Monday 4 April 2022

శ్రీరామ గడియ

కోసల దేశానికి రాజధాని అయిన అయోధ్యా నగరంలో రాములవారు రాజ్యం చేస్తున్నారు. ధర్మాన్ని నాలుగు పాదాలా నిలబెట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆ అయోధ్యా నగరంలో సరయూ నది ఒడ్డున్నే శ్రీరాముల వారి అంతఃపురం ఉంది. ఆ అంతఃపురం చాలా విశాలమైనది. ఆ అంతఃపురానికి మధ్యలో సీతమ్మ వారి ఆనందవనం ఉంది. ఆ శాద్వలం రకరకాల పండ్ల చెట్లతోనూ, చిన్న చిన్న క్రీడా శైలాలతోనూ, చక్కటి పుష్ప లతలతోనూ, మెత్తటిగడ్డితోనూ, విలాస సరోవరాలతోనూ విరాజిల్లుతోంది. ఆ ఆనంద వనం మధ్యలో రాముల వారు సీతమ్మ కోసం నిర్మింపజేసిన ముత్యాల భవనం ఉంది. ఆ భవనం అంతా ముత్యాల మయం. కిటికీలకి తెరలుగా ముత్యాల హారాలు, దీప స్తంభాలూ, వాటిపైన ఉన్న దీపాలూ అన్నీ ముత్యాల అలంకరణతో వైభవంగా వెలుగొందుతాయి.
ఆ భవనం పడమటి దిక్కులో మేడమీద విశాలమైన సీతమ్మ వారి శయన మందిరం ఉంది. ఆ శయన మందిరానికి ఒకటే దారి. ఆ దారి అంతా రత్నాల తివాచీలు పరిచి ఉంటాయి. ఆ దారి అంతా అంతఃపుర రక్షకీమణులు అనేకమంది విచ్చుకత్తులతో షష్టి ఘడియలూ కాపలా కాస్తూ ఉంటారు. వారి మీద సర్వాధికారాలూ సీతమ్మవే. ఆవిడ అనుజ్ఞ లేకుండా ఆ దారిలో అడుగు కూడా పెట్టలేరు. ఆ దారిలో శయన మందిరానికి వొస్తే ముందర ఒక పెద్ద తలుపు కనిపిస్తుంది. అది బంగారు తలుపు. ఆ తలుపు నిండా రత్న మాణిక్యాలు తాపడం అయి వున్నాయి.ఆ బంగారుతలుపు మధ్యలో వజ్రాల గడియ ఉంది. ఎప్పుడన్నా మరీ ఏకాంతం కావాలన్నప్పుడూ, ఏదన్నా రహస్యం మాట్లాడాలన్నప్పుడూ, ఆ గడియ వేస్తుంది సీతమ్మ.

ఆ శయన మందిరం మధ్యలో ఉన్న పట్టెమంచం మొత్తమూ ముత్యాలతో ముణిగిపోయినట్టు ఉంటుంది. ఆ శయనమందిరంలో పడమర కిటికీ పక్కన వీణ వాయించటానికీ, కూచుని మాటలు చెప్పు కోవటానికీ సింహాసనాలూ , గద్దెలూ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాంటి ఒక గద్దె పైన కూచుని సీతాదేవి వీణ వాయిస్తోంది. చాలాసేపు వాయించటం వలన ఆమె వేళ్ళు నొప్పి పుట్టటం మొదలెట్టాయి. వీణ వాయించటం ఆపి పరిచారిక వైపు సాకూతంగా చూసింది. సీతమ్మ అభిప్రాయం గ్రహించిన ఆమె వొచ్చి వీణని తీసి పక్కన పెట్టింది.

సీతమ్మ మెల్లిగా "ఊర్మిళ వెళ్ళి చాలా సమయం అయింది కదా? ఇప్పుడు కాలం ఎంత అయ్యి ఉంటుంది?" అని చిన్నప్పటి నించీ తనని పెంచి తనతో అయోధ్య వొచ్చిన పరిచారికని అడిగింది. పరిచారిక బయటికి వెళ్ళి కాల గణనయంత్రాన్నీ, చంద్రుడి సంచారాన్నీ గమనించి వొచ్చి "ఇప్పుడే అర్ధరాత్రి దాటింది. స్వామి వారు ఇంకా లవణాసురుని రాజ్యం నించి వొచ్చిన గూఢచారులతో మాట్లాడుతున్నారని వార్త." అన్నది. సీతమ్మ కొద్దిగా విసుక్కుంటూ " ఏ విషయం పట్టుకుంటే దాంట్లో ముణిగిపోతారు ఈయన. ఏమిచేయాలబ్బా?" అంటూ లేచి మందిరంలో అటూ ఇటూ తిరగటం మొదలెట్టింది. అప్పుడు ఆ పరిచారిక చొరవ తీసుకుని "మిథిలలో మీ నాన్నగారు మహర్షులతో మాట్లాడుతూ కాలం మరిచి అర్ధరాత్రో, అపరాత్రో వచ్చేవారు. చూసి, చూసి మీ అమ్మగారు ఒకసారి తలుపు బిడాయించుకుని కూచున్నారు. మీ తండ్రిగారు వొచ్చి బ్రతిమిలాడినా తెల్లారే వరకు తీయలేదు. అప్పటి నుంచీ మీ తండ్రి గారు కాలాతీతం కాకుండా అంతఃపురం జేరేవారు" అన్నది.

సీతమ్మ ఆలోచిస్తోంది. "ఒకసారి తలుపులు మూసి కూచుంటే విషయం చక్కబడుతుందా" అంటూ ఆలోచించింది. ముందూ వెనుకలాడింది. సరే అని ధైర్యం చేసి " తలుపులు మూయండి" అని ఆజ్ఞాపించింది సీతమ్మ. ఆవిడ ఆజ్ఞతో బంగారు తలుపులు మూసి వజ్రాల గడియ వేశారు పరిచారికలు. సీతమ్మ మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది గానీ, ఆవిడ మనసు మనసులో లేదు.

ఈలోపల, అక్కడ రాములవారు, శత్రుఘ్నుడితో కలిసి, లవణాసురుడి రాజధాని నుంచి వొచ్చిన గూఢచారులతో సంభాషణ ముగించారు. " లక్ష్మణా" అని పిలిచారు. సుమంత్రుడు వొచ్చి " ప్రభూ, తమరు సాయం సంధ్యాసమయానికే లక్ష్మణుల వారు వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు" అని చెప్పాడు. రామప్రభువు సింహాసనం మీద నుంచిలేస్తూ" "సమయం ఎంత అయినది." అన్నారు. "అర్ధరాత్రి దాటింది ప్రభూ" అన్నాడు సుమంత్రుడు. "అయ్యో, సీతకు త్వరగా వస్తానని చెప్పానే" అనుకుంటూ రామప్రభువు అంతఃపురం వైపు బయలుదేరుదాము అనుకునిలేవబోయారు. ఈలోపల, "ఇంకొక రెండు అధికారుల సమూహాలు మీతో మాటాడుదామని వేచి ఉన్నాయి. ఏమి ఆజ్ఞ" అన్నాడు సుమంత్రుడు. "సరే, పిలవండి" అన్నాడు రామ ప్రభువు విసుగుని దాచుకుంటూ. వారితో మాటలు కాసేపుసాగాయి. అవి ఎలాగొలా ముగించి రాములవారు అంతః పురానికి బయలుదేరారు.

గబగబా నడిచి రాములవారు అంతఃపురం జేరారు. మేడ మెట్లు ఎక్కి పైకి వొచ్చి శయన మందిరం లోపలికి వెళ్దామని చూస్తే తలుపులు మూసి ఉన్నాయి. "ఇదేమిటి" అనుకుంటూ రాములవారు తలుపు నెట్టారు. అప్పటికి రామ ప్రభువుకి తలుపులు మూసి ఉన్నాయి, దాంతో బాటు గడియ కూడా పెట్టబడి ఉన్నదని గ్రహింపు వచ్చింది. జీవితంలోమొదటి సారి కలిగే ఏ అనుభవం అయినా ఒక కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది కదా. రాములవారికి అంతఃపురం తలుపుకి గడియ పెట్టి ఉండటమనే కొత్త విషయం అనుభవంలోకి వొచ్చింది. అయితే ఏమీ?, శృంగార సూత్రాలు అన్నీ తెలుసును అనే ధీమా, సీత తన మాట వింటుందనే ధైర్యమూ ఉండటంతో, ఈ కొత్త విషయాన్ని ఎలాగొలా త్వరగా ముగించేసి సీతని జేరి మాట్లాడాలని అనుకున్న రాములవారు తలుపు దగ్గరకు జేరి,మెల్లిగా ఆ తలుపు మీద మధ్యవేలు వెనుకభాగంతో చిన్నగా తట్టారు.
మందిరంలోపల వేచి ఉన్న సీతమ్మ, సిం హం లాగా నడిచే రాములవారి అడుగుల శబ్దం విని, చిరునవ్వు నవ్వుకుంటూ తలుపు లోపలి వైపుకి జేరింది. మందిరం లోపల నడుస్తున్న సీతమ్మ అడుగుల శబ్దమూ, దాంతోబాటు వొచ్చే బంగారుమంజీరాల శబ్దమూ విన్న రాములవారు తలుపులు తెరుచుకుంటున్నయ్యేమోనని చూశారు. తలుపులు తెరుచుకోలేదు. దాంతో తలుపు మీద మెల్లిగా మధ్యవేలుతో కొద్దిగా గట్టిగా కొట్టారు రాములవారు.లోపలనించీ సీతమ్మ "ఎవరూ?" అంటూ వేసిన ప్రశ్న వినపడింది రాములవారికి. దాంతోబాటు వినీవినపడకుండా వినిపించిన చిన్న నవ్వు రాములవారి మనస్సుని క్షణకాలం ఉక్కిరి బిక్కిరి చేసేసింది. సీతమ్మ తో గడిపిన మధుర క్షణాలన్నీ ఒక్కసారి కళ్ళకెదురుగా పొడగట్టాయి. దాంతో అనిర్వచనీయమైన ప్రేమా, అమితమైన ఉత్సాహమూ ఒక్కసారి మనస్సు నిండగా, రాములవారు ఆనందంగా " నేను, రాముడిని" అన్నారు.

రామప్రభువు వొచ్చాడని స్థిరపరుచుకున్న సీతమ్మ తలుపు తీద్దామని అనుకుని తలుపు దగ్గరకి వచ్చి, గడియమీదచెయ్యి వేసింది. ఈలోపల ఆమెకు ఒక చిలిపి ఊహవొచ్చింది. ఆ ఊహకి ఆమెకే నవ్వు వొచ్చింది. ఆ నవ్వుని ఆపుకుంటూ సీతమ్మ మెల్లిగా "భార్గవ రాములకి నమస్సులు. మహర్షులైన తమరు రావటం మాకు మంగళకరమైనదే అయినా, ఇప్పుడు మావారు అంతఃపురంలో లేని కారణం వల్ల తలుపు తెరిచి మిమ్మలిని సేవించుకోలేకపోతున్నాము. రేపు పొద్దున్న సకల మర్యాదలతో మిమ్మల్ని సేవించుకుంటాము" అని అన్నది.
వినీ వినిపించకుండా ఉన్న సన్నసన్నని నవ్వూ, దాంతోబాటు రాముడు అని తను అంటే దానికి భార్గవ రాముడు అని ప్రత్యుత్తరం ఇచ్చిన సీతమ్మ మాటలూ, రాములవారిని ఉత్తేజితం చేశాయి. దాంతోబాటే ఎలాగైనా సీతమ్మని మాటలలో గెలవాలనే కోరికా కలిగింది. వీరులకీ, ధీరులకీ, కోరిక కలిగితే ఇంక అడ్డేముందీ?.

వెంటనే "నేను కోదండరాముణ్ణి. ఎప్పుడూ కోదండం ధరించి, బాణాలతో దుష్టులని శిక్షిస్తూ ఉంటాను" అన్నాడు రాములవారు తన వీరత్వం మొత్తం మాటల్లో చూబిస్తూ. అలా ధైర్యంగా చెప్పిన రాములవారి మాటలు విన్న సీతమ్మకి మళ్ళీ కొత్త ఆలోచనలు వొచ్చాయి. ఆ ఆలోచనలు ఆమె మనస్సుని కాస్త తొందర పెట్టాయి. దాంతోబాటు ఈసారి కూడామాటల్లో గెలిచేస్తున్నాను అనే ధైర్యమూ వొచ్చింది ఆమెకు. అత్యంత ఉత్సాహంతో కరకంకణాలు సద్దుకుంటూ "అయ్యా, మీరెవరో నాకు తెలియదు కానీ, మావారికి కూడా కోదండం చాల ఇష్టం. కానీ అదేమి చిత్రమో ఎంతలేసి కోదండాలైన ఆయన చేతిలో పుటుక్కున విరిగిపోతాయి. మహా మహా మహాదేవ చాపానికి కూడా విరిగిపోయే గతి పడితే మిగతా వాటి సంగతి ఏమిటో ఆలోచించుకోండి. ఇంక కోదండాలెక్కడ?, వాటినే ఎల్లప్పుడూ ధరించడం ఎక్కడ?. మీరెవరో?, వెళ్ళి రండి" అని సవిలాసంగా అన్నది.

తలుపు లోపల నించి వినిపిస్తున్న అర నవ్వులూ, వాటితో బాటు వినిపించిన మధురమైన మాటలూ రాములవారి మనస్సుని ఆకట్టుకున్నాయి. కానీ ప్రశ్నకి మించిన సమాధానం రావటమూ, సీత తనని మాటలతో ఓడించటమూ చూసి రాములవారికి కసి పెరిగింది. ఈసారి ఏమి చెప్పాలా అని ఆలోచించారు రాములవారు. ఈసారి విషయం స్పష్టంగా, సందేహాలు లేకుండా చెప్పాలిఅని ఆలోచించి, ఆలోచించి మళ్ళీ తలుపుతట్టారు రాములవారు. తట్టి " నేను రాజుని” అని అన్నారు. సందేహాలకి తావులేకుండా స్పష్టంగా విషయం చెప్పాను కదా అనుకున్న రాములవారికి మరుక్షణమే సీతమ్మ అన్న మాటతో ఏమిచెయ్యాలో అర్థం కాలేదు. రాజు అంటే చంద్రుడు అన్న అర్థం ఉందని చాలా కావ్యాల్లో చదివిన సీతమ్మ, ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయకుండా, "ఆకాశంలో ఉన్న చంద్రుడు గారూ, మీరు భూమి మీదకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు. చెప్పండి?. నిజానికి ఆకాశంలో ప్రకాశించే మీకంటే మావారి ముఖమే చాలా బావుంటుందని అందరూ అంటారు.అదే మాకు చాలు. అందుకే మీతో మాకు పనిలేదు. ఇంకో విషయం. ఎంత పెద్ద రాజ్యానికి రాజు అయినా, అంతఃపురానికి వొచ్చేటప్పటికి భర్త మాత్రమే రాజు కదా" అని అంటూ ఈసారి కూడా గెలిచానని విజయగర్వంతో నవ్విన నవ్వు విన్న రామ ప్రభువుకి ఏమి చెయ్యాలో తోచలేదు.

మాటలతో గెలవలేకపోతున్నానని కాస్త కోపం వొచ్చింది రాములవారికి. కానీ ఏమి చేస్తారు?. ఏదో అస్త్రాలు వేసి యుద్ధంలో గెలిచినట్టు కాదు కదా ఇక్కడ. స్త్రీల విషయం. కాబట్టి, ప్రతాపాల కంటే చమత్కారాలూ, విభ్రమాలూ కావాలాయె. " సరే, ఏమిచేస్తాం?" అనుకుని దీర్ఘంగా ఆలోచించిన రాములవారు, తమ తండ్రి గురించి చెబితే ఘనంగా ఉంటుంది అనుకున్నారు. వెంటనే" నేను దాశరథిని దశరథ మహారాజు పుత్రుడిని" అని ధీమాగా అన్నారు. వెంటనే సీతమ్మ గట్టిగా నవ్విన నవ్వూ, దాంతో బాటు" స్వర్గాన ఉన్న మా మామగారికి నమస్సులు. ఆయన ఇక్కడే తన నలుగురు కొడుకులకీ నాలుగు అంతఃపురాలు నిర్మించి ఇచ్చారు. ఆ నలుగురిలో మీరెవరో సరిగ్గా తెలిస్తే గానీ ఏ అంతఃపురంలోకి మీకు ప్రవేశం ఉన్నదో తెలియదు కదా?" అన్న వ్యంగ్యంగా వదిలిన మాటల బాణమూ తలుపు సందుల్లోంచి వొచ్చి రాములవారికి తాకాయి.

ఆ వ్యంగ్యపు మాటల దెబ్బకి రాములవారికి ఏమి చెయ్యాలో తోచలేదు. ఇలా గెలవలేకపోతున్నానని ఒక్క క్షణం దిగాలుపడిపోయారు కూడానూ. కానీ తేరుకుని, మనస్సు స్థిమితం చేసుకుని ఆలోచించటం మొదలెట్టారు రామ ప్రభువు. గెలవకపోతే పోయె, ఎలాగొలా అంతః పుర ప్రవేశం చేస్తే తనకి మాట నిలుస్తుంది అని దీర్ఘంగా ఆలోచించారు రాములవారు. తలుపు లోపల సీతమ్మ కూడా ఈసారి ఏమి ప్రశ్న వొస్తుందా?, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలా?, అంటూఆలోచించసాగింది.
కాసేపైంది. తలుపు తట్టిన శబ్దమైంది. ఆ శబ్దంతోబాటు "నేను జానకీ రాముణ్ణి " అన్న రాములవారి మాట సీతమ్మకి వినవచ్చింది. ఆమాట వినేటప్పటికి ఆమె మనస్సు ఒక్కసారి ఆనంద తరంగితమైపోయింది. ఆ ఉత్సాహంతో మెల్లిగా వజ్రాలగడియని పట్టుకుని కొద్దిగా ఎత్తి పక్కకి జరపబోతూ సీతమ్మ ఆగింది. ఆవిడకి ఆ క్షణంలో ఒక కొత్త ఆలోచనవొచ్చింది. అది ఆమె మనస్సుని ఉరకలు వేయించింది. వెంటనే కొద్దిగా పైకి లేచిన గడియ కాస్తా కిందకి జారిపోయింది. బయట వేచి ఉన్న రాములవారికి గడియని ఎత్తిన శబ్దమూ, అది మళ్ళీ కిందకి జారిపోయిన శబ్దమూ వినిపించాయి. "మళ్ళీ ఏమి బాణాలు మీద పడతాయా?" అని తల తడుముకుంటున్నాడు రాములవారు.
సీతమ్మ ఆలోచించింది. ఆలోచిస్తూ ఉన్నకొద్దీ ఆమెకు ఉత్సాహం అధికం అవడమూ, దాంతోబాటు ఎంత ఉగ్గబట్టుకున్నా మధ్య మధ్య నవ్వు బయటకు రావటమూ జరుగుతోంది. అది వింటున్న రాములవారికి "మళ్ళీ ఏదో పిడుగు మీద పడుతోంది" అని నిర్ధారణ అయ్యింది. "అది ఏమై ఉంటుందబ్బా" అని ఆలోచిస్తున్నారు రాములవారు.

కొన్ని క్షణాల తరవాత తలుపు వెనకాల నించీ నవ్వులూ, వాటి మధ్యలో మాటలూ, మళ్ళీ నవ్వులూ ఇలా మీదపడుతున్నాయి. సీతమ్మ చెప్పడం మొదలెట్టింది. "మా నాయన, బ్రహ్మ వేత్త అయిన జనకుల వారికి ఇద్దరం సంతానం, నేనూ, మా చెల్లీ. ఇద్దరమూ దశరథ మహారాజు గారి కోడళ్ళమే. అందుకని ఈ ఊళ్ళో జానకి అని పిలవబడేవాళ్ళంఇద్దరం ఉన్నాం. రాముడు అంటే ఆనందింపజేసేవాడు అనే అర్థం ఉంది కాబట్టి, ఈ ఊరిలో ఇద్దరు జానకీ రాములు ఉన్నారు. వారిలో మీరెవ్వరో చెప్పండీ" అన్న మాటలు తలుపు వెనకాల నించి వొచ్చి రాములవారిని తాకాయి.
క్షణ కాలలో ఆయనకి విషయం అర్థమైంది. దాంతో బాటు ప్రశ్నకి సమాధానమూ దొరికింది. ఈ సమాధానం ముందరేచెబితే సరిపోయేదిగా అని కూడా అనిపించింది. దాంతో ఆలస్యం అయిపోయిందని ఉద్విగ్నత కలిగింది. వెంటనేధైర్యంగా, ఉత్సాహంగా తలుపు తట్టి "నేను సీతారాముణ్ణి" అని గట్టిగా అన్నాడు రామ ప్రభువు.
సీతమ్మకి అర్థమైంది. తను మాటలలో గెలిచాననీ, తన భర్త, మహా ప్రతాపవంతుడూ, బుద్ధిశాలీ అయి కూడా తననిగెలవలేక పోయాడు అని గుర్తించింది. ఇంకా పొడిగిద్దామా అనుకుంది. కానీ గెలిచినప్పుడే శాంతమూ, వినయమూ కావాలని తెలిసినది కావటం వల్ల విజయ గర్వంతోనూ, చాలా సేపు తలుపు బయట వేచి ఉన్న భర్తపైన ఎక్కువైనప్రేమతోనూ, తలుపులు మెల్లిగా తెరిచిన సీతమ్మ, భర్తకి మామూలు కంటే ఎక్కువ సపర్యలు చేసింది. అసలే చలికాలమూ, అందులో అర్ధరాత్రి. ఇక దంపతుల మధ్య మనం ఎందుకు చెప్పండి. పదండి కంచికి.
         
                             - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...