Saturday 7 May 2022

గీతార్థము

త్యాగరాజ స్వామి కంచి వెళ్ళారు. ఆయన శిష్య, ప్రశిష్యులు అందరూ ఆయనకి సేవ చేస్తూ, ఆయనని రకరకాల ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకుంటున్నారు. మరుసటి రోజు శిష్యసమేతంగా వరదరాజ పెరుమాళ్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడ, శిష్యుడైన వాలాజాపేట వెంకటరమణ భాగవతార్, ఇతర శిష్యులు ఆయన వెనకాలే ఉన్నారు. దర్శనం చేసి బయటికి వచ్చి బయట ఉన్న రావి చెట్టు కింద కూచున్నారు అయ్యవారు. రకరకాల మాటలు సాగుతున్నయ్యి.

అప్పుడు భాగవతార్ అన్నాడూ "అయ్యవారూ, సంగీతం వల్ల వచ్చే ముఖ్య  ఆనందం అనేది పాడేవాడికి కలిగేదా?, లేక పాటవినే సామాజికులకి కలిగేదా? అనే ప్రశ్న మీద మా విద్యార్థులందరమూ చాలాసార్లు చింతన చేశాము కానీ ఏకవాక్యం కుదరలేదు. నిజానికి ఈ ప్రశ్న పక్కవీధిలోని అలంకార శాస్త్ర విద్యార్థుల చర్చల్లో నాటక రస నిష్పత్తి గురించి నలుగుతున్నది. రసం నటనిష్ఠమా, ప్రేక్షకనిష్ఠమా అని వాళ్ళ చర్చ. ఆ శాస్త్రంలో రకరకాల పండితులు రకరకాల సిద్ధాంతాలు చేశారు. అలాగే సంగీతం పాడితే వచ్చే ఆనందం గురించి రకరకాలుగా భావించారు పండితులు. తను పాడిన సంగీతం, తాను వింటే వచ్చే ఆనందం ఒకటి, తాను పాడగా విన్న శ్రోతలకి కలిగేది మరొకటి. ఈ రెండిట్లో ఏది నిజమైన సంగీతానందము అని మీ అభిప్రాయమో చెబితే వినాలని ఉన్నది. అలాంటి సంగీతానందం గురించి బాగా తెలిసిన వారు ఎవరో కూడా తెలిపితే సరి చూసుకోవటం కుదురుతుంది ".

అయ్యవారు నవ్వుతూ "సూర్యుడు అస్తమిస్తున్నాడు. ముందర సంధ్య కానిచ్చి తరవాత ప్రశ్న గురించి ఆలోచిద్దాము" అన్నారు.


రాత్రి పూజ మొదలైంది. ఆ రోజు శనివారం. హనుమంతుడికి తమలపాకులతో పూజ చేసి రామప్రభువు పూజ చేశాడు వెంకట సుబ్బయ్య. పూజ చివర గీతం శ్రావయామి అనగానే అప్పటిదాకా భక్త్యావేశంలో తేలుతున్న అయ్యవారు పాడటం మొదలెట్టారు.

గీతార్థము, సంగీతానందము నీతావున జూడరా, ఓ మనసా (గీ)

సీతాపతి చరణాబ్జము నిడుకొన్న వాతాత్మజునికి బాగతెలుసురా (గీ)

హరిహరభాస్కర కాలాది కర్మములను మతముల  మర్మముల నెరింగిన రివర రూపుడు, హరిహయ వినుతుడు, వర త్యాగరాజ వరదుడు, సుఖిరా (గీ)

అంటూ పాడారు.

మరుసటి రోజు పొద్దున్న శిష్యులు పాడిన పాటనివిని భాగవతార్ వైపు తిరిగి "విశదం అయ్యిందా?" అన్నారు. "పూర్తిగా కాలేదు" అన్నాడు శిష్యుడు. అయ్యగారు దయతో "పాటలో ఏమి ఉన్నదీ, భగవద్గీత యొక్క అర్థాన్నీ, సంగీతం యొక్క ఆనందాన్నీ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే చూడు అని. అర్థమైందా?" అన్నారు. "అయ్యీ కాకుండా ఉంది గురువుగారూ. నువ్వు పాట విను అనే మాటకి అర్థం తెలుస్తోంది. కానీ నువ్వున్న చోట పాటని చూడు అంటే అందులో పాటని చూడటం ఎట్లాగో అర్థం కాలేదు. అదీ నేనున్న చోట వెదకటానికి అదేమన్నా వస్తువా అని సందేహం అయ్యవారూ" అన్నాడు భాగవతార్.

ఒక్క క్షణం ఆలోచించి "సంగీతానందము ఎక్కడ చూడాలి అంటే ఓ మనసా, నీలో చూడమని చెప్పినదానికి అర్థం ఏమిటి అంటే దేహానికీ, మనస్సుకీ అతీతంగా నీలో ఉన్న ఆత్మే సర్వమూ అని, అదే సంగీతానందానికి ఆధారమని. గీతకూడా అనేక చోట్ల ఆత్మయే ఆనందానికి ఆధారం అని చెప్పింది. ఇక సంగీతానందం అనేది పాట పాడేవాడికి కలిగేదా లేక పాట వినేవాడికి కలిగేదా అనే నీ ప్రశ్నకి సరైన సమాధానం ఏమిటంటే ఇద్దరికీ బయటినించి కలిగేది కాదు అని. ఆనందం ఆత్మ నిష్ఠం. అన్ని రకాల అనందాలకీ మూలం ఆత్మే. అందుకే అన్ని రకాల ఆనందాలూ లోనుంచి వస్తున్నయ్యే కానీ బయటఉన్న వస్తువుల వల్ల, ఇంద్రియాల ద్వారా కాదు. అర్థమైందా?"

"మరి, నేను పాట విన్నప్పుడు నాకు కలిగే ఆనందం సంగతేమిటి?"

"మనం మనస్సులో రకరకాల భావాలు, కోరికలు పెట్టుకోవడంతో ఆత్మానందం మనకు దొరకదు. నువ్వు శ్రద్ధగా పాటవిన్నప్పుడు, కొద్ది సేపు నీ మనస్సు లయమౌతుంది. ఎప్పుడు నీ మనస్సు లయమౌతే అప్పుడు ఆత్మలో ఉన్న ఆనందం బయటికి వస్తుంది. అప్పుడు నీకు ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ నీ మనస్సు కదలగానే ఆ ఆనందం అదృశ్యమౌతుంది. అందువల్లే నీ మనస్సు బాగా చీకాకుగా ఉంటే సంగీతం విన్నా అంత ఆనందం కలగదు ."

"నేను కర్ణాట సంగీతం విన్నప్పుడు నా మనస్సు లయమౌతుంది, అప్పుడు ఆనందం వొస్తుంది అన్నారు కదా. అలాగైతే, కొంతమందికి యక్షగానాలు వింటే ఆనందం వొస్తుంది, ఇతర్లకి వేరే ఏవో వింటే వొస్తుంది కదా,  ఎట్లాగ గురువుగారూ."

"ఆనందం వచ్చేది లోపలి నించే. కానీ ఎవరి మనస్సుల్లో ఉన్న సంస్కారాలబట్టి వారికి కొన్ని రకాల విషయాలు నచ్చి, ఆ విషయాలు విన్నప్పుడో, చూసినప్పుడో మనస్సులయమై ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ విషయాల వల్ల ఆనందం ఎలా వొస్తోందో అర్థమౌతుందో అప్పుడు అన్ని ఆనందాలకీ మూలం అర్థమై శాంతి లభిస్తుంది. అలా శాంతిని సంపాదించిన  వాళ్ళల్లో అర్జునుడి  రథం మీద కూచుని గీతని కృష్ణ భగవానుడి నోటవిన్న ఆంజనేయ స్వామి అతిముఖ్యుడు" అన్నారు అయ్యవారు.

" ఆంజనేయ స్వామికి ఆ శాంతి ఎలా దొరికింది?"

"అన్ని రకాల మతాలపై అవగాహనా, అఖండ  రామనామ జపమూ, ఆ జపానికి ఆధారమైన రామతత్త్వ విచారణా, భగవద్గీతా ప్రత్యక్ష శ్రవణమూ ఇవన్నీ ఆయనకి శాంతిని అందించాయి. అందుకే ఆయన సుఖి. మీరు కూడా ఆయనలాగా సుఖులు అవటానికి ప్రయత్నించండి" అని ముగించారు అయ్యవారు.


                      - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...