Saturday 30 April 2022

పాపిడి

కైలాసంలో పొద్దున్న అయ్యింది. అర్ధనారీశ్వర మూర్తి నిద్ర లేచారు. ఇన్నేళ్ళయినా అక్కడ ఉండే పరిచారకులకూ, పరిచారికలకూ ఇప్పటిదాకా మూర్తిని అర్ధనారీశ్వరుడు అనాలా? లేక అర్ధనారీశ్వరురాలు అనాలా అన్న విషయం నిర్ధారణకి రాలేదు. ఏదో ఎడంపక్క ఉన్నప్పుడు స్త్రీలింగంతోనూ కుడిపక్క ఉన్నప్పుడు పుంలింగంతోనూ పిలుస్తూ ఎలాగొలా సద్దుకుపోతుంటారు వాళ్ళు. అప్పుడప్పుడూ, తప్పుగా సంబోధించినప్పుడు, క్షమాపణలు చెప్పుకుని లెంపలేసుకుంటారు వారందరూ.

అలాంటి మూర్తి నిద్ర లేచారు. గొప్పవాళ్ళని  స్త్రీ పురుష భేదం లేకుండా "లేచారు" అనవచ్చేమో కాబట్టి అర్ధనారీశ్వరమూర్తి నిద్ర లేచారు. కాసేపయిన తరవాత మూర్తి స్నానంచేసి బయటికి వచ్చారు. మూర్తికి తలని దువ్వి అలంకరణ చేయటానికి బయలుదేరారు సేవకులు.

ఎడమవైపు ఉన్న జుట్టుని దంతపు దువ్వెనతో దువ్వుతున్నారు పరిచారికలు. పొడుగాటి జుట్టుని పైనించి కిందవరకూ దువ్వి, దానికి సుగంధ తైలాలు రాశారు వారు. ఎడమపక్కన ఉన్న చెవిలో తాము రోజున ఏవిధంగా జుట్టుని ముడి వేస్తారో చెప్పి, అనుజ్ఞ తీసుకుని, జుట్టుని చిత్రాతిచిత్రంగా ముడివేశారు పరిచారికా బృందం.

కొత్తరకంగా ముడి వేసిన జుట్టు మీద చంద్రవంకలూ, బంగారు జడలూ, వాటి కింద అందమైన కుప్పెలూ లాంటి రకరకాల ఆభరణాలు పెట్టారు.

లోపల కుడివైపు ఉన్న జటలు కట్టిన జుట్టుకి పెద్దగా చేసేది ఏమీ లేనందువల్ల, జటలని కాస్త సవరించి, దుమ్ముదులిపి సర్దిపెట్టారు భూత గణాల వారు.


నుదుటి మీద ఎడమవైపు చక్కగా కుంకుమ దిద్దారు పరిచారికలు. నుదుట మీద కుడివైపు విభూతి పెట్టారు భూతగణాలు. అలంకరణ పూర్తి అయ్యింది అని పరిచారికలు అనుకుంటుంటే అందులో  ఒక పరిచారిక "అసలుది మర్చేపొయ్యాం" అంటూ దీర్ఘం తీసింది. "ఏమిటా" అని చూసిన వారికి పాపిటబిళ్ళ పెట్టలేదని అర్థం అయ్యింది. "సరే" అని ఆభరణాల పెట్టెలోంచి నవరత్న ఖచితమైన పాపిటబిళ్ళ తీసి, పెడదామని పరిచారికలు జుట్టుని సద్దుతున్నారు.

ఇంతలో భూతగణాలలోని ఒక కుర్రవాడు ముందుకు వొచ్చి " పాపిటబిళ్ళ పెట్టకూడదు. ఎందుకంటే పాపిటలో సగభాగం అయ్యవారిది. దాన్ని మీరు ఎట్లా ఆక్రమిస్తారు? ఇంకో విషయం. పాపిటబిళ్ళ పెడితే అది మావైపు నుదురునికూడా కొంత ఆక్రమిస్తుంది. అందువల్ల పాపిట బిళ్ళ పెట్టరాదు" అని హడావిడి చేశాడు.

చేసేది లేక పరిచారికలు పాపిటబిళ్ళని ఎడమవైపు మాత్రమే వొచ్చేట్టు సద్దారు.

కొన్ని రోజులు గడిచినయ్యి. ఒక దినం నారద మహర్షి కైలాసం వొచ్చి అర్థనారీశ్వర మూర్తికి నమస్కారం చేశాడు. కాసేపు మాట్లాడి అమ్మవారిని ఉద్దేశించి "తల్లీ, నీ ముఖం మీద ఉన్న పాపట బిళ్ళ కాస్త పక్కకి ఉన్నది తల్లీ" అని చెప్పాడు. నారదుడు చెప్పగానే పరిచారికలను పిలిచి విషయం అడిగింది అమ్మవారు. వాళ్ళు జరిగింది అంతా చెప్పారు.

అమ్మవారికి కోపం వచ్చింది. వెంటనే అయ్యవారికి వినపడేట్టు, నారదుడితో "నారదా, నువ్వు చెప్పు పాపిడి ఆయనదో, నాదో?" అని అన్నది. నారదుడు పులుకూ  పులుకూ చూశాడు. పక్కనే ఉన్న అయ్యవారు నిశ్చలంగా ఉన్నారు. ఒక క్షణం ఏమి మాట్లాడాలో తెలియలేదు. కాసేపటికి ధైర్యం తెచ్చుకుని " చూసిన కొద్దీ మనస్సు భేదభావనలని కల్పిస్తూ ఉంటుంది కదా తల్లీ. రెండు శరీరాలు ఉంటే భేదభావం వొస్తోందని అర్ధనారీశ్వర రూపం తపస్సు చేసి మరీ సాధించావు గదా తల్లీ. ఇంకా భేద భావం గురించి ఆలోచించటం ఎందుకు తల్లీ?" అన్నాడు నారదుడు.

అమ్మవారు విసుగ్గా "ఉపన్యాసాలు ఆపి విషయం చెప్పు. ఇంతకీ పాపట నాదా, ఆయనదా? సరిగ్గా చెప్పు?" అన్నది. అంతలో ఆది శంకరులు అక్కడికి వచ్చి నమస్కరించి, కలహ కారణం తెలుసుకున్నాడు. అంతా విని ఆయన మౌనంగా చిరు నవ్వు నవ్వి ఊరుకోవటం, నారదుడికి నచ్చలేదు. కనుబొమలు ముడి వేసి పెదవి బిగించాడు.

'శంకరా! అన్నిటికీ భాష్యం చెప్తానంటావు కదా, చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేవా?' అన్నది అర్ధనారీశ్వరమూర్తి దక్షిణార్ధం. 'అయ్య అనుగ్రహము, అమ్మ కటాక్షమూ ఉంటే, అన్ని జవాబులూ అవే స్ఫురిస్తాయి' అని శివాశివులకుకు వినమ్రంగా మళ్లీ మొక్కాడు శంకరుడు.

'అయితే ఇంకా ఆలస్యమెందుకు ? చెప్పు!' అన్నది వామార్ధాంగి.

'అర్థనారీశ్వర రూపంలో శివా శివ సంయోగం వాగర్థ సంపృక్తి లాగా సంపూర్ణం...'

'అయితే...?' ముఖం చిట్లించాడు నారదుడు.

'అందువల్ల దక్షిణ వామార్ధాల మధ్య ఎటువంటి ఎడమూ లేదు. పాపట అంటూ యథార్థంగా లేదు లేదు..'

'మరి కనిపిస్తున్నది మిథ్య అంటావా?' అన్నాడు నారదుడు వెటకారంగా, కటువుగా.

'అక్కడ ఉన్నది అర్ధనారీశ్వర తత్త్వ రహస్యాన్ని, ప్రకృతి పురుషుల సాన్నిహిత్య మర్మాన్ని తెల్లం చేసే జ్ఞానార్క కిరణం. అదాటుగా చూస్తే అదే అమ్మ వారి సీమంతసరణిగా స్ఫురిస్తుంది. శ్రద్ధగా దాని ప్రకాశంలో చూస్తే, అన్ని భేదభావాలూ అంతరిస్తాయి' అన్నాడు.

'నీ ద్రవిడ శిశువు చాలా ఘటికుడే సుమా!' అని దక్షిణార్ధం మెచ్చుకొనేసరికి, దాక్షాయణి పరమానందమైపోయి పరమేశ్వరుడిలో ఒదిగిపోయింది.

ఇప్పుడు ధ్యాసగా చూసిన పారిషదులకు శివాశివరూపం ఒకే  వెలుగుగా పొడగట్టింది.


                     - మల్లాది హనుమంతరావు.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...