Sunday 15 May 2022

కల్ల

రాత్రి అయ్యింది. శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. త్యాగరాజస్వామి అయ్యవారు, రామ  ప్రభువు తన చిన్నప్పుడు కలలో కనిపించిన సంగతి చెబుతున్నారు. " రోజు రాత్రి జపం చేసి పడుకున్నానో, లేదో నిద్ర పట్టిందిఅప్పుడు కల వచ్చిందిఆకలలో ప్రభువు దర్బారులో సీతమ్మా, తమ్ముళ్ళూ అందరూ చుట్టూ నిలిచి  సేవిస్తున్నారు. భరతుడు చామరంవీస్తున్నాడు. ప్రభువు ఎదురుగ్గా స్త్రీలు నాట్యం చేస్తున్నారు.  నేను మెల్లిగా వెళ్ళి ప్రభువుకి పాదసంవాహనం చేస్తున్నాను. ప్రభువు దయ తలిచి తన తల నా వైపు తిప్పి చూస్తే కదులుతున్న చామరం ఆయన దృష్టికి అడ్డం వొచ్చింది. తన చేతితోకదిలే చామరాన్ని పట్టుకుని నిలిపి  నేను నీ వరదుణ్ణి అని చెప్పి అంతతో ఆగకుండా, ఇంత జపం చెయ్యి నీకుప్రత్యక్షమై అనుగ్రహిస్తాను అన్నారు. ఎలాగొలా  జపం పూర్తి అయ్యింది కానీ ప్రభువు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఏమి తప్పుచేశానో ఏమో?" అని దిగాలుగా అన్నారు అయ్యవారు


శిష్యులు కొడుతూ వింటున్నారు. వారందరూ కథ వినటం వందోసారో, వెయ్యోసారో. అయినా కథలోని భక్తి భావానికి ముగ్ధులవటం వల్లో, అయ్యవారి మీద తమకి ఉన్న భక్తివిశేషం వల్లో అందరూ కథ సభక్తికంగా వింటూ కాళ్ళు పడుతూ, విసనకర్ర వీస్తూ గురు శుశ్రూష చేస్తున్నారు. అయ్యవారు కాసేపు  ఆగి "ఇంత జపం చేసిన తరవాత కనిపిస్తానన్న స్వామి, జపం పూర్తి అయ్యి ఇన్ని రోజులైనా కనిపించడు చూడు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తంజావూరు రామారావు మెల్లిగా "కనిపిస్తాడు, ఎందుకు కనిపించడూ?. ఇంత మంది భక్తులకి కనిపించినవాడు మీకు ఎందుకు కనిపించడు?." అంటూ సర్దుకునే మాటలు చెప్పాడు. మాటలు వింటూ అయ్యవారూ, శిష్యులూ నిద్రించారు.

 

పొద్దున్న లేచారే కానీ అయ్యవారికి మాత్రం స్వామి ఇంకా కనిపించలేదన్న బాధ పోలేదు. అలా రాత్రి అయ్యింది. రాత్రిపూజ కాగానే పాట దగ్గరకి రాగానే అయ్యవారి హృదయంలో ఉన్న బాధ అంతా బయటపడింది. సభక్తికంగా, రామప్రభువు మీద చిన్ననాటి మాట మరిచిపోయాడనే నెపం పెడుతూ కీర్తన పాడటం మొదలెట్టారు.

 

పల్లవి:

నాటి మాట మరచితివో రామ చిన్న (నా)

 

అనుపల్లవి:

మాటి మాటికి నాపై మన్నన జేయుచు

ఏటికి యోచన భాగ్యము నీదను. (నా)

 

చరణం:

తరుణుల బాగు నర్తనములు జూచు వేళ

చరణములని గని నే కరగుచు సేవింప

భరతుని కరచామరమును నిల్పుచు

కరుణను త్యాగరాజ వరదుడనని పల్కిన (నా)

 

అని పాట ముగిసింది. అయ్యవారు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు.

నిద్రలో అయ్యవారికి కల వచ్చింది. కలలో, మెరుపుతో  కూడిన మేఘం లాగా. సీతమ్మ తో ఉన్న రామ ప్రభువు సాక్షాత్కరించాడు. "త్యాగయ్యా, రాబోయే పున్నమినాడు మీ ఇంటికి వొస్తాను" అని కలలో రామప్రభువు చెప్పటం విని అయ్యవారు ప్రభూ అంటూ రాములవారి పాదాలు పట్టుకున్నారు. ఇంతలో ఆయనకు మెలకువ వచ్చింది. కలలో రామప్రభువు చెప్పిన మాటకి ఆయన మహదానందభరితుడు అయ్యారు. వెంటనే శిష్యులని పిలిచారు.



నాలుగు రోజుల్లో రానున్న పున్నమి నాడు రామప్రభువు వొస్తానని కలలో చెప్పి రెండురోజులైంది. అప్పటి నించీ శిష్యులకినిద్రాహారాలు లేవు. ఇల్లంతా హడావిడిగా కలియ తిరుగుతూ, పనులు పురమాయిస్తూ, అవి సరిగ్గా అయినవా, లేదాఅని చూస్తూ, ఇంకా ఏమి చెయ్యాలా అని ఆలోచించే అయ్యవారికి తీరికేలేదు.

ఇంతలో పున్నమి రానే వొచ్చింది.  చంద్రుడి కోసం వేచి ఉండే చకోరం లాగా, రామ ప్రభువు కోసం అయ్యవారు వేచిఉన్నారు. మధ్యాహ్నం అయ్యింది. అయ్యవారు ఎవరి కోసం వేచి చూస్తున్నారో, రాముడు రాలేదు. శిష్యులూ, ఊరిలోనించి వచ్చిన వారూ అందరూ తృప్తిగా భోజనం చేసి వెళుతున్నారు కానీ రాముడు రాలేదు. సాయంత్రం అయ్యింది. రాత్రి అయ్యింది. ఇంకా రాములవారు వొస్తారేమో అనే మినుకు మినుకు మనే చిన్ని ఆశతో వేచి చూస్తూ అయ్యవారు తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోయారు.

తెల్లవారింది. అయ్యవారు స్నానం చేసి రాముల వారి మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఆయనకి పట్టరాని దుఃఖంకలిగింది. దుఃఖం పాటై ప్రవహించింది. చాలా అబద్ధాలు చెబితే ఏమి సుఖము అంటూ రాముణ్ణి నిలదీస్తూ ఆపాట సాగింది.

 

ల్లవి:

చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా( చా)

 

అనుపల్లవి:

కాలము పోను మాట నిలుచును

కల్యాణ రామ నాతో (చా)

 

చరణం:

తల్లి తండ్రి నేనుండ తక్కిన భయమేలరాయని

పలుమారు నీవెంతో బాసలు చేసి

ఇలలో సరి వారలలో ఎంతో బ్రోచుచుండి

పెద్దలతో పల్కి మెప్పించి త్యాగరాజునితో (చా)

 

అంటూ భావావేశంతో, తాదాత్మ్యతతో పాడారు అయ్యవారు. చిన్నప్పుడు కనిపిస్తానని చెప్పడమూ, నాలుగు రోజుల కిందకలలో పున్నమి నాడు వొస్తానని మాట ఇవ్వడమూ, పున్నమినాడు రాక పోవటమూ ఇవి అన్నీ కలిసి ఆయన మనస్సుని కలిచివేశాయి. మౌనంగా ఉన్న ఆయనని మాట్లాడించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. సాయంత్రం అయ్యింది. శిష్యులే ఎలాగొలా పూజ పూర్తి చేశారు. రాత్రి అయ్యింది. అందరూ నిద్రిస్తున్నారు. అయ్యవారికి కూడా మాగన్నుగా నిద్ర పట్టింది. నిద్రలో అయ్యవారికి కోదండధారి అయిన మెరుపు చెంగటనున్న మేఘం లాంటి రామయ్య కనిపించాడు. "త్యాగయ్యా, నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్న మధ్యాహ్నం మీ ఇంటికి వొచ్చాము. సీత ముచ్చట పడింది అని మావనవాసంలో వేసుకున్న చెంచు వేషాల్లో వొచ్చాము. మీ శిష్యులు తరవాత రమ్మని పక్కకి తోసేశారు కదా. ఏమిచెయ్యనూ?" అని కలలో రామయ్య ప్రశ్నవేసి అదృశ్యం అయ్యాడు.

అయ్యవారికి మెలుకువ వొచ్చింది. కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఇంటికి వచ్చిన రామప్రభువుకి ఇంత అన్నం పెట్టలేదు సరికదా, ఇంట్లోకే రానివ్వలేదే అని ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో తంజావూరు రామారావు లేచి అయ్యవారి దగ్గరకు వచ్చాడు. అయ్యవారి పరిస్థితి చూసి క్షణంలో శిష్యులని లేపాడు. చుట్టూ చేరిన శిష్యులని చూసి అయ్యవారు మెల్లిగా "నిన్న మధ్యాహ్నం భోజనాలకి చెంచువాళ్ళు ఎవరన్నా వొచ్చారా?" అని అడిగారు. కుప్పుఅయ్యరు ముందుకు వొచ్చి, "ఒక చెంచువాళ్ళ జంట మధ్యాహ్నం భోజనాలకి వొచ్చారు. వాళ్ళువొచ్చిన సమయానికే తంజావూరు ఆస్థాన మంత్రి గారైన రామయ్యర్ గారు, ఆయన సిబ్బంది వొచ్చారు. అందుకని నేనే ఆ చెంచువారిని తరువాత రమ్మన్నాను." అన్నాడు.

అయ్యవారు తల కొట్టుకున్నారు. "కుప్పూ, వొచ్చినది రామయ్యా, సీతమ్మా. ఆ వేషంలో వొచ్చారు. వారు ఇంట్లోకి కూడారాలేదు, చూడు" అంటూ విషణ్ణ వదనంతో కూచున్నారు అయ్యవారుఇంతలో రోజున రాసిన కృతి గుర్తుకు వొచ్చి ఆయన చాల క్షుభితుడు అయ్యాడు. సత్యాన్నే పట్టుకుని స్థిరంగా నిలబడిన రాముడి మీద  చాలా అబద్ధాలు ఆడావు అని కీర్తన రాయడం ఆయన మనసుకి చాలా కష్టం కలిగించింది. భోజనమూ పెట్టలేదు, పైగా అబద్ధాల కోరు అని రాముడిని తిట్టానని ఆయన చాలా దుఃఖించారు. ఇంత దుడుకుగా ప్రవర్తించిన తనని ఎవరు రక్షిస్తారు అని వితర్కించుకున్నారు అయ్యవారు. వెంటనే  గౌళ రాగంలో కృతి ప్రవాహం మొదలైంది

 

పల్లవి:

దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో (దుడుకు)

 

అనుపల్లవి:

కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు (దుడుకు)

 

చరణాలు:

శ్రీవనితా హృత్కుముదాబ్జ, అవాఙ్మానసగోచర (దు)


సకభూతముల యందు నీవై యుండగా మదిలేక పోయిన (దు)

 

చిఱుతప్రాయములనాడే, భజనామృత రసవిహీన కుతర్కుడైన (దు)

 

పరధనముల కొఱకు నొరుల మది కరగబలికి కడుపునింప తిరిగినట్టి (దు)

 

తన మదిని భువిని సౌఖ్యపు జీవనమె యనుచు సదా దినములు గడిపే(దు)

 

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమవుట కువదిశించిసంతసిల్లి స్వరలయంబు లెఱుంగకనుశిలాత్ములై సుభక్తులకు సమానమను (దు)

 

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేవామిత ధనాదులనుదేవాదిదేవ నెర నమ్మితి గాకనునీ పదాబ్జ భజనంబు మఱచిన( దు)

 

చక్కని ముఖకమలంబును సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనులకోరి పరితాపములచేదగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధినయి, చపలచిత్తుడనైన (దు)

 

మానవతను దుర్లభమనుచు నెంచి పరమానంద మొందలేకమదమత్సర కామలోభమోహాలకు దాసుడయి మోసబోతిగాకమొదటి కులజుడగుచు భువివి శూద్రుల పనులు సల్పుచునుంటిని గాకనరాధములును రోయ రసవిహీన మయినను సాధింప తారుమారు (దు)

 

సతులకు కొన్నాళ్ళాస్తికై,సుతులకై, కొన్నాళ్ళు,

ధనతతులకై తిరిగితినయ్య, త్యాగరాజాప్త ఇటువంటి (దు)


అంటూ తనయందు నైచ్యానుసంధానం చేసుకుంటూ పెద్ద పాట పాడినా అయ్యవారు దుఃఖభారంలో నుంచి బయటకి రాలేదు.

రోజులు గడుస్తున్నాయి, కానీ అయ్యవారికి దుఃఖం అయితే తగ్గలేదు. "మాట మరవని దాశరథిది తప్పులేదనీ, కానీ భగవంతుణ్ణి కల్లలాడేవాడు అని అన్న తనదే పూర్తిగా  తప్పు" అనీ శిష్యులతో అంటూ ఉండేవారు అయ్యవారు.

తరవాత వొచ్చిన  పూర్ణిమనాడు చంద్రగ్రహణం వొచ్చింది. అదీ తెల్లవారుఝామున వొచ్చింది. ఎవరు లేస్తారు?. అయ్యవారు ఒక్కరే  లేచి పట్టు స్నానం చేసి జపం చేస్తూ కూచున్నారు. విడుపు పూర్తి అయ్యింది. లేద్దాము అనుకునేంతలో చంద్రమండలమే కిందికి దిగివచ్చిందా అన్నట్టుగా ఉన్న మోముతో రామచంద్రప్రభువు నిలబడి ఉన్నాడు. పక్కనే సీతమ్మ.



అయ్యవారు దంపతుల పాదాలు పట్టుకుని తన కన్నీళ్ళతో వారి కాళ్ళు కడిగారు. "మీరు స్వయంగా వొచ్చినా గ్రహించనివాణ్ణి, గ్రహించకుండా, పైపెచ్చు మీరు అబద్ధాలు ఆడతారని అంటూ కృతి రాసిన వాణ్ణి, నన్ను క్షమించుప్రభూ" అంటూ  ప్రభువు పాదాలు వొదలకుండా పట్టుకున్నారు అయ్యవారు. రామ ప్రభువు చెయ్యిపట్టి అయ్యవారిని లేపుతూ "త్యాగయ్యా, భక్తితో రాసిన కీర్తనలైనా మనోహరాలే. అందులో భక్తిలో ముణిగి రాసిన నీకీర్తనలు అన్నీ మరీమనోహరమైనవి. వాటిల్లో నీ భక్తి పూర్తిగా నిండి ఉంటుంది. చాల కల్లలాడ అంటూ నువ్వు రాసిన కృతి కూడా నాకు మధురమూ, మనోహరమూ. ఎందుకంటే దాని వెనుక ఉన్నది అకలంకమైన నీ భక్తీ, అంతులేని నీ ఆర్తీ కనక. భవిష్యత్తులో కృతిని సంగీత విద్వాంసులు తరతరాలు పాడి తరిస్తారు." అని అదృశ్యమయ్యారు.

మరునాటి పొద్దున్న దుఃఖాన్ని అంతా మరచి ఉత్సాహంగా ఉన్న గురువు గారిని చూసి శిష్యులు అంతా సంతోషించారు. సంతోషాన్ని పట్టలేని శిష్యుడొకడు "ఇంతకీ దుఃఖం వొదిలి ఆనందంగా ఉన్నారా?" అని ప్రశ్నిస్తే అయ్యవారు పట్టరాని సంతోషంతో

 

పల్లవి:

ఇంతకన్నానందమేమి రామ రామ

 

అనుపల్లవి:

సంత జనులకెల్ల సమ్మతియైయుండు కాని ()

 

చరణాలు:

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా

వేడుచు మనసున కూడియుండుట చాలు ()

 

శ్రీ హరి కీర్తనచే దేహాది ఇంద్రియ

సమూహముల మరచి సోహమైనదే చాలు ()

 

నీ జపములు వేళనీ జగములు నీవై

రాజిల్లునయ త్యాగరాజ నుత చరిత్ర ()

 

అంటూ ఆనందిస్తూ పాడారు.


                    - జొన్నలగడ్డ సౌదామిని

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...