Friday 23 September 2022

కలసి వేడుక - జనార్దనాష్టకం

సాయంత్రమైంది. యమునా తీరం కోలాహలంగా ఉంది. గోపికలు అందరూ జట్లుగా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కుసుమ ఒక్కత్తీ మట్టుక్కు వాళ్ళకి దూరంగా మోదుగ చెట్టు కింద కూచుని పూలమాల కడుతూ రాగం తీస్తోంది. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. గోపికలు అందరూ పరిగెత్తారు. కుసుమ కదలలేదు. కాసేపు గోపికలతో ఆడి, పాడి అలిసిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటుంటే కృష్ణుడు మెల్లిగా కుసుమ దగ్గరకు వచ్చాడు. కృష్ణుడు అలా నడిచి  వస్తుంటే, రాజుగారు వస్తుంటే రాజభటులు ముందు వచ్చి హడావిడి చేసినట్టు, ఆతని శరీరం నుండి దివ్యపరిమళాలు వచ్చి కుసుమకి తాకాయి. ఆ సువాసనల వల్ల ఎవరు వొస్తున్నారో గ్రహించిన కుసుమ ఇంకాస్త బింకంగా, ఏమీ పట్టనట్టు కూచుంది. 

కృష్ణుడు వొచ్చి కుసుమకి ఎదురుగ్గా కూచున్నాడు. కుసుమ తలకూడా తిప్పలేదు. 

కృష్ణుడు మాట కలుపుతూ " నాట్యానికి  రాలేదు, ఒంట్లో ఎట్లా వుందీ?" అని ప్రశ్నించాడు. 

కుసుమ మాట్లాడలేదు. 

కృష్ణుడు మళ్ళీ ప్రశ్నించాడు " ఆరోగ్యం ఎలావుందీ" అని. 

కుసుమ తలతిప్పితే ఒట్టు"కోపం వచ్చిందా? క్షమించు. ఏమి చెయ్యమంటావో చెప్పు.ఏమి చెయ్యటానికైనా నేను సిద్ధం" అన్నాడు కృష్ణుడు.

కుసుమ వెంటనే తలతిప్పి 

అలుకలన్నియు తీరగా నా అండకెప్పుడు వస్తివీ

పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివీ

వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివీ

కలసి వేడుక, దనుజ మర్దన కందుకూరి జనార్దనా 

అన్నది. 

"అదేమిటీ? " అని ఆశ్చర్యంగా చూశాడు కృష్ణుడు 

"అవును, ఎప్పుడన్నా, అసలెప్పుడన్నా వొచ్చి నా పక్కన కూచుని, ఏది ఏమైనా నేను నీ పక్కన ఉన్నాను అని చెప్పి నాఅలుకలు అన్నీ తీర్చావా?, చెప్పు?. చక్కగా పిలిచి ఇదిగో ఈ రత్నాభరణం తీసుకో, ఈ కర్ణాభరణాలు నీకు బాగుంటయ్యి తీసుకో అంటూ ప్రేమతో ఎప్పుడన్నా, ఏమన్నా ఇచ్చావా చెప్పు? . అంతెందుకు, నిన్ను వలచి నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటే, వదలకుండా నాతో కలసి వేడుక చేసుకున్నావా? లేదే. ఎంతసేపూ ఊరు తిరగటమేనాయె. ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా నన్ను మెచ్చావా? లేదే? ఇంకేం చెప్పనూ?" 

"అదేమిటి అట్లా అంటావు?, నిన్న రాత్రి కాస్త జ్వరం వొస్తేనూ..." 

"నిన్న రాత్రి జ్వరమా? సర్వాబద్ధం. 

నిన్న రాతిరి చవికె లోపల నీవు చెలి కూడుంటిరా

ఉన్న మార్గములన్నియును నేనొకతె చేతను వింటిరా

విన్నమాత్రమె కాదురా నిను వీధిలో కనుగొంటిరా

కన్నులారా, దనుజ మర్దన, కందుకూరి జనార్దనా " 

"అదేమీ కాదు, నేను.."


"మోసపు మాటలు చాలు. నిన్న రాత్రి నువ్వు వెళ్ళిన ఇంటి పక్కనే నా సఖి మధూలిక వాళ్ళ ఇల్లు. నువ్వూ, నీ చెలీకలిసి ఆ చవికెలో కూర్చుని ఏమేమి చేశారో చక్కగా చూసిన నా సఖి నాకు పూర్తిగా వివరించింది. నిజానికి నీ చెలి ఇంట్లోనించి బయటికి వొస్తున్నప్పుడు ఏదో పని మీద అటు వెళుతున్న నేను కూడా నువ్వు వీధిలోకి రావటం చూశాను. ఇంకేమన్నా సాక్ష్యాలు కావాలా?." 

"ఊ , అది ఏమైందంటే.." 

"నీ అసత్యాల పుస్తకాలు ఇంక విప్పకు. అప్పటి విషయం ఎందుకు. ఇప్పటి విషయం మాట్లాడుకుందాము. ఇక్కడకు వచ్చేముందు ఎక్కడి వెళ్ళి వొచ్చావో కానీ ఇంత రాత్రి అయ్యాకా రావటం?. దానికి తోడు నీ వేషం చూడు. ఎల్లావుందో. 

చెల్లెబో, పసుపంటినది నీ జిలుగు దుప్పటి విప్పరా

ముల్లుమోపగ సందులేదుర మోవి కెంపులు గప్పరా

తెల్లవారినదాక యెక్కడ తిరుగులాడితి చెప్పరా 

కల్లలాడక దనుజ మర్దన కందుకూరి జనార్దనా" 

"ఆ ఏమీలేదు, ఉద్ధవుడు ఆడుతూ గంధం పూశాడు, అంతే"

"ఇది గంధమా?, వాసన చూడు?, పసుపు కాదూ?, ఎవరు ముఖానికి రాసుకున్న పసుపో ఇది?. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతావు?, 

"అది కాదు.."

"ఏది కాదో తెలుసు కానీ, ముందు ఎవరి పసుపో అంటిన నీ జిలుగు ఉత్తరీయం తీయి. ఆ అట్టే, అట్టే.. ఆగు. ఆ వొంటినిండా ఆ ఎర్రటి నక్షత్రాలు ఏమిటి? ఎవరివో నఖ క్షతాలు లాగా ఉన్నయ్యి. అవునా?. ముఖం కాస్త ఇటు తిప్పు. ఇప్పుడు చెప్పు. నీ మోవిని కెంపులతో కప్పి వేసింది  ఎవరు?. ఇప్పటి దాకా ఎక్కడ తిరిగావో కల్లలు ఆడకుండా చెప్పు?"

"ఈ సారికి పొరపాటు అయ్యింది క్షమించు. ఇక నించీ నువ్వు ఏమి చెబితే అదే చేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను అనుగ్రహించు." అన్నీ అసత్యాలే. నీ అసత్యాలు అన్నీ తెలుసుకున్నాను. 

దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పుబాసలు చేయకూ

మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ

ఉబ్బుచేసుక తత్తరంబున ఒడలిపై చెయివేయకూ

గబ్బితనమున దనుజమర్దన కందుకూరి జనార్దనా

నీ అబద్ధాలు అన్నీ తెలుసు. అందుకని ఊరికే తప్పు ప్రతినలు చెయ్యకు. రాత్రి అంతా తిరిగి వచ్చావు కదా, నీ కళ్ళు అరమూతలు పడుతూ, మబ్బు తేరుతున్నాయి. అలా అరమూసిన కళ్ళతో నాదగ్గరికి మాటిమాటికీ రాకు. ఏదో దగ్గరగా ఉన్నానని సంతోషపడి, నీ పొగరు చూపిస్తూ ఒంటిమీద చెయ్యి వెయ్యద్దు. సరేనా?" 

"నువ్వు ఏది చెబితే అదే, కానీ...?"

"అదే వొద్దంటూంటే మళ్ళీ మీద చెయ్యి వేస్తావు. వొద్దంటుంటే వినవూ, ధూర్తుడా"

"---"

"ఇలాగైతే  ఓర్చేది లేదు. 

అండబాయక కూడియుంటిమి ఆయెబోయెను నాటికీ

ఖండి మండి పడంగనేటికి కదలుమెప్పటి చోటికీ

ఏమిటి ఆ కోపం. తప్పు నువ్వు చేసి మళ్ళీ కోపమా, నీతో వేగింది ఇంకచాలు. ఇద్దరమూ కలిసి ఉన్న రోజులు అయిపోయాయి. నామీదే కోపం తెచ్చుకుని మండిపడుతున్నావూ, అయితే పో, నీ మామూలు చోటికే పో" 

"సరే నువ్వు పొమ్మంటే పోవాల్సిందేకదా?. ఎంత చెప్పినా వినవాయెను. ఇదిగో పోతున్నాను" 

"అబ్బా, నీతో చచ్చిన చావు వొచ్చిందే. ఏదో కోపంలో ఓమాటన్నాను అని వొదిలేసి వెళ్ళిపోతావూ?. హమ్మా"

"ఇంతకీ ఏమి చెయ్యమంటావో చెప్పకూడదూ?, వెళ్ళిపోనా" 

ఉండరా, నీ మాటలకు నే నోర్వజాలను మాటికీ 

గండి దొంగవు దనుజ మర్దన కందుకూరి జనార్దనా" 

దొంగ వెధవ, ఉండూ, ఉండమని చెబుతున్నానా, ఉండు. నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఓర్వలేను అని నీకు తెలీదూ, ఉత్త బెట్టు చేస్తావు గానీ. నా మనస్సు కన్నం వేసి మొత్తం దోచుకుపోయే కన్నపు దొంగవి గదా నువ్వు. ఇంక నీ ఇష్టం. "కోడి కూసింది. కృష్ణుడు లేచి ఇంటికి వెళ్ళటానికి తయారయ్యాడు." 

కొదవలన్నియు తీర్చుకొంటివి గుణములెరిగీ శయ్యనూ

అదనెరింగీ ఏలితివి విరవాది పూవుల శయ్యనూ

మదన కేళికి నీవె జాణవు మారునేమిటి చెయ్యనూ

కదియరారా, దనుజ మర్దన కందుకూరి జనార్దనా

కొరత ఏమన్నా ఉంటే అన్నీ శయ్య మీదతీర్చుకున్నావు. విరవాది పూల పక్కమీద సమయం చూసి మరీ నన్ను ఏలావు. పేరుకే ఇది మన్మథయుధ్ధం, కానీ ఈ యుద్ధంలో మన్మథుడు కూడా నీ తరవాతే, వెళ్ళే ముందు ఒకసారి దగ్గరకి వొచ్చివెళ్ళరాదూ? " అన్నది కుసుమ. 

కథ కంచికి మనం ఇంటికి.


                              - జొన్నలగడ్డ సౌదామిని 

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...