Saturday 11 June 2022

పాదం

రాత్రి పూజాంతంలో అయ్యవారు పాడటం మొదలెట్టారు.


పల్లవి:

శ్రీరామ పాదమా! నీ కృప చాలునే! చిత్తానికి రావే(శ్రీ)

అనుపల్లవి:

వారిజభవ సనకసనందన వాసవాదులెల్ల పూజించే (శ్రీ)

చరణం:

దారినిశిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ శూర అహల్యను చూచి బ్రోచితారీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)


అంటూ ముగించారు.

మర్నాడు పొద్దున శిష్యులు ఆ పాటని పాడగా విని తలఊపారు అయ్యవారు.


ఇంతలో వెంకట రమణ భాగవతార్ లేచి "గురువుగారూ, యుద్ధాలు ఏమీ చేయని అహల్యని శూర అహల్య అని సంబోధించటం కొత్తగా ఉన్నది అనుకుంటాను" అన్నాడు.

అయ్యవారు చిరునవ్వుతో "నిజానికి అహల్యే అందరికంటే శౌర్యం కలది. తను చేసిన తప్పుకి గౌతమ మహర్షి పెట్టిన శాపాన్ని స్వీకరించి, అక్కడే ఆ దుమ్మూ ధూళిలో పడి, అలా తపస్సు చేసీ, చేసీ సంవత్సరాలు, యుగాలు దేనికీ చలించకుండా మనస్సుని నిగ్రహించి, అగ్నిలో పుటం పెట్టిన బంగారంలాగా, శుద్ధంగా బయటకు వచ్చి రామ ప్రభువుచరణ స్పర్శని పొందిన ధన్యురాలు. ఎంత ధన్యురాలు అంటే రామాయణం మొత్తంలో బంధుత్వం లేకుండా రామప్రభువు ముట్టుకున్న స్త్రీ, ఆమే" అన్నారు.

భాగవతార్ మళ్ళీలేచి "గురువుగారూ, అహల్య తపస్వి అంటే ఇంకా బావుంటుందేమో" అన్నాడు. శిష్యుడి మనస్సులో శూరఅహల్య అనే మాట తప్పు అనే భావం పోలేదని గ్రహించిన అయ్యవారు "నీకు నిజంగా జరిగిన కథ చెబుతాను, విను. ఒక అడవిలో ఒక ముని ఉండేవాడు. ఆయన శిష్యుల్లో ఒక కుర్రవాడు రాజాస్థానంలో కవి. ఆ కవి తన గురువు గారి మీద "భరణి" అనే పద్ధతిలో ఒక కావ్యం రాసి రాజసభలో చదువుతుంటే మిగతా పండితులు అభ్యంతరపెట్టారు. వారి అభ్యంతరం ఏమిటంటే భరణి అనే కావ్యశైలి వెయ్యి ఏనుగులని చంపే వీరుడిని వర్ణించేది. అడవిలో ఉన్న ముని చివరకు చీమని కూడా చంపడు. మరి ఆయనపై ఇటువంటి కావ్యం రాయటం తప్పు కదా అని.

శిష్యుడు పండితులని వచ్చి తన గురువుగారి శూరత్వము  చూసి పరిక్షించుకోవచ్చని అన్నాడు. మర్నాడు పండితులు ముని వద్దకు వెళ్ళారు. అహంకారాన్ని జయించిన ఆ ముని దగ్గరకు వెళ్ళగానే పండితుల మనసులు మూగపోయాయి. కదలలేదు. అంతా అలా పరమశాంత స్థితిలో కూచున్నారు. కొన్ని రోజుల తరవాత ముని అనుగ్రహం వల్ల మళ్ళీ లోకంలోకి వచ్చిన పండితులు అందరూ ముక్తకంఠంతో వెయ్యి ఏనుగులని చంపే శూరత్వం కంటే ఎన్నో ఎక్కువ రెట్లు కష్టమైన అహంకార నాశనం చేసిన ముని అందరికంటే శూరుడు అని వర్ణించారు.

దీని వల్ల అర్థం అయ్యేది ఏమిటంటే శూరులు అనేది ఇతరులతో యుద్ధం చేసేవారి కంటే అంతర్యుద్ధం చేసి తన మనస్సుని నాశనం చేసిన వారి విషయంలో ప్రయోగించటమే ఉచితం అనిపిస్తుంది. అహల్య అలా మనోనాశం చేసిన మహనీయుల్లో ఎన్నతగినది.

ఇంకో విధంగా చూస్తే శూర అనేది రాములవారి సంబోధనగా గ్రహించినా సమన్వయం సరిపోతుంది కదా" అని ముగించారు అయ్యవారు.


                        - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...