Friday 30 September 2022

కన్న తల్లి - కథ

త్యాగరాజ  స్వామి వాలాజాపేటకి వొస్తున్నారని తెలియగానే ఆయన శిష్యుడైన వెంకటరమణ భాగవతార్‌కి కాళ్ళూ చేతులూ ఆడటల్లేదు. అప్పటికే యాభయ్యో పడిలో సగం దాటిన భాగవతార్ తన శిష్యులందరినీ పిలిచి తలా ఒక పనీ అప్పగించారు. ముఖ్య శిష్యుడైన మైసూర్ సదాశివరావుకి అందరినీ సమన్వయ పరచే పని అప్పగించారు. 

మరుసటి రోజు త్యాగరాజ స్వామి వాలాజాపేట వచ్చే మార్గంలో భాగవతార్ శిష్యులతో నిలబడ్డారు. అయ్యవారి పల్లకీదగ్గరకు రాగానే అందరూ సాష్టాంగపడ్డారు. బోయీలని తొలగమని చెప్పి భాగవతార్ పల్లకీ ముందు వైపు ఎత్తారు. ఆయన శిష్యులు మిగతా పక్కల ఎత్తారు. అందరూ కలిసి అయ్యవారి పల్లకీ మోస్తూ జయజయధ్వానాలు చేస్తూ వెడుతూఉంటే మైసూర్ సదాశివరావు తను సభక్తికంగా రచించిన "త్యాగరాజ స్వామి వెడలిన" అన్న పాట పాడితే అందరూ సంతోషించారు.

భాగవతార్ ముఖ్యశిష్యుడూ, మైసూర్ ఆస్థాన సంగీత విద్వాంసుడూ, వాగ్గేయకారుడూ అయిన సదాశివరావు సభక్తికంగా పరమగురువులైన అయ్యవారిని సేవించాడు. 

కొన్ని రోజులైన తరవాత ఒక మధ్యాహ్నం భాగవతార్ శిష్యులని అందరినీ పిలిచి "మీకు ఏమన్నా ప్రశ్నలు, సందేహాలుంటే అయ్యవారు వొస్తారు, ఆయనని అడగవచ్చు" అని చెప్పాడు. అయ్యవారు వొచ్చి కూచున్నారు. ఒకరిద్దరు శిష్యులు సంగీతశాస్త్ర విశేషాలని అడిగితే అయ్యవారు సమాధానం చెప్పారు. తరవాత సదాశివరావు లేచాడు. అయ్యవారికి సాష్టాంగప్రణామం చేసి నుంచుని" స్వామీ నేనడిగే ప్రశ్న తప్పైతే క్షమించండి. మీ కృతులు మాగురువుగారైన భాగవతార్ గారిదగ్గిర నేర్చుకున్నాను. ఆయన రాసుకున్న కృతులు అన్నీ చూసి నేను ఒక ప్రతి రాసుకున్నాను. ఆ కృతులు అమృతభాండాలు. సంగీత సాహిత్య శిఖరాలు. నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. నిజానికి రామయ్య కంటే సీతమ్మ అంటే నా మనస్సు ద్రవిస్తుంది. అటువంటి సీతమ్మని మీరు పూర్తిగా మనస్సులో పెట్టుకోలేదని నాకు అని అనిపించింది. ఎందుకో తెలుసుకోవచ్చా?" అని సవినయంగా అడిగాడు. 

వింటూ ఉన్న అందరూ ఆ ప్రశ్నకి చకితులు అయ్యారు. భాగవతార్ కోపంగా లేచి శిష్యుణ్ణి తిట్టబోతూ అయ్యవారి సైగచూసి కూచున్నాడు. అయ్యవారు శాంతంగా "నీకు కలిగిన భావానికి సరైన కారణం చెబితే అప్పుడు దాన్ని విచారిద్దాము" అన్నారు. 

సదాశివరావు చేతులు జోడించి "విన్నవించుకుంటాను. అవధరించండి. ఉపాస్య దేవతలని కన్న తల్లి అని కన్న తండ్రి అనీ భావించటం సహజమే. పితామహస్య జగతో, మాతా, ధాతా, పితామహః ( ఈ జగత్తుని ధరించేవాడినీ, తండ్రినీ, తల్లినీ, తాతనీ నేనే ) అని గీతలో నవమోధ్యాయంలో చెప్పింది , ఈ జగత్తు అంతటికీ మూలబీజం తానే అని గీత సప్తమోధ్యాయంలో ( బీజం మాం సర్వభూతానాం) కృష్ణుడు చెప్పినట్టు మీరు కూడా అనేక చోట్ల దేవీ స్వరూపాలని  కన్నతల్లి అనీ దేవ స్వరూపాలని కన్న తండ్రి అనీ సంబోధించారు. 

దేవమనోహరి రాగంలో "కన్నతండ్రి నాపై కరుణ మానకే, గాసి చూపకే " అని కీర్తన ప్రారంభించారు. నిన్ననవలసినదేమి అనే కళ్యాణి రాగ కీర్తనలో "కన్నతండ్రి , నీకన్న వేల్పులెవరున్నారురా, ఆపన్న రక్షక" అంటూ మీరు రాముణ్ణి ప్రార్థించారు. 

ఎవరు తెలియను పొయ్యెదరు అనే పున్నాగవరాళి కృతిలో "కన్నతండ్రి ఇదియా పేదపై యుక్తి" అంటూ విన్నవిస్తారు 

"సిగ్గుమాలి నావలే" అనే కేదారగౌళ కృతిలో "కన్నతండ్రి, త్యాగరాజునింక కరుణ చూడ లేదని తెలిసి" అంటూ దైన్యంగా విచారిస్తారు తమరు. 

ఇలా ఇన్నిసార్లు రామప్రభువుని కన్నతండ్రి అని సంబోధించి సీతమ్మ గురించి కన్నతల్లి అని ఒక్క కీర్తనలో కూడా అనలేదు. దానికి కారణం ఏమిటా అని తెలుసుకుందామని నా విన్నపం" అని దోసిలి ఒగ్గి అన్నాడు . 

అయ్యవారి పక్కనే కూచున్న వెంకట సుబ్బయ్య " సీతమ్మ మాయమ్మ అన్న వసంత రాగ కృతి ఉన్నది కదా" అన్నారు.  సదాశివ రావు ఆయన వైపు తిరిగి వినమ్రంగా "అయ్యా, అమ్మకీ కన్నతల్లికీ భేదం ఉందనుకొంటాను. యశోద, దేవకి ఇద్దరూ అమ్మలే కానీ కన్నతల్లి మట్టుక్కు దేవకి మాత్రమే." అన్నాడు. 

వీణ కుప్పయ్యర్ "కన్నతల్లి అని చాలా చోట్ల వస్తుంది కదా" అని చెబుతుంటే సదాశివరావు ఆయన వైపు తిరిగి "మీరు చెప్పింది సత్యం. కన్నతండ్రి అని రాముణ్ణి సంబోధించిన అయ్యవారు, కన్నతల్లి అని పార్వతీదేవినే సంబోధించటం విశేషం. నారాయణి, రమాపతి సోదరి అయిన అమ్మవారిని "నన్ను కన్న తల్లి, నా భాగ్యమా" అంటూ సంబోధించారు. "సుందరి నీ దివ్యరూపమును" అనే కృతిలో "నన్ను కన్నతల్లి, నా జన్మము నేడు సఫలమాయెనమ్మ" అంటూ అమ్మవారిని చూసినప్పుడు కల్గిన ఆనందాన్ని వర్ణించారు. 

అదేవిధంగా "కన్నతల్లి నీవు నాపాల గలుగ గాసి చెందనేలనమ్మ" అంటూ తిరువొత్రియూర్ త్రిపురసుందరితో తన ధైర్యానికి కారణం ఆవిడే అని చెప్పారు. 

లాల్గుడి పంచరత్నాలలో ఒకటైన "లలితే శ్రీ ప్రవృద్ధే" అనే కృతిలో "కన్నతల్లి శుభవదనే, మీ యన్న దయకు పాత్రుడనే" అని అన్నా చెల్లెళ్ళ గురించి పాడారు అయ్యవారు" అని ఆగాడు.

మిగతా శిష్యులు ఎవ్వరూ మాట్లాడకపోవటం గమనించి అయ్యవారు గొంతు సవరించుకుని "నా దృష్టిలో ఉన్నది రామపరబ్రహ్మమే. ఉన్నది ఆయన తత్వమే. మిగిలినవి ఏమీ అంత ముఖ్యం కాదు నాకు. అందువల్ల అలా వచ్చి ఉండవచ్చు. రాముణ్ణి స్త్రీ రూపంలో చూస్తే అదే అమ్మవారు అవుతుంది. అందుకని ఆవిడని కన్నతల్లి అనడమూ, రామప్రభువుని కన్న తండ్రి అనటమూ ఒక్కటే నాకు.  


"అభిమానమెన్నడు కల్గురా" కృతిలో  "కన్నతల్లియు, కన్నతండ్రియు అన్నియు నీవని నమ్మ లేదా" అంటూ కన్నతల్లీ, కన్న తండ్రీ నువ్వే అంటూ రాముడికి విన్నవించాను. 

సీతమ్మ మాయమ్మ. ఆవిడపై నాకు అత్యంత ప్రేమా, గౌరవమూ ఉన్నాయి. అనేక కృతుల్లో ఆవిడ ప్రస్తావన చేశాను. ఆవిడకి ఉన్న మహనీయమైన స్థానం ఆవిడదే. " అని ముగించారు అయ్యవారు. 


                          - జొన్నలగడ్డ సౌదామిని 

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...