Saturday 4 June 2022

స్వస్వరం

మొన్న భగవాన్ చెప్పిన విషయాలు, కృష్ణభిక్షుతో సంభాషణ అన్నీ కలిపి ఒక లేఖ లాగా రాసి పెట్టింది. చూస్తే చక్కగానే తోచింది ఆమెకు. ఒక వారం గడిచింది. ఆశ్రమం వెనగ్గా ఉన్న గోలక్ష్మి సమాధి దగ్గర చెట్టు నీడలో కూచుని తన పాత రచనలని ఏం మార్పు. చెయ్యాలా అని చూస్తోంది నాగమ్మ. ఇంతలో కృష్ణభిక్షు అటు వెళుతూ నాగమ్మని చూసి "ఏమిరాస్తున్నావమ్మా?" అని పలకరించాడు.

"పాతవే మళ్ళీ చూసుకుని దిద్దుకుంటున్నాను అన్నా, ఆ. మర్చేపోయా, నీ రాజకుమారుడి విషయం కొత్తలేఖలో రాశాను."

"రాశావా, అందుకే నేను వచ్చాను నీ దగ్గిరికి. రాయద్దని అడగటానికి"

"అన్నా, మహనీయులైన భగవాన్ చెప్పిన మాటలు ఒక్కటి వొదిలేసి నా మనస్సు ఒప్పుకోదు. నిజానికి భగవాన్ చెప్పిన మాటల్లో కొంత హాస్యం తోస్తోందని అనిపిస్తోందే తప్ప వేరే భావం ఏదీ అనిపించటల్లేదు అన్నా"


"సరే, నీ ఇష్టమే కానీ."

"అన్నా"

"చెప్పమ్మా?"

"మొన్నటి కీర్తన నా మనస్సులో బాగా ముద్ర వేసుకుపోయింది"

"అది నీ సంస్కారబలం"

"అన్నా, ఇంకొక కీర్తన పాడవూ?"

"మళ్ళీ ఇంకొకటా, ఇంకో లేఖ రాయడానికా?"

"లేఖలు భగవాన్ విషయాల గురించే అన్నా. ఇంకే విషయాలూ లేఖలో రాయను. మొన్న నీ విషయం కూడా, భగవాన్ వచ్చి మాట్లాడినందుకే రాశాను"

"సరే కానీ, ఈ కీర్తన విను


పల్లవి:

సుఖి ఎవ్వరో రామనామ సుఖి ఎవ్వరో (సు)

అనుపల్లవి:

సుఖి ఎవ్వరో సుముఖి ఎవ్వరో అఖిల సారమగు తారక నామ (సు)

చరణం:

సత్యము తప్పక సకల లోకులకు భృత్యుడై దైవ భేదము లేక నిత్యమైన సుస్వర గానముతో నిరంతరము త్యాగరాజ సన్నుత (సు) "

అని ముగించాడు కృష్ణ భిక్షు.


"చాలా బావుంది అన్నా, నువ్వు పాడుతుంటే గుడిలో దేవుడి ముందు కూచున్నట్టు ఉంది"

"భగవాన్ ముందు కూచున్నట్టు లేదూ?"

"అదే సరైన ఉపమానం. కానీ నాదో సందేహం?"

"చెప్పు?"

"సకల లోకులకు భృత్యుడై అని పాడావు కదా అన్నా. కానీ భగవాన్ నమ్మేదీ చెప్పేదీ సర్వ సమత్వం కదా?, ఇంక భృత్యత్వం ఎక్కడ?"

"మంచి పాయింటే పట్టావే, సరే, ఆలోచించనీ" అని వెళ్ళిపోయాడు కృష్ణభిక్షు.


మరుసటి రోజు మధ్యాన్నం భోజనం చేసి వెళుతున్న కృష్ణభిక్షు దగ్గరికి "అన్నా, ఒకసారి మాట్లాడాలి" అని వొచ్చింది నాగమ్మ. ఇద్దరూ వెళ్ళి మర్రిచెట్టు కింద కూచున్నారు.

"అన్నా, పొద్దున్న ఇక్కడ కూచుని రాసుకుంటుంటే భగవాన్ వచ్చి పలకరించారు. ఏమి రాస్తున్నావు అని అడిగితే నిన్న నువ్వు చెప్పిన త్యాగరాజ కృతి చెప్పాను. అందులో నిన్న నిన్ను అడిగిన విషయం, సకల లోకులకు భృత్యుడై, అనే దాని గురించి అడిగాను. దయాపూర్ణులైన భగవాన్ చిరునవ్వుతో అందరికీ భృత్యుడైతే అహంకారం అణుగుతుంది. అప్పుడు సర్వ సమత్వ భావం వస్తుంది అని అన్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ పాటకెల్లా ముఖ్యమైన పదం నిత్యమైన సుస్వర గానం అన్నారు. సుస్వర గానం అంటే రాగ లయ బద్ధంగా ఉండే పాట కాదు. ప్రపంచం అంతట్లోకీ సుస్వరం ఏదంటే స్వరం ఉండటాన్నీ, లేకుండటాన్నీ దాటి నిలిచే నిత్యమైన ఆత్మ స్వరం, అదే స్వస్వరం. దాన్ని పట్టుకుంటే వచ్చేది నిరంతర ఆనంద గాన ప్రవాహమే. అది పట్టుకున్నవాడే సుఖి " అని బాష్ప పూర్ణ నేత్రాలతో గద్గద కంఠంతో చెబుతున్న నాగమ్మ మాటలని విని పరమానంద భరితుడయ్యాడు కృష్ణభిక్షు.


                             - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...