Thursday, 1 December 2022

అవధూత గీత - మూడో అధ్యాయం

 అథ తృతీయోఽధ్యాయః ॥

మూడో అధ్యాయము 

 

గుణవిగుణవిభాగో వర్తతే నైవ కిఞ్చితడడడ

    రతివిరతివిహీనం నిర్మలం నిష్ప్రపఞ్చమ్ ।

గుణవిగుణవిహీనం వ్యాపకం విశ్వరూపం

    కథమహమిహ వన్దే వ్యోమరూపం శివం వై ॥ ౧॥

ఎవరికి, గుణాలు  ఉండటమూ, లేకపోవటమూ అనే విభజించటం కొద్దిగా కూడా వర్తించదో, ఎవరు సుఖమూ, దుఖమూ లేక నిర్మలమై, ప్రపంచాన్ని దాటి ఉంటాడో, ఎవరు, గుణాలు ఉండటమూ, లేకపోవటమూ లేకుండావ్యాపించి ప్రపంచ రూపంగా ఉంటాడో, అలాంటి ఆకాశరూపుడైన శివుణ్ణి గూర్చి నేను ఏవిధంగా నమస్కరించను?. 

 

శ్వేతాదివర్ణరహితో నియతం శివశ్చ

    కార్యం హి కారణమిదం హి పరం శివశ్చ ।

ఏవం వికల్పరహితోఽహమలం శివశ్చ

    స్వాత్మానమాత్మని సుమిత్ర కథం నమామి ॥ ౨॥

శివుడిది తెల్లటి రంగే అని నియమం ఏమీ లేదు. ఆయనకి ఏ రంగూ లేదు. కార్యమూ, కారణమూ రెండూ ఆ పరమశివుడే. నేను ఆలోచనలులేని, ఏ మకిలమూ అంటని శివుణ్ణి. మిత్రమా ,ఆత్మ తనకి తానే ఎలా నమస్కరిస్తుందో నాకుచెప్పు. 

 

నిర్మూలమూలరహితో హి సదోదితోఽహం

    నిర్ధూమధూమరహితో హి సదోదితోఽహమ్ ।

నిర్దీపదీపరహితో హి సదోదితోఽహం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩॥

నేను మూలమే  లేని వాడిని, మూలాన్ని  నాశనం చేసినవాడిని, ఎప్పుడూ అస్తమించని సూర్యుణ్ణి. నేను పొగ వంటిఅజ్ఞానం కలగనివాడిని, పొగవంటి అజ్ఞానం లేనివాడిని. ఎప్పుడూ అస్తమించని సూర్యుణ్ణి. ప్రకాశం ఏదీఉండనివాడిని, ప్రకాశం ఏదీ కలగనివాడినిఎప్పుడూ అస్తమించని సూర్యుణ్ణి. 

 

నిష్కామకామమిహ నామ కథం వదామి

    నిఃసఙ్గసఙ్గమిహ నామ కథం వదామి ।

నిఃసారసారరహితం చ కథం వదామి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౪॥

నాకు కోరికలు లేవు, కానీ నాకు కోరికలు ఉన్నయ్యి. వాటి గురించి ఏమి చెప్పేది. నాకు సంగం లేదు, కానీ సంగం ఉన్నది, వాటి గురించి ఏమి చెప్పేది. నాకు సారమే లేదు, కానీ సారం వున్నది, వాటి గురించి నేను ఏమి చెప్పేది. నేను, అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్ని, ఆకాశంలాంటి వాణ్ణి నేను. 

 

అద్వైతరూపమఖిలం హి కథం వదామి

    ద్వైతస్వరూపమఖిలం హి కథం వదామి ।

నిత్యం త్వనిత్యమఖిలం హి కథం వదామి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౫॥

ఏకమైన వాణ్ణి, అన్ని రూపాలూ గల వాణ్ణి, ఇంక ఏమి చెప్పను?. నేను అన్నిటి కంటే వేరే, కానీ అన్నిట్లో ఉన్నవాణ్ణి. నేనుఇంక ఏమి చెప్పను?. నేను నిత్యమైన వాణ్ణి, నిత్యం కాని వాణ్ణి, ఇంక ఏమి చెప్పను?. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్ని, ఆకాశం లాంటి వాణ్ణి నేను. 

 

స్థూలం హి నో నహి కృశం న గతాగతం హి

    ఆద్యన్తమధ్యరహితం న పరాపరం హి ।

సత్యం వదామి ఖలు వై పరమార్థతత్త్వం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౬॥

నేను స్థూలమూ కాదు, కృశించిన వాణ్ణీ కాదు, వచేవాణ్ణీ, పోయేవాణ్ణీ నేను కాదు. మొదలూ, మధ్యా, తుదీ లేని వాణ్ణి, పెద్దవాణ్ణీ కాదు, చిన్న వాణ్ణీ కాదు. పరమార్థ తత్త్వాన్ని గూర్చి నిజం చెబుతున్నాను, అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్ని, ఆకాశం లాంటి వాణ్ణి నేను. 

 

సంవిద్ధి సర్వకరణాని నభోనిభాని

    సంవిద్ధి సర్వవిషయాంశ్చ నభోనిభాంశ్చ ।

సంవిద్ధి చైకమమలం న హి బన్ధముక్తం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౭॥

అన్ని ఇంద్రియాలలో, ఆకాశంలో లాగా, ఏమీ లేదని తెలుసుకో. అన్ని విషయాలలో, ఆకాశంలో లాగా, ఏమీ లేదనితెలుసుకో. ఒక్కటీ, ఏ మకిలీ అంటనిదీ, బంధింప బడనిదీ, వదిలింపబడనిదీ, అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

దుర్బోధబోధగహనో న భవామి తాత

    దుర్లక్ష్యలక్ష్యగహనో న భవామి తాత ।

ఆసన్నరూపగహనో న భవామి తాత

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౮॥

నన్ను తెలుసుకోవటం ఏమీ కష్టం కాదు, నేను, బుద్ధికి ఏమాత్రం అందకుండా ఎక్కడో కూర్చోలేదు, నన్ను చూడటం ఏమీకష్టం కాదు, నేను, చూపుకు ఏమాత్రం అందకుండా దాక్కోలేదు నాయనా. ?...............అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

నిష్కర్మకర్మదహనో జ్వలనో భవామి

    నిర్దుఃఖదుఃఖదహనో జ్వలనో భవామి ।

నిర్దేహదేహదహనో జ్వలనో భవామి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౯॥

కర్మలు లేని వాణ్ణి, కర్మలని అన్నింటినీ దహించే వాణ్ణి దుఖం లేనివాణ్ణి, దుఖాన్ని అంతా దహించే వాణ్ణి, దేహం లేనివాణ్ణి, దేహాన్ని దహించే వాణ్ణి,  అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

నిష్పాపపాపదహనో హి హుతాశనోఽహం

    నిర్ధర్మధర్మదహనో హి హుతాశనోఽహమ్ ।

నిర్బన్ధబన్ధదహనో హి హుతాశనోఽహం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౦॥

నేను పాపం లేనివాణ్ణి, పాపాలని తగలబెట్టే అగ్ని దేవుడిని నేను. నేను ధర్మం లేనివాణ్ణి, ధర్మాన్ని తగలబెట్టేఅగ్నిదేవుడిని నేను. బంధనాలు లేనివాణ్ణి, అన్ని బంధనాలూ తగలబెట్టే అగ్ని లాంటి వాణ్ణి, అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

నిర్భావభావరహితో న భవామి వత్స

    నిర్యోగయోగరహితో న భవామి వత్స ।

నిశ్చిత్తచిత్తరహితో న భవామి వత్స

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౧॥

ఏ భావాలూ కలగనివాడిని, భావాలు ఏమన్నా కలిగినా అవేవీ మిగలనివాడిని, ఇవేవీ నాకు సంబంధించినవి కావు. ఏరకమైన కలయికా లేనివాడిని, ఏరకమైన కలయికా మిగలనివాడిని. ఇవేవీ నాకు సంబంధించినవి కావు. చిత్తమేలేనివాడిని, చిత్తం లేకుండా చేసినవాడిని, ఇవేవీ నాకు సంబంధించినవి కావు,  అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 


నిర్మోహమోహపదవీతి న మే వికల్పో

    నిఃశోకశోకపదవీతి న మే వికల్పః ।

నిర్లోభలోభపదవీతి న మే వికల్పో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౨॥

మోహమే లేనివాడిని, మోహం కలవాడిని అనేవి నన్ను ఏవిధంగానూ కదల్చలేవు.శోకం లేకుండా ఉండటమూ, శోకంఉండటమూ అనేవి నన్ను ఏవిధంగానూ  కదల్చలేవు. లోభం లేకుండా ఉండటమూ, లోభం ఉండటమూ అనేవి నన్నుఏవిధంగానూ కదల్చలేవు. అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 


 

సంసారసన్తతిలతా న చ మే కదాచిత్

    సన్తోషసన్తతిసుఖో న చ మే కదాచిత్ ।

అజ్ఞానబన్ధనమిదం న చ మే కదాచిత్

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౩॥

సంసారమూ, దాన్నించి పుట్టి బంధించే లతలు నాకు కొద్దిగానూ లేవు. సంతోషమూ. దాన్నుంచి  పుట్టే సుఖాలూ నాకుకొద్దిగానూ లేవు.అజ్ఞానమూ, దాని బంధనము అయిన ఈ ప్రపంచమూ నాకు కొద్దిగానూ లేవు. అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 


సంసారసన్తతిరజో న చ మే వికారః

    సన్తాపసన్తతితమో న చ మే వికారః ।

సత్త్వం స్వధర్మజనకం న చ మే వికారో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౪॥

రజో గుణము వల్ల పుట్టే సంసారం వల్ల  నాకు ఏ మార్పూ లేదు. తమోగుణంతో పుట్టే సంతాపం వల్లనాకు ఏ మార్పూలేదు. సత్త్వ గుణాన్నించీ పుట్టే స్వధర్మం వల్ల నాకు ఏ మార్పూ లేదు. అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

సన్తాపదుఃఖజనకో న విధిః కదాచిత్

    సన్తాపయోగజనితం న మనః కదాచిత్ ।

యస్మాదహఙ్కృతిరియం న చ మే కదాచిత్

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౫॥

సంతాపాలూ, దుఖాలూ, నా బుద్ధిని ఏమాత్రమూ కదిలించలేవు. కష్టాలూ వాటి నించి పుట్టే సంతాపమూ నామనస్సును ఏమాత్రమూ కదిలించలేవు. నా అహంకారాన్ని ఎక్కువచేసేవి ఏవీ నన్ను కదిలించలేవు. అమృతమైనజ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

నిష్కమ్పకమ్పనిధనం న వికల్పకల్పం

    స్వప్నప్రబోధనిధనం న హితాహితం హి ।

నిఃసారసారనిధనం న చరాచరం హి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౬॥

కదిలేదానినీ, కదలని దానినీ నాశనం చేసేవాణ్ణీ, చేసేదీ,చేయకూడనిదీ, రెండూ కాని వాణ్ణీ, మెలకువనీ, కలనీ నాశనంచేసేవాణ్ణీ, శుభమైనదీ, అశుభమైనదీ నాశనం చేసేవాణ్ణీ , సారమైనదాన్నీ, నిస్సారమైనదాన్నీ నాశనం చేసేవాణ్ణీ, కదిలేవాటినీ, కదలనివాటినీ నాశనం చేసేవాణ్ణీ, అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

నో వేద్యవేదకమిదం న చ హేతుతర్క్యం

    వాచామగోచరమిదం న మనో న బుద్ధిః ।

ఏవం కథం హి భవతః కథయామి తత్త్వం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౭॥

తెలుసుకునేవాణ్ణీ, తెలుసుకోబడేవాణ్ణీ కాను నేను. కారణాన్నీ, తార్కికమైనదాన్నీ కాను. వాక్కుకి, మనస్సుకీ, బుద్ధికీఅందని వాడిని నేను. ఆ పరతత్త్వం మాటలకి ఎలాగైనా అందుతుందా చెప్పు?. అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

నిర్భిన్నభిన్నరహితం పరమార్థతత్త్వ-

    మన్తర్బహిర్న హి కథం పరమార్థతత్త్వమ్ ।

ప్రాక్సమ్భవం న చ రతం నహి వస్తు కిఞ్చిత్

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౮॥

భిన్నమూ, భిన్నము కానిదీ అనే రెంటినీ దాటిన పరమార్థ తత్వాన్ని నేను. లోపలా, బయటా అనే భావాలు దాటినపరమార్థ తత్త్వాన్ని. నేను ముందు ఎప్పుడూ పుట్టలేదు, ఇప్పుడు దేనికీ తగిలి ఉండలేదు. ఎల్లాంటి వస్తువునీ కాను. అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

రాగాదిదోషరహితం త్వహమేవ తత్త్వం

    దైవాదిదోషరహితం త్వహమేవ తత్త్వమ్ ।

సంసారశోకరహితం త్వహమేవ తత్త్వం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౧౯|

అనురాగము లాంటి దోషాలు లేని పర తత్త్వాన్ని నేను. ప్రారబ్ధమూ, దాని దోషాలూ లేని పరతత్త్వాన్ని నేను. ఈప్రపంచమూ, దాని శోకాలు లేని పరతత్త్వాన్ని నేను. అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

స్థానత్రయం యది చ నేతి కథం తురీయం

    కాలత్రయం యది చ నేతి కథం దిశశ్చ ।

శాన్తం పదం హి పరమం పరమార్థతత్త్వం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౦॥

మెలకువా, కలా, నిద్రా నేను కానప్పుడు ఇక వాటిని దాటిన తురీయమైన సమాధి స్థితి నేనెట్లా అవగలను. భూత, భవిష్యత్ వర్తమాన కాలాలు నేను కానప్పుడు, ఇక దిశల గురించి ఏమి చెప్పను?. శాంతమూ, పరమమూ అయినపదమూ, పరమార్థ తత్త్వమూ, అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

దీర్ఘో లఘుః పునరితీహ నమే విభాగో

    విస్తారసంకటమితీహ న మే విభాగః ।

కోణం హి వర్తులమితీహ న మే విభాగో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౧॥

పపొడుగూ పొట్టీ లాంటి మాటలు నన్ను విభజించలేవు. విశాలమైందీ, పల్చనైనదీ అనే మాటలునన్ను విభజించలేవు. కోణాలు ఉన్నదీ, గుండ్రంగా ఉన్నదీ అనే మాటలు నన్ను విభజించలేవు. అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 


మాతాపితాది తనయాది న మే కదాచిత్

    జాతం మృతం న చ మనో న చ మే కదాచిత్ ।

నిర్వ్యాకులం స్థిరమిదం పరమార్థతత్త్వం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౨॥

తల్లీ,తండ్రీ, పిల్లలూ  నాకు ఎప్పుడూ లేరు. పుట్టుకా, చావూ, మనస్సూ నాకు కొద్దిగా కూడా లేవు. చలించనిదీ, స్థిరంగాఉండే ఈ పరమార్థ తత్త్వాన్నీ, అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

శుద్ధం విశుద్ధమవిచారమనన్తరూపం

    నిర్లేపలేపమవిచారమనన్తరూపమ్ ।

నిష్ఖణ్డఖణ్డమవిచారమనన్తరూపం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౩॥

అనంతమైన రూపం ఉన్న నేను, శుద్ధమైనవాణ్ణి, శుద్ధం చేయబడ్డ వాణ్ణి. ఆలోచనలు లేనివాణ్ణి.  ఏ మాలిన్యాలూ లేనివాణ్ణి, అన్ని మాలిన్యాలూ కలిగిన వాణ్ణి, ఆలోచనలు లేనివాణ్ణి, అనంతమైన రూపం ఉన్నవాణ్ణి, విభజింపలేనివాణ్ణీ, ముక్కలైనవాణ్ణీ, ఆలోచనలు లేనివాణ్ణీ, అనంతమైన రూపం ఉన్నవాణ్ణీ, అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి  నేను. 

 

బ్రహ్మాదయః సురగణాః కథమత్ర సన్తి

   స్వర్గాదయో వసతయః కథమత్ర సన్తి ।

యద్యేకరూపమమలం పరమార్థతత్త్వం

     జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౪॥

బ్రహ్మదేవుడూ, ఇతర దేవతలూ అక్కడ ఎట్లా వుండగలరు?. స్వర్గమూ, స్వర్గంలో ఉండే వాళ్ళూ అక్కడఎట్లాఉండగలరు?. వాటికి ఆధారమైన నా ఒక్కటైన రూపం శుద్ధమైనది, పరమార్థ తత్త్వమైనది. నేను అమృతమైనజ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

నిర్నేతి నేతి విమలో హి కథం వదామి

    నిఃశేషశేషవిమలో హి కథం వదామి 

నిర్లిఙ్గలిఙ్గవిమలో హి కథం వదామి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥౨౫॥

ఏమరకలూ లేకుండా,ఇది కాదు, ఇది కానిదికాదు అనే వాడి గురించి ఎలా మాట్లాడగలను?. ఏమరకలూ లేకుండా, మిగలనివాడూ, మిగిలినవాడూ, అయిన వాడి గురించి ఎలా మాట్లాడగలను. ఏలింగమూ లేనివాడూ కానీ లింగంఉన్నవాడూ, ఏ మరకలూ లేనివాడు అయిన వాడి గురించి ఎలా మాట్లాడగలను. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

నిష్కర్మకర్మపరమం సతతం కరోమి

    నిఃసఙ్గసఙ్గరహితం పరమం వినోదమ్ ।

నిర్దేహదేహరహితం సతతం వినోదం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౬॥

ఎప్పుడూ చేసే కర్మచేసినా,చేయకున్నా నేను పరమమైన వాణ్ణే. సంగం ఇప్పుడు లేనివాణ్ణీ, సంగమెప్పుడూ లేనివాణ్ణీ, ఆనందంతో కూడినపరమమైనవాణ్ణీ. దేహమెప్పుడూ లేనివాణ్ణీ, దేహమిప్పుడు లేనివాణ్ణీ, ఎప్పుడూ ఉండేఆనందాన్నీ,నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి.  

 

మాయాప్రపఞ్చరచనా న చ మే వికారః ।

    కౌటిల్యదమ్భరచనా న చ మే వికారః ।

సత్యానృతేతి రచనా న చ మే వికారో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౭॥

మాయ అయిన ఈ ప్రపంచం నా మీద ఏ ప్రభావమూ చూపించలేదు. కుటిలత్వమూ, మోసాలు చేసేందుకు వేసేఎత్తులూ నా మీద ఏ ప్రభావమూ చూపించవు. నిజమూ, అబద్ధమూ, వాటిని చెప్పే విధాలూ నా మీద ఏ ప్రభావమూచూపించవు. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

సన్ధ్యాదికాలరహితం న చ మే వియోగో-

    హ్యన్తః ప్రబోధరహితం బధిరో న మూకః ।

ఏవం వికల్పరహితం న చ భావశుద్ధం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౮॥

సంధ్యాది కాలాలు లేని వాణ్ణి అయిన నాకు విడిపోవటం లేదు. నేను చివరి ప్రబోధాలు లేని చెవిటి వాణ్ణీ, మూగవాణ్ణీకాదు. నేను ఏ వికల్పాలూ లేని వాణ్ణి కాదు, శుద్ధమైన భావాలు ఉన్న వాణ్ణీ కాను, నేను అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

నిర్నాథనాథరహితం హి నిరాకులం వై

    నిశ్చిత్తచిత్తవిగతం హి నిరాకులం వై ।

సంవిద్ధి సర్వవిగతం హి నిరాకులం వై

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౨౯॥

ఇప్పుడు యజమాని లేనివాణ్ణి, ఎప్పుడూ యజమాని లేనివాణ్ణి.  వ్యాకులత  లేనివాణ్ణి. ఇప్పుడు మనస్సు లేనివాణ్ణి, ఎప్పుడూ మనస్సు లేనివాణ్ణి, వ్యాకులత లేనివాణ్ణి. బాగా అన్నీ తెలిసినవాణ్ణి, అన్నీ వదిలేసినవాణ్ణి. వ్యాకులతలేనివాణ్ణి, నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

కాన్తారమన్దిరమిదం హి కథం వదామి

    సంసిద్ధసంశయమిదం హి కథం వదామి ।

ఏవం నిరన్తరసమం హి నిరాకులం వై

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౦॥

సత్యం aనేది అడవిలో ఉన్న రహస్య భవనం లాంటిది అని ఎప్పుడు చెప్పాను?, సత్యం అనేది ఎప్పుడూ సిద్దించేవుందిఅన్న దాంట్లో సందేహం వుందని ఎప్పుడు అన్నాను?, ఎప్పుడూ వుండేదీ, సమం అయినదీ, వ్యాకులత లేనిదీ నేనుఅమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

నిర్జీవజీవరహితం సతతం విభాతి

    నిర్బీజబీజరహితం సతతం విభాతి ।

నిర్వాణబన్ధరహితం సతతం విభాతి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౧॥

ఇప్పుడు  జీవం  లేనివాణ్ణి, ఎప్పుడూ లేనివాణ్ణి, ఎప్పుడూప్రకాశించేవాణ్ణి. ఇప్పుడు బీజం లేనివాణ్ణి, ఎప్పుడూ బీజంలేనివాణ్ణి, ఎప్పుడూ ప్రకాశించేవాణ్ణి. అన్నీ వదలిన వాణ్ణీ, బంధాలు లేనివాణ్ణి, ఎప్పుడూ ప్రకాశించేవాణ్ణి, నేనుఅమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 


 

సమ్భూతివర్జితమిదం సతతం విభాతి

    సంసారవర్జితమిదం సతతం విభాతి ।

సంహారవర్జితమిదం సతతం విభాతి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౨॥

పుట్టుక అనేది వదిలి బాగా ప్రకాశిస్తున్నవాణ్ణి. నాటకం లాగా నడుస్తున్న ఈ సంసారాన్ని వదిలి బాగా ప్రకాశిస్తున్న వాణ్ణి. అన్నిటికీ, అందరికీ జరిగే నాశనాన్ని వదిలి బాగా ప్రకాశిస్తున్న వాణ్ణి. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

ఉల్లేఖమాత్రమపి తే న చ నామరూపం

    నిర్భిన్నభిన్నమపి తే న హి వస్తు కిఞ్చిత్ ।

నిర్లజ్జమానస కరోషి కథం విషాదం

     జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౩॥

నీగురించి ఎవరు ఏమి చెప్పారోగానీ నీకు మట్టుక్కు నామమూ, రూపమూ లేవు. నువ్వు ఒక్కడివా, అనేకుడివాఅనేదానికి సమాధానం తెలీదు కానీ, ఇక్కడ నువ్వు తప్ప వేరెవరూ లేరు. సిగ్గులేకుండా ఇటూ అటూ తిరిగే మనసా! నువ్వెందుకు అలా ఏడుస్తూ ఉంటావు?. 

నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

కిం నామ రోదిషి సఖే న జరా న మృత్యుః

    కిం నామ రోదిషి సఖే న చ జన్మ దుఃఖమ్ ।

కిం నామ రోదిషి సఖే న చ తే వికారో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౪॥

ఓ ంఇత్రుడా నీకు ముసలితనమూ, మృత్యువూ లేనేలేవు. ఎందుకు నువ్వు ఏడుస్తుంటావు. 

ఓ మిత్రుడా,  నీకు పుట్టుకా, దాంతో వచ్చే దుఖమూ లేనేలేవు, ఎందుకు నువ్వు ఏడుస్తుంటావు. నీకు ఎలాంటిమార్పులూ లేవు, ఎందుకు నువ్వు ఏడుస్తుంటావు. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటివాణ్ణి. 

 

 

కిం నామ రోదిషి సఖే న చ తే స్వరూపం

    కిం నామ రోదిషి సఖే న చ తే విరూపమ్ ।

కిం నామ రోదిషి సఖే న చ తే వయాంసి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౫॥

నీకు  ఏ స్వరూపమూ లేదు, ఎందుకు నువ్వు ఏడుస్తుంటావు?. నీకు రూపం లేకుండా ఎవరూ చేయలేరు. ఎందుకునువ్వు ఏడుస్తుంటావు?. నీకు ఎప్పుడూ ముసలితనం రాదు, ఎందుకు నువ్వు  ఏడుస్తూ ఉంటావు. నేనుఅమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

కిం నామ రోదిషి సఖే న చ తే వయాంసి

    కిం నామ రోదిషి సఖే న చ తే మనాంసి ।

కిం నామ రోదిషి సఖే న తవేన్ద్రియాణి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౬॥

నీ యౌవనం  ఎప్పటికీ కోలుపోవు. ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉంటావు?. నీ మనస్సు ఎప్పుడూ విశదంగాఉంటుంది, ఎందుకు నువ్వు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు?. నీకు ఇంద్రియాలే లేవు, ఇంక ఎందుకు ఏడుస్తావు. నేనుఅమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

కిం నామ రోదిషి సఖే న చ తేఽస్తి కామః

    కిం నామ రోదిషి సఖే న చ తే ప్రలోభః ।

కిం నామ రోదిషి సఖే న చ తే విమోహో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౭॥

నీకు కోరికలేలేవు, ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉంటావు?. నీకు లోభమే లేదు, ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉంటావు?. నీకు ఎక్కువైన మోహం ఎప్పుడూ లేదు, ఎందుకు నువ్వు  ఏడుస్తూ ఉంటావు?. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారనిఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

ఐశ్వర్యమిచ్ఛసి కథం న చ తే ధనాని

    ఐశ్వర్యమిచ్ఛసి కథం న చ తే హి పత్నీ ।

ఐశ్వర్యమిచ్ఛసి కథం న చ తే మమేతి

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౮॥

ఐశ్వర్యం కావాలి అంటావు కానీ నీదగ్గర ధనం లేదు. ఐశ్వర్యం కావాలి అంటావు నీకు భార్య కూడా లేదు. ఐశ్వర్యంకావాలి అంటావు కానీ నీకు నావి అనేవి ఏవీ లేవు. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటివాణ్ణి. 

 


 

లిఙ్గప్రపఞ్చజనుషీ న చ తే న మే చ

    నిర్లజ్జమానసమిదం చ విభాతి భిన్నమ్ ।

నిర్భేదభేదరహితం న చ తే న మే చ

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౩౯॥

నీకూ  నాకూ ఈ పుట్టటమూ, స్త్రీ పురుష విభేదాలూ, ప్రపంచమూ లాంటివి లేనే లేవు. సిగ్గులేని మనస్సే ఒక్కటి అయినఆత్మని అనేకంగా చూపిస్తుంది, నిజానికి నీకూ నాకూ భేదాలు ఇప్పుడూ లేవు,  భేదాలు ఎప్పుడూ లేవు. నేనుఅమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

నో వాణుమాత్రమపి తే హి విరాగరూపం

    నో వాణుమాత్రమపి తే హి సరాగరూపమ్ ।

నో వాణుమాత్రమపి తే హి సకామరూపం

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౪౦॥

నువ్వు అణుమాత్రం కూడా విరాగం లేనివాడివి. నువ్వు అణుమాత్రం కూడా అనురాగం లేనివాడివి. నువ్వుఅణుమాత్రం కూడా కోరికలు లేనివాడివి.  నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

ధ్యాతా న తే హి హృదయే న చ తే సమాధి-

    ర్ధ్యానం న తే హి హృదయే న బహిః ప్రదేశః ।

ధ్యేయం న చేతి హృదయే న హి వస్తు కాలో

    జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౪౧॥

నీహృదయంలో ధ్యానం చేసేటప్పుడుకానీ సమాధిలోకానీ ధ్యానించేవాడు ఎవరూ లేడు. నీహృదయంలో కానీ బయటఎక్కడ కానీ ధ్యానం చేయటం అనేదే లేదు. నీ హృదయం లో కానీ, ఇతర వస్తు కాలాల్లో ఎక్కడా ధ్యానంచేయబడేదే(ధ్యాత) లేదు. నేను అమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

యత్సారభూతమఖిలం కథితం మయా తే

    న త్వం న మే న మహతో న గురుర్న న శిష్యః ।

స్వచ్ఛన్దరూపసహజం పరమార్థతత్త్వం

   జ్ఞానామృతం సమరసం గగనోపమోఽహమ్ ॥ ౪౨॥

ఇఇప్పుడు చెప్పిన దాని సారం మొత్తం ఏమిటి అంటే నువ్వూ లేవు, నేనూ లేను, గొప్పదైన వస్తువు ఏదీ లేదు. గురువూలేడు, శిష్యుడూ లేడు. పరమార్ధమైన తత్త్వం లాగా సహజమూ, స్వయంగా వెలిగే రూపమూ అయిన నేనుఅమృతమైన జ్ఞానాన్ని, మారని ఆనందాన్నీ, ఆకాశం లాంటి వాణ్ణి. 

 

 

కథమిహ పరమార్థం తత్త్వమానన్దరూపం

    కథమిహ పరమార్థం నైవమానన్దరూపమ్ ।

కథమిహ పరమార్థం జ్ఞానవిజ్ఞానరూపం

    యది పరమహమేకం వర్తతే వ్యోమరూపమ్ ॥ ౪౩॥

ఇది   నాకు  చెప్పు, పరమార్థం అయిన తత్త్వం ఆనంద రూపం గా ఎందుకు వుంటుంది?. ఇదినాకు చెప్పుపరమార్థమైన తత్త్వం ఆనంద రూపం కాకుండా ఎలా వుంటుంది?.  ఇది నాకు చెప్పు, పరమార్ధ తత్త్వం. ప్రపంచరూపవిజ్ఞానంగా , ఆత్మరూప జ్ఞానంగా ఎలావుంటుంది?. పరమమైన నేను ఒక్కణ్ణే ఆకాశ రూపం లో ఉన్నాను. 

 

దహనపవనహీనం విద్ధి విజ్ఞానమేక-

    మవనిజలవిహీనం విద్ధి విజ్ఞానరూపమ్ ।

సమగమనవిహీనం విద్ధి విజ్ఞానమేకం

    గగనమివ విశాలం విద్ధి విజ్ఞానమేకమ్ ॥ ౪౪॥

అగ్నీ,  వాయువూ, లేని ఒక్కటే అయిన విజ్ఞానము నువ్వే అని తెలుసుకో. భూమీ, నీరూ లేని విజ్ఞాన రూపం నువ్వే అనితెలుసుకో. సమమూ, కదలికలేనిదీ నువ్వే అని తెలుసుకో. ఆకాశంలాగా విశాలమైనది విజ్ఞానం ఒక్కటే అని తెలుసుకో. 

 

న శూన్యరూపం న విశూన్యరూపం

    న శుద్ధరూపం న విశుద్ధరూపమ్ ।

రూపం విరూపం న భవామి కిఞ్చిత్

    స్వరూపరూపం పరమార్థతత్త్వమ్ ॥ ౪౫॥

 శూన్యరూపం కానిదీ, విశూన్యరూపం కానిదీ, శుద్ధరూపం కానిదీ, విశుద్ధ రూపం కానిదీ, రూపమూ, రూపం లేకుండా  ఉండటం రెండూ కొద్దిగా కూడా లేని ఆత్మ స్వరూపమే, పరమార్థ తత్త్వమే నేను. 

ముఞ్చ ముఞ్చ హి సంసారం త్యాగం ముఞ్చ హి సర్వథా ।

త్యాగాత్యాగవిషం శుద్ధమమృతం సహజం ధ్రువమ్ ॥ ౪౬॥

వదిలెయ్యి,  వదిలెయ్యి, సంసారాన్ని.  వదలివెయ్యటాన్ని కూడా ఎప్పుడూ వదిలివెయ్యి. నువ్వు వదిలేసినా, లేకున్నా, శుద్ధమూ, అమృతమూ, సహజమూ, ఎప్పుడూ ఉండేది అయిన ఆత్మలో మునిగి ఆనందించు. 

 

ఇతి తృతీయోఽధ్యాయః ॥ ౩॥

ఇది మూడో అధ్యాయము 

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...