Tuesday 1 March 2022

చలి

హేమంతం చివరికి వచ్చింది. పొద్దున్నే దట్టంగా పొగమంచు కమ్మేసింది. రెండు అడుగులు మించి కనిపించటల్లేదు. చలి వొణికించేస్తోంది అందరినీ. ఉహుహూ అని దుప్పట్లుకప్పుకుని వణుకుతోంది లోకం మొత్తం. చిదంబర నటరాజదేవాలయం లాంటి మహత్తర దేవాలయంలోనూ ఆ చలి ప్రభావం వల్ల భక్తులు పెద్దగా లేరు. పురోహితులు మట్టుక్కు ఎలాగొలా తయారై అంతటి చలిలోనూ సూర్యోదయం కాకుండానే మొదలయ్యే ప్రాతఃకాల అభిషేకానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అభిషేకం మొదలెట్టడానికి ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు వారందరూ.

ఇంతలో దూరం నుండి అడుగుల చప్పుడు వినిపించింది. చెయ్యెత్తు మనిషి, వొళ్ళంతా త్రిపుండ్రాలు పెట్టుకుని, రుద్రాక్షమాలలు ధరించి, చక్కటి కర్ణాభరణాలు పెట్టుకుని, చక్కటి ధోవతి, ఉత్తరీయమూ, ఆపైన చలి బాధ తగ్గించుకోవటం కోసం ఎవరో మహారాజు కప్పిన దుశ్శాలువా కప్పి, నిరంతర శివ మంత్ర జపంతో పునీతమైన వాక్కుతో, అద్వైత విచారణతో అఖండ బ్రహ్మానందం అనుభవిస్తూ విరాజిల్లే అప్పయ్య దీక్షితులు అక్కడికి వచ్చారు. ఆయనతో బాటు ఆయన శిష్యబృందం కూడా ఉంది.

ఆయన రాగానే పురోహితులలో ఒకరు "వచ్చారా, మీకోసమే చూస్తున్నాం" అంటే ఇంకొకరు "బాగా చలిగా ఉంది, కాసేపటి తరవాత మొదలు పెడదామా?" అన్నారు. వారిమాటలకి తల అడ్డంగా ఊపి "చలి అని ఆగితే ఎలా? ఎంత కష్టమైనా ఏ సమయానికి  జరిగేది ఆ సమయానికి జరగాలి" అని దీక్షితులు గంభీరమైనస్వరంతో శివస్తుతులు చదువుతూ గుడి లోపలికి బయలుదేరారు. ఆయన శిష్యులు ఆయనతో గొంతు కలిపి గట్టిగా చదువుతుంటే గుడి మొత్తం ఆ స్తోత్రాలు  ప్రతిధ్వనించాయి.

గుడి లోపలికి వెళ్ళి, కనకసభలో శిష్యులతో కూచుని, పురోహితులు మొదలెట్టిన మహన్యాసంలో గొంతు కలిపారు దీక్షితులు. "ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్.." అన్న శ్లోకం పోటీలు పడి గట్టిగా చదువటం మొదలెట్టారు అందరూ. ఇంతలో చలిగాలి రివ్వున వీచింది. గట్టిగా వీచిన ఆ చలిగాలి అందరినీ ఒక్కసారి గజగజ వణికించింది. అప్రయత్నంగా వొంటిమీద ఉన్న శాలువాని సవరించుకున్నారు దీక్షితులు. ఇంకా చలి వేస్తుంటే ఏమి చెయ్యాలో తోచలేదు దీక్షితులకి.



ఇంతలో ఆయన దృష్టి ఎదురుగ్గా ఉన్న నటరాజు మీద పడింది. ఆయన్ని చూస్తూ "స్వామీ, నటరాజా" అనుకుంటూ శాలువాని తలమీదా, వొంటిచుట్టూ గట్టిగా చుట్టుకుంటుంటే దీక్షితులకి పరమశివుడు ఇంత చలిని ఎలా తట్టుకుంటున్నాడా అని ఒక భావం కలిగింది. "ప్రభో! కనకసభాపతే! ఇంత చలి ఎలా తట్టుకుంటున్నావయ్యా" అని పైకే అనేశారు దీక్షితులు. అందరూ ఆయన వైపే చూశారు. ఆయన మాత్రం ఈ లోకంలో లేరు. ఆపైన "అసలే హేమంతపు చలి, పైన ఆపకుండా ఈ చన్నీళ్ళ అభిషేకాలు, ఎలా భరిస్తున్నావయ్యా?" అంటూ అదే భావనలో ఉండిపోయారు  దీక్షితులు.

ఆలోచిస్తూ ఉన్నకొద్దీ దీక్షితులకి శివుడి అవస్థ ఇంకా విశదం కాసాగింది. మొదలుపెట్టిన అభిషేకం పూర్తి అయ్యేదాకా ఆపలేరు. అందుకని అలా ఆలోచిస్తూ కూచున్న దీక్షితులు తన చలి గురించి మర్చిపోయి శివుడి చలి గురించి ఆలోచించారు.

శివుడు ఉండేదే మంచు కొండలలో, చేసుకున్నది మంచు కొండల కూతురిని. నెత్తి మీద చల్లగా ఉండే గంగమ్మ, చంద్రుడూ. వొళ్ళంతా చల్లగా ఉండే పాములు  తిరుగుతూ ఉంటాయి. ఆపైన వొళ్ళంతా చందనమూ. ఇలా శివుణ్ణి గురించి ఆలోచిస్తున్న దీక్షితులకి ఇన్ని చల్లటి వాటిని వొంటిమీద, చుట్టూ పెట్టుకుని ఉన్న శివుడు ఎలా చలికి వొణకకుండా ఉన్నాడా అని ఆలోచిస్తున్నారు దీక్షితులు. దానికి తాను ఏమి చెయ్యగలమా అని ఆలోచిస్తున్నారు.

ఇంతలో అభిషేకంపూర్తి అయ్యింది. పూజ కూడా దాదాపు పూర్తి అయ్యింది. అప్పుడు గీతం శ్రావయామి అన్నాడు పురోహితుడు. వెంటనే అప్పయ్య దీక్షితులు

మౌళౌగంగాశశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగాః,

పార్శ్వే వామే దయార్ద్ర హిమగిరిదుహితా చందనం సర్వగాత్రే,

ఇత్థం శీతం ప్రభూతం తవ కనకసభానాథ సోఢుం క్వశక్తిః?

చిత్తే నిర్వేదతస్తే యది భవతినతే నిత్యవాసోమదీయే.

(తలమీద గంగా, చంద్రులు, కాళ్ళూ,చేతుల మీద చల్లగా ఉండే పాములూ, ఎడమపక్క దయతో తడిసిపోయి ఉన్నహిమగిరి కుమార్తె అయిన పార్వతీ దేవీ, వొళ్ళంతా చందనమూ, ఇట్లా చల్లటి వాళ్ళనీ, చల్లటి వస్తువులనీ చుట్టూ చేర్చుకున్న ఓ కనకసభా నాథా, ఇంత చల్లదనం ఎలా భరిస్తున్నావు? నీ దయ ఇంకా కలగలేదే అని నిర్వేదంతో వేడెక్కిపోయి ఉన్న నా మనస్సులో వచ్చి ఎప్పటికీ ఉండిపో. అలా ఉండిపోతే నీకు చుట్టూ ఉన్న చల్లదనం వలన కలిగిన చలిపోతుంది) అన్నారు.

పూజ అయ్యి అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకి వచ్చారు. అప్పుడు పురోహితులలో ఒకరు "దీక్షితులవారూ, మీ శ్లోకార్థం అద్భుతంగా ఉంది. మరి శివుడికి చలి తగ్గాలి అంటే మేము ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాము?" అన్నారు. అప్పయ్య దీక్షితులవారు ఆలోచించి "గుడిలో దినచర్యని ప్రతి దినమూ చేసేదాని కంటే ఇంకొద్ది సేపు ఆలస్యంగామొదలెట్టండి. దాంతో చలి తగ్గి శివుడికి కాస్త సులువుగా ఉంటుంది" అన్నారు. ఆ సలహాకి అందరూ సమ్మతించారు. "మరి మిగతా గుళ్ళలో మాట?" అని పురోహితవర్గంనించి ఇంకో ప్రశ్న వచ్చింది. "మన శివుడికి ఇష్టమైనది మనం చేద్దాం, ఎక్కడ శివుడికి ఏది ఇష్టమో అక్కడ అది జరుగుతుంది" అన్నారు అప్పయ్య దీక్షితులు చిరునవ్వుతో.

అప్పటినించీ అరుణాచలంలో అయిదున్నరకే ఆలయం తెరిచినా చిదంబరం లోనూ ఇంకా అనేక పెద్ద పెద్దఆలయాలలోనూ పొద్దున్న ఆరు గంటలకే స్వామి దర్శనం మొదలైంది.

                                                                                          - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...