Saturday, 11 June 2022

పాదం

రాత్రి పూజాంతంలో అయ్యవారు పాడటం మొదలెట్టారు.


పల్లవి:

శ్రీరామ పాదమా! నీ కృప చాలునే! చిత్తానికి రావే(శ్రీ)

అనుపల్లవి:

వారిజభవ సనకసనందన వాసవాదులెల్ల పూజించే (శ్రీ)

చరణం:

దారినిశిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ శూర అహల్యను చూచి బ్రోచితారీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)


అంటూ ముగించారు.

మర్నాడు పొద్దున శిష్యులు ఆ పాటని పాడగా విని తలఊపారు అయ్యవారు.


ఇంతలో వెంకట రమణ భాగవతార్ లేచి "గురువుగారూ, యుద్ధాలు ఏమీ చేయని అహల్యని శూర అహల్య అని సంబోధించటం కొత్తగా ఉన్నది అనుకుంటాను" అన్నాడు.

అయ్యవారు చిరునవ్వుతో "నిజానికి అహల్యే అందరికంటే శౌర్యం కలది. తను చేసిన తప్పుకి గౌతమ మహర్షి పెట్టిన శాపాన్ని స్వీకరించి, అక్కడే ఆ దుమ్మూ ధూళిలో పడి, అలా తపస్సు చేసీ, చేసీ సంవత్సరాలు, యుగాలు దేనికీ చలించకుండా మనస్సుని నిగ్రహించి, అగ్నిలో పుటం పెట్టిన బంగారంలాగా, శుద్ధంగా బయటకు వచ్చి రామ ప్రభువుచరణ స్పర్శని పొందిన ధన్యురాలు. ఎంత ధన్యురాలు అంటే రామాయణం మొత్తంలో బంధుత్వం లేకుండా రామప్రభువు ముట్టుకున్న స్త్రీ, ఆమే" అన్నారు.

భాగవతార్ మళ్ళీలేచి "గురువుగారూ, అహల్య తపస్వి అంటే ఇంకా బావుంటుందేమో" అన్నాడు. శిష్యుడి మనస్సులో శూరఅహల్య అనే మాట తప్పు అనే భావం పోలేదని గ్రహించిన అయ్యవారు "నీకు నిజంగా జరిగిన కథ చెబుతాను, విను. ఒక అడవిలో ఒక ముని ఉండేవాడు. ఆయన శిష్యుల్లో ఒక కుర్రవాడు రాజాస్థానంలో కవి. ఆ కవి తన గురువు గారి మీద "భరణి" అనే పద్ధతిలో ఒక కావ్యం రాసి రాజసభలో చదువుతుంటే మిగతా పండితులు అభ్యంతరపెట్టారు. వారి అభ్యంతరం ఏమిటంటే భరణి అనే కావ్యశైలి వెయ్యి ఏనుగులని చంపే వీరుడిని వర్ణించేది. అడవిలో ఉన్న ముని చివరకు చీమని కూడా చంపడు. మరి ఆయనపై ఇటువంటి కావ్యం రాయటం తప్పు కదా అని.

శిష్యుడు పండితులని వచ్చి తన గురువుగారి శూరత్వము  చూసి పరిక్షించుకోవచ్చని అన్నాడు. మర్నాడు పండితులు ముని వద్దకు వెళ్ళారు. అహంకారాన్ని జయించిన ఆ ముని దగ్గరకు వెళ్ళగానే పండితుల మనసులు మూగపోయాయి. కదలలేదు. అంతా అలా పరమశాంత స్థితిలో కూచున్నారు. కొన్ని రోజుల తరవాత ముని అనుగ్రహం వల్ల మళ్ళీ లోకంలోకి వచ్చిన పండితులు అందరూ ముక్తకంఠంతో వెయ్యి ఏనుగులని చంపే శూరత్వం కంటే ఎన్నో ఎక్కువ రెట్లు కష్టమైన అహంకార నాశనం చేసిన ముని అందరికంటే శూరుడు అని వర్ణించారు.

దీని వల్ల అర్థం అయ్యేది ఏమిటంటే శూరులు అనేది ఇతరులతో యుద్ధం చేసేవారి కంటే అంతర్యుద్ధం చేసి తన మనస్సుని నాశనం చేసిన వారి విషయంలో ప్రయోగించటమే ఉచితం అనిపిస్తుంది. అహల్య అలా మనోనాశం చేసిన మహనీయుల్లో ఎన్నతగినది.

ఇంకో విధంగా చూస్తే శూర అనేది రాములవారి సంబోధనగా గ్రహించినా సమన్వయం సరిపోతుంది కదా" అని ముగించారు అయ్యవారు.


                        - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday, 4 June 2022

స్వస్వరం

మొన్న భగవాన్ చెప్పిన విషయాలు, కృష్ణభిక్షుతో సంభాషణ అన్నీ కలిపి ఒక లేఖ లాగా రాసి పెట్టింది. చూస్తే చక్కగానే తోచింది ఆమెకు. ఒక వారం గడిచింది. ఆశ్రమం వెనగ్గా ఉన్న గోలక్ష్మి సమాధి దగ్గర చెట్టు నీడలో కూచుని తన పాత రచనలని ఏం మార్పు. చెయ్యాలా అని చూస్తోంది నాగమ్మ. ఇంతలో కృష్ణభిక్షు అటు వెళుతూ నాగమ్మని చూసి "ఏమిరాస్తున్నావమ్మా?" అని పలకరించాడు.

"పాతవే మళ్ళీ చూసుకుని దిద్దుకుంటున్నాను అన్నా, ఆ. మర్చేపోయా, నీ రాజకుమారుడి విషయం కొత్తలేఖలో రాశాను."

"రాశావా, అందుకే నేను వచ్చాను నీ దగ్గిరికి. రాయద్దని అడగటానికి"

"అన్నా, మహనీయులైన భగవాన్ చెప్పిన మాటలు ఒక్కటి వొదిలేసి నా మనస్సు ఒప్పుకోదు. నిజానికి భగవాన్ చెప్పిన మాటల్లో కొంత హాస్యం తోస్తోందని అనిపిస్తోందే తప్ప వేరే భావం ఏదీ అనిపించటల్లేదు అన్నా"


"సరే, నీ ఇష్టమే కానీ."

"అన్నా"

"చెప్పమ్మా?"

"మొన్నటి కీర్తన నా మనస్సులో బాగా ముద్ర వేసుకుపోయింది"

"అది నీ సంస్కారబలం"

"అన్నా, ఇంకొక కీర్తన పాడవూ?"

"మళ్ళీ ఇంకొకటా, ఇంకో లేఖ రాయడానికా?"

"లేఖలు భగవాన్ విషయాల గురించే అన్నా. ఇంకే విషయాలూ లేఖలో రాయను. మొన్న నీ విషయం కూడా, భగవాన్ వచ్చి మాట్లాడినందుకే రాశాను"

"సరే కానీ, ఈ కీర్తన విను


పల్లవి:

సుఖి ఎవ్వరో రామనామ సుఖి ఎవ్వరో (సు)

అనుపల్లవి:

సుఖి ఎవ్వరో సుముఖి ఎవ్వరో అఖిల సారమగు తారక నామ (సు)

చరణం:

సత్యము తప్పక సకల లోకులకు భృత్యుడై దైవ భేదము లేక నిత్యమైన సుస్వర గానముతో నిరంతరము త్యాగరాజ సన్నుత (సు) "

అని ముగించాడు కృష్ణ భిక్షు.


"చాలా బావుంది అన్నా, నువ్వు పాడుతుంటే గుడిలో దేవుడి ముందు కూచున్నట్టు ఉంది"

"భగవాన్ ముందు కూచున్నట్టు లేదూ?"

"అదే సరైన ఉపమానం. కానీ నాదో సందేహం?"

"చెప్పు?"

"సకల లోకులకు భృత్యుడై అని పాడావు కదా అన్నా. కానీ భగవాన్ నమ్మేదీ చెప్పేదీ సర్వ సమత్వం కదా?, ఇంక భృత్యత్వం ఎక్కడ?"

"మంచి పాయింటే పట్టావే, సరే, ఆలోచించనీ" అని వెళ్ళిపోయాడు కృష్ణభిక్షు.


మరుసటి రోజు మధ్యాన్నం భోజనం చేసి వెళుతున్న కృష్ణభిక్షు దగ్గరికి "అన్నా, ఒకసారి మాట్లాడాలి" అని వొచ్చింది నాగమ్మ. ఇద్దరూ వెళ్ళి మర్రిచెట్టు కింద కూచున్నారు.

"అన్నా, పొద్దున్న ఇక్కడ కూచుని రాసుకుంటుంటే భగవాన్ వచ్చి పలకరించారు. ఏమి రాస్తున్నావు అని అడిగితే నిన్న నువ్వు చెప్పిన త్యాగరాజ కృతి చెప్పాను. అందులో నిన్న నిన్ను అడిగిన విషయం, సకల లోకులకు భృత్యుడై, అనే దాని గురించి అడిగాను. దయాపూర్ణులైన భగవాన్ చిరునవ్వుతో అందరికీ భృత్యుడైతే అహంకారం అణుగుతుంది. అప్పుడు సర్వ సమత్వ భావం వస్తుంది అని అన్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ పాటకెల్లా ముఖ్యమైన పదం నిత్యమైన సుస్వర గానం అన్నారు. సుస్వర గానం అంటే రాగ లయ బద్ధంగా ఉండే పాట కాదు. ప్రపంచం అంతట్లోకీ సుస్వరం ఏదంటే స్వరం ఉండటాన్నీ, లేకుండటాన్నీ దాటి నిలిచే నిత్యమైన ఆత్మ స్వరం, అదే స్వస్వరం. దాన్ని పట్టుకుంటే వచ్చేది నిరంతర ఆనంద గాన ప్రవాహమే. అది పట్టుకున్నవాడే సుఖి " అని బాష్ప పూర్ణ నేత్రాలతో గద్గద కంఠంతో చెబుతున్న నాగమ్మ మాటలని విని పరమానంద భరితుడయ్యాడు కృష్ణభిక్షు.


                             - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday, 28 May 2022

హృద్భాంతం

అప్పటికి ఇంకా తెల్లవారలేదు. రమణాశ్రమంలో ఉన్న రెండు మూడు గుడిసెలలో ఉన్న కొద్దిమందీ తమ పనులు తాము చేసుకుంటున్నారు. వంటగదిలో ఇడ్లీ పిండి రుబ్బుతున్నారు. భగవాన్ దగ్గరగా ఉండి ఇడ్లీలలోకి అన్నీ సరిగా పడ్డాయోలేదో చూస్తున్నారు. ఇంతలో అణ్ణామలై స్వామి వచ్చి వేదపారాయణకి సమయం అయినది అని చెప్పాడు. భగవాన్ లేచివెళ్ళబోతూ "మనకి కాకుండా ఒక పది ఇడ్లీలు ఎక్కువగా చెయ్యండి" అని వెళ్ళిపోయారు. ఇడ్లీలు చేస్తున్న రాజయ్యర్ నవ్వుతూ "ఇవ్వాళ్ళ మనకి వచ్చే అతిథి ఎవరో సరిగ్గా చెప్పిన వాళ్ళకి బహుమానం" అన్నాడు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల పేర్లు చెప్పారు. ఇంతలో పొడుగ్గా, ఎర్రగా ఉన్న వ్యక్తి గబగబా నడుచుకుంటూ వచ్చి "అభిషేకానికి పాలుకావాలి అంటున్నారు" అన్నాడు. వెంటనే "కృష్ణ భిక్షూ, ఇప్పుడే వచ్చావా? పది ఇడ్లీలు నీలెక్కలో వేశాము" అన్నాడు రాజయ్యర్. "పది కాకపోతే ఇరవై వెయ్యండి. నీ ఇడ్లీలు బావుంటాయిగా" అన్నాడా వ్యక్తి.

“అలా కుదరదు, అలా అయితే భగవాన్ పదే అని చెప్పరు" అంటూ అభిషేకం పాలు ఇచ్చాడు రాజయ్యర్. "సరే, పదిటితో సరిపెట్టుకుంటాను ఈసారికి" అని  ఆ వ్యక్తి నిష్క్రమించాడు.

ఆ వ్యక్తి పేరు ఓరుగంటి వెంకట కృష్ణయ్య. ఆయన్ని అందరూ "కృష్ణ భిక్షు" అని "కిష్టయ్య" అని కూడా పిలుస్తారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన ఆ పని పెద్దగా చేయలేదు. ఆయన ప్రవృత్తి మట్టుక్కు దైవ సంబంధమైనదే. అందుకని గుళ్ళూ గోపురాలు తిరగటమూ, సత్పురుష దర్శనమూ ఆయన దిన చర్య. త్యాగరాజ కీర్తనలు పాడుకోవటమూ, గాయత్రి జపం చెయ్యటమూ ఆయన అలా తిరిగేటప్పుడు చేసే పనులు. గణపతిముని శిష్యులైన కొంత కాలం తర్వాత ముని తనతో బాటు భగవాన్ దగ్గరకు తీసుకువొస్తే అప్పటి నుంచీ ఏం చేసినా, ఎక్కడ తిరిగినా, భగవాన్‌కి అంకితమైపోయిన వ్యక్తి.

ఆ కిష్టయ్య తీరిక దొరికినప్పుడల్లా, కోర్టుకి శెలవలు వచ్చినప్పుడల్లా ఆశ్రమానికి వచ్చేసేవాడు. ఎన్ని రోజులు వీలైతే అన్నిరోజులు ఆశ్రమంలో ఉండిపోయేవాడు. బ్రహ్మచారిగా ఉండబట్టి ఎవరికీ ఏ చిక్కూ లేకుండా ఉండేది.

ఆ రోజు సాయంత్రమైంది. బయట ఊళ్ళ నించి వచ్చిన కొద్దిమంది భక్తులు ఊళ్ళోకి వెళ్ళారు. ఆశ్రమంలోని కొద్దిమంది భక్తులు మిగిలారు. అజ్ఞాని మనస్సులోని తమస్సు లాగా చీకట్లు నిండాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని అందరూ భగవాన్ కూచున్న మంచం చుట్టూ చేరారు. గురువు యొక్క కరుణారసభరితమైన చూపుల లాగా ఆకాశంలోని చంద్రునికిరణాలు అందరినీ ముంచెత్తుతున్నాయి. ఇంక చుట్టూ చేరిన కొద్దిమంది మెల్లిగా ఒకరి తరవాత ఒకరు వారి వ్యక్తిగత జీవిత ప్రశ్నలూ, సాధనలో వచ్చే సందేహాలూ ఇలా ఏదో ఒకటి అడగడం మొదలెట్టారు. కొంతమంది తాము భగవాన్ మీద రాసిన గీతాలో, స్తోత్రాలో, కవిత్వమో చదువుతున్నారు. కాసేపు గడిచింది. కృష్ణ భిక్షు ఒక్కడే ఏమీ మాట్లాడకుండా భగవాన్ని చూస్తూ కూచున్నాడు. ఇంతలో రామనాథ బ్రహ్మచారి నవ్వుతూ "కిష్టయ్యా, నీకు పాటలూ, పద్యాలూ చాలా వచ్చు కదా, ఇవాళ్ళ పొద్దుణ్ణించీ రాత్రి దాకా ఏమీ చెప్పలేదు నువ్వు" అన్నాడు. కిష్టయ్య ఏమీ మాట్లాడలేదు. రాత్రి అయ్యింది, అందరూ నిద్దర్లు పోయారు.

తెల్లారేటప్పటికి ఊళ్ళోంచి శాంతమ్మా, సూరి నాగమ్మలాంటి వాళ్ళు అందరూ గుంపుగా వచ్చారు. భర్తనీ, తల్లితండ్రులనీ పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నాగమ్మ భగవాన్ సందర్శనంతో కొత్తమనిషి అయ్యి రమణాశ్రమంలో జరిగేవి అన్నీ లేఖలుగా రాస్తున్నదని అందరికీ తెలుసు. నాగమ్మ భగవాన్ దర్శనం చేసుకుని హాలు బయట ఉన్న చెట్టు కిందకూచుని ఏదో రాసుకుంటోంది. ఇంతలో కృష్ణభిక్షు అటువెళుతూ నాగమ్మ దగ్గరికి వచ్చి "ఏమ్మా, ఎలా వున్నావు?" అనిపలకరించాడు. "భగవాన్ దయ వల్ల అంతా కుశలమే, రా, ఇటు కూచో అన్నా" అని నాగమ్మ అంటే ఆ చెట్టుకిందే కూచున్నాడు కృష్ణభిక్షు. కాసేపు వివిధ విషయాల మీద మాట్లాడుకున్న తరవాత నాగమ్మ "అన్నా, మీకు త్యాగరాయకృతులు చాలా వచ్చుట కదా, భగవాన్ ముందు ఎప్పుడూ పాడరేమి?" అన్నది. కృష్ణభిక్షు నవ్వుతూ "అమ్మా, భగవాన్దగ్గర అన్నింటిలో మా ఇంట్లో ఉన్నట్టే ఉంటాను. కానీ ఆయన ముందు ఈ పాటలే నోరు పెగలవు" అన్నాడు. "ఇప్పుడు నా దగ్గర ఒక పాట పాడకూడదూ?" అని అడిగిన నాగమ్మతో "కావాలంటే నీకు పాట చెబుతాను" అన్నాడు. నాగమ్మ ఒప్పుకుని చేసిన విన్నపాన్ని మన్నించి కృష్ణభిక్షు పాట మొదలెట్టాడు.

 

పల్లవి:

భజరే భజ మానస రామం(భ)


అనుపల్లవి:

అజముఖ శుక వినుతం శుభ చరితం. (భ)

 

చరణం:

నిర్మిత లోకం నిర్జిత శోకం

పాలిత మునిజన మధునా నృప పాకం (భ)

 

శంకర మిత్రం శ్యామల గాత్రం

కింకర జనగణ తాపత్రయ తమోమిత్రం. (భ)

 

భూసమ శాంతం భూజా కాంతం

వారమఖిలదం త్యాగరాజ హృద్భాంతం (భ)


అని చెప్పాడు. నాగమ్మ వెంటనే ఆ పాట రాసేసుకుంది.

 

"ఇందులో రామ తీసి రమణ అని పెడితే భగవాన్ మీద పాట అయ్యేలా ఉంది" అన్నది నాగమ్మ.

"అదికూడా అక్కర్లేదు ఎందుకంటే  భగవాన్ ఆత్మారాములు కదా ఇంకో విధంగా చూసినా రమయతీతి రామః కాబట్టి భగవాన్‌కి రామ శబ్దం వాడచ్చు. కానీ మొదటి చరణంలో నృప పాకం అంటే రాజకుమారుడు అన్నదీ, భూజా కాంతం అంటే భూదేవి కూతురి భర్తా అని చివరి చరణంలో ఉన్నవి పట్టిస్తాయి." అన్నాడు కృష్ణ భిక్షు.


ఈ లోపల ప్రతిరోజూ లాగే కాసేపు కొండ మీద తిరగటానికి బయలుదేరారు భగవాన్. అందరూ లేచి నిలుచున్నారు. నాగమ్మా కృష్ణ భిక్షు ఉన్న చోటికి వచ్చి ఆగారు. "ఏమిటీ ఆ రాసింది?" అని అడిగిన భగవాన్ కి త్యాగరాజ కృతి చదివి వినిపించింది. "భగవాన్‌కి  రామ శబ్దం వాడచ్చని ఎందుకు అనుకుంటున్నామో" అని వివరించింది నాగమ్మ. "రమణుడు కూడా రాముడే , నిజానికి ఉన్నది అంతా రాముడే, వేరే ఏమీ లేదు" అన్నారు భగవాన్. అని బయలుదేరేంతలో నాగమ్మ సభక్తికంగా "ఒక రెండు మాటలకి అర్థం కుదరటల్లేదు" అన్నది. "చెప్పు" అన్నట్టు సైగచేసిన భగవాన్‌కి "నృప పాకం, భూజా కాంతం" అనే మాటలు చెప్పింది నాగమ్మ. క్షణకాలం ఆలోచించి "అరుణాచలేశ్వరుడు ఈ ఊరి మహారాజు. మనమంతా ఆయన పిల్లలం కాబట్టి అందరమూ రాజ కుమారులమే, రాజకుమారికలమే. ఇక భూజ అంటే చెట్టు  అని  కూడా అర్థం చెప్పచ్చు. అప్పుడు చెట్టుకి అధిపతి ఎవరో వాడు భూజాకాంతుడు. ఇన్ని చెట్లున్నయ్యి ఇక్కడ. మనమందరమూ భూజాకాంతులమే. ఆ కృతి మొదట్లో రామ తీసి కృష్ణపెడితే పాటమొత్తం మన కృష్ణ భిక్షుది అయిపోతుంది.ఎర్రగా  బుర్రగా వుంటాడు కాబట్టి రాజకుమారుడి వేషానికిపనికివస్తాడు"అని నవ్వుతూ వెళ్ళిపోయారు భగవాన్.

"భగవాన్ మీద పాటలాగా వుంది అని మనం అనుకుంటే అది నా మీదకి తోసి తప్పించుకుని ఎలా వెళ్ళిపోతున్నారో చూడమ్మా" అంటూ భగవాన్ మీద ఆరోపణ చేస్తున్న లాయరు కృష్ణభిక్షు గారిని చూసి నాగమ్మ ఫక్కున నవ్వింది. అలా భక్తులతో క్రీడించే భగవాన్ మనల్ని కాపాడు గాక.


                            - జొన్నలగడ్డ సౌదామిని.

Sunday, 15 May 2022

కల్ల

రాత్రి అయ్యింది. శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. త్యాగరాజస్వామి అయ్యవారు, రామ  ప్రభువు తన చిన్నప్పుడు కలలో కనిపించిన సంగతి చెబుతున్నారు. "ఆ రోజు రాత్రి జపం చేసి పడుకున్నానో, లేదో నిద్ర పట్టింది. అప్పుడు కల వచ్చింది. ఆకలలో ప్రభువు దర్బారులో సీతమ్మా, తమ్ముళ్ళూ అందరూ చుట్టూ నిలిచి  సేవిస్తున్నారు. భరతుడు చామరంవీస్తున్నాడు. ప్రభువు ఎదురుగ్గా స్త్రీలు నాట్యం చేస్తున్నారు.  నేను మెల్లిగా వెళ్ళి ప్రభువుకి పాదసంవాహనం చేస్తున్నాను. ప్రభువు దయ తలిచి తన తల నా వైపు తిప్పి చూస్తే కదులుతున్న చామరం ఆయన దృష్టికి అడ్డం వొచ్చింది. తన చేతితోకదిలే ఆ చామరాన్ని పట్టుకుని నిలిపి  నేను నీ వరదుణ్ణి అని చెప్పి అంతతో ఆగకుండా, ఇంత జపం చెయ్యి నీకుప్రత్యక్షమై అనుగ్రహిస్తాను అన్నారు. ఎలాగొలా  జపం పూర్తి అయ్యింది కానీ ప్రభువు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఏమి తప్పుచేశానో ఏమో?" అని దిగాలుగా అన్నారు అయ్యవారు. 


శిష్యులు ఊ కొడుతూ వింటున్నారు. వారందరూ ఆ కథ వినటం వందోసారో, వెయ్యోసారో. అయినా ఆ కథలోని భక్తి భావానికి ముగ్ధులవటం వల్లో, అయ్యవారి మీద తమకి ఉన్న భక్తివిశేషం వల్లో అందరూ ఆ కథ సభక్తికంగా వింటూ కాళ్ళు పడుతూ, విసనకర్ర వీస్తూ గురు శుశ్రూష చేస్తున్నారు. అయ్యవారు కాసేపు  ఆగి "ఇంత జపం చేసిన తరవాత కనిపిస్తానన్న స్వామి, ఆ జపం పూర్తి అయ్యి ఇన్ని రోజులైనా కనిపించడు చూడు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తంజావూరు రామారావు మెల్లిగా "కనిపిస్తాడు, ఎందుకు కనిపించడూ?. ఇంత మంది భక్తులకి కనిపించినవాడు మీకు ఎందుకు కనిపించడు?." అంటూ సర్దుకునే మాటలు చెప్పాడు. ఆ మాటలు వింటూ అయ్యవారూ, శిష్యులూ నిద్రించారు.

 

పొద్దున్న లేచారే కానీ అయ్యవారికి మాత్రం స్వామి ఇంకా కనిపించలేదన్న బాధ పోలేదు. అలా రాత్రి అయ్యింది. రాత్రిపూజ కాగానే పాట దగ్గరకి రాగానే అయ్యవారి హృదయంలో ఉన్న బాధ అంతా బయటపడింది. సభక్తికంగా, రామప్రభువు మీద చిన్ననాటి మాట మరిచిపోయాడనే నెపం పెడుతూ కీర్తన పాడటం మొదలెట్టారు.

 

పల్లవి:

నాటి మాట మరచితివో ఓ రామ చిన్న (నా)

 

అనుపల్లవి:

మాటి మాటికి నాపై మన్నన జేయుచు

ఏటికి యోచన ఈ భాగ్యము నీదను. (నా)

 

చరణం:

తరుణుల బాగు నర్తనములు జూచు వేళ

చరణములని గని నే కరగుచు సేవింప

భరతుని కరచామరమును నిల్పుచు

కరుణను త్యాగరాజ వరదుడనని పల్కిన (నా)

 

అని పాట ముగిసింది. అయ్యవారు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు.

నిద్రలో అయ్యవారికి కల వచ్చింది. కలలో, మెరుపుతో  కూడిన మేఘం లాగా. సీతమ్మ తో ఉన్న రామ ప్రభువు సాక్షాత్కరించాడు. "త్యాగయ్యా, రాబోయే పున్నమినాడు మీ ఇంటికి వొస్తాను" అని కలలో రామప్రభువు చెప్పటం విని అయ్యవారు ప్రభూ అంటూ రాములవారి పాదాలు పట్టుకున్నారు. ఇంతలో ఆయనకు మెలకువ వచ్చింది. కలలో రామప్రభువు చెప్పిన మాటకి ఆయన మహదానందభరితుడు అయ్యారు. వెంటనే శిష్యులని పిలిచారు.



నాలుగు రోజుల్లో రానున్న పున్నమి నాడు రామప్రభువు వొస్తానని కలలో చెప్పి రెండురోజులైంది. అప్పటి నించీ శిష్యులకినిద్రాహారాలు లేవు. ఇల్లంతా హడావిడిగా కలియ తిరుగుతూ, పనులు పురమాయిస్తూ, అవి సరిగ్గా అయినవా, లేదాఅని చూస్తూ, ఇంకా ఏమి చెయ్యాలా అని ఆలోచించే అయ్యవారికి తీరికేలేదు.

ఇంతలో పున్నమి రానే వొచ్చింది.  చంద్రుడి కోసం వేచి ఉండే చకోరం లాగా, రామ ప్రభువు కోసం అయ్యవారు వేచిఉన్నారు. మధ్యాహ్నం అయ్యింది. అయ్యవారు ఎవరి కోసం వేచి చూస్తున్నారో, ఆ రాముడు రాలేదు. శిష్యులూ, ఊరిలోనించి వచ్చిన వారూ అందరూ తృప్తిగా భోజనం చేసి వెళుతున్నారు కానీ రాముడు రాలేదు. సాయంత్రం అయ్యింది. రాత్రి అయ్యింది. ఇంకా రాములవారు వొస్తారేమో అనే మినుకు మినుకు మనే చిన్ని ఆశతో వేచి చూస్తూ అయ్యవారు తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోయారు.

తెల్లవారింది. అయ్యవారు స్నానం చేసి రాముల వారి మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఆయనకి పట్టరాని దుఃఖంకలిగింది. ఆ దుఃఖం పాటై ప్రవహించింది. చాలా అబద్ధాలు చెబితే ఏమి సుఖము అంటూ రాముణ్ణి నిలదీస్తూ ఆపాట సాగింది.

 

పల్లవి:

చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా( చా)

 

అనుపల్లవి:

కాలము పోను మాట నిలుచును

కల్యాణ రామ నాతో (చా)

 

చరణం:

తల్లి తండ్రి నేనుండ తక్కిన భయమేలరాయని

పలుమారు నీవెంతో బాసలు చేసి

ఇలలో సరి వారలలో ఎంతో బ్రోచుచుండి

పెద్దలతో పల్కి మెప్పించి త్యాగరాజునితో (చా)

 

అంటూ భావావేశంతో, తాదాత్మ్యతతో పాడారు అయ్యవారు. చిన్నప్పుడు కనిపిస్తానని చెప్పడమూ, నాలుగు రోజుల కిందకలలో పున్నమి నాడు వొస్తానని మాట ఇవ్వడమూ, పున్నమినాడు రాక పోవటమూ ఇవి అన్నీ కలిసి ఆయన మనస్సుని కలిచివేశాయి. మౌనంగా ఉన్న ఆయనని మాట్లాడించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. సాయంత్రం అయ్యింది. శిష్యులే ఎలాగొలా పూజ పూర్తి చేశారు. రాత్రి అయ్యింది. అందరూ నిద్రిస్తున్నారు. అయ్యవారికి కూడా మాగన్నుగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో అయ్యవారికి కోదండధారి అయిన మెరుపు చెంగటనున్న మేఘం లాంటి రామయ్య కనిపించాడు. "త్యాగయ్యా, నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్న మధ్యాహ్నం మీ ఇంటికి వొచ్చాము. సీత ముచ్చట పడింది అని మావనవాసంలో వేసుకున్న చెంచు వేషాల్లో వొచ్చాము. మీ శిష్యులు తరవాత రమ్మని పక్కకి తోసేశారు కదా. ఏమిచెయ్యనూ?" అని కలలో రామయ్య ప్రశ్నవేసి అదృశ్యం అయ్యాడు.

అయ్యవారికి మెలుకువ వొచ్చింది. కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఇంటికి వచ్చిన రామప్రభువుకి ఇంత అన్నం పెట్టలేదు సరికదా, ఇంట్లోకే రానివ్వలేదే అని ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో తంజావూరు రామారావు లేచి అయ్యవారి దగ్గరకు వచ్చాడు. అయ్యవారి పరిస్థితి చూసి క్షణంలో శిష్యులని లేపాడు. చుట్టూ చేరిన శిష్యులని చూసి అయ్యవారు మెల్లిగా "నిన్న మధ్యాహ్నం భోజనాలకి చెంచువాళ్ళు ఎవరన్నా వొచ్చారా?" అని అడిగారు. కుప్పుఅయ్యరు ముందుకు వొచ్చి, "ఒక చెంచువాళ్ళ జంట మధ్యాహ్నం భోజనాలకి వొచ్చారు. వాళ్ళువొచ్చిన సమయానికే తంజావూరు ఆస్థాన మంత్రి గారైన రామయ్యర్ గారు, ఆయన సిబ్బంది వొచ్చారు. అందుకని నేనే ఆ చెంచువారిని తరువాత రమ్మన్నాను." అన్నాడు.

అయ్యవారు తల కొట్టుకున్నారు. "కుప్పూ, ఆ వొచ్చినది రామయ్యా, సీతమ్మా. ఆ వేషంలో వొచ్చారు. వారు ఇంట్లోకి కూడారాలేదు, చూడు" అంటూ విషణ్ణ వదనంతో కూచున్నారు అయ్యవారు. ఇంతలో ఆ రోజున రాసిన కృతి గుర్తుకు వొచ్చి ఆయన చాల క్షుభితుడు అయ్యాడు. సత్యాన్నే పట్టుకుని స్థిరంగా నిలబడిన రాముడి మీద  చాలా అబద్ధాలు ఆడావు అని కీర్తన రాయడం ఆయన మనసుకి చాలా కష్టం కలిగించింది. భోజనమూ పెట్టలేదు, పైగా అబద్ధాల కోరు అని రాముడిని తిట్టానని ఆయన చాలా దుఃఖించారు. ఇంత దుడుకుగా ప్రవర్తించిన తనని ఎవరు రక్షిస్తారు అని వితర్కించుకున్నారు అయ్యవారు. వెంటనే  గౌళ రాగంలో కృతి ప్రవాహం మొదలైంది

 

పల్లవి:

దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో (దుడుకు)

 

అనుపల్లవి:

కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు (దుడుకు)

 

చరణాలు:

శ్రీవనితా హృత్కుముదాబ్జ, అవాఙ్మానసగోచర (దు)


సకభూతముల యందు నీవై యుండగా మదిలేక పోయిన (దు)

 

చిఱుతప్రాయములనాడే, భజనామృత రసవిహీన కుతర్కుడైన (దు)

 

పరధనముల కొఱకు నొరుల మది కరగబలికి కడుపునింప తిరిగినట్టి (దు)

 

తన మదిని భువిని సౌఖ్యపు జీవనమె యనుచు సదా దినములు గడిపే(దు)

 

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమవుట కువదిశించి, సంతసిల్లి స్వరలయంబు లెఱుంగకనుశిలాత్ములై సుభక్తులకు సమానమను (దు)

 

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేవామిత ధనాదులను, దేవాదిదేవ నెర నమ్మితి గాకనునీ పదాబ్జ భజనంబు మఱచిన( దు)

 

చక్కని ముఖకమలంబును సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనులకోరి పరితాపములచేదగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధినయి, చపలచిత్తుడనైన (దు)

 

మానవతను దుర్లభమనుచు నెంచి పరమానంద మొందలేక, మదమత్సర కామలోభమోహాలకు దాసుడయి మోసబోతిగాక, మొదటి కులజుడగుచు భువివి శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక, నరాధములును రోయ రసవిహీన మయినను సాధింప తారుమారు (దు)

 

సతులకు కొన్నాళ్ళాస్తికై,సుతులకై, కొన్నాళ్ళు,

ధనతతులకై తిరిగితినయ్య, త్యాగరాజాప్త ఇటువంటి (దు)


అంటూ తనయందు నైచ్యానుసంధానం చేసుకుంటూ పెద్ద పాట పాడినా అయ్యవారు ఆ దుఃఖభారంలో నుంచి బయటకి రాలేదు.

రోజులు గడుస్తున్నాయి, కానీ అయ్యవారికి దుఃఖం అయితే తగ్గలేదు. "మాట మరవని దాశరథిది తప్పులేదనీ, కానీ భగవంతుణ్ణి కల్లలాడేవాడు అని అన్న తనదే పూర్తిగా  తప్పు" అనీ శిష్యులతో అంటూ ఉండేవారు అయ్యవారు.

తరవాత వొచ్చిన  పూర్ణిమనాడు చంద్రగ్రహణం వొచ్చింది. అదీ తెల్లవారుఝామున వొచ్చింది. ఎవరు లేస్తారు?. అయ్యవారు ఒక్కరే  లేచి పట్టు స్నానం చేసి జపం చేస్తూ కూచున్నారు. విడుపు పూర్తి అయ్యింది. లేద్దాము అనుకునేంతలో చంద్రమండలమే కిందికి దిగివచ్చిందా అన్నట్టుగా ఉన్న మోముతో రామచంద్రప్రభువు నిలబడి ఉన్నాడు. పక్కనే సీతమ్మ.



అయ్యవారు ఆ దంపతుల పాదాలు పట్టుకుని తన కన్నీళ్ళతో వారి కాళ్ళు కడిగారు. "మీరు స్వయంగా వొచ్చినా గ్రహించనివాణ్ణి, గ్రహించకుండా, పైపెచ్చు మీరు అబద్ధాలు ఆడతారని అంటూ కృతి రాసిన వాణ్ణి, నన్ను క్షమించుప్రభూ" అంటూ  ప్రభువు పాదాలు వొదలకుండా పట్టుకున్నారు అయ్యవారు. రామ ప్రభువు చెయ్యిపట్టి అయ్యవారిని లేపుతూ "త్యాగయ్యా, భక్తితో రాసిన ఏ కీర్తనలైనా మనోహరాలే. అందులో భక్తిలో ముణిగి రాసిన నీకీర్తనలు అన్నీ మరీమనోహరమైనవి. వాటిల్లో నీ భక్తి పూర్తిగా నిండి ఉంటుంది. చాల కల్లలాడ అంటూ నువ్వు రాసిన కృతి కూడా నాకు మధురమూ, మనోహరమూ. ఎందుకంటే దాని వెనుక ఉన్నది అకలంకమైన నీ భక్తీ, అంతులేని నీ ఆర్తీ కనక. భవిష్యత్తులో ఆ కృతిని సంగీత విద్వాంసులు తరతరాలు పాడి తరిస్తారు." అని అదృశ్యమయ్యారు.

మరునాటి పొద్దున్న దుఃఖాన్ని అంతా మరచి ఉత్సాహంగా ఉన్న గురువు గారిని చూసి శిష్యులు అంతా సంతోషించారు. సంతోషాన్ని పట్టలేని శిష్యుడొకడు "ఇంతకీ దుఃఖం వొదిలి ఆనందంగా ఉన్నారా?" అని ప్రశ్నిస్తే అయ్యవారు పట్టరాని సంతోషంతో

 

పల్లవి:

ఇంతకన్నానందమేమి ఓ రామ రామ

 

అనుపల్లవి:

సంత జనులకెల్ల సమ్మతియైయుండు కాని (ఇ)

 

చరణాలు:

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా

వేడుచు మనసున కూడియుండుట చాలు (ఇ)

 

శ్రీ హరి కీర్తనచే దేహాది ఇంద్రియ

సమూహముల మరచి సోహమైనదే చాలు (ఇ)

 

నీ జపములు వేళనీ జగములు నీవై

రాజిల్లునయ త్యాగరాజ నుత చరిత్ర (ఇ)

 

అంటూ ఆనందిస్తూ పాడారు.


                    - జొన్నలగడ్డ సౌదామిని

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...