోకి కళ్ళుపెట్టి చూశాడు. అప్పటిదాకా కిందపడుకుని చంద్రుణ్ణి చూస్తున్న కుసుమ, తన కళ్ళకి ఎదురుగ్గా ఉన్న కృష్ణుడి కళ్ళల్లోకి చూసింది. కృష్ణుడి కళ్ళల్లో  ఆమెకి ఒక కాంతి కనిపించింది. ఇంకాస్త విశదంగా చూస్తే పండు వెన్నెల కాస్తూ ఉన్నట్టు ఉన్నదని ఆమెకి అనిపించింది. ఇదేమిటీ, చంద్రుడి దగ్గర వెన్నెల కృష్ణుడి కళ్ళల్లో కనిపిస్తోందేమా అనుకుంటూ అతని జంట కన్నులని అంటి మరీ చూసింది. ఖచ్చితంగా అది పండువెన్నెలే అని రూఢి చేసుకుంది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ తల కొద్దిగా పక్కకి జరిపి ఆకాశంలోని చంద్రుడి వెన్నెలని చూసింది. మరుక్షణం కృష్ణుడి జంటకన్నుల్ని, అందులో కాస్తున్న పండు వెన్నెల్నీ చూసింది. కృష్ణుడి కళ్ళల్లోని వెన్నెల, బయట మెరుస్తున్న చంద్రుడి పున్నమి వెన్నెల కంటే గొప్పగా, ప్రకాశవంతంగా ఉండటం గ్రహించింది. అలా ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం  ఎక్కువ అయి "నీ కంట్లో ఒక పండు వెన్నెల కాస్తూ ఉండటం నేను చూశాను. అది ఎలా సంభవం?" అంటూ కృష్ణుడిని అడిగింది కుసుమ. కృష్ణుడు ఆమెకి మరి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. 

మరుసటి రోజు కోడి కూయగానే కుసుమా కృష్ణులు ఇళ్ళకి బయలుదేరారు. రాత్రి జరిగింది అంతా గుర్తుకు తెచ్చుకున్న కుసుమ 

జంట నేత్రములంటి చూచితె జాజిపూవులు పూచెరా 

మింటిత్రోవల చూచుచుండగ మేఘవర్ణము గప్పెరా

కంటిలో ఒక పండు వెన్నెల కాయుచున్నది యేమిరా

కంటిలేరా, దనుజమర్దన కందుకూరి జనార్దనా

అంటూ పాడింది. కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇంటికి వెళ్ళాడు.


                       - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...