Thursday 11 August 2022

టీ

కాళిదాసూ, మాఘుడూ, భారవీ, బాణుడూ లాంటి కావ్యరస గ్రహణపారీణులు అంతా నందన వనంలో, కల్పవృక్షంచెట్టు నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి సురభిళంగా వుంది. మధ్య మధ్యా అక్కడ ఉన్న పరిచారికలు కావలసినవన్నీ చూస్తున్నారు.

ఇంతలో యేదోవొక విషయమ్మీద మాఘుడికీ  బాణుడికీ భిన్నాభిప్రాయం వచ్చింది. ఇద్దరు తెలివిగలవాళ్ళ మధ్య గొడవ రాకుండానే వుండాలి కానీ, వొస్తే సుఖాసుఖాల తేలుతుందా?. ఇద్దరూ గట్టిగా పట్టుపట్టి కూచున్నారు. కాళిదాసూ, భారవీ మధ్యలో కల్పించుకుందామంటే వారికి కోపదారులైన ఇద్దరంటే మహా భయమాయె. అందులోనూ బాణుడుగారు అంటే మరీ భయం. ఆయన మాటలు మామూలుగానే బాణాలు లాగా ఉంటాయి, ఇక కోపమొస్తే చెప్పనే అక్కరలేదు. మాఘుడు గారు వదిలే మాటలు ఆక్షణం పెద్ద కఠినంగా అనిపించకపోయినా తర్వాత వాటిని లోతుగా ఆలోచిస్తే అనిపించే ధ్వనులూ, గూఢార్థాలూ గుండెని గుభేలనిపించకమానవు.

విషయం ఎంత జటిలం అయినా ఎవరో ఒకరు సర్ది చెప్పాలి కదా. తప్పక కాళిదాసు  పూనుకున్నాడు. కాస్త ఆలోచించి పరిచారికని పిలిచి అందరికీ చక్కటి కస్తూరి, కుంకుమ పువ్వూ వేసిన టీ పట్టుకురమ్మన్నాడు. టీ వొచ్చే లోపు బాణుడికీ మాఘుడికీ ఏవో సాంత్వన పరిచే విషయాలు చెప్పాడు. కొద్దిగా విషయం మార్చటంతో వాతావరణం కాస్త తేలికపడింది. ఇంతలో టీ వచ్చింది. కవులందరూ ఆహా, ఓహో అంటూ జుర్రారు.

టీ చక్కగా పనిచేసిందని కాళిదాసు సంతోషించినంత సేపు పట్టలేదు మన కవుల వాగ్వాదం మళ్ళీ ఆరంభం కావటానికి. కాళిదాసు తలపట్టుకున్నాడు. ఇలా వ్యవహారం వందల టీ పాత్రల మీదా, గంటల కొద్దీ సాగింది. కానీ ఇంకా మాఘుడూ, బాణుడూ బిర్రబిగుసుకుని కూర్చునే ఉన్నారు.

అట్లా వాగ్వాదం సాగుతుండగా బాణుడుగారు అన్నాడూ "నేను చెప్పేదాన్ని దేవత తప్పితే ఇంకెవరు కాదన్నా ఒప్పుకోను" అని. వెంటనే కాళిదాసుకి బుర్రలో ఆలోచన వచ్చింది. బాణుడి వైపూ, మాఘుడి వైపూ తిరిగి "మీరిద్దరూ మహాకవులు , కాబట్టి మీ వాగ్వాదం తీర్చడం దేవి వల్లే అవుతుంది. అందుకని దేవిని ప్రార్థిద్దాము. దేవి వొచ్చి ఏమి చెబితే అది మీరు ఇద్దరూ ఒప్పుకోవాలి " అని చెప్పిందానికి అందరూ ఒప్పుకున్నారు.

అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు కరుణారసభర నయనాలతో దయతో చూస్తూ చిరునవ్వుతోప్రత్యక్షమైంది. అందరూ నమస్కరించారు. కాళిదాసు మహాకవుల వివాదం గురించి కొద్దిగా చెప్పి మహాకవులని వారివారి వాదన చెప్పమన్నాడు. ఇంతలో అమ్మవారు అక్కడ బల్లల మీద ఉన్న టీ పాత్రలని చూసి "మీరందరూ ఒకటికి పది టీ తాగి కూర్చున్నారు, మరి నాకు టీ ఏదిరా" అన్నది.

బాణుడు, మాఘుడూ పరిచారికల దగ్గరకి పరిగెత్తారు.

కాళిదాసు కొద్దిగా ఆలోచించి "సర్వజగత్తునీ కాపాడి కష్టపడుతున్నదానికి నీకు ఒకటీ ఎక్కడ సరిపోతుంది తల్లీ. ఇవిగో పన్నెండు టీలు సమర్పిస్తున్నాను, అనుగ్రహించు" అని


చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ

కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |

పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా

ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతాం

అని  భక్తిభావంతో పాడాడు. ఇంతలో మాఘుడూ, బాణుడూ తెచ్చిన టీని సేవించిన అమ్మవారు కాళిదాసుని చిరునవ్వుతో చూస్తూ  "అసలు టీ కంటే నీ పన్నెండు టీలే బావున్నాయిరా" అంటూ తన దగ్గిర ఉన్న టీ పాత్రలని విసిరేస్తే పాత్ర బాణుడి ఒళ్ళోనూ, పాత్ర కింద ఉండే పానపాత్ర మాఘుడి చేతిలోనూ పడ్డాయి. అమ్మవారు అదృశ్యురాలైంది.

పాత్ర గొప్పదా, పానపాత్ర గొప్పదా అనే విషయంలో చర్చ మొదలై ఇప్పటి వరకూ తెగినట్టు లేదు. చివరికి ఏమైందో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.

(అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా రాసినది)

    

                         - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...