Saturday 2 July 2022

మనుష్య కిశోర న్యాయం

సాయంత్రమైంది. యమునా తీరం హడావిడిగా ఉంది. గోపికలు మెల్లిగా నడిచి వస్తున్నారు. వాళ్ళ వెనక కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ముచ్చటలు చెబుతూ, వింటూ వస్తున్నాడు. అందరూ వచ్చారో లేదో చూసి అందరూ వచ్చారనటానికి గుర్తుగా ఉద్ధవుడు తల ఊపాడు. అది చూసి కృష్ణుడు సైగ చేస్తే అది చూసి గోపికలు ఆట మొదలెట్టబోయారు.



ఇంతలో ఒక సుందరి పరుగు పరుగున వచ్చి ఆట మొదలెట్టబోయే గోపికలతో కలిసింది. ఇక ఆటలూ, పాటలూ దివ్యంగా సాగాయి. కొత్తగా వచ్చిన ఆ పిల్ల అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటే చూసిన అందరూ ముచ్చట పడ్డారు. ఆమె హావభావాలూ, విలాసాలూ, వయ్యారాలూ మనోహరంగా ఉన్నాయి. కాసేపు అయిన తరవాత నాట్యం ముగిసింది. అందరూ వృత్తాకారంలో కూచుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

నందనందనుడు ఉద్ధవుడి చెవిలో ఏదో చెప్పాడు. ఉద్ధవుడు ఆ కొత్త అమ్మాయిని చూస్తూ "ఇక్కడికి ఎవరన్నా కొత్తవారు వచ్చి నాట్యమాడాలంటే వారు తమ గురించి కృష్ణుడికి చెప్పాలి. అతను ఒప్పుకుంటే అప్పుడు మా జట్టులో చేరినట్టు. అప్పటి నుంచీ ఆటపాటలలో వారు పాల్గొనవచ్చు. నువ్వేమో ఎవరినీ, ఏమీ అడగకుండా ఆటలో కలిశావు. ఈసారికి క్షమించాడు కృష్ణుడు. ఇప్పుడు వచ్చి నువ్వెవరో చెప్పు?" అన్నాడు ఉద్ధవుడు.

అందరూ తనవైపే చూస్తుంటే తప్పక, లేచి, అందరి మధ్యా కృష్ణుడి వైపు ముఖం పెట్టి నుంచుని దోసిలి ఒగ్గింది. సభక్తికంగా, సవినయంగా నుంచుని "ఈ జగత్తు మొత్తమూ వ్యాపించి ఉన్న నీకు నమస్కారం. అన్నిటా వ్యాపించి ఉన్న నీకు, నేనెవరో తెలియకుండా ఉంటుందా? చెప్పు. అయినా నీ ఆజ్ఞ అయ్యింది కనుక, దాన్ని పాలించటం మా విధి కనుక నా తెలివి కొద్దీ చెబుతాను. అవధరించు.

నేను ఎవరా అని ఆలోచిస్తే కోట్లాది జీవరాశుల్లో ఒక జీవాన్ని, ఈ జీవాలన్నింటికీ భిన్నంగా అవ్యయుడివిగా ఉన్న పరమపురుషుడివి నీవు అనిపిస్తుంది కాసేపు. నేనూ, నాతోటి ఈ జీవరాశులన్నీ నీలో భాగాలు అయినట్టు, నువ్వు మహామహిత దేహుడివి అయి సర్వ జీవరాశినీ నీలో ఇముడ్చుకున్నట్టు అనిపిస్తుంది ఇంకాసేపు.


ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే నువ్వు తప్ప వేరే ఏమీ లేదనీ, ఈ కనిపించేదంతా వ్యవహారం లో ఉన్నది అనీ, సత్యంగా ఉన్నది దివ్యమైన నీ తత్త్వమేనని అనిపిస్తుంది. నిజం ఏమిటో స్వల్ప బుద్ధినైన నాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అది నీకే తెలియాలి, నువ్వే చెప్పాలి." అని మెత్తగా, హృదయానికి హత్తుకొనేలా మాట్లాడింది.

ఆ మధుర భాషణానికి అందరూ ముగ్ధులు అయ్యారు. కృష్ణుడు చిరునవ్వుతో అంతా విన్నాడు. అప్పుడు ఉద్ధవుడు "కృష్ణా, ఆమె ఏదో ప్రశ్న వేసింది. నువ్వే సమాధానం చెప్పాలి?" అన్నాడు. కృష్ణుడు మల్లెమొగ్గల లాంటి పళ్ళు కనిపించీ కనిపించకుండా నవ్వి "ఎవరు ఎలా తలిస్తే అట్లాగే" అన్నాడు.

కృష్ణుడి మాటలు శ్రద్ధతో. ఆలకించిన ఆమె మెల్లిగా "భగవన్, అందరూ నిన్ను ప్రార్థిస్తూ మమ్మల్ని మర్కటకిశోర న్యాయం అంటే కోతిపిల్ల తన తల్లిని గట్టిగా పట్టుకున్నట్టు కాకుండా, మార్జాల కిశోర న్యాయము అంటే తల్లి అయిన పిల్లి , పిల్లలకి ఏ కష్టం కలగకుండా వాటిని నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళినట్టు, నువ్వే జాగ్రత్తగా మమ్మల్ని సంసార సముద్రం దాటించాలి అని విన్నవిస్తారు. కానీ నాకు వాటి కంటే మనుష్య కిశోర న్యాయం నాకు సరి అయినది అని తలుస్తాను. ఎందుకంటే, పుట్టిన కొద్ది సేపటికే కోతి పిల్లలూ, పిల్లి పిల్లలూ తమంతట తాము కదల గలవు. కానీ మనుష్య శిశువు మట్టుక్కు కొన్నినెలల దాకా కదల లేదు. అంటే మనుష్య శిశువు తల్లి మీద ఎక్కువ ఆధార పడుతుంది. ఆ తరవాత కూడా పిల్లలని జీవితం మొత్తం చక్కగా ఉండేట్టు చూస్తుంది మనుష్య శిశువుని ఆ తల్లి. ఆ విధంగా ఒక తల్లి మనుష్య శిశువుని చూసినట్టు నా జీవితం మొత్తం నీ అనుగ్రహం ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను" అని సకరుణంగా అడిగిన ఆమె మాటకి కృష్ణుడి కళ్ళు కూడా మేఘాలు అయ్యాయి. "ఔను" అన్నట్టు తలకాయ మెల్లిగా ఊపాడు కృష్ణుడు.

ఆ సుందరి వెంటనే అదృశ్యం అయ్యింది. " అయ్యో, తను ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయిందే?" అన్న గోపిక ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు "తను ఘృతాచి అనే అప్సరస కూతురు. రోజూ మన ఆటలు పైనించీ చూసి ముచ్చటపడి వచ్చి ఒకసారి ఆడింది. అంతే" అంటూ స్నేహితులతో ఇంటికి బయలుదేరాడు. 

                                  - జొన్నలగడ్డ సౌదామిని.


No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...