Wednesday 13 April 2022

నీడ

నందుడివాళ్ళ ఇంట్లో చాలా పాత బాదంచెట్టు దొడ్లో చిట్ట చివర ఉండేది. చెట్టుకాండం చాలా పొడుగ్గా, లావుగా ఉండేది. అది చాలా ఎత్తు పెరిగటం వల్లనూ, చెట్టు కొమ్మలు బాగా విస్తరించుకోవటం వల్లనూ, చెట్టు నీడ దొడ్లో చాలాభాగం పరుచుకుని ఉండేది. పెద్ద చెట్టు మీద చిన్నా, పెద్దా పక్షులు చాలా నివాసం ఉండేవి. కృష్ణుడు పుట్టడానికి కొద్ది సంవత్సరాల ముందు బాదం చెట్టు మీద ఉన్న గూడులో ఉన్న కృష్ణపక్షి రెండు గుడ్లు పెట్టింది. వాటి నించి రెండు చిన్ని కృష్ణ పక్షులు పుట్టాయి. వాటి పేర్లు యాస్కుడూ, శబరుడూ.

అవి రెండూ త్వరలో పెద్దవై హాయిగా అటూఇటూ తిరుగటం మొదలెట్టాయి. వాటి రెక్కలు కూడా పెద్దవి అయ్యాయి. కొన్ని రోజులకి కృష్ణుడు పుట్టాడు. యశోద ప్రేమతో "కృష్ణా" అని పిలిచితే బాదం చెట్టు మీద నించీ పక్షులు రెండూ "కృష్ణా, కృష్ణా" అంటూ అరిచేవి. వాటికి ప్రతిగా కృష్ణుడు గట్టిగా "కృష్ణా, కృష్ణా" అంటూ అరిచేవాడు. పక్షులు మళ్ళీ అరిచేవి. అలా పొద్దున మొత్తం గడిచేది. పొద్దెక్కి ఎండ  కాస్త చుర్రు మనటం మొదలెట్టగానే పక్షుల్లో పెద్దదో, చిన్నదో వొచ్చి ఆచురుక్కుమనే ఎండ కృష్ణుడి మీద పడకుండా, గొడుగు లాగా, ఆకాశంలో అలా రెక్కలు కదిలిస్తూ స్థిరంగా  నిలబడేది. కాసేపు అలా ఉన్న తరవాత, ఓపిక అయిపోతే, ఒక  అరుపు అరిస్తే రెండో పక్షి వొచ్చి ఎండ పడకుండా నిలబడితే మొదటి పక్షి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది. ఇలా కృష్ణుడు ఇంటి బయట ఆడుతున్నంత సేపూ రెండు పక్షులూ, ఒకటి తరవాత ఒకటి వొచ్చి కృష్ణుడి మీద ఎండ పడకుండా చూసేవి. అలాగే వర్షాకాలంలో కూడా కృష్ణుడు తడవకుండా నిలబడేవి.


ఇంతలో కృష్ణుడు ఇంద్ర పూజ మానిపించి గోవర్ధన పర్వతానికి పూజ చేయించాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి పుష్కలావర్త మేఘాలని పంపించి వర్షంతో పాటు శిలలూ  కురిపించటం మొదలెట్టాడు. వెంటనే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద ఎత్తి గోపీ, గోపాలకులు అందరినీ ఆవులూ, దూడలతోబాటు పర్వతం కిందకి రమ్మన్నాడు. అందరూ పర్వతం కిందకి వొచ్చి శిలలతో కూడిన వర్షాన్ని తప్పించుకున్నారు.

కృష్ణుడు మిగతా జీవజాలాన్నీ పర్వతం కిందకి రమ్మన్నాడు అన్నీ వొచ్చేశాయి. కానీ బాదం చెట్టు మీద ఉన్న రెండుపక్షుల మధ్య గొడవ మొదలైంది. అన్నా, తమ్ముడూ ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలెట్టారు.

"అన్నా, అందరూ వానని తట్టుకోలేక కొండకింద దాక్కున్నారుపద అన్నా, మనం కూడా కొండ కిందకి వెళదాము"  అన్నాడు శబరుడు.

యాస్కుడు అడ్డంగా తలఊపుతూ "ఇన్నాళ్ళు మనం, వర్షం వొచ్చినా, ఎండ వొచ్చినా కృష్ణుడికి పైన ఎగిరేవాళ్ళం. తానుఏ ఇంట్లో ఉంటే ఇంటి మీద ఎగిరే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు కాస్త పెద్ద వర్షం వొచ్చిందని వొదిలేసి వెళ్ళిపోతామాఅసంభవం" అన్నాడు.

"అన్నా, ఇది పెద్ద వర్షం కాదు, ఇది శిలావర్షం, ప్రళయ భీభత్స వర్షం. మనం తట్టుకోలేము. అందుకని గోవర్ధన పర్వతం కిందకి పోదాం పద"

"తమ్ముడూ, ఏమైనా కానీ, నేను కృష్ణుడి మీదా, అతను ఉన్న ప్రదేశాల మీదా వర్షం పడకుండా నా రెక్కలు పరిచి ఆపాల్సిందే. ఇదే నా కర్తవ్యం. నువ్వు కావాలంటే వెళ్ళి కొండకింద దూరు, పో " అని యాస్కుడు గట్టిగా చెప్పాడు.

బాగా ఆలోచించి, ఈ శిలావర్షానికి కొండకింద ఉండటమే సరి అని తమ్ముడైన శబరుడు ఎగురుకుంటూ కొండ కిందకి పయనమైతే, పెద్దవాడైన యాస్కుడు కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. తన రెక్కలన్నీ విప్పి, కొండ మీద నిలబడ్డాడు.

వారం రోజులైంది. వర్షాలు ఆపి, ఓటమిని ఒప్పుకుని, స్వర్గానికి బయలుదేరాడు ఇంద్రుడు. కొండకింద నుంచీ అందరూ బయటికి వొచ్చిన తరవాత, కొండని యథాస్థానంలో పెట్టేసి, ఇంటికి వెళ్ళి వెన్నముద్దలు తింటున్నాడు కృష్ణుడు. తమ్ముడు పక్షి వెళ్ళి బాదం చెట్టు మీద వాలి చూస్తే అన్న పక్షి అక్కడే ఉన్నాడు.

మెల్లిగా అన్న దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి "అన్నా, అంత పెద్ద శిలా వర్షం నించి ఎలా తప్పించుకున్నావుఎవరునిన్ను రక్షించారు?" అని అడిగాడు తమ్ముడు.

"ముందర నాకు ఇది చెప్పు? కృష్ణుడు దేంతో కొండని ఎత్తిపట్టుకున్నాడు?". "అన్నా, ఎడమ చెయ్యి, చిటికెన వేలితో ఆ కొండని ఎత్తి పట్టుకున్నాడు కృష్ణుడు." అన్నాడు తమ్ముడు.


బాష్ప పూరిత లోచనాలతో, గద్గద కఠంతో, అన్న, మెల్లిగా "మరి రెండో చేత్తో ఏమి చేశాడు? తెలుసా" అని పలికి కళ్ళుమూసుకుని మౌనంగా కూచున్నాడు.


                      - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...