Tuesday 8 March 2022

మాయ

ప్రతి రోజూ రాత్రి భోజనాల తరవాత త్యాగరాజ స్వామితో పాటు ముఖ్యశిష్యులు అందరూ దొడ్లో పొగడ చెట్టు కింద జేరేవారు. మెల్లిగా వ్యాసపీఠాన్నీ, పోతనగారి భాగవత గ్రంథాన్నీ పట్టుకుని తెలుగు బాగా వచ్చిన మానాంబుచావడి వెంకటసుబ్బయ్యో, వాలాజాపేట వెంకటరమణ భాగవతారో అక్కడికి జేరేవారు. త్యాగరాజు గారి కూతురు సీతాలక్ష్మి దీపాన్ని తీసుకువచ్చి పెట్టేది. అప్పుడు నిత్య పోతన భాగవత పారాయణ మొదలయ్యేది. అయ్యవారు ఆ పద్యాలు వింటూ అలా మైమరచి పోతూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆ పరవశంలో రాసిన కృతులతో బాటు అప్పుడే రాసిన కృతులు పాడుతుండేవారు అయ్యవారు. అందుకని శిష్యులు రాతసామగ్రి కూడ ఎప్పుడూ దగ్గర ఉంచుకొనేవారు.

ఆ రోజు వామన చరిత్ర చదువుతున్నారు వెంకట సుబ్బయ్య. వామనుడు రావటమూ, బలిదానమివ్వడమూ, త్రివిక్రమావతారమూ పూర్తయ్యినయ్యి. ఇంతలో కథలోకి ప్రహ్లాదుడు రావటమూ, బలి భార్య వింధ్యావళి రావటమూ, ఆమె చేసిన కన్నీటి విన్నపమూ అయ్యవారిని కదిలించినయ్యి. సానుకంపంగా సుబ్బయ్య


కాదనడు, పొమ్ము, లేద

రాదనడు, జగత్త్రయైక రాజ్యము నిచ్చెన్,

నాదయితు గట్టనేటికి

శ్రీదయితా చిత్తచోర, శ్రితమందారా


అన్న పద్యం చదివాడు. అయ్యవారు తానే వింధ్యావళి అయిపోయినంత కదిలిపోయారు. ఆయన కళ్ళవెంట కన్నీళ్ళు కారుతున్నయ్యి. కథ సాగుతోంది. బ్రహ్మ కూడా వచ్చి ప్రార్థించాడు.అప్పుడు విష్ణువు చెప్పిన పద్యం పాడటం మొదలెట్టాడు సుబ్బయ్య.

”ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని యఖిల విత్తంబు నే నపహరింతు"

అని మొదలెట్టగానే అప్పటిదాకా విన్నపాలు చేసిన వింధ్యావళి మొరలే మనస్సులో ఉన్న అయ్యవారికి మదిలో చాలాకష్టం వేసింది. రక్షించు తండ్రీ అని మొరబెట్టితే అలా మొరబెట్టిన వాడి సర్వాన్నీ తానే అపహరిస్తానని విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఆయనకి ఆక్షణాన రుచించలేదు. పద్యం మిగతాభాగం వినబుద్ధి కాలేదు. మనస్సులో భావావేశం పొంగింది. వెంటనే అయ్యవారు గొంతు సవరించుకున్నారు. శిష్యులు కాగితమూ, కలమూ అందుకున్నారు.


పల్లవి.

అడిగి సుఖములెవ్వరనుభవించిరిరా

ఆది మూలమా రామ


అనుపల్లవి.

సడలని పాప తిమిర కోటి సూర్య 

సార్వభౌమ సారసాక్ష సద్గుణ ని(న్న)


చరణం1.

ఆశ్రయించి వరమడిగిన సీత

అడవికి పోనాయె

ఆశ హరణ రక్కసియిష్టమడుగ-

నపుడే ముక్కు పోయె ఓ రామ ని(న్న)


చరణం2.

వాసిగ నారద మౌని వరమడుగ

వనిత రూపుడాయె

ఆసించి దుర్వాసుడన్నమడుగ

అపుడే మందమాయె ఓ రామ ని(న్న)


చరణం3.

సుతుని వేడుక జూడ దేవకియడుగ

యశోద జూడనాయె

సతులెల్ల రతి భిక్షమడుగ వారి వారి

పతుల వీడనాయె ఓ రామ ని(న్న)

 

అంటూ నిందాత్మకమైన పాటని పాడుతున్న అయ్యవారికి అప్పటికి మనస్సులోని ఆవేగం తగ్గింది. " అయ్యో, ఇదేమిటీ ఇలా రాశాను" అనుకొన్న అయ్యవారు ఒక్క క్షణం ఆలోచించి


చరణం4.

నీకే దయ పుట్టి బ్రోతువో బ్రోవవో

నీ గుట్టు బయలాయె

సాకేత ధామ శ్రీ త్యాగరాజ నుత

స్వామి ఏటి మాయ ఓ రామ ని(న్న) 


అని పాటని ముగించారు.


కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న శిష్యులని చూసి "భగవంతుడు అపార కరుణా మూర్తి. కానీ ఆయన మాయ ఏమిటో ఎవరికీ ఏమీ అర్థం కాదు. సీత ఒకసారి ఋషులని చూడాలి అంటే ఆవిడ ఏళ్ళతరబడి అడవిలో ఉండేట్టు చూశాడు. శూర్పణఖ తన కోరిక చెబితే తన ముక్కు కాస్తా పోయింది. విష్ణుమాయని తెలుసుకోవాలి అనుకున్న నారదుడు స్త్రీ అయ్యాడు. దూర్వాసుడు వచ్చి పాండవులని భోజనం పెట్టించమంటే అప్పుడే కడుపు నిండిపోయింది. దేవకి తపస్సు చేసి కన్న పిల్లవాడి ముద్దు ముచ్చటలు యశోదకి దొరికాయి. గోపికలు రతిభిక్ష అడిగితే వాళ్ళ కాపురాలకి దూరం అయ్యారు. కరుణా సుధాబ్ధి అయిన రాముడు ఇలా ఒకటి అడిగితే వేరే ఒకటి ఎందుకు ఇచ్చాడు అంటే అదే ఆయన మాయ. అనిర్వచనీయమైన ఆయన శక్తి. ఎవరి ప్రారబ్ధ ప్రకారం వారికి ఇచ్చాడు" అని ముగించారు.

 

                                    -  జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...