Saturday 28 May 2022

హృద్భాంతం

అప్పటికి ఇంకా తెల్లవారలేదు. రమణాశ్రమంలో ఉన్న రెండు మూడు గుడిసెలలో ఉన్న కొద్దిమందీ తమ పనులు తాము చేసుకుంటున్నారు. వంటగదిలో ఇడ్లీ పిండి రుబ్బుతున్నారు. భగవాన్ దగ్గరగా ఉండి ఇడ్లీలలోకి అన్నీ సరిగా పడ్డాయోలేదో చూస్తున్నారు. ఇంతలో అణ్ణామలై స్వామి వచ్చి వేదపారాయణకి సమయం అయినది అని చెప్పాడు. భగవాన్ లేచివెళ్ళబోతూ "మనకి కాకుండా ఒక పది ఇడ్లీలు ఎక్కువగా చెయ్యండి" అని వెళ్ళిపోయారు. ఇడ్లీలు చేస్తున్న రాజయ్యర్ వ్వుతూ "ఇవ్వాళ్ళ మనకి వచ్చే అతిథి ఎవరో సరిగ్గా చెప్పిన వాళ్ళకి బహుమానం" అన్నాడు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల పేర్లు చెప్పారు. ఇంతలో పొడుగ్గా, ఎర్రగా ఉన్న వ్యక్తి గబగబా నడుచుకుంటూ వచ్చి "అభిషేకానికి పాలుకావాలి అంటున్నారు" అన్నాడు. వెంటనే "కృష్ణ భిక్షూ, ఇప్పుడే వచ్చావా? పది ఇడ్లీలు నీలెక్కలో వేశాము" అన్నాడు రాజయ్యర్. "పది కాకపోతే ఇరవై వెయ్యండి. నీ ఇడ్లీలు బావుంటాయిగా" అన్నాడా వ్యక్తి.

అలా కుదరదు, అలా అయితే భగవాన్ పదే అని చెప్పరు" అంటూ అభిషేకం పాలు ఇచ్చాడు రాజయ్యర్. "సరే, పదిటితో సరిపెట్టుకుంటాను ఈసారికి" అని  ఆ వ్యక్తి నిష్క్రమించాడు.

ఆ వ్యక్తి పేరు ఓరుగంటి వెంకట కృష్ణయ్య. ఆయన్ని అందరూ "కృష్ణ భిక్షు" అని "కిష్టయ్య" అని కూడా పిలుస్తారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన ఆ పని పెద్దగా చేయలేదు. ఆయన ప్రవృత్తి మట్టుక్కు దైవ సంబంధమైనదే. అందుకని గుళ్ళూ గోపురాలు తిరగటమూ, సత్పురుష దర్శనమూ ఆయన దిన చర్య. త్యాగరాజ కీర్తనలు పాడుకోవటమూ, గాయత్రి జపం చెయ్యటమూ ఆయన అలా తిరిగేటప్పుడు చేసే పనులు. గణపతిముని శిష్యులైన కొంత కాలం తర్వాత ముని తనతో బాటు భగవాన్ దగ్గరకు తీసుకువొస్తే అప్పటి నుంచీ ఏం చేసినా, ఎక్కడ తిరిగినా, భగవాన్‌కి అంకితమైపోయిన వ్యక్తి.

ఆ కిష్టయ్య తీరిక దొరికినప్పుడల్లా, కోర్టుకి శెలవలు వచ్చినప్పుడల్లా ఆశ్రమానికి వచ్చేసేవాడు. ఎన్ని రోజులు వీలైతే అన్నిరోజులు ఆశ్రమంలో ఉండిపోయేవాడు. బ్రహ్మచారిగా ఉండబట్టి ఎవరికీ ఏ చిక్కూ లేకుండా ఉండేది.

ఆ రోజు సాయంత్రమైంది. బయట ఊళ్ళ నించి వచ్చిన కొద్దిమంది భక్తులు ఊళ్ళోకి వెళ్ళారు. ఆశ్రమంలోని కొద్దిమంది భక్తులు మిగిలారు. అజ్ఞాని మనస్సులోని తమస్సు లాగా చీకట్లు నిండాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని అందరూ భగవాన్ కూచున్న మంచం చుట్టూ చేరారు. గురువు యొక్క కరుణారసభరితమైన చూపుల లాగా ఆకాశంలోని చంద్రునికిరణాలు అందరినీ ముంచెత్తుతున్నాయి. ఇంక చుట్టూ చేరిన కొద్దిమంది మెల్లిగా ఒకరి తరవాత ఒకరు వారి వ్యక్తిగత జీవిత ప్రశ్నలూ, సాధనలో వచ్చే సందేహాలూ ఇలా ఏదో ఒకటి అడగడం మొదలెట్టారు. కొంతమంది తాము భగవాన్ మీద రాసిన గీతాలో, స్తోత్రాలో, కవిత్వమో చదువుతున్నారు. కాసేపు గడిచింది. కృష్ణ భిక్షు ఒక్కడే ఏమీ మాట్లాడకుండా భగవాన్ని చూస్తూ కూచున్నాడు. ఇంతలో రామనాథ బ్రహ్మచారి నవ్వుతూ "కిష్టయ్యా, నీకు పాటలూ, పద్యాలూ చాలా వచ్చు కదా, ఇవాళ్ళ పొద్దుణ్ణించీ రాత్రి దాకా ఏమీ చెప్పలేదు నువ్వు" అన్నాడు. కిష్టయ్య ఏమీ మాట్లాడలేదు. రాత్రి అయ్యింది, అందరూ నిద్దర్లు పోయారు.

తెల్లారేటప్పటికి ఊళ్ళోంచి శాంతమ్మా, సూరి నాగమ్మలాంటి వాళ్ళు అందరూ గుంపుగా వచ్చారు. భర్తనీ, తల్లితండ్రులనీ పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నాగమ్మ భగవాన్ సందర్శనంతో కొత్తమనిషి అయ్యి రమణాశ్రమంలో జరిగేవి అన్నీ లేఖలుగా రాస్తున్నదని అందరికీ తెలుసు. నాగమ్మ భగవాన్ దర్శనం చేసుకుని హాలు బయట ఉన్న చెట్టు కిందకూచుని ఏదో రాసుకుంటోంది. ఇంతలో కృష్ణభిక్షు అటువెళుతూ నాగమ్మ దగ్గరికి వచ్చి "ఏమ్మా, ఎలా వున్నావు?" అనిపలకరించాడు. "భగవాన్ దయ వల్ల అంతా కుశలమే, రా, ఇటు కూచో అన్నా" అని నాగమ్మ అంటే ఆ చెట్టుకిందే కూచున్నాడు కృష్ణభిక్షు. కాసేపు వివిధ విషయాల మీద మాట్లాడుకున్న తరవాత నాగమ్మ "అన్నా, మీకు త్యాగరాయకృతులు చాలా వచ్చుట కదా, భగవాన్ ముందు ఎప్పుడూ పాడరేమి?" అన్నది. కృష్ణభిక్షు నవ్వుతూ "అమ్మా, భగవాన్దగ్గర అన్నింటిలో మా ఇంట్లో ఉన్నట్టే ఉంటాను. కానీ ఆయన ముందు ఈ పాటలే నోరు పెగలవు" అన్నాడు. "ఇప్పుడు నా దగ్గర ఒక పాట పాడకూడదూ?" అని అడిగిన నాగమ్మతో "కావాలంటే నీకు పాట చెబుతాను" అన్నాడు. నాగమ్మ ఒప్పుకుని చేసిన విన్నపాన్ని మన్నించి కృష్ణభిక్షు పాట మొదలెట్టాడు.

 

పల్లవి:

భజరే భజ మానస రామం(భ)


అనుపల్లవి:

అజముఖ శుక వినుతం శుభ చరితం. (భ)

 

చరణం:

నిర్మిత లోకం నిర్జిత శోకం

పాలిత మునిజన మధునా నృప పాకం (భ)

 

శంకర మిత్రం శ్యామల గాత్రం

కింకర జనగణ తాపత్రయ తమోమిత్రం. (భ)

 

భూసమ శాంతం భూజా కాంతం

వారమఖిలదం త్యాగరాజ హృద్భాంతం (భ)


అని చెప్పాడు. నాగమ్మ వెంటనే ఆ పాట రాసేసుకుంది.

 

"ఇందులో రామ తీసి రమణ అని పెడితే భగవాన్ మీద పాట అయ్యేలా ఉంది" అన్నది నాగమ్మ.

"అదికూడా అక్కర్లేదు ఎందుకంటే  భగవాన్ ఆత్మారాములు కదా ఇంకో విధంగా చూసినా రమయతీతి రామః కాబట్టి భగవాన్‌కి రామ శబ్దం వాడచ్చు. కానీ మొదటి చరణంలో నృప పాకం అంటే రాజకుమారుడు అన్నదీ, భూజా కాంతం అంటే భూదేవి కూతురి భర్తా అని చివరి చరణంలో ఉన్నవి పట్టిస్తాయి." అన్నాడు కృష్ణ భిక్షు.


ఈ లోపల ప్రతిరోజూ లాగే కాసేపు కొండ మీద తిరగటానికి బయలుదేరారు భగవాన్. అందరూ లేచి నిలుచున్నారు. నాగమ్మా కృష్ణ భిక్షు ఉన్న చోటికి వచ్చి ఆగారు. "ఏమిటీ ఆ రాసింది?" అని అడిగిన భగవాన్ కి త్యాగరాజ కృతి చదివి వినిపించింది. "భగవాన్‌కి  రామ శబ్దం వాడచ్చని ఎందుకు అనుకుంటున్నామో" అని వివరించింది నాగమ్మ. "రమణుడు కూడా రాముడే , నిజానికి ఉన్నది అంతా రాముడే, వేరే ఏమీ లేదు" అన్నారు భగవాన్. అని బయలుదేరేంతలో నాగమ్మ సభక్తికంగా "ఒక రెండు మాటలకి అర్థం కుదరటల్లేదు" అన్నది. "చెప్పు" అన్నట్టు సైగచేసిన భగవాన్‌కి "నృప పాకం, భూజా కాంతం" అనే మాటలు చెప్పింది నాగమ్మ. క్షణకాలం ఆలోచించి "అరుణాచలేశ్వరుడు ఈ ఊరి మహారాజు. మనమంతా ఆయన పిల్లలం కాబట్టి అందరమూ రాజ కుమారులమే, రాజకుమారికలమే. ఇక భూజ అంటే చెట్టు  అని  కూడా అర్థం చెప్పచ్చు. అప్పుడు చెట్టుకి అధిపతి ఎవరో వాడు భూజాకాంతుడు. ఇన్ని చెట్లున్నయ్యి ఇక్కడ. మనమందరమూ భూజాకాంతులమే. ఆ కృతి మొదట్లో రామ తీసి కృష్ణపెడితే పాటమొత్తం మన కృష్ణ భిక్షుది అయిపోతుంది.ఎర్రగా  బుర్రగా వుంటాడు కాబట్టి రాజకుమారుడి వేషానికిపనికివస్తాడు"అని నవ్వుతూ వెళ్ళిపోయారు భగవాన్.

"భగవాన్ మీద పాటలాగా వుంది అని మనం అనుకుంటే అది నా మీదకి తోసి తప్పించుకుని ఎలా వెళ్ళిపోతున్నారో చూడమ్మా" అంటూ భగవాన్ మీద ఆరోపణ చేస్తున్న లాయరు కృష్ణభిక్షు గారిని చూసి నాగమ్మ ఫక్కున నవ్వింది. అలా భక్తులతో క్రీడించే భగవాన్ మనల్ని కాపాడు గాక.


                            - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...