Tuesday 1 November 2022

కృష్ణుడూ - కందిపచ్చడీ

గోకులం మధ్యలో ధగధగలాడుతూ మెరిసిపోయే విష్ణ్వాలయానికి భరతశర్మ గారు పూజారి అయితే గోకులం చివర వెలతెలబోతూ ఉన్న శివాలయానికి పూజారి విశ్వనాథం గారు. విశ్వనాథం చిన్నప్పుడే ఒడుగు చేసిన వాళ్ళ నాన్న, వెంటనే గుడి పూజా వ్యవహారం తొందరగా నేర్పాడు. అన్ని మంత్రాలనీ ఏక సంతలో నేర్చుకున్న విశ్వనాథం నేర్చిన రెండోవిద్య తనకి అన్నిటికంటే ఇష్టమైన కందిపచ్చడి చెయ్యటం.

పుట్టి బుద్ధెరిగిన తరవాత మొదటిసారి ఎప్పుడు అమ్మ చేతి కంది పచ్చడి తిన్నాడో అప్పటి నించీ ప్రతిరోజూ కంది పచ్చడి చెయ్యమని తల్లిని పోరేవాడు విశ్వనాథం. అప్పటికీ ఆవిడ అప్పుడప్పుడు చేసేది కానీ విశ్వనాథం ప్రతిరోజూ చెయ్యమని పోరేవాడు. ఇంట్లో పదిమంది పిల్లలుంటే వాళ్ళల్లో చిన్నవాడి మాట ఎక్కడ నెగ్గుతుంది? అయినా వదలకుండా వెంటపడుతుంటే ఒకరోజు విశ్వనాథం గోలకి విసిగి "నీకు నేర్పిస్తాను నువ్వు వేయించి రుబ్బుకో" అని తనకి ఎలా చెయ్యాలో విశదంగా చెప్పి చూపించింది.

మరుసటి రోజు యమునకి స్నానానికి వెళ్ళివచ్చిన విశ్వనాథం తల్లి రోటి దగ్గర కూచుని రుబ్బుతూన్న పిల్లవాణ్ణి చూసి ఆశ్చర్యపడిపోయింది.

"ఏమి చేస్తున్నావురా?"

"కంది పచ్చడి రుబ్బుతున్నానమ్మా"

"కంది  పచ్చడా?" నిర్ఘాంతపోయింది ఆవిడ.

"నిన్న నువ్వు నేర్పావు కదమ్మా. పొద్దున్నే యమునలో మునకేసి వచ్చా. అప్పుడే నువ్వు యమునకి వెళుతున్నావు. సరే అని ఆ ఇనప బాండీ తీసి కందులని వేయించా, జీలకర్రా, ఎండు మిరపకాయలూ తగిలించా. చింతపండూ, ఉప్పూ కలిపి రుబ్బుతున్నా. ఇదిగో కొద్దిగా రుచి చూడు, కాస్త తిరగమోత పెట్టాలి అంతే" అంటూ అమ్మ చేతిలో కాస్త పెట్టాడు విశ్వనాథం.

సందేహిస్తూనే రుచి చూసింది ఆవిడ. పచ్చడి నాలిక్కి తగలగానే శబరి సమర్పిత ఫలాలని రాముడు తిన్నప్పుడు ఆమెకు ఎంత ఆనందం కలిగిందో, విశ్వామిత్రుడికి వసిష్ఠుడి ధేనువు వల్ల సిద్ధమైన అన్నం తింటే ఎంత ఆనందం వేసిందో, రంతిదేవుడి అన్నదానం వల్ల ఇంద్రుడికి ఎంత ఆనందం కలిగిందో, అల్లాంటి ఆనందం వేసి ఆ పచ్చడి మొత్తం ఒక్కసారి తినేసింది. "బావుందా అమ్మా, ఇంకాస్త పెట్టనా?" అన్న కొడుకు మాటకి తల ఊపి ఇంకాస్త పెట్టించుకుని తిని "మహాబావుందిరా అబ్బాయీ, ఇలావుంటే ఎంతైనా తినచ్చు" అని ఆగి "ఇంతకీ ఎంతపప్పు పోశావు?" అంది. "వీశెడు . అంతే. ఇదంతా నాకే. ఇంకెవరికీ ఇవ్వను. మీకు కావాలంటే మీరు చేసుకోండి." అన్నాడు. "అంతేం చేసుకుంటావురా?" అంటే "నేనే తింటాను, నువ్వు ఎవ్వరికీ ఇవ్వద్దు." అని గట్టిగా చెప్పాడు. అంతా నిజంగా తానే తిన్నాడు. దిష్టి తగులుతుందేమో అని తల్లి ఆ మాట ఎవ్వరికీ చెప్పలేదు. అప్పటి నించీ ప్రతి రోజూ వీశెడు కందిపచ్చడి జాగ్రత్తగా రుబ్బుకుని రాత్రి లోపల ఖాళీ చేసేవాడు.

ఒక రోజు ఇంటిల్లిపాదీ పక్క ఊరి పెళ్ళికి ప్రయాణం అయ్యారు. దేవుడికి నైవేద్యం పెట్టటానికి  విశ్వనాథాన్ని అట్టిపెట్టి వెళ్ళారు. వెళుతూ, విశ్వనాథం తండ్రి "నువ్వు ఏది చేసుకు తింటావో అది ముందర శివుడికి నైవేద్యం పెట్టు, మేము సాయంత్రం వస్తాము " అన్నాడు. సరే అన్నాడు విశ్వనాథం.

వాళ్ళు వెళ్ళంగానే "శివుడికి ఏమి నైవేద్యం పెడితే బాగుంటుంది" అని తీవ్రంగా అలోచించి కందిపచ్చడే సరి తీర్మానించుకుని తనకి చాతనైనంత బాగా కందిపచ్చడి తయారు చేసి నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులందరికి తలాకాస్త పంచిపెట్టాడు. అసాధారణమైన ఆ ప్రసాదానికీ, దాని రుచికీ భక్తులు ముగ్ధులైపోయారు.


సాయంత్రం వచ్చిన విశ్వనాథం తండ్రికి భక్తులందరూ కందిపచ్చడి ప్రసాదం గురించీ, దాని రుచి గురించి కథలు కథలుగా చెబుతూంటే, ఆయన పిల్లవాణ్ణి పిలిచాడు. "పిల్లవాడు పొరపాటున కందిపచ్చడి నైవేద్యంగా పెట్టాడు, వాడి తప్పు వాడికి చెప్పి సరిదిద్దండి, అంతే కానీ తిట్టకండి" అని తల్లి బ్రతిమిలాడింది. వచ్చిన విశ్వనాథంతో "శివుడికి నైవేద్యంగా పెట్టేది, తనకి అత్యంత ఇష్టమైనది అయ్యుండాలి. దాన్ని భక్తితో ఇవ్వాలి. నువ్వు నీకు ఇష్టమైన కందిపచ్చడి శివుడికి పెట్టావు. భక్తులందరికీ నచ్చింది. అంటే శివుడికీ నచ్చినట్టే. చేసే పని భక్తిశ్రద్ధలతో చెయ్యి. అంతే" అన్నాడు. అప్పటి నించీ అతనిపేరు "కందిపచ్చడి విశ్వనాథం" అయ్యింది.

ఇది జరిగిన కొన్ని రోజులకి తండ్రి మరణించటంతో విశ్వనాథం పూజారి అయ్యాడు. అప్పటినించీ వానైనా, వరదైనా విశ్వనాథం కందిపచ్చడి చేసి శివుడికి నైవేద్యం పెట్టేవాడు. అప్పటిదాకా దాన్ని ఎవరినీ ముట్టనిచ్చేవాడు కాదు. నైవేద్యం తరవాత భక్తులకి కొంత ప్రసాదం లాగా పంచిపెట్టేవాడు. అంతే, తనేమిటో, తన గుడి ఏమిటో తప్ప ఇంక దేన్నీ పట్టించుకునేవాడు కాదు.

అలా సాగిన విశ్వనాథానికి ఇప్పుడు అరవై యేళ్ళు. భార్యపోయి పదేళ్ళయ్యింది. పిల్లలు ఎవరూ లేరు. ఎలాగైనా సరే రోజూ కందిపచ్చడి మట్టుక్కు చేసి శివుడికి పెట్టేవాడు.

ఆ రోజు రాత్రి నిద్రపోతూన్న విశ్వనాథానికి కల వచ్చింది. కలలో శివుడు కనిపించి కందిపచ్చడి అడిగాడు. విశ్వనాథం చేసి తీసుకు వెళితే అక్కడ శివుడి స్థలంలో నందుడి గారి పిల్లవాడు కనిపించాడు. కాసేపటికి కల చెదిరింది. లేచి "ఇదేమిటీ" అని ఆలోచించి కాసిన్ని మంచితీర్థం పుచ్చుకుని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ అదేకల. కాసేపటికి మళ్ళీ లేచి కూచున్నాడు. నందుడుగారి పిల్లవాడికి కందిపచ్చడి ఇవ్వటం శివుడికి ఇష్టమేమో అని అనిపించింది విశ్వనాథానికి. వెంటనే లేచి యమునకి వెళ్ళి ఓ మునుగు మునిగి వచ్చి పొయ్యి వెలిగించి బాండీ పెట్టి కందిపప్పు పోసి వేయించటం మొదలుపెట్టాడు. కాసేపటికి పచ్చడి తయారయ్యింది. అది ఒక మూకుడులో పెట్టి మూత కప్పి, మంచినీళ్ళ తాబేటికాయని కూడా  తీసుకెళ్ళి నందుడిగారి ఇంటి వాకిలి దగ్గర ఉన్న అరుగుమీద కూచున్నాడు.

తీసుకురావడమైతే తీసుకు వచ్చాడు గానీ, ఎప్పుడూ ఎవరితో పరిచయం లేని కారణాన ఎలా ఆ పిల్లవాడిని పిలవాలా, వాడికి ఎలా  ఇవ్వాలా అని సతమతమౌతున్నాడు.

ఇంతలో ఎలా తెలుసుకున్నాడో ఏమో ఆ నల్ల పిల్లవాడు ఎదురుగ్గా వచ్చాడు. వచ్చి  "పచ్చడేది తాతా" అని నడుము దగ్గర కావిలించుకున్నాడు. విశ్వనాథం ఈ లోకంలో లేడు. ఇంతలో నందుడు "ఎవరూ" అంటూ బయటికి వచ్చాడు. "మన విశ్వనాథం తాత నాన్నా, శివాలయం తాత నాన్నా" అన్నాడు కృష్ణుడు. నందుడు లోపలికి వెళ్ళి కృష్ణుడు ఆవులుమేపటానికి కావల్సినవన్నీ సిద్ధంగా ఉన్నయ్యా లేవా అని చూస్తున్నాడు. విశ్వనాథం కాసేపటికి లోకంలోకి వచ్చాడు. కృష్ణుడు ఎదురుగ్గా కూచుని మూకుడులో పచ్చడిని వాసన చూస్తున్నాడు. క్షణంలో అక్కడ శివుడు కనిపించాడు విశ్వనాథానికి. మరుక్షణంలో మళ్ళీ పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడే పరమశివుడని విశ్వనాథానికి రూఢి అయ్యింది. 


వెంటనే ఆ తాబేటికాయ నీళ్ళు కృష్ణుడి పాదాల మీదపోస్తూ నమకం చదవసాగాడు. పొద్దున్నే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వినిపించే ఆ మంత్ర ధ్వని విని నందుడూ యశోదా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి అట్టే ఆగిపోయారు. అక్కడే, వీధిలోనే కృష్ణుడికి సాష్టాంగపడ్డాడు విశ్వనాథం. కృష్ణుడు మట్టుక్కు మెల్లిగా మూకుడులో ఉన్న పచ్చడిని కొద్దికొద్దిగా తింటున్నాడు. ఇంతలో కృష్ణుడి మిత్రులు గోలగోలగా మాట్లాడుకుంటూ వచ్చారు. విశ్వనాథం మోహం పట్టలేక కృష్ణుడికి ఒక ముద్దు పెట్టి, ఇంటికి వచ్చాడు.

అప్పటి నించీ, ప్రతిరోజు పొద్దున్నా, విశ్వనాథం కంది పచ్చడి చేసి తీసికెళ్ళి కృష్ణుడికి ఇచ్చి ఒక ముద్దు పెట్టి వచ్చేవాడు. అలా కొన్నేళ్ళు  సాగింది. శివుడికి ఎంత దీక్షతో పచ్చడి నైవేద్యం పెట్టేవాడో అంత దీక్షతోనూ కృష్ణుడికి  పొద్దున్నే పచ్చడిచేసి ఇచ్చేవాడు.

ఒకరోజు విశ్వనాథానికి జబ్బు చేసింది. కదలలేకపోయాడు. పొద్దెక్కిన తరవాత లేచాడు. "అయ్యో, పొద్దున్న కృష్ణుడికి పచ్చడి ఇవ్వలేదే" అని విచార పడ్డాడు. శివుడి నైవేద్యం ఎలా అని చింత పడ్డాడు. అప్పుడు, "పిల్లలు లేరు గదా" అని చింతించాడు విశ్వనాథం.

"నేనున్నాను గదా నీకు, చెప్పు తాతా ఏం చెయ్యాలో" అంటూ కృష్ణుడు నవ్వుతూ వచ్చాడు.

"భగవంతుడైన నీకు చెయ్యాల్సింది పోయి, నీ చేత చేయించుకోవటం ఎలా స్వామీ" అన్నాడు విశ్వనాథం.

"నాకు మా అమ్మ భోజనం పెడుతుంది, నాకేమీ వద్దు కానీ శివుడికి నైవేద్యం పెట్టాలి గదా?." అని కృష్ణుడు అక్కడ ఉన్నపాత్రలనీ వంట సామాన్లనీ తీసుకుని విశ్వనాథం వద్దంటున్నా వంట చెయ్యటం మొదలెట్టాడు.

కందిపప్పు తీసుకుని బాండీలో పెట్టి వేయించసాగాడు కృష్ణుడు. మంచి వాసన రాసాగింది. తన పాపాలన్నీ కృష్ణుడు వేయించి నాశనం చేస్తున్నట్టు అనిపించింది విశ్వనాథానికి. జీలకర్రా, ఎండు మెరపకాయలూ కలిపి వేయించసాగాడు కృష్ణుడు. ఆ ఘాటుకి తనకి ఉన్న దుర్గుణాలు అన్నీ పుంజాలు తెంపుకుని పోతున్నట్టు తోచింది విశ్వనాథానికి. చింతపండూ, ఉప్పూ కలిపి ఆ మొత్తాన్నీ రోట్లో పోసి రుబ్బటం మొదలెట్టాడు కృష్ణుడు. తన అహంకార, మమకారాలని ఇలా రుబ్బి కృష్ణుడు నాశనం చేసినట్టు అనిపించింది విశ్వనాథానికి. ఈ లోపల ఎలాగో స్నానం చేసి వెళ్ళి శివలింగం దగ్గర కూచున్నాడు విశ్వనాథం.

కృష్ణుడు పూర్తిగా రుబ్బి, తిరగమోత వేసి, కలిపి, కందిపచ్చడి తీసుకొచ్చి శివ లింగం దగ్గర పెట్టాడు. కృష్ణుడు ఆ పచ్చడి తీసుకు వస్తుంటే శివుడే వస్తున్నట్టు తోచింది విశ్వనాథానికి. మనస్సు స్థిరపరచుకుని, కృష్ణుడి చెయ్యి పట్టుకుని పక్కన కూచోపెట్టుకుని మెల్లిగా మూకుడులోని కందిపచ్చడిని కృష్ణుడి నోట్లో పెట్టబోయాడు. కృష్ణుడు శివలింగం వైపు చూబెట్టాడు. "శివాయ కృష్ణ రూపాయ" అంటూ కృష్ణుడి నోట్లో కంది పచ్చడి పెట్టాడు విశ్వనాథం. నవ్వుతూ , ఆనందంగా తిన్నాడు కృష్ణుడు. మళ్ళీ, మళ్ళీ పెట్టి పచ్చడి మొత్తం పూర్తి అయ్యేదాకా పెట్టి  అందరి పాపాలూ కడిగే గంగానది పుట్టిన కృష్ణుడి పాదాలకి నమస్కారం చేయడానికి వంగాడు విశ్వనాథం. తనని తాను సంపూర్ణంగా సమర్పించుకుని అలాగే వంగి కృష్ణుడిలో లీనమై పోయాడు " కందిపచ్చడి" విశ్వనాథం.

        

                       - జొన్నలగడ్డ సౌదామిని.

1 comment:

  1. ఛాలా బాగుంది కథ. అభినందనలు.

    ReplyDelete

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...