Thursday, 11 August 2022

హల్లీసకము - మొదటి భాగము

సాయంత్రమైంది. గోపికా సుందరీమణులు ఓపికలు లేని చిత్తంతో రాసమండల పరిభ్రమణ మహా మండలేశ్వరుడూ, గోప గోపీజన గౌరవ మనోహారీ, నిరంతర తపస్సంతప్త సర్వ కిల్బిష హర సమర్ధ మహా మౌనిజన హృదయ నివాసీ, అయిన ఆ నల్లనయ్య కోసం వేచి ఉన్నారు. వారి పేర్లు అర్మిలి, నెనరు, గాదిలి, మక్కువ, నెమ్మి, రహి, కూర్మి, లలి . వీళ్ళందరికీ ముగ్గురు దూతికలు ఉన్నారు. ఆ అమ్మాయిల పేర్లు ప్రేమ, ప్రియ ప్రీతి.

అందరూ ఆ నల్లని వాడి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఇంతలో అర్మిలి


ఇదిగిదిగొ ఇక్కడే, ఇక్కడే నావాడువెలుగు కన్నుల,నన్ను చూచినాడు

 

అదిగదిగొ ఆ పూల వనము లోపల స్వామి చేరి నా చేతులు పట్టి నాడు

 

ఇదిగిదిగొ ఈ శింశుపా వృక్ష ఛాయలో ప్రభువు కౌగిలి పెన వేసినాడు

 

అదిగదిగొ ఆ నీల సరసు లో నా రేడు జలకమాడి వేణి తీర్చినాడు

 

ఏడి,వాడు, రాడు, నా మన్మధుని ఈడు మోడి చేసి వాడు మాయమయ్యె

 

వాడు లేని నాడు రేడు లేనిది జగము వాడి పోయెను మనసు వాడు లేక

 

అంటూ ఏడవడం మొదలెట్టింది. ప్రేమ మెల్లిగా అర్మిలిని సముదాయించడం మొదలుపెట్టింది.


"స్వామి, వస్తాడు. తప్పకుండా, మొన్న అన్నిపనులు చేసిన వాడు మళ్ళీ రాక ఎక్కడికి పోతాడు. మెల్లిగా వస్తాడు. ఇంకాపొద్దు కూడా సరిగా కాలేదు. మెల్లిగా వస్తాడు. ఆగు. " అన్నది ప్రేమ..

 

" వస్తాడంటావా మెల్లిగా, వస్తే చాలు,వచ్చి మెల్లిగా చూస్తే చాలు, చూసి, చూసి.....

 

మెల్లగా కనులతో చూచినంతనె చాలు కన్నులలొ కన్నుల్లు కలిసిపోవు

 

మెలమెల్లగా తాను మాటాడినంతనే పాటపాడును గుండె ప్రతి క్షణమ్ము

 

మెలమెలమెల్లగా ముట్టుకొనినంతనే చుట్టుకొని వదల దా మనసు రాదు

 

మెలమెల్ల మెలమెల్ల మూర్కొనునంతనే కరిగి వానిలోన కలిసిపోదు

 

మెల మెల్ల మెల మెల్ల మెల్లగా ఒకసారి చేయి పట్టినంత వాడె నేను

 

మెల మెల్ల మెల మెల్ల మెల మెల్ల మెల్లగా దగ్గర తీసిన ఉన్న దొకటె " అన్నది అర్మిలి.

 

" అవును, నువ్వూ, స్వామీ కలిస్తే మిగిలేది ఒకటే కానీ, మిగతావాళ్ళు కలిసినా కూడా అంతే కదా బృందావనమందయానా, అదిగో అక్కడ కూచున్న కూర్మి సంగతి చూడు, ఎప్పుడూ ఇల్లు వదలి రాని పిల్ల ఎలా అయిపోయిందోదాని పక్కన కూర్చుని నెమ్మదిస్తూ పాట పాడుతోంది నెమ్మి ఒకసారి విందాం పద " అంటూ అర్మిలిని తీసుకుని గాదిలివెళ్ళింది.

 

అక్కడ నెమ్మి సప్తస్వరాల హరివిల్లు విరిసే గళంలో కృష్ణుడిని ఉద్దేశించి కూర్మి గురించి పాడుతోంది.

నిచ్చలింట్లో నుండే నీరజాక్షిరో ఇది అచ్చపు ప్రేమతో అటమటించెనురా

మెచ్చుకోళ్ళవి తాను మెచ్చేది లేదుర ఇచ్చకమ్ములవీ నచ్చేది కాదురా

ఉల్లముల్లసిల్ల మెల్లన తలనిండ మల్లెమొల్లలు మరి ముడియుచున్నదిరా

తెల్లని కోకది నారింజ చెంగుతో అభిసారిక లాగు వెలుగు చున్నదిరా 

సల్లలితముగాను ఒక గీతి పాడుచు మెల్లగ తల ఎత్తి చూచుచున్నదిరా

కళ్ళలో నీరుతో కృష్ణ కృష్ణా యని ఎల్ల దిక్కుల నిన్ను వెదకేనురా

మనసులో నువు  నిండ మాటలు పెగలక మౌనిలా తానేమో కూరుచున్నదిరా

తానిది తానది అనుచు తనలో తాను తనవాడనీ నిన్ను తగిలియున్నదిరా

కానడు  తనననుచు కలికి కుందుచు బాగా విన్నబోయీ మిగుల చిన్న అయినదిరా

బాణము ధాటికి వేణిని వదలి బాల నిన్నే తలచి బడలి ఉన్నదిరా

వేగమె నీవొచ్చి చెయిబట్ట కుంటేను చెయిదాటి పోయేను: చలమేలరా

సాగి శ్రీ స్వామి శ్రీ రాజగోపాల నీమముగ దొరతనము నిలబెట్టుకోరా

అలా నెమ్మి పాటవినీ, కూర్మి మనసు చేసే మొర విని కూడా రాలేదు కృష్ణుడు. కూర్మి బడలి, వడలి, నెమ్మి ఒళ్ళో ఒరిగిపోయింది. ప్రేమ వచ్చి శైత్యోపచారాలు చేయటం మొదలుపెట్టింది.

అర్మిలి, గాదిలి ఇద్దరూ కూర్మిని, నెమ్మిని చూసి ఎంతో దిగాలుపడ్డారు.

ఇంతలో పుష్ప కుంజం లో ఉన్న రహి, అక్కడ నృత్యం చేస్తూ ఉన్న నెనరు గురించి

తనను తాను మరచి మరచి తన్మయమైనదిరో

చిన్నారి చెలి చక్కగ చిన్ననాటి సొద తలచుచు

మదిలో పట్టని ప్రేమతొ కన్నులలో వెన్నెలతో

ముదిత మనో మోహనముగ అతిలోకపు నవ్వుతోడ

నేనే కృష్ణుడననుచు నమ్మకముగ ఆటలే

నవ్వులతో పువ్వులతో సువ్వి, ఈల పాటలే

బకుని, కేశి, పూతనలని చంపానని మాటలే

గోపికనని వేడుకగా నవ్వుల విరి. తోటలే

నాకే కస్తూరి నుదుట, పింఛముంది  చూసుకో

ఇదిగో ఇదె వైజయంతి, ఇదియే పీతాంబరము

ఇవిగో శంఖము చక్రము కౌస్తుభమూ, నందకమూ,

ఇవిగో అందెలు ఘల్లన, ఇదిగో వేణువు అనుచును

నేనే పూతనను చంపి పాలు త్రావినానుగా

నేనే కాళియు తలపై నూత్న నాట్య మాడితిగా

నేనే కేశిని చంపి చల్దులెన్నొ కుడిచితిగా

నేనే గోవర్ధనమును ఒక్క కేల నెత్తితిగా

నేనెవ్వరు నేనెవ్వరు నేనెవ్వరు అని అడుగుచు

నేనె  జగద్రక్షణకై దీక్షా కంకణ ధారిని

నేనే విశ్వము లాగా కనిపించే వెలుగును

అవ్యయమఖిలము నేనే ఆదిరూపుడను నేనే

నిర్వికార నిరంజనము నేనే అని పలుకుచూ

అని పాడటం మొదలెట్టగానే అందరూ రహి తన్మయత్వాన్ని, నెనరు తల్లీనమై చేసే నాట్యాన్నీ ఆశ్చర్యంగా చూడ సాగారు. అద్భుతమైన ఆ నాట్యాన్ని చూస్తూ, మధురమైన ఆ పాట వింటూ, కృష్ణుడి లాగా అభినయం చేయటం చూస్తూఅందరూ ఆనందిస్తున్నారు.

నాట్యం ఆగింది.

ఇంతలో యమున వడ్డున నుంచీ, " అందరూ ఇటురండి" అనేకేక వినిపిం చింది. అందరూ "ఏమిటా" అన్నకుతూహలంతో అక్కడికి పరిగెత్తారు. అక్కడ యమున వడ్డున ఇసకలో శంఖ చక్రాంకితాలైన కృష్ణ పాదాలు, వాటి చుట్టూచిన్న వృత్తమూ, వాటి మీద రంగురంగులపూలూ కనిపించాయి అందరికీ. నేల మీద పడుకుని మక్కువ అందిస్తున్నపూలని ఆ పాదాల చుట్టూ సద్దుతోంది లలి.

మందార పూలన్ని మా మంచి శూరునకు అందాల పూలన్ని ఆనంద వీరునకు

బృందారకాది గణ రక్షణ సుధీరునకు బృందావనములోని చిన్నారి మారునకు

నందాత్మజునకు మా నవనీత చోరునకు అందరిని ఉల్లాస పరచేటి పేరునకు

కలికి మొగము లాగ కలువ విచ్చింది

 

కలికి పెదవిలాగ మందార విరిసింది

 

కలికి తళుకులాగ పొగడలే వెలిగాయి

 

కలికి మొగము లాగ మల్లెల్లు మెలిగాయి

 

కలికి నడకలాగ తామరలు ఊగాయి

 

కలికి వేడుక లాగ జాజులు సాగాయి

 

కలికి నడత లాగ దవనమ్ము గంధమ్ము కలికి మొత్తమ్మది కృష్ణుని సొమ్ము

అంటూ పాడుతూ ఆడుతోంది  మక్కువ.

అందరూ ఆ కృష్ణ పాదాలని చూసి మెల్లిగా వంగి చుట్టూ ఉన్న ఇసక కొంచెం తీసుకుని మూర్ధంలో ధరించారు. దానిచుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు. అందరూ కృష్ణుడు అక్కడే నుంచుని వున్నట్టుగా భావనచేస్తూ ఉన్నారు.  "మెల్లమెల్లగ మనసుదోచుతు, నల్లకలువల మించు సొబగుతొ, ఎల్లవారల గుండెనిండే, కళ్ళు ఎవ్వరివో " అంటూ అన్నది కూర్మిఆర్తితో,

"సనక ఋషులను మించినట్టిది, జనక రాజుని దాటినట్టిది, కనక ప్రభలను దాటు వజ్రపుతునక ఎక్కడిదో?" అన్నది నెమ్మి. "మీరు చెప్పే వాటిల్లో ఛందో భంగం ..." అంటూ సంకోచిస్తూన్న రహిని మధ్యలోనే ఆపింది గాదిలి. "ఎన్ని భంగాలున్నా బాధలేదు, మనం చెప్పేది త్రిభంగిలో నుంచున్న వాడి గురించైతే మట్టుక్కు.  మనవాడు అన్ని వ్యాకరణాలకీ అతీతుడు కదా?. నువ్వు కూడా ధైర్యంగా నాలుగు పాటలు పాడు, పద్యాలు చెప్పు, సరైతేమంచిదే, తప్పులైతే మరీ మంచిది." అన్నది గాదిలి. మెల్లిగా రహి కోమలమైన స్వరంతో


బాలగోపాలమాశ్రయేహం, సతతం. (బా)

నీల నీరద దేహ, నిరుపమ శుభ గేహ,

పాలితాద్భుత వాహ, సకల జగన్మోహ  (బా)

నంద గోప కుమార, నిత్య సుఖ సంసార

బృందావన చోర, వందారు మందార.    (బా)

అకళంక మృదు భాష, అవని రాక్షస శోష

సకలేంద్రియ శేష , సరస మంగళ వేష.   (బా)


అని పాడింది. "బానే పాడావు కదా, కృష్ణుణ్ణి పడేయటానికి ఇంకేం కావాలి" అని గాదిలి అంటే రహి సిగ్గుపడింది.

"ఒద్దికగా నుండే ముద్దు గోపాలునితో సద్దు చేసే మంచి బుద్ధిశాలి యెవరో (ఒ)

హద్దులు మీరుచు నిద్దర మానుచు వద్దు అంటూ కూడు ముద్దియ యెవ్వరో (ఒ)

అద్దంపు చెక్కిళ్ళు వసివాడులాగా, ముద్దుల్లు పెట్టేటి మోహిని ఎవరో

సుద్దులు చెప్పుచు ఎద్దుల బండిలొ పొద్దున్నె మీదున్న  పెద్ద జాణ ఎవరొ? (ఒ)

నిక్కి చూచి మదిలో చక్కని సామిని గ్రక్కున చేతితొ పట్టిన దెవరో?

ఎక్కువ ప్రేమతొ దిక్కునీవనుచును మక్కువతో కౌగిలించేది ఎవరో?

చిక్కియు చిక్కని చుక్కల రాయుని చుక్కల రాతిరి సొక్కజేసిన దెవరొ?

మిక్కిలి కూర్మితొ పెక్కైన భంగుల హక్కుగ స్వామిని హత్తుకున్నదెవరొ?  (ఒ)

అంటూ కృష్ణుడు ఎక్కడ  ఉన్నాడోనని, ఎవరితో ఉన్నాడని ఊహించి నెనరు రాగాలు తీసింది.

ఇంతలో వనంలోనుంచి కృష్ణుడి వేణుగానం వినిపించింది.

 

మొదటి భాగం సమాప్తం.


                      - జొన్నలగడ్డ సౌదామిని 

టీ

కాళిదాసూ, మాఘుడూ, భారవీ, బాణుడూ లాంటి కావ్యరస గ్రహణపారీణులు అంతా నందన వనంలో, కల్పవృక్షంచెట్టు నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి సురభిళంగా వుంది. మధ్య మధ్యా అక్కడ ఉన్న పరిచారికలు కావలసినవన్నీ చూస్తున్నారు.

ఇంతలో యేదోవొక విషయమ్మీద మాఘుడికీ  బాణుడికీ భిన్నాభిప్రాయం వచ్చింది. ఇద్దరు తెలివిగలవాళ్ళ మధ్య గొడవ రాకుండానే వుండాలి కానీ, వొస్తే సుఖాసుఖాల తేలుతుందా?. ఇద్దరూ గట్టిగా పట్టుపట్టి కూచున్నారు. కాళిదాసూ, భారవీ మధ్యలో కల్పించుకుందామంటే వారికి కోపదారులైన ఆ ఇద్దరంటే మహా భయమాయె. అందులోనూ బాణుడుగారు అంటే మరీ భయం. ఆయన మాటలు మామూలుగానే బాణాలు లాగా ఉంటాయి, ఇక కోపమొస్తే చెప్పనే అక్కరలేదు. మాఘుడు గారు వదిలే మాటలు ఆక్షణం పెద్ద కఠినంగా అనిపించకపోయినా తర్వాత వాటిని లోతుగా ఆలోచిస్తే అనిపించే ధ్వనులూ, గూఢార్థాలూ గుండెని గుభేలనిపించకమానవు.

విషయం ఎంత జటిలం అయినా ఎవరో ఒకరు సర్ది చెప్పాలి కదా. తప్పక కాళిదాసు  పూనుకున్నాడు. కాస్త ఆలోచించి పరిచారికని పిలిచి అందరికీ చక్కటి కస్తూరి, కుంకుమ పువ్వూ వేసిన టీ పట్టుకురమ్మన్నాడు. టీ వొచ్చే లోపు బాణుడికీ మాఘుడికీ ఏవో సాంత్వన పరిచే విషయాలు చెప్పాడు. కొద్దిగా విషయం మార్చటంతో వాతావరణం కాస్త తేలికపడింది. ఇంతలో టీ వచ్చింది. కవులందరూ ఆహా, ఓహో అంటూ జుర్రారు.

టీ చక్కగా పనిచేసిందని కాళిదాసు సంతోషించినంత సేపు పట్టలేదు మన కవుల వాగ్వాదం మళ్ళీ ఆరంభం కావటానికి. కాళిదాసు తలపట్టుకున్నాడు. ఇలా వ్యవహారం వందల టీ పాత్రల మీదా, గంటల కొద్దీ సాగింది. కానీ ఇంకా మాఘుడూ, బాణుడూ బిర్రబిగుసుకుని కూర్చునే ఉన్నారు.

అట్లా వాగ్వాదం సాగుతుండగా బాణుడుగారు అన్నాడూ "నేను చెప్పేదాన్ని ఆ దేవత తప్పితే ఇంకెవరు కాదన్నా ఒప్పుకోను" అని. వెంటనే కాళిదాసుకి బుర్రలో ఆలోచన వచ్చింది. బాణుడి వైపూ, మాఘుడి వైపూ తిరిగి "మీరిద్దరూ మహాకవులు , కాబట్టి మీ వాగ్వాదం తీర్చడం ఆ దేవి వల్లే అవుతుంది. అందుకని ఆ దేవిని ప్రార్థిద్దాము. ఆ దేవి వొచ్చి ఏమి చెబితే అది మీరు ఇద్దరూ ఒప్పుకోవాలి " అని చెప్పిందానికి అందరూ ఒప్పుకున్నారు.

అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు కరుణారసభర నయనాలతో దయతో చూస్తూ చిరునవ్వుతోప్రత్యక్షమైంది. అందరూ నమస్కరించారు. కాళిదాసు ఆ మహాకవుల వివాదం గురించి కొద్దిగా చెప్పి ఆ మహాకవులని వారివారి వాదన చెప్పమన్నాడు. ఇంతలో అమ్మవారు అక్కడ బల్లల మీద ఉన్న టీ పాత్రలని చూసి "మీరందరూ ఒకటికి పది టీ తాగి కూర్చున్నారు, మరి నాకు టీ ఏదిరా" అన్నది.

బాణుడు, మాఘుడూ పరిచారికల దగ్గరకి పరిగెత్తారు.

కాళిదాసు కొద్దిగా ఆలోచించి "సర్వజగత్తునీ కాపాడి కష్టపడుతున్నదానికి నీకు ఒకటీ ఎక్కడ సరిపోతుంది తల్లీ. ఇవిగో పన్నెండు టీలు సమర్పిస్తున్నాను, అనుగ్రహించు" అని


చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ

కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |

పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా

ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతాం

అని  భక్తిభావంతో పాడాడు. ఇంతలో మాఘుడూ, బాణుడూ తెచ్చిన టీని సేవించిన అమ్మవారు కాళిదాసుని చిరునవ్వుతో చూస్తూ  "అసలు టీ కంటే నీ పన్నెండు టీలే బావున్నాయిరా" అంటూ తన దగ్గిర ఉన్న టీ పాత్రలని విసిరేస్తే పాత్ర బాణుడి ఒళ్ళోనూ, పాత్ర కింద ఉండే పానపాత్ర మాఘుడి చేతిలోనూ పడ్డాయి. అమ్మవారు అదృశ్యురాలైంది.

పాత్ర గొప్పదా, పానపాత్ర గొప్పదా అనే విషయంలో చర్చ మొదలై ఇప్పటి వరకూ తెగినట్టు లేదు. చివరికి ఏమైందో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.

(అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా రాసినది)

    

                         - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday, 9 July 2022

సందేశం

సాయంత్రమైంది. మెల్లిగా గోపికలూ, గోప బాలురూ యమునా తీరం దగ్గరకి చేరుతున్నారు. గోధా కూడా తన స్నేహితురాళ్ళతో కలిసి యమున దగ్గరకి వస్తోంది. ఇంతలో అక్కడ ఉన్న కానుగు చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు బయటకి వచ్చి గోధాని పిలిచాడు. గోధా మెల్లిగా పక్కకి వచ్చి "ఏమిటి, విశేషం, ఇవ్వాళ్ళ నీ దృష్టి నామీద పడింది?" అన్నది నవ్వుతూ. కృష్ణుడు తల కొద్దిగా దించి దిగాలుగా ఉన్న ముఖంతో " ప్రియంవదకి నా మీద కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయింది"

"ఎందుకో?"

"ఎందుకో ఒకందుకు. ఆ సంగతి ఇప్పుడు ఎందుకు  కానీ, ముందర నీ స్నేహితురాలి  దగ్గరికెళ్ళి తన కోపం తగ్గించి ఇక్కడకి తీసుకురాకూడదూ."

"ముందర తమరు చేసిన అపరాధం చెప్పండి మహానుభావా?"

"తప్పదా?, సరే విను తనని దగ్గరకు తీసుకుంటూ పొరపాటున..."

"ఊ, పొరపాటున, ఏమి చేశావో చెప్పు."

"చతురిక అని పిలిచా, అంతే"

"అంతేనా, కొంపలు ముణిగి పోయే  పనిచేసి, అంతే అని అంటావా?"

"ఎలాగైనా నువ్వే రక్షించాలి" అంటూ గోధా చేతులు పట్టుకున్నాడు.

"పక్షం క్రితం నేను నీతో నాట్యం చెయ్యటానికి వస్తే ఏమి చేశావో గుర్తు ఉందా?"

"నక్షుద్రోపి  ప్రథమసుకృతాపేక్షయా సంశ్రయాయ

ప్రాప్తే మిత్రే భవతి విముఖః కిం పునర్యస్తథోచ్చైః"

"ఎంత అల్పుడైనా, ఆశ్రయం కోరి మిత్రుడు వస్తే, ఇంతకు ముందు చేసిన ఉపకారాన్ని ఆలోచిస్తూ విముఖుడిగా ఉండలేడు. అలాంటప్పుడు ఉన్నతమైన వారి గురించి చెప్పటానికి ఏముంది."

"భలే పొగిడావు , కానీ.."

"ఇంకేమీ అనుకోవద్దు.

తేనార్థిత్వం త్వయి విధివశా దూరబంధుర్గతోహం

యాంచా మోఘా వరమధిగుణే నాథమే లబ్ధకామా

విధివశాత్తు, బంధువులు దూరంగా ఉన్న నేను నిన్ను యాచిస్తున్నాను. మంచి గుణాలు ఉన్న వారికి చేసిన విన్న ఫలించకపోయినా మంచిదే, అధములకి చేసిన విన్నపం సఫలమైనా అది మంచిది కాదు."

"సరే, దౌత్యం వహిస్తాను. ఇంతకీ ప్రియంవదని నువ్వు తప్పు పేరుతో పిలిచిన తరవాత ఏమైందో చెప్పు."

"వెంటనే పుష్ప కుంజంలోంచి వెళ్ళిపోయింది. నేను క్షమించమంటూ ఆమె వెంట వెళ్ళాను. ఆమె వెళ్ళి తన ఇంట్లో ఉన్నమణి మంటపంలో కూచుంది."

"ఊ"

"యా తత్ర స్యాత్ యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః

అక్కడ ఏ అమ్మాయి ఉన్నదో, ఆమె స్త్రీల విషయంలో బ్రహ్మ యొక్క అత్యుత్తమ సృష్టి"

"బ్రహ్మాండంగా చెప్పావు, తరవాత ఏమైంది?"

"తంత్రీ మార్ద్రాం నయన సలిలైః సారయిత్వా కథంచి

ద్భూయోభూయః  స్వయమపి కృతాం మూర్ఛనాం  విస్మరంతీ

కన్నీళ్ళ చేత తడిసిన వీణ తీగెని ఎట్లాగో శ్రుతి చేసి మళ్ళీ మళ్ళీ తాను సొంతంగా రచించిన స్వర కల్పనని మరచిపోతున్నది నా ప్రియతమ"

"బావుంది, తరవాత"

"జాతాం మన్యే శిశిర మథితాం పద్మినీం వాన్య రూపాం

తాను, శిశిరంలో మంచు తో బాధపొందే పద్మం యొక్క మారు రూపం అని తలుస్తాను"

"ఆహా, ఏం చెప్పావు., తరవాత."

"తామేవోష్ణైర్విరహమహతీ మశ్రుభిర్యాపయంతీం

ఆ రాత్రే ఎక్కువైన విరహంతో, వేడి కన్నీళ్ళతో, గడుపుతున్న ఆమెను చూడు."

"ఊ"

"ఆమెతో మాట్లాడు. ఆమె కోపం తగ్గించు."

"--"

"ఆపన్నార్తి ప్రశమన ఫలాః సంపదో హ్యుత్తమానాం

ఉత్తముల సంపదలు ఆర్తుల ఆపదలు నివారించటమే ఫలముగా కలవి కదా."

"సరే, ఆలోచిస్తాను, కానీ ఈ ఎడబాటు వల్ల ఆమె ప్రేమ ఏమన్నా తగ్గి ఉంటుందా?"

"స్నేహానాహుః కిమపి విరహే ధ్వంసినస్తే త్వభోగా

దిష్టే వస్తున్యుపచితరసాః ప్రేమరాశీ భవంతి.

ఎడబాటు కలిగినప్పుడు మమతలని ఎందుకో నాశనమౌతాయని చెబుతున్నారు. కానీ ఆ మమతలు భోగం లేకపోవటంవల్ల ఇష్టమైన వస్తువు మీద పెరిగిన రసాల వల్ల ప్రేమరాశి అవుతున్నాయి"

"అయితే?"

"ఆశాబంధః కుసుమ సదృశం ప్రాయశోహ్యంగనానాం

సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగేరుణద్ధి

వెంటనే రాలిపోయే స్వభావం ఉన్న స్త్రీల జీవితంలో కలిగే విరహ భావనని ఆశ అనే బంధమే ఎక్కువగా నిలుపుతుంది."




కానీ ప్రియంవదని ఎరిగిన నాకు ఇది వ్యర్థం అనిపిస్తోంది.

"కేవానస్యుః పరిభవ పదం నిష్ఫలారంభ యత్నాః"

ఉపయోగం లేని పనులు కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా అవమానపాత్రులు ఎందుకు కారు?"

"నీవంటి మెత్తని హృదయం కలవాళ్ళు ఇలా మాట్లాడకూడదు.

ప్రాయస్సర్వో భవతి కరుణావృత్తి రార్ద్రాంతరాత్మా

తరచుగా, సున్నితమైన మనస్సుగల ప్రతివారూ  కారుణ్యం కలవారు అవుతున్నారు. "

"---"

"ఎందుకంటే

ప్రత్యుక్తం హి ప్రణయిషు సతాం ఈప్సితార్థ క్రియైవ

ఎందుకంటే సత్పురుషులకి ప్రణయజీవులకి ఇష్టమైనవి ఇవ్వటమే ప్రత్యుత్తరం"

"ఎంత బాగా చెప్పావు.?. ఇంతకీ తనకి నీ సందేశం ఏమని చెప్పమంటావు?"

"కాలే కాలే భవతి భవతా యస్య  సం యోగ మేత్య

స్నేహ వ్యక్తిశ్చిర విరహజం ముంచతో బాష్పముష్ణం

మారుతున్న అన్ని కాలాలలో , ప్రేమ ప్రవృత్తి తో తనతో  సం యోగాన్ని  పొంది చిరకాల వియోగంతో కలిగిన వేడి కన్నీటిని విడవడం ఎవరికి కలుగుతోంది?  అని అడుగు?"

"ఇంకా?"

"అవ్యాపన్నః కుశలమబలే! పృఛ్ఛతి త్వాం వియుక్తః

పూర్వాభాష్యం సులభవిపదాం ప్రాణినామేతదేవ

నీ వియోగంతో తపించిపోతూ నీ క్షేమాన్ని అడుగుతున్నాడు అని చెప్పు. నేనూ క్షేమమే అని చెప్పు.

ఏమీ లేకుండా ఆపదల పాలైన ప్రణయ జీవులకి ఇదే మొదట చెప్పవలసిన మాట"

"చక్కగా చెప్పావు"

"శుక్లాపాంగైః సజలనయనైః స్వాగతీకృత్య కేకాః

ప్రత్యుద్యాతః కథమపి భవాన్ గంతుమాశు  వ్యవస్యేత్

ఆనంద బాష్పాలు రాలుతున్న కళ్ళు కల నెమళ్ళు వాటి కేకారావాలతో ఎదురుకోలు ఇస్తుండగా నువ్వు ఎట్లాగైనాతొందరగా వెళ్ళటానికి ప్రయత్నించు."

"సరే బయలుదేరుతున్నాను."

"మందాయంతే న ఖలు సుహృదా మభ్యుపేతార్థ కృత్యాః

మిత్రుల పని సఫలము అయ్యేదాకా చేస్తాము అన్నవారు ఆలస్యము చేయరు  కదా?"

"వెళ్ళే ముందర నీతో ఒక మాట కృష్ణా"

"చెప్పు"

"కస్యైకాంతం సుఖముపనతం దుఃఖ మేకాంతతో వా

నీచైర్గఛ్ఛత్యుపరిచ దశా చక్రనేమి క్రమేణ

ఎవరికి ఎప్పుడూ సుఖము కానీ అచ్చంగా దుఃఖంగానీ ప్రాప్తించింది?. ఈ అవస్థలు బండి చక్రం లాగా పైకీ కిందకీపోతున్నాయి."

"ఊ"

"కాబట్టి చింతించవద్దు"

"అలాగే"

"అంతః సారం ఘన!, తులయితుం నానిలః శక్త్యతి త్వాం

రిక్తః సర్వో భవతిహి లఘుః పూర్ణతా గౌరవాయ

ఓ మేఘం లాంటి రంగు ఉన్న వాడా, లోపల శక్తి ఉన్న నిన్ను మహత్తరమైన వాయువు కూడా కదిలించలేడు. లోపల శక్తిలేని వాడి దగ్గర ఏమీ ఉండదు. శక్తి గల పూర్ణుడికే  ఎప్పుడూ గౌరవం ఉంటుంది. "

"ఊ"

"నీ శక్తి అనేది నీకు ప్రియంవద మీద ఉన్న అచంచలమైన ప్రేమ.

సౌభాగ్యంతే సుభగ! విరహావస్థయా వ్యంజయంతీ

కార్శ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః

ఓ ధన్యుడా, సౌందర్యంతో ప్రకాశిస్తున్న ఆమె  ఎట్లా చిక్కిపోకుండా ఉంటుందో, ఆ పని నువ్వే చెయ్యాలి."

"సరే"

"స్వల్పీభూతే సుచరిత ఫలే స్వర్గిణాం గాం గతానాం,

శేషైః పుణ్యైర్హృతమివ దివః కాంతిమత్ఖండమేకం

చేసిన మంచి పనుల ఫలం తగ్గిపోతుండగా, స్వర్గం నించీ భూమిని చేరిన వాళ్ళ పుణ్యాల చేత తీసుకురాబడినంత  కాంతిమంతమైనదీ, ముఖ్యమైనదీ అయిన స్వర్గపు తునక లాగా ఉన్నది ఈ ప్రదేశం."

 "--"

"ఇక్కడికి ప్రియంవదని తీసుకు వస్తాను"

"ఆహా"

"సంసర్పంత్యా సపది భవతః స్రోతసి ఛ్ఛాయయాసౌ

స్యాదస్థానోపగత యమునా సంగమేవాభి రామా

ప్రవాహంలో వెంటనే వ్యాపిస్తున్న నీ నీడతో ఈ యమునా నది సంగమ స్థలం లాగా మనోజ్ఞంగా అయ్యింది."

"ఇంకా?"

"ఖద్యోతాలీ విలసిత నిభాం విద్యుదున్మేష దృష్టిం

మిణుగురు పురుగుల కాంతితో సమానమైన మెరుపులాంటి  చూపు నీది"

"--"

"దాంతో ప్రియంవదని ప్రేమగా చూడు. "

"అలాగే , ఇంక వెళ్ళు"

"ఇంకొకటి,

స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు

ప్రియులతో స్త్రీలు మాట్లాడే మొదటి ప్రణయవాక్యం విలాసం చూపించటమే కదా. అదిగ్రహించు"

"అల్లాగల్లాగే, ముందు నువ్వు తొందరగా వెళ్ళి ప్రియంవదని తీసుకురా

"అలాగే"


(కాళిదాస వాక్యాల ఆధారంగా  అల్లిన కథ)


                 ‌          - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday, 2 July 2022

మనుష్య కిశోర న్యాయం

సాయంత్రమైంది. యమునా తీరం హడావిడిగా ఉంది. గోపికలు మెల్లిగా నడిచి వస్తున్నారు. వాళ్ళ వెనక కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ముచ్చటలు చెబుతూ, వింటూ వస్తున్నాడు. అందరూ వచ్చారో లేదో చూసి అందరూ వచ్చారనటానికి గుర్తుగా ఉద్ధవుడు తల ఊపాడు. అది చూసి కృష్ణుడు సైగ చేస్తే అది చూసి గోపికలు ఆట మొదలెట్టబోయారు.



ఇంతలో ఒక సుందరి పరుగు పరుగున వచ్చి ఆట మొదలెట్టబోయే గోపికలతో కలిసింది. ఇక ఆటలూ, పాటలూ దివ్యంగా సాగాయి. కొత్తగా వచ్చిన ఆ పిల్ల అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటే చూసిన అందరూ ముచ్చట పడ్డారు. ఆమె హావభావాలూ, విలాసాలూ, వయ్యారాలూ మనోహరంగా ఉన్నాయి. కాసేపు అయిన తరవాత నాట్యం ముగిసింది. అందరూ వృత్తాకారంలో కూచుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

నందనందనుడు ఉద్ధవుడి చెవిలో ఏదో చెప్పాడు. ఉద్ధవుడు ఆ కొత్త అమ్మాయిని చూస్తూ "ఇక్కడికి ఎవరన్నా కొత్తవారు వచ్చి నాట్యమాడాలంటే వారు తమ గురించి కృష్ణుడికి చెప్పాలి. అతను ఒప్పుకుంటే అప్పుడు మా జట్టులో చేరినట్టు. అప్పటి నుంచీ ఆటపాటలలో వారు పాల్గొనవచ్చు. నువ్వేమో ఎవరినీ, ఏమీ అడగకుండా ఆటలో కలిశావు. ఈసారికి క్షమించాడు కృష్ణుడు. ఇప్పుడు వచ్చి నువ్వెవరో చెప్పు?" అన్నాడు ఉద్ధవుడు.

అందరూ తనవైపే చూస్తుంటే తప్పక, లేచి, అందరి మధ్యా కృష్ణుడి వైపు ముఖం పెట్టి నుంచుని దోసిలి ఒగ్గింది. సభక్తికంగా, సవినయంగా నుంచుని "ఈ జగత్తు మొత్తమూ వ్యాపించి ఉన్న నీకు నమస్కారం. అన్నిటా వ్యాపించి ఉన్న నీకు, నేనెవరో తెలియకుండా ఉంటుందా? చెప్పు. అయినా నీ ఆజ్ఞ అయ్యింది కనుక, దాన్ని పాలించటం మా విధి కనుక నా తెలివి కొద్దీ చెబుతాను. అవధరించు.

నేను ఎవరా అని ఆలోచిస్తే కోట్లాది జీవరాశుల్లో ఒక జీవాన్ని, ఈ జీవాలన్నింటికీ భిన్నంగా అవ్యయుడివిగా ఉన్న పరమపురుషుడివి నీవు అనిపిస్తుంది కాసేపు. నేనూ, నాతోటి ఈ జీవరాశులన్నీ నీలో భాగాలు అయినట్టు, నువ్వు మహామహిత దేహుడివి అయి సర్వ జీవరాశినీ నీలో ఇముడ్చుకున్నట్టు అనిపిస్తుంది ఇంకాసేపు.


ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే నువ్వు తప్ప వేరే ఏమీ లేదనీ, ఈ కనిపించేదంతా వ్యవహారం లో ఉన్నది అనీ, సత్యంగా ఉన్నది దివ్యమైన నీ తత్త్వమేనని అనిపిస్తుంది. నిజం ఏమిటో స్వల్ప బుద్ధినైన నాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అది నీకే తెలియాలి, నువ్వే చెప్పాలి." అని మెత్తగా, హృదయానికి హత్తుకొనేలా మాట్లాడింది.

ఆ మధుర భాషణానికి అందరూ ముగ్ధులు అయ్యారు. కృష్ణుడు చిరునవ్వుతో అంతా విన్నాడు. అప్పుడు ఉద్ధవుడు "కృష్ణా, ఆమె ఏదో ప్రశ్న వేసింది. నువ్వే సమాధానం చెప్పాలి?" అన్నాడు. కృష్ణుడు మల్లెమొగ్గల లాంటి పళ్ళు కనిపించీ కనిపించకుండా నవ్వి "ఎవరు ఎలా తలిస్తే అట్లాగే" అన్నాడు.

కృష్ణుడి మాటలు శ్రద్ధతో. ఆలకించిన ఆమె మెల్లిగా "భగవన్, అందరూ నిన్ను ప్రార్థిస్తూ మమ్మల్ని మర్కటకిశోర న్యాయం అంటే కోతిపిల్ల తన తల్లిని గట్టిగా పట్టుకున్నట్టు కాకుండా, మార్జాల కిశోర న్యాయము అంటే తల్లి అయిన పిల్లి , పిల్లలకి ఏ కష్టం కలగకుండా వాటిని నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళినట్టు, నువ్వే జాగ్రత్తగా మమ్మల్ని సంసార సముద్రం దాటించాలి అని విన్నవిస్తారు. కానీ నాకు వాటి కంటే మనుష్య కిశోర న్యాయం నాకు సరి అయినది అని తలుస్తాను. ఎందుకంటే, పుట్టిన కొద్ది సేపటికే కోతి పిల్లలూ, పిల్లి పిల్లలూ తమంతట తాము కదల గలవు. కానీ మనుష్య శిశువు మట్టుక్కు కొన్నినెలల దాకా కదల లేదు. అంటే మనుష్య శిశువు తల్లి మీద ఎక్కువ ఆధార పడుతుంది. ఆ తరవాత కూడా పిల్లలని జీవితం మొత్తం చక్కగా ఉండేట్టు చూస్తుంది మనుష్య శిశువుని ఆ తల్లి. ఆ విధంగా ఒక తల్లి మనుష్య శిశువుని చూసినట్టు నా జీవితం మొత్తం నీ అనుగ్రహం ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను" అని సకరుణంగా అడిగిన ఆమె మాటకి కృష్ణుడి కళ్ళు కూడా మేఘాలు అయ్యాయి. "ఔను" అన్నట్టు తలకాయ మెల్లిగా ఊపాడు కృష్ణుడు.

ఆ సుందరి వెంటనే అదృశ్యం అయ్యింది. " అయ్యో, తను ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయిందే?" అన్న గోపిక ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు "తను ఘృతాచి అనే అప్సరస కూతురు. రోజూ మన ఆటలు పైనించీ చూసి ముచ్చటపడి వచ్చి ఒకసారి ఆడింది. అంతే" అంటూ స్నేహితులతో ఇంటికి బయలుదేరాడు. 

                                  - జొన్నలగడ్డ సౌదామిని.


Friday, 24 June 2022

తులసి

మధ్యాహ్న భోజనాలు అయ్యాయి. త్యాగరాజ స్వామి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఆయన కూతురు కాళ్ళకి గజ్జెలు శబ్దం చేస్తూ గది తలుపు దాకా వొచ్చి "అడుగుదామా, వొద్దా" అనుకుంటూ అక్కడ ఆగింది. కూతురు గజ్జెలచప్పుడూ, అది తలుపు దగ్గర ఆగిపోవడమూ గమనించిన అయ్యవారు "సీతమ్మా, ఇటురా" అని మెల్లిగా అన్నారు.

"ఇంక ఆలోచన ఎందుకు?" అని మనస్సు దిటవు పరుచుకుని గదిలోకి వెళ్ళి తండ్రి ముందు కూచుంది సీతాలక్ష్మి. అయ్యవారు  తల ఎత్తకుండానే  "ఊ, చెప్పు, మళ్ళీ ఏం అయ్యింది?" అన్నారు అయ్యవారు. "ఏమీ కాలేదు నాన్నగారూ, పెళ్ళై తంజావూరు వెళ్ళిన మన పక్కింటి సుందరమ్మ పండక్కి వొచ్చింది" అని ఆగింది.

"వొస్తే?"

"రెండు వారాలు ఉండి కార్తీక దశమి నాటికి వెళుతుందట"

"వెళితే?"

"వాళ్ళ అత్తగారి ఊళ్ళో చిలుకు ద్వాదశి వ్రతం చేసుకుంటుందట"

"అబ్బా, విసిగించక విషయం చెబుదూ?"

"సుందరమ్మ అత్తగారికి బోలెడు పాటలు వొచ్చుట, సుందరమ్మ కూడా నాలుగు కొత్త పాటలు నేర్చుకుని వెళితే దాని మన్నన  దక్కుతుందిట. అందుకని తులశమ్మ మీద పాడుకోవటానికి మీరు ఓ నాలుగు పాటలు అన్నా రాసి ఇస్తారేమోనని..."

"ఆలోచిస్తే, ఇది నువ్వూ, మీ అమ్మా పన్నిన పన్నాగంలాగా అనిపిస్తోంది"

"హహహ, సరిగ్గా గ్రహించావు నాన్నా, కొంత మా కోరికా ఉంది. ఇంత వాగ్గేయకారుల భార్యనై ఉండీ, తులసి పూజ చివరపాడు కోవటానికి ఓ నాలుగు పాటలు కూడా తెలియవే అని అమ్మ ఎప్పుడూ అనుకుంటుంది. దానికి సుందరమ్మ కోరికా తోడు అయ్యి ఇలా వొచ్చి చెప్పాను"

"దొంగలు మీరు" అంటూ అయ్యవారు హాయిగా నవ్వారు. చటుక్కున లేచి "నాలుగు తులశమ్మ పాటలు, పదిరోజులే వున్నయ్యి" అంటూ ఆ పిల్ల ఇంట్లోకి పరిగెత్తింది.

ఇదంతా చూస్తూ ఉన్న తంజావూరు రామారావు "అయ్యవారూ, మీరు ఒక తాదాత్మ్యం చెంది పాడతారు. నిజానికి మీరు ఏమి పాడారో అన్న విషయం కూడా మరుసటి రోజు దాకా మీకే తెలియదు. మరి ఈ పాటలు ఎట్లా రాస్తారు?" అని అడిగాడు.

"వాళ్ళు చెప్పాల్సిన మాట వాళ్ళు చెప్పారు. మిగతాది కోదండరాముడి ఇష్టం. ఆయన వల్ల ఏది జరిగితే అదే సుఖమూ, సుందరమూ. నిజానికి నాకు ఏ పాటా రాయాలనీ లేదు, రాయకూడదనీ లేదు. ఇప్పుడు పిల్ల చెప్పినవి కూడా అంతే. చూద్దాం భగవదేఛ్ఛ ఎలావుందో?" అని భాగవతం చేతిలోకి తీసుకున్నారు అయ్యవారు.

సాయంత్రం అయ్యింది. అయ్యవారు సంధ్య ఉపాసనకి బయలుదేరారు. మామూలుగా తను కూచునే పొగడ చెట్టుకిందకి వెళ్ళారు. అక్కడ కూచోడానికి పీట కూడా లేదు. పిల్లని పిలవబోయేంతలో " నాన్నా, ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశాను, చూడు" అన్న కూతురు గొంతు విని అటువైపు చూశారు. అక్కడ ఉసిరి  చెట్టూ, దాని ముందు  తులసి కోటా ఉన్నాయి. వాటి పక్కనే అంతా విశదంగా ఏర్పాటు చేసి ఉంది. అయ్యవారు అక్కడికి  వచ్చి అంతా చూసి నవ్వుతూ "తులసి కోటపక్కన కూర్చుంటే తులసి మీద కీర్తనలు వొస్తాయా?" అని నవ్వారు. సీతాలక్ష్మి తల పంకించి "మా ప్రయత్నం మేము చెయ్యాలి కదా నాన్నా, రాములవారి ముందు కూచుని రాముడి మీద పాటలు రాసే మీకు తులసి కోట ముందు కూచుంటే తులసి మీద పాటలు రావూ? చూద్దాము" అని వెళ్ళిపోయింది.

అయ్యవారు సంధ్యోపాసనకి కూచున్నారు. ఎదురుగ్గా ఉన్న తులసి కోటా, దానికి వేసిన రంగులూ, దాని చుట్టూ చిత్రంగా వేసిన ముగ్గులూ, అక్కడి దీపాలంకరణా ఇవ్వన్నీ ఆయన మనస్సులో ముద్రించుకుని పోయినాయి. సంధ్య ముగిసింది. కాసేపటి తరవాత రామ పూజ మొదలై చివరికి వచ్చింది. అంత సేపూ తులసి దళాలతో పూజింపబడుతున్న రామప్రభువే కనిపించాడు అయ్యవారికి. దాంతో పూజ చివర


ప. తులసీ దళములచే సంతోషముగా పూజింతు

 

అ. పలుమారు చిర కాలము పరమాత్ముని పాదములను (తు)

 

చ. సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక 

కరవీర మల్లికా సుగంధ రాజ సుమముల

ధరణిని ఒక పర్యాయము ధర్మాత్ముని 

సాకేతపుర వాసుని శ్రీ రాముని వర త్యాగరాజ నుతుని (తు)


అని పాడారు అయ్యవారు.


మరుసటి రోజు పొద్దున్న బుంగమూతి పెట్టుకుని ఉన్న కూతురిని అయ్యవారు గమనించనేలేదు. పొద్దున్నే పాఠాలకి కూచున్న అయ్యవారు రాత్రి పాడిన పాట విని ఆనందించి పిల్లని కేకవేశారు. పిల్ల రాగానే "కూచుని పాటవిను, బావుంది" అన్నారు. సీతాలక్ష్మి దిగాలుగా ఉన్న ముఖంతో "మోసం చేశావు నాన్నా?" అన్నది. అయ్యవారు ఆ మాటలకిఅదిరిపడ్డారు. "అదెట్లా?. వివరించు" అన్నారు.

కూతురు గునుస్తూ "పాట మొదటి మాట తులసి. అది చూసి తులసీదేవి మీద పాట అనుకున్నాను. కానీ యథా ప్రకారం మన రాముడి మీద పాటే అయ్యింది చివరికి" అన్నది.  అయ్యవారు సాలోచనగా "ఆయన అనుగ్రహం అది. మనం ఏమి చెయ్యగలం చెప్పు" అన్నారు. కూతురు లోపలికి వెళ్ళింది.

రెండు రోజులైంది. "నాన్నా , ఇవ్వాళ్ళ నించీ రోజూ సాయంత్రం సంధ్య కాగానే దొడ్లో తులసి పూజ, తర్వాత ఇంట్లో రామపూజ" అన్నది ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చిన సీతాలక్ష్మి. "సరే అలాగే కానివ్వండి" అన్నారు అయ్యవారు.

సాయంత్రం సంధ్య, తులసి కోటకి ఎదురుగ్గా కూచుని చేస్తున్నారు అయ్యవారు. విశేషంగా చేసిన అలంకారం ఆయన మనస్సుని లోగొన్నది. సంధ్య పూర్తి కాగానే తులసి పూజ మొదలైంది. అయ్యవారికి చిన్నప్పటి నించీ చదివిన తులసీ దేవికథలు గుర్తుకు వచ్చాయి. అవి అన్నీ ఆయన మనస్సుని ద్రవీభూతం చేశాయి. పూజ చివరికి రాగానే పురోహితుడు "గీతంశ్రావయామి" అన్నాడు. వెంటనే తులసిని భక్తితో భావిస్తున్న అయ్యవారు

 


ప. శ్రీ తులసమ్మ మాయింట నెలకొనవమ్మ

ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారు బొమ్మ


చ1. కరగు సువర్ణపు సొమ్ములు పెట్టి

సరిగె చీర ముద్దు కురియగ కట్టి

కరుణ జూచి సిరులను ఒడి కట్టి

వరదుని కరమునను పట్టి (శ్రీ)

 

చ2. ఉరమున ముత్యపు సరులసియాడ

సుర తరుణులు నిన్ను కని కొనియాడ

వర మునులష్ట దిగీశులు వేడ

వరదుడు నిన్ను ప్రేమ జూడ (శ్రీ)


చ3. మరువక పారిజాత సరోజ

కురువక వకుళ సుగంధ రాజ

వర సుమములచే త్యాగరాజ

వరదే నిను పూజ సేతు (శ్రీ)

 

అని పాడారు. తర్వాత మిగతా పూజలన్నీ యథాప్రకారం సాగాయి. మరుసటి రోజు పొద్దున్న పాఠం మొదలెట్టే ముందు గునగునా నడిచి వచ్చి అయ్యవారి దగ్గర నిలబడి "నేనూ, సుందరమ్మా కూడా నేర్చుకుంటాము" అని రాగాలు తీస్తూ ఉన్న కూతురికి "అల్లాగే" అన్న మాట వినపడగానే అక్కడే కూచుని ఆ పాట నేర్చుకుంది.

మధ్యాహ్నం భోజనాలైన తరవాత అయ్యవారు విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్ల వచ్చి "కాసేపు కాళ్ళు పట్టనా నాన్నా" అంటూ వొచ్చి కాళ్ళు పట్టటం మొదలెట్టింది. అయ్యవారు హాయిగా ఆనందిస్తున్నారు. సీతాలక్ష్మి మెల్లిగా "అవును నాన్నా, ఒక సందేహం. తులసి అంటే రాముడికి ఎందుకు అంత ఇష్టమూ?" అని దీర్ఘాలు తీసింది. అయ్యవారు ఏదో చెప్పబోయేటంతలో "సీతమ్మా" అంటూ స్నేహితురాళ్ళు పిలిచిన పిలుపులు విని "ఇప్పుడే వస్తాను నాన్నా" అంటూ తుర్రుమంది పిల్ల. పిల్ల వెళ్ళినా ఆమె అడిగిన ప్రశ్న అయ్యవారిని వదలలేదు. అలా ఆలోచిస్తూ ఉంటే సాయం సంధ్యసమయం అయింది.

అయ్యవారు తులసి కోట దగ్గిర కూచుని సంధ్యోపాసన చేస్తూ ఉన్నా ఆ ప్రశ్న వదల్లేదు. కాసేపాగి తులసి పూజమొదలైంది. ప్రశ్న మనసులో ఇంకా తిరుగుతూ ఉంది. పూజ చివర పాట పాడే సమయం వొచ్చింది. అయ్యవారి నోటివెంట పాట రావడం మొదలైంది.


ప. అమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ

సతతము పదములే నమ్మినానమ్మ


అ. నెమ్మదిని నీ విహ పరమ్ములొసగుదువనుచు

కమ్మ విల్తుని తండ్రి కలనైన బాయడట (అ)


చ. నీ మృదు తనువును కని, నీ పరిమళమును కని,

నీ మహత్వమును కని నీరజాక్షి,

తామరస దళ నేత్ర,  త్యాగరాజుని మిత్రు

ప్రేమతో శిరమునను పెట్టుకొన్నాడట (అ)

 

అని పాడారు అయ్యవారు.


మరుసటి రోజు పొద్దున్న పాఠం మొదలెట్టే ముందు సీతాలక్ష్మి మంచి నీళ్ళ చెంబు తెచ్చి తండ్రి పక్కనే పెట్టి "బ్రహ్మాండంగా రాశావు నాన్నా" అని పక్కనే పాఠానికి కూచుంది. అయ్యవారు, పిల్ల చుంచు దువ్వి, చుబుకం పుణికారు. పాఠం సాగింది. మధ్యాహ్నం శిష్యులతో ఏదో పని మీద బయటికి వెళ్ళారు.

ఆ రోజు సాయంత్రం యథా ప్రకారం సాగింది. తులసికోట దగ్గర కూచుని సంధ్య చేసిన తరవాత తులసీ పూజ చివర పాటమొదలైంది.



ప. తులసీ బిల్వ మల్లికాది

జలజ సుమముల పూజల కైకొనవే

 

అ. జలజాసన సనకాది కరార్చిత

జలదాభ సునాభ విభాకర

హృజ్జలేశ హరిణాంక సుగంధ (తులసీ)

 

చ. ఉరమున ముఖమున శిరమున భుజమున

కరమున నేత్రమున చరణ యుగంబున

కరుణతో నెనరుతో పరమానందముతో నిరతమును 

శ్రీ త్యాగరాజు నిరుపాధికుడై అర్చించు (తులసీ) 


అని పూర్తి చేశారు అయ్యవారు. 


మరుసటి రోజు పొద్దున్న పిల్లపాఠానికి రాలేదు. అయ్యవారు మధ్యాహ్నం భోజనం అయిన తరవాత పిల్లని పిలిచారు. పిల్ల వొచ్చింది. తుమ్మచెట్టు మీదపొద్దు కుంకినట్టుంది ముఖం. "ఏమైందీ" అని ఆరా తీశారు అయ్యవారు. "ఏముంది నాన్నా, రెండు తులశమ్మ పాటలు వొచ్చాయి కదా అని ఆనందిస్తే మళ్ళీ తులసీ అని మొదలెట్టి రాములవారి మీద పాట రాశారు కదా నాన్నా? "అన్నది పిల్ల. "మనమేమి చేస్తామూ. ఆయన కృప అది." అన్నారు అయ్యవారు. పిల్ల సాలోచనగా " ఇంతకూ అసలు తులసి లేకపోతేశసరిపోయేది. మాకు పాటలు అడగటమూ, మీకు రాయాల్సి రావటమూ తప్పేది" అంటూ పాద సంవాహనం మొదలెట్టింది.

పిల్ల అన్న మాటలో " తులసి లేకపోతే" అన్న ముక్క అయ్యవారి ఆలోచనలని ఎక్కడికో తీసుకెళ్ళింది. అలా ఆలోచిస్తూ ఉంటే సాయంత్రం అయ్యింది. తులసి పూజ జరిగింది. అంత సేపూ అయ్యవారి ఆలోచన " తులసి లేకపోతే" అన్నమాట మీదే ఉన్నది. పూజ చివర పాట రాగానే

 

ప. దేవి శ్రీ తుళసమ్మ బ్రోచుట కిదే సమయమమ్మ మాయమ్మ


అ. పావనీ బ్రహ్మేంద్రాదులు నీ భక్తిచే విలసిల్లిరట మహా(దేవి)


చ. నీవు లేక శంకరు మా రమణుడు నీరజాదులనొల్లరట

నీవు లేక తీర్థము సేవించుట నీరనుచు పేరాయెనట

నీవు లేక త్రాసున శ్రీ హరి సరి నిల్వక పోయెనట

నీవు లేక వనమాలయని పలికిరా

నీ సరియెవ్వరే త్యాగరాజ నుత మహా(దేవి)


అని పాడారు. 


మరునాడు పాఠానికి పిలవకుండానే వొచ్చి కూచున్న పిల్లనిచూసి అయ్యవారికి సంతోషమూ, ఆశ్చర్యమూ కలిగాయి. పాఠం అయి పోయిన తరవాత కూడా, దగ్గర ఉండి అన్నీ సద్దిపెడుతూన్న కూతురుని చూసి అయ్యవారికి ముచ్చట వేసింది.

భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న అయ్యవారి దగ్గరికి వచ్చి  పాదాలు నొక్కుతూ "అమృత  వర్షంలో తడిసిపోయాము" అన్నది పిల్ల. "భగవంతుడి దయ ఎలా వున్నా తల ఒగ్గు. నీకు కావాల్సిందే రావాలని ఆశించక" అన్నారు అయ్యవారు. "ప్రయత్నిస్తా నాన్నా. నిన్న పూజ జరుగుతుంటే అమ్మ ఏదో చెప్పింది. తులసి మొదలు, మధ్య, చివర అని ఏదో చెప్పింది. అర్థం కాలేదు. ఏమిటి నాన్నా అది?" అని అడిగింది. ఇంతలో "సీతమ్మా" అని దొడ్లోంచి పిలిచినట్టు వినిపించింది. "సుందరమ్మ పిలుస్తోంది, ఇప్పుడే వొస్తాను నాన్నా" అంటూ పరిగెత్తింది పిల్ల. కానీ పిల్లకి తులసి గురించి చెబుదాము అనుకున్న విషయం అయ్యవారి నోట్లో ఆగిపోయింది.


సాయంత్రం తులసి పూజ కాగానే అయ్యవారి పాట మొదలైంది.


ప. తులసి జగజ్జనని దురితాపహారిణీ


అ. నిలవరమగు నీ సరి వేల్పులు లేరట బ్రోవుమికను (తు)


చ. చరణ యుగంబులు నదులకు పరమ వైకుంఠమట

సరసిజాక్షి నీ మధ్యము సకల సురావాసమట

శిరమున నైగమ కోటులు చెలగుచున్నారట

సరస త్యాగరాజాది వర భక్తులు పాడేరట (తు) 


అని ముగించారు.

 

మరుసటి రోజు కార్తీక ఏకాదశీ, సోమవారమూ కలిసి రావటంతో గుళ్ళోనూ, ఇంట్లో అభిషేకం హడావిడితో అయ్యవారికీ, శిష్యులకీ మిగతా వన్నీ వెనక పడ్డాయి. ఆ మరుసటి రోజు క్షీరాబ్ధి ద్వాదశి. ఇంట్లో పిల్ల హడావిడికి అంతే లేదు. సాయంత్రం అయ్యింది. అయ్యవారు సంధ్యకి వెళ్ళేసరికి ఉసిరిచెట్టు కింద దీపాలూ, అలంకరణలూ, ముగ్గులూ, ప్రసాదాలూ అంతా హడావిడిగా ఉండటంతో, తమ యథాస్థానమైన పొగడచెట్టు కింద కూచుని అనుష్ఠానం మొదలెట్టారు. ఈ లోపల ఊళ్ళో ఉన్న అనేక స్త్రీలు అందరూ వొచ్చి ఉసిరి చెట్టు కింద వేంచేసిన ఇందిరనీ, తులసినీ, అందరికీ వందనీయుడైన విష్ణువునీ దర్శించి నమస్కరించి దీపాలు వెలిగించి అక్కడే సర్దుకుని కూచుంటున్నారు. కాసేపటికి దొడ్డి అంతా దీపాల వెలుగుతో జాజ్జ్వల్య మానంగా ప్రకాశిస్తోంది. ఇంతలో పిల్లా, తల్లీ అలంకరించుకుని వొచ్చి పూజ మొదలెట్టారు. పూజ అయ్యి పాట మొదలైంది. అయ్యవారు పాడిన నాలుగు తులశమ్మ పాటలూ, రెండు తులసితో మొదలైన రాముడిమీద పాటలూ, మొత్తం ఆరు పాటలూ అక్కడ కూచున్న  స్త్రీ బృందం పాడటం మొదలెట్టారు. అక్కడున్న అందరూ ఏక కంఠంతో ఒకదాని తరవాత ఒకటి పాడుతూఉంటే, మహాద్భుతంగా ఉన్నది. ఆ పాటలు మొదలు కాగానే ఆ రసానుభూతిలో ముణిగిపోయిన అయ్యవారు, ఆ పూజ పూర్తి అయ్యి అందరూ వెళ్ళిన తరవాత పిల్ల వొచ్చి లేపేదాకా ఆ ఆనందంలో మునగి ఉన్నారు.

ఇంతలో భార్య వొచ్చి "నా కోరిక తీర్చారు. జన్మ ధన్యం అయ్యింది." అని నమస్కరిస్తే అయ్యవారు చిరునవ్వుతూ "అందరి కోరికలు తీర్చేవాడూ, తీర్చగలిగిన వాడూ ఆ రామప్రభువు ఒక్కడే. ఆయనకి నమస్కరిద్దాము, రండి" అని లేచి వెళ్ళి రామచంద్ర మహారాజుకి సాష్టాంగ నమస్కారం చేశారు.

                         - జొన్నలగడ్డ సౌదామిని 

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...